‘మంచి సినిమా.. భవిష్యత్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ పక్కన రోల్.. ఇంకోసారి ఆలోచించండి మేడం..’ కాస్టింగ్ అసిస్టెంట్ నుంచి ఫోన్. ‘సారీ.. డేట్స్ క్లాష్ అవుతున్నాయి. భవిష్యత్ సూపర్ స్టార్ కోసం ఆల్రెడీ సూపర్ స్టార్‌గా ఉన్న హీరో సినిమాను వదులుకోలేను కదా..’ అని ఆ హీరోయిన్ సమాధానం. ఆమె వదులుకున్న సినిమా.. బాజీగర్. విలక్షణ నటుడు కమల్‌హాసన్ పక్కన చేయబోతున్న సినిమా కోసం. ఇది 1990ల నాటి సంగతి. ఆ హీరోయిన్.. ఫర్హీన్ ఖాన్.
హిందీ నటే అయినా తమిళ, కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ‘జాన్ తేరే నామ్’తో తారాపథంలోకి దూసుకెళ్లింది. బాలీవుడ్‌ను మాధురీ దీక్షిత్ ఏలుతున్న కాలంలో అడుగుపెట్టింది ఫర్హీన్. అదే కను, ముక్కు తీరు.. అదే నవ్వు.. అదే గిరిజాల జుట్టు ఉండడంతో ఫర్హీన్‌ను మాధురీకి జిరాక్స్‌గా పోల్చారు. స్టార్‌డమ్‌లో కూడా మాధురీకి పోటీ వస్తుందని జోస్యమూ చెప్పారు. నిజానికి ఆ అవకాశాలు మెండుగా కనిపించాయి. కానీ హఠాత్తుగా పెళ్లి చేసేసుకొని అంతర్థానమైపోయింది.
ఆ వరుడెవరు?
క్రికెట్ సంచలనం.. మనోజ్ ప్రభాకర్. ఒక పార్టీలో కలుసుకున్నారిద్దరూ. అతనికి ఫర్హీన్ నచ్చింది. మాటామాటా కలిపాడు. పరిచయం పెరిగింది. ప్రేమ మొదలైంది. అయితే అప్పటికే మనోజ్ వివాహితుడు, ఒక కొడుకు కూడా. అదేమీ అభ్యంతరంగా అనిపించలేదు ఫర్హీన్‌కు. అతను ఆమె జీవితంలోకి వచ్చాక ఆమె తెర మీద మెరవలేదిక. ఇంకా చెప్పాలంటే అదృశ్యమైపోయింది. కుతూహలం కలవారు కూపీ లాగితే.. మనోజ్‌ను రహస్యంగా నిఖా చేసుకొని ఢిల్లీ వెళ్లిపోయిందని తెలిసింది. ఇంచుమించుగా బాలీవుడ్‌తో సంబంధాలు తెంచేసుకుంది.
చదవండి: వయసులో తనకంటే చిన్నవాడిని ప్రేమించిన లతా మంగేష్కర్, పెళ్లెందుకు చేసుకోలేదంటే?
విడిపోయారని..
కాలం సాగిపోతోంది. మనోజ్, ఫర్హీన్ దంపతులకు ఓ కొడుకు పుట్టాడు. నాలుగేళ్లు గడిచాయి. ఇంతలోకే ఓ వార్త.. మనోజ్ మీద అతని మొదటి భార్య సంధ్య వరకట్న వేధింపుల కేస్ పెట్టిందని.. ఢిల్లీ హైకోర్ట్‌లో అది సెటిల్ అయిందని.. ఆ తీర్పు ప్రకారం మనోజ్.. ఫర్హీన్‌ను వదిలేసి సంధ్య దగ్గరకు వెళ్లిపోయాడు అని. బాలీవుడ్ దృష్టి మళ్లీ ఫర్హేన్ మీదకు మళ్లింది. వివరాలేమీ అందలేదు.
ఇంకొన్నాళ్లకు..
ఫర్హీన్ ఢిల్లీలోనే ఉంటున్నట్టు తెలిసింది. ‘మిర్రర్ ’ ప్రతినిధి.. ఆమెను సంప్రదిస్తే ఇంటర్వ్యూ ఇచ్చింది. తను.. మనోజ్‌తో కలిసే ఉంటున్నట్టు చెప్పింది. వాళ్లు విడిపోయినట్టు వచ్చినవన్నీ వదంతులేనని తేల్చింది. ‘నిజానికి మేమిద్దరం (ఆమె, మనోజ్) ముందు ఫ్రెండ్స్‌గానే ఉన్నాం. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం.. రెండింటిలో అతను గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు నా ఆసరా కోరాడు. సోలేస్‌గా నిలిచాను. అప్పుడే కలిసి జీవిద్దామనుకున్నాం. బహుశా ఆ టైమ్‌లోనే మా మాధ్య ప్రేమ మొదలై ఉండొచ్చు. మనోజ్‌ను లైఫ్ పార్ట్‌నర్‌గా చేసుకున్నాను. కెరీర్‌ను వదిలేశాను’ అంటూ తన ప్రేమ, పెళ్లి గురించి వివరించింది.
‘అందరూ అనుకున్నట్టు నేనేం అదృశ్యమైపోలేదు. మా మకాం ఢిల్లీకి మారింది అంతే. పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లాడి బాధ్యతల్లో పడిపోయి సినిమాల గురించి ఆలోచించలేదు. అలాగని ఖాళీగా కూడా లేను. హెర్బల్ స్కిన్‌కేర్ బిజినెస్ పెట్టాను. బాలీవుడ్‌తో కనెక్షన్ కంటిన్యూ చేయకపోయినా.. కట్ కూడా చేసుకోలేదు. ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ అయిన దీపక్, ఆదిత్య పంచోలి, జరీనా వాహబ్, శక్తి కపూర్‌తో టచ్‌లో ఉన్నాను. సినిమాల్లో నటించొద్దని మనోజ్ చెప్పలేదు. నేనే విరామం తీసుకుందామనుకున్నా. ఇప్పుడు పిల్లాడు పెద్దాడైపోయాడు. బాధ్యతలూ ఓ కొలిక్కి వచ్చాయి. కావాల్సినంత టైమ్ దొరుకుతోంది. మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నా. ఇంపార్టెంట్ రోల్స్ దొరికితే కచ్చితంగా చేస్తాను. జాన్ తేరే నామ్ సినిమా సీక్వెల్ కోసం అడిగారు. ఓకే అన్నాను’ అని చెప్పింది ఫర్హీన్. త్వరలోనే ఫర్హీన్‌ను తెర మీద చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు ఆమె అభిమానులు.
- ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment