తేనెటీగలు అంతరిస్తే..? | Honey Bees Are Going To Extinct | Sakshi
Sakshi News home page

తేనెటీగలు అంతరిస్తే..?

Published Sun, Aug 18 2019 12:02 PM | Last Updated on Sun, Aug 18 2019 12:02 PM

Honey Bees Are Going To Extinct - Sakshi

ఊరకే రొదపెడుతూ తిరిగే తేనెటీగలను చూస్తే చాలామంది చిరాకుపడతారు. ఒక్కోసారి అవి మనుషులను కుడుతుంటాయి కూడా. తేనెటీగలు కుట్టిన చోట దద్దుర్లు ఏర్పడి విపరీతంగా మంట పుడుతుంది. అందువల్ల తేనెటీగలను చూస్తే చాలామంది భయపడతారు కూడా. ఎప్పుడైనా ఒక చెంచాడు తేనె రుచి చూస్తే మాత్రం తేనెటీగల మీద చిరాకు, భయం, కోపం వంటివన్నీ ఆ క్షణానికి మాయమవుతాయి. తేనెలోని ఔషధ గుణాల గురించి తెలుసుకున్నప్పుడు మాత్రం తేనెటీగల మీద కృతజ్ఞతా భావం కూడా ఏర్పడుతుంది.
తేనెటీగలు నిరంతరం శ్రమించి పొందికగా అల్లుకున్న గూళ్లలో భద్రపరచిన తేనెను మనుషులు వారి అవసరాల కోసం కొల్లగొడుతున్నారు. తేనెటీగల శ్రమను దోచుకుంటున్న మనుషులు వాటి పట్ల రవ్వంతైనా కృతజ్ఞత చూపుతున్నారా అంటే, లేదనే సమాధానం చెప్పాలి.
అజ్ఞానంతో, అహంకారంతో, నిర్లక్ష్య ధోరణితో మనుషులు కన్నూ మిన్నూ కానకుండా తేనెటీగలకు ముప్పు తెచ్చిపెడుతున్నారు. ఇష్టానుసారం పంటలపై పురుగుమందులు చల్లుతూ తేనెటీగలు  భూమ్మీద మనుగడ కొనసాగించలేని దారుణమైన పరిస్థితులను కల్పిస్తున్నారు.

ఆఫ్టరాల్‌ తేనెటీగలు... అవి ఈ భూమ్మీద ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనే ధోరణిలో మనుషులు తమ పద్ధతులను ఏమాత్రం మార్చుకోవడం లేదు. ఎడాపెడా వాడుతున్న పురుగుమందుల కారణంగా అరుదైన కొన్నిజాతుల తేనెటీగలు ఇప్పటికే అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి. ‘హవాయిన్‌ యెల్లో ఫేస్డ్‌ బీస్‌’ రకానికి చెందిన ఏడు ఉపజాతుల తేనెటీగలు, ‘రస్టీ ప్యాచ్డ్‌ బంబ్లీ బీ’ జాతికి చెందిన తేనెటీగలు ప్రమాదం అంచులకు చేరుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గిపోతోందని ‘గ్రీన్‌పీస్‌’ సంస్థ ‘బీస్‌ ఇన్‌ డిక్లైన్‌’ అనే పుసక్తం ద్వారా దశాబ్దం కిందటే ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులేవీ రాలేదు సరికదా, తేనెటీగలు మరింతగా ప్రమాదానికి చేరువవుతున్నాయి.

తేనెటీగలు చేసే పని గూళ్లు కట్టుకుని, తేనెను సేకరించడం మాత్రమే కాదు. చాలా పంటలు ఎదగడానికి కూడా అవి ఇతోధికంగా దోహదపడతాయి. మనుషులు ఆహారంగా ఉపయోగించే చాలా పంటల్లో– కచ్చితంగా చెప్పాలంటే దాదాపు 35 శాతం ఆహార పంటల్లో పరపరాగ సంపర్కం జరగడానికి ఇవి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. తేనెటీగల శ్రమను పట్టించుకోని మనుషులు, వాటికి ముప్పు కలిగిస్తూ, తమ ముప్పును తామే కొని తెచ్చుకుంటున్నారు.
రెండో ప్రపంచయుద్ధ కాలం నుంచే వ్యవసాయం కోసం పురుగుమందులు వాడటం మొదలైంది. పురుగు మందుల వాడకం పెరుగుతున్న కొద్దీ తేనెటీగల సంఖ్య తగ్గిపోతూ వస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేనెటీగలు పూర్తిగా అంతరించిపోతే, అవి అంతరించిన మరో నాలుగేళ్లకు ఈ భూమ్మీది మనుషులు కూడా అంతరించిపోతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి తేనెటీగలను కాపాడుకోకుంటే మానవాళి సొంత ముప్పును కొనితెచ్చుకున్నట్లేనని వారు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement