జస్ట్‌ మ్యారీడ్‌ | Just Married | Sakshi
Sakshi News home page

జస్ట్‌ మ్యారీడ్‌

Published Sun, Nov 12 2017 7:36 AM | Last Updated on Sun, Nov 12 2017 7:37 AM

Just Married - Sakshi

పెళ్లి చూపులు అయ్యాయి. అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చేశాడు. ‘అమ్మాయికి నచ్చితే చాలండీ, ఈ పెళ్లి జరిగిపోతుంది’ అని అబ్బాయి తండ్రి.. ముందే చెప్పేశాడు కాబట్టి అబ్బాయికి అమ్మాయి నచ్చిందా లేదా అన్నది ప్రశ్నే కాదసలు. తల్లి లేని బిడ్డ. ఒకడే బిడ్డ. చేతనైనంత త్వరగా వాడికో తోడును జత చేయడం తన బాధ్యత అనుకున్నాడు ఆ తండ్రి. అంతే తప్ప ‘నా కొడుకు నచ్చకపోతాడా’ అన్న ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ కాదది. 

పెళ్లిచూపులు అయ్యాక, వరుడు చిరంజీవి అలోక్, వధువు చి.ల.సౌ. అఖిల అని శుభలేఖలు ప్రింట్‌ అవడానికి ముందు.. అలోక్‌ తండ్రి అలోక్‌కి తెలియకుండా మళ్లీ ఒకసారి అఖిల తల్లిదండ్రులను కలిశాడు. అప్పుడు అక్కడ అఖిల లేదు. 
‘‘కడుపులో దాచుకుంటానంటే మీకొక విషయం చెబుతాను. చెప్పడం నా ధర్మం అనుకున్నాను. దాచుకోవడం మీ ధర్మం అనుకుంటారని ఆశిస్తున్నాను’’ అన్నాడు భారంగా. 

ఆ తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి, ‘‘అలోక్‌ ఇప్పటికీ నా గదిలోనే పడుకుంటాడు’’ అన్నాడు. ‘అందులో ఏముందీ’ అన్నట్లు చూశారు వియ్యంకులు. ‘‘ఇప్పటికీ వాడు నా పక్కనే పడుకుంటాడు’’ అన్నాడు.‘‘గారాబంగా పెరిగినట్లున్నాడు.. తల్లి లేని బిడ్డ కదా’’ అని నవ్వారు.‘‘గారాబం కాదు చెల్లెమ్మా’’ అన్నాడు అలోక్‌ తండ్రి.. అఖిల తల్లి వైపు చూసి. ఆమె తన భర్త వైపు చూసింది. ఇద్దరూ కలిసి మళ్లీ అలోక్‌ తండ్రి వైపు చూశారు. 

‘‘మావాడికి.. దెయ్యాలంటే భయం. రాత్రి పూట ఒక్కడే పడుకోలేదు’’ అన్నాడు ఆయన.. కాస్త ఇబ్బంది పడుతూ. 
రాబోయే నవ్వును ఆపుకున్నారు అలోక్‌కి కాబోయే మామగారు. నవ్వితే బాగుండదని అలా ఉండిపోయింది అలోక్‌కి కాబోయే అత్తగారు. 

‘‘అన్నయ్యా.. అసలిది విషయమే కాదు. మీరు మాకేం చెప్పలేదు. మేమేమీ వినలేదు. మీ అబ్బాయికీ తెలియనివ్వకండి. మా అమ్మాయికీ తెలియనివ్వం’’ అంది అఖిల తల్లి. 

ఆ వెంటనే ఇంకో మాట కూడా అంది ఆవిడ. ‘‘దెయ్యాలకు భయపడడం అంటే.. ఉన్నాయని భయపడతాడా? ఉన్నాయేమోనని భయపడతాడా?’’ అని. 

‘‘తను నిద్రపోతున్నప్పుడు రోజూ రాత్రి ఇంట్లోకి ఎవరో వస్తున్నట్లు అనిపిస్తుందని భయపడతాడు చెల్లెమ్మా’’ అన్నాడు.
‘‘ఎప్పట్నుంచి ఆ భయం మొదలైంది’’.

‘‘గుర్తులేదు బావగారూ.. ఓసారెప్పుడో మెలకువ వచ్చి చూస్తే, పెద్దగా ఎవరితోనో పోట్లాడుతున్నాడు. ఆ అరుపుకే నేను లేచింది. ‘‘ఏమైంది అలోక్‌..’’ అని దగ్గరికి వెళ్లి అడిగితే.. ఇంట్లోనే ఓ మూలకు చెయ్యి చూపిస్తూ భయంతో వణికిపోతున్నాడు’’.  

‘‘ఆ తర్వాత?’’ 
‘‘ఆ తర్వాతెప్పుడూ వాడు అరవలేదు. ఎందుకంటే.. ఆ తర్వాత ఎప్పుడూ వాడు ఒంటరిగా పడుకోలేదు’’ అని చెప్పాడు అలోక్‌ తండ్రి.

అలోక్, అఖిల పెళ్లి జరిగిపోయింది.
పెళ్లిలో చాలాసార్లు అల్లుడి ముఖం చూశారు అఖిల తల్లి, తండ్రి. దెయ్యాలకు భయపడే అబ్బాయిలా అనిపించలేదు. 
∙∙ 
ఫస్ట్‌ నైట్‌ ముగుస్తుండగా..తెల్లవారు జామునే అఖిల నుంచి ఫోన్‌! ‘‘మమ్మీ.. మమ్మీ.. డాడీ.. డాడీ..’’ అంటోంది కానీ, ఏమీ చెప్పలేకపోతోంది. ఆమె తల్లిదండ్రుల ఆలోచన అల్లుడి మీదకు మళ్లింది. ఫోన్‌ స్పీకర్‌ ఆన్‌ చేశారు.

‘‘చెప్పమ్మా అఖీ.. ఏమైంది? నువ్వెలా ఉన్నావ్‌? అల్లుడుగారు ఎక్కడ?’’ అని అడిగారు. ‘‘అలోక్‌.. అలోక్‌..’’ – అఖిల చెప్పలేకపోతోంది. ఆయాస పడుతోంది.‘‘ఊ.. అలోక్‌కి ఏమైందమ్మా...’’‘‘అలోక్‌.. అలోక్‌.. అలోక్‌.. అలోక్‌వాళ్ల డాడీ చనిపోయారమ్మా.. చనిపోయారు’’.వెంటనే బయల్దేరారు అఖిల తల్లిదండ్రులు అఖిల దగ్గరకు. సిటీలోనే వాళ్లది ఆ మూల, వీళ్లది ఈ మూల. అలోక్‌ దుఃఖాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. ‘‘రాత్రి నాకు.. పక్క గదిలోంచి ‘అలోక్‌.. అలోక్‌’ అని నాన్న అరవడం వినిపించింది. కలలా అనిపించింది. అప్పుడే వెళ్లుంటే ఇంతపని జరిగి ఉండేది కాదు’’ అంటున్నాడు. ‘‘ఏం జరిగింది బాబూ’’ అని భుజం మీద చెయ్యేసి అడిగారు అత్తమామలు. ‘‘డాక్టర్‌ హార్ట్‌ ఎటాక్‌ అంటున్నారు. కాదని నాకు తెలుసు. కచ్చితంగా తెలుసు. ఆయన్ని దెయ్యం చంపేసింది. ఇన్నాళ్లూ నేను నాన్న పక్కన పడుకునేవాణ్ణి కాబట్టి అది నాన్నను ఏమీ చేయలేకపోయింది. ఒక్కరోజు లేకపోయేసరికి దానికి అవకాశం దొరికింది’’ అంటున్నాడు అలోక్‌. 

‘‘నీకెలా తెలుసు బాబూ’’ అన్నారు మామగారు. ‘‘నాకు తెలుసు. నాకే తెలుసు. నాన్నకు కూడా తెలీదు. ఓరోజు రాత్రి నేను దెయ్యంతో గొడవపడ్డాను. నాన్నను చంపుతాను అని అది ఆయన గదిలోకి వెళ్లబోతుంటే నేను పెద్దగా అరుస్తూ దాన్ని తరిమేశాను. ‘చూస్తా ఎంతకాలం మీ నాన్నను కాపాడుకుంటావో’ అని వికృతంగా నవ్వుకుంటూ గాలిలో కలిసిపోయింది. ఆ రోజు నుంచీ నేను నాన్న మంచం మీదే, నాన్న పక్కనే పడుకుంటున్నాను. దెయ్యాలు కలలోకి వస్తున్నాయి నాన్నా.. అని నాన్నకు అబద్దం చెప్పి ఆయన పక్కనే పడుకుంటున్నాను’’ అని చెప్పాడు అలోక్‌. అత్తమామమలు ముఖముఖాలు చూసుకున్నారు. అఖిలకైతే ఏమీ అర్థం కావడం లేదు. పదో రోజు. ఫ్యామిలీ అల్బమ్‌ చూస్తున్నాడు అలోక్‌. పక్కనే అఖిల ఉంది. ‘‘ఎవరీవిడ?’’ అంది ఆల్బమ్‌లో ఓ ఫొటోపై వేలు ఉంచి.‘‘మా పిన్నమ్మ’’ అని చెప్పాడు. 

 ‘‘మీ అమ్మ సొంత చెల్లెలా?’’ అని అడిగింది. ‘‘అవును. మా నాన్నంటే తనకు కోపం. ప్రేమించిన తనను కాదని, నాన్న తను ప్రేమించిన అమ్మను చేసుకున్నాడని. అమ్మ అనారోగ్యంతో చనిపోయినప్పుడు.. ‘అది బతికుండగా నన్ను చేసుకోలేదు. ఇప్పుడైనా చేసుకుంటావా?’ అని నాన్నను అడిగితే నాన్న కాదన్నారట. నాన్న మీద ప్రేమతో, అమ్మ మీద కోపంతో ఆమె పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. మనోవేదనతో మంచం పట్టి ఏడాదిన్నర క్రితం చనిపోయింది’’ అని చెప్పాడు అలోక్‌. అఖిల మౌనంగా ఉండిపోయింది. అలోక్‌ చెబుతున్న దానికీ, ఆ రోజు మామగారి గదిలో ఆయన మంచం పక్కనే అత్తగారి ఫొటో పడి పగిలి ఉండడానికీ... ఏదైనా సంబంధం ఉందా అని ఆమె ఆలోచిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement