మంచి కోరే మనిషి | Special Story On Funday | Sakshi
Sakshi News home page

మంచి కోరే మనిషి

Published Sun, Dec 16 2018 10:35 AM | Last Updated on Sun, Dec 16 2018 10:35 AM

Special Story On Funday - Sakshi

కర్పూర కు ఆ కాలనీలో మొదట పరిచయమైంది శ్యామలి. పక్కపక్క ఇళ్లు కావడం వల్ల అయిన పరిచయం కాదది. కర్పూర, శ్యామలి వేర్వేరు వీధుల్లో ఉంటారు. ఎప్పుడైనా.. కాలనీ బయట మెయిన్‌ రోడ్డులో ఉన్న సూపర్‌ మార్కెట్‌లో ఒకరికొకరు కనిపిస్తుంటారు. అప్పుడైన పరిచయం. ‘కర్పూర.. పేరు బాగుంది’ అంది శ్యామలి.. పరిచయం కాగానే. ‘శ్యామలి పేరు కూడా కొత్తగా ఉంది. శ్యామల, కోమలి కలిసినట్లు’ అని నవ్వింది కర్పూర. కాలనీలో కోమలి తప్ప కర్పూరకు మరొక పరిచయం లేదు!
∙∙ 
నెలక్రితమే కర్పూర ఆ కాలనీకి వచ్చింది. ఆమె భర్త రోహిత్‌. భార్యకు చూపించకుండానే రోహిత్‌ రెంట్‌ అడ్వాన్స్‌ కట్టేసి, ఆ కాలనీకి ఆమెను తీసుకొచ్చాడు. నమ్మకం. కాలనీ గానీ, ఇల్లు గానీ తనకు నచ్చిందంటే భార్యకూ నచ్చుతుందని. అతడికున్న నమ్మకాన్ని మించి కర్పూరకు ఆ ఇల్లు చాలా నచ్చింది. రోహిత్‌కి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మంచి ఉద్యోగం. కర్పూర పెళ్లికి ముందే చెప్పేసింది.. తనకు ఉద్యోగం చేసే ఆసక్తి లేదని. పెళ్లయి రెండేళ్లవుతోంది. ఈ మధ్యలో ఒకట్రెండుసార్లు అడిగాడు రోహిత్‌.. ‘‘మంచి కంపెనీ అట. నీ క్వాలిఫికేషన్స్‌కైతే నిన్ను కళ్లకద్దుకుని తీసుకుంటారు’’ అని. ‘‘ఎంత కళ్లకద్దుకుని తీసుకున్నా.. నేను ఉద్యోగం చెయ్యనని’’ చెప్పేసింది కర్పూర.

‘‘హాయిగా ఇంట్లోనే ఉంటాను రోహిత్‌’’ అంటుంది ఎప్పుడూ కర్పూర. భవిష్యత్తును చక్కబెట్టుకోవడం కన్నా ఇల్లు చక్కబెట్టుకోవడం ఆమెకు ఇష్టం. ఆ సంగతిని మొదట్లోనే గ్రహించాడు రోహిత్‌. అందుకే ఆమెను బలవంతపెట్టడు. పిల్లలు అప్పుడే వద్దనుకున్నారు కాబట్టి.. వాళ్లిద్దరి మధ్య డబ్బూ కాకుండా.. పిల్లలూ కాకుండా.. ఆ వయసులో ఉండే సరదా కబుర్లే ఉండేవి. ఇలా సరదాగా కబుర్లతో సాగిపోతున్న కర్పూర జీవితంలోకి అకస్మాత్తుగా శ్యామలి కాకుండా ఇంకో కొత్త వ్యక్తి ప్రవేశించడం జరిగింది. ఆ వ్యక్తి స్త్రీ కాదు. పురుషుడు!

‘‘మీతో కాస్త మాట్లాడొచ్చా?’’ అన్నాడు ఆ వ్యక్తి, కర్పూర దగ్గరకు వచ్చి. కంగారు పడింది కర్పూర. అది చీకటి పడబోతున్న సాయంత్రం కానీ, తెల్లారబోతున్న చీకటి కానీ కాదు ఆమె కంగారు పడడానికి. మిట్ట మధ్యాహ్నం. ఆ టైమ్‌లో కాలనీలో బయటెవరూ ఉండకపోవడం కాలనీకి వచ్చిన మొదట్లోనే గమనించింది కర్పూర. ఉద్యోగాలు చేసేవాళ్లంతా ఆఫీసులకు వెళ్లిపోయాక, పిల్లల్ని స్కూల్లో వదిలొచ్చిన ఆడవాళ్లు ఇంట్లో పనిలో పడిపోయాక, కాలనీ వీధులు నిశ్శబ్దంగా అయిపోతాయి. బహుశా ఆ కాలనీ కొత్తది కావడం వల్ల కావచ్చు.. జన సంచారం ఉండదు.‘‘మీతో కాస్త మాట్లాడొచ్చా’’ అని అతడు అడిగాక.. కంగారుపడి, బిత్తరపోతున్నట్లుగా అతడిని చూసింది కర్పూర. 

‘‘భయపడకండి. మీ మంచి కోరేవాడిని. ఊదా రంగు ఇంట్లోనే కదా మీరు ఉంటారు’’ అన్నాడు ఆ వ్యక్తి. ఆ మాటకు కర్పూర మరింత భయపడింది. అంటే.. ఎప్పటి నుంచో గమనిస్తున్నాడన్నమాట! ‘మీరెవరు? నా మంచి కోరడం ఏంటి?’ అని ఆమె అడగొచ్చు. కానీ అతడికి ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వదలచుకోలేదు. అక్కడి నుంచి వేగంగా నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. మెయిన్‌ రోడ్డు మీదకు చేరుకుంటుండగా.. ఆమెకు అనిపించింది.. ‘వెనక్కు తిరిగి చూస్తేనో..’ అని. కానీ చూడలేదు. తను చూస్తే, తను చూడ్డం అతను చూస్తే.. మాట్లాడేందుకు అతడు మళ్లీ అవకాశం తీసుకుంటే!! సూపర్‌ బజార్‌లో కావలసినవేవో తీసుకుని తిరిగి అదే దారిలో వస్తూ ఉంటే.. ‘మళ్లీ రాడు కదా’ అనుకుంది. రాలేదు! ఊపిరి పీల్చుకుంది. 

ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ చాలాసేపటి వరకు కబుర్లు చెప్పుకుంటూ మేల్కొనే ఉన్నారు కానీ.. ఆ మధ్యాహ్నం తారసపడిన ఆ మంచికోరే మనిషి గురించి కర్పూర రోహిత్‌కి చెప్పలేదు. ఆ తర్వాత ఆమె కూడా ఆ సంగతి దాదాపుగా మర్చిపోయింది. అలా మర్చిపోతున్న సమయంలో.. మళ్లీ అదే చోట, అదే సమయంలో అతడు ఓ రోజు ప్రత్యక్షమయ్యాడు! గుండె గుభేల్మంది కర్పూరకి. ‘‘భయపడకండి. మీ మంచి కోరేవాడిని’’ అన్నాడతను. మళ్లీ అదే మాట!‘‘చూడండి. మీరు నాకేం చెప్పనవసరం లేదు. నేనేం వినే అవసరం లేదు. సాయంత్రం నా భర్త వస్తాడు. మీరు చెప్పదలచుకుంది ఏమైనా ఉంటే ఆయనకు చెప్పండి’’ అని చెప్పి.. వేగంగా కదిలి వెళ్లిపోయింది. అక్కడి నుంచి సూపర్‌ మార్కెట్‌కి వెళ్లకుండా.. నేరుగా పక్క వీధిలోని శ్యామలి ఇంటికి వెళ్లింది. 

శ్యామలి ఆశ్చర్యంగా కళ్లింత చేసి చూసింది. ‘‘మీరేంటి.. ఇలా?’’ అంది. కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చింది. గటగటా నీళ్లు తాగేసింది కర్పూర. ఆ తర్వాత.. ఆ మంచి కోరే వ్యక్తి గురించి చెప్పింది. ‘‘వాడేంటట.. నీ మంచి కోరేది’’ అంది శ్యామలి చిరాగ్గా. ‘‘రోహిత్‌కి చెప్పేదా?’’ అంది కర్పూర.‘‘చెప్పడమే మంచిది. ఇప్పటికే రెండుసార్లు ఇలా అయింది కదా. మూడోసారి కాకూడదనేముందీ’’ అంది శ్యామలి.  ఆ రాత్రి రోహిత్‌కి బాగా దగ్గరకి జరిగి, అతడి గుండె మీద చెయ్యి వేసింది కర్పూర. సాధారణంగా అతడే ఆమెవైపు జరుగుతాడు. ఆ రోజు కర్పూరే అతడి వైపు జరిగింది. 
‘‘కాలనీ మారిపోదాం రోహిత్‌’’ అంది. 

రోహిత్‌ నవ్వాడు. ‘‘ఏంటిది సడెన్‌గా?’’‘‘నాకంతా చికాకు చికాకుగా ఉంది రోహిత్‌. అతనెవరో.. నా మంచి కోరతానని.. కాలనీలో నా వెంట పడుతున్నాడు’’.. చెప్పింది కర్పూర. ‘‘అవునా!’’ అన్నాడు అశ్చర్యంగా. ‘‘ఈసారి నీతో మాట్లాడ్డానికి ట్రై చేస్తే ఫోన్‌ కలిపి అతనికివ్వు’’ అన్నాడు. ఆ తర్వాత కర్పూర నిశ్చింతగా నిద్రపోయింది.రోహిత్‌కే నిద్రపట్టలేదు. రాత్రి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తనని ఓ వ్యక్తి ఆపడం రోహిత్‌కి గుర్తొచ్చింది. ‘మీది ఊదా రంగు ఇల్లే కదా అన్నాడు. మీ మంచి కోరి ఓ విషయం చెప్తాను’ అన్నాడు. చెప్పమన్నాడు రోహిత్‌. అతడు చెప్పాడు!

ఉదయం ఆఫీస్‌కి బయల్దేరేముందు ఇంటి ఓనర్‌కి ఫోన్‌ చేసి.. ‘‘ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండిపోయిన టెనెంట్‌ ఫొటో ఉందా మీ దగ్గర? ఉంటే వాట్సాప్‌ చేస్తారా?’’ అని అడిగాడు. 
‘‘ఎందుకు?’’ అటువైపు నుంచి ప్రశ్న. ‘‘వెంటనే ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటున్నాడు మమ్మల్ని. మా మంచికేనట’’ చెప్పాడు రోహిత్‌. ‘‘సరే పంపిస్తాను’’ అన్నాడు ఇంటి ఓనర్‌. ఆ లోపే ఇంట్లోంచి పెద్దగా అరుస్తూ బయటికి వచ్చింది కర్పూర.

‘‘ఇదిగో.. ఇతనే.. ఇతనే..’ అంటూ భయంగా ఒణికిపోతోంది. ఆమె చేతిలో ఎవరిదో గ్రూప్‌ ఫొటో ఉంది. అటక మీద నుంచి ఫ్యాన్‌ గాలికి బూజుతో పాటు రాలి పడిన ఫొటో అది.
ఫొటో తీసుకుని చూశాడు రోహిత్‌. ‘‘ఇతనే.. కాలకనీలో నాతో మాట్లాడాలని ట్రై చేస్తోంది’’ చెప్పింది కర్పూర. బయటికి వచ్చాక ఇంటి ఓనర్‌కి ఫోన్‌ చేసి.. ‘‘ఫొటో పంపక్కర్లేదు’’ అని చెప్పాడు రోహిత్‌. చెప్పి, అటక మీద నుంచి రాలి పడిన ఫొటోలో ఆ మంచి కోరే మనిషిని మాత్రం ఫొటో తీసి ఇంటి ఓనర్‌కి వాట్సాప్‌ చేశాడు. వెంటనే రిప్లయ్‌ వచ్చింది.‘ఇతనే ఆ టెనెంట్‌. చనిపోయి చాలాకాలం అయింది’ అని.  ఆ సంగతి కర్పూరకు చెప్పలేదు రోహిత్‌. ఆ తర్వాత కొద్దిరోజులకే కాలనీ మారిపోయారు రోహిత్, కర్పూర. ఇల్లు మారితే సరిపోతుంది కదా అంటే.. కర్పూరే.. ‘‘వద్దు.. కాలనీనే మారిపోదాం’’ అంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement