అటుకుల వడ.. తింటే ఆహా అనాల్సిందే! | Tasty Snack Recipes In Telugu | Sakshi
Sakshi News home page

అటుకుల వడ.. తింటే ఆహా అనాల్సిందే!

Published Sun, Sep 15 2019 10:53 AM | Last Updated on Sun, Sep 15 2019 10:53 AM

Tasty Snack Recipes In Telugu - Sakshi

ఆపిల్‌ రింగ్స్‌
కావలసినవి:  ఆపిల్‌ రింగ్స్‌ – 12 లేదా 15 (ఆపిల్‌ కాయను శుభ్రం చేసుకుని కొద్దిగా మధ్యలో భాగం తొలగించి రింగ్స్‌లా సిద్ధం చేసుకోవాలి), చిక్కటి మజ్జిగ – 1 కప్పు, గుడ్లు – 3, మైదాపిండి – ఒకటిన్నర కప్పులు, పంచదార పొడి – 3 లేదా 4 టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి – అర టీ స్పూన్, దాల్చినచెక్కపొడి – అర టీ స్పూన్, బేకింగ్‌ పౌడర్‌ – 1 టీ స్పూన్, జాజికాయ పొడి – పావు టీ స్పూన్‌, ఉప్పు – కొద్దిగా, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని మైదాపిండి, 2 టేబుల్‌ స్పూన్ల పంచదార పొడి, దాల్చినచెక్క పొడి,  యాలకుల పొడి, జాజికాయ పొడి, బేకింగ్‌ పౌడర్, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గుడ్లు వేసుకుని.. కొద్దికొద్దిగా మజ్జిగ వేసుకుని బజ్జీల పిండిలా సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఆపిల్‌ రింగ్స్‌ని మైదా మిశ్రమంలో ముంచి నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పంచదార పొడి వాటిపైన వేసుకుని వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

బ్రెడ్‌ సమోసా
కావలసినవి:  బ్రెడ్‌ స్లైస్‌ – 10 లేదా 15, శనగపిండి – 1 కప్పు, పసుపు – పావు టీ స్పూన్‌, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, బంగాళదుంపలు – 3(ఉడకబెట్టి ముద్ద చేసుకోవాలి), ఆవాలు – అర టీ స్పూన్‌, కరివేపాకు – 3 రెమ్మలు, పచ్చ బఠానీలు – పావు కప్పు(ఉడకబెట్టుకోవాలి), పసుపు – చిటికెడు, నీళ్లు – తగినన్ని, అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌, పచ్చిమిర్చి పేస్ట్‌ – అర టీ స్పూన్‌, కొత్తిమీర తురుము – ఒక టేబుల్‌ స్పూన్‌, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. పాత్రలో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేసుకుని, వేడి కాగానే ఆవాలు, కరివేపాకు వేయించుకోవాలి. తర్వాత బంగాళదుంపల ముద్ద, బఠానీలు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర తురుము, ఉçప్పు వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో శనగపిండి, పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ  బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇప్పడు ఒక బ్రెడ్‌ స్లైస్‌ తీసుకుని, నలువైపులా లైట్‌గా తొలగించి.. ఒకసారి నీళ్లలో తడిపి, నీళ్లుపోయేలా ఒత్తుకుని.. దానిపైన కొద్దిగా ఆలూ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. దానిపై నలువైపులా తొలగించి తడిపిన మరొక బ్రెడ్‌ స్లైస్‌ పెట్టి సమోసాలా చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిని శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి.

అటుకుల వడ
కావలసినవి: అటుకులు – 1 కప్పు(నీళ్లలో తడిపి పిండుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు, శనగపిండి –  1 టేబుల్‌ స్పూన్, బియ్యప్పిండి – 2 టేబుల్‌ స్పూన్లు, అల్లం పేస్ట్‌ – 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్‌ – ఒకటిన్నర టీ స్పూన్లు, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్‌, కొత్తిమీర తురుము –3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, అటుకులు, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. పసుపు, జీలకర్ర, కొత్తిమీర తురుము, ఉప్పు వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని చేతులతో వడల్లా ఒత్తుకుని నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే రుచిగా ఉంటాయి.
సేకరణ:  సంహిత నిమ్మన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement