బీట్‌రూట్‌లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇక రొయ్యలు సంగతి చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ఈ రెండింటి కాంబినేషన్‌లో రుచి కరమైన కబాబ్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
►పెద్ద రొయ్యలు – అర కప్పు (శుభ్రం చేసి, ఉప్పు, కారం, పసుపు పట్టించి కుకర్‌లో 3 విజిల్స్ వేయించి పెట్టుకోవాలి)
►కిడ్నీ బీన్స్ (రాజ్మాగింజలు) – 1 కప్పు (నానబెట్టి, మిక్సీ పట్టుకోవాలి)
►బీట్‌రూట్ ముక్కలు – అర కప్పు (ముక్కలు కట్ చేసుకుని, మిక్సీ పట్టుకోవాలి)
►అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్‌చూర్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున
►గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ చొప్పున, మిరియాల పొడి – కొద్దిగా, ఉప్పు – తగినంత, శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు
►ఆల్మండ్ పొడి – 1 టేబుల్ స్పూన్
►కారం – 2 టీ స్పూన్లు, బంగాళదుంప – 1 (ఉడికించి గుజ్జులా చేసుకోవాలి)
►రోజ్ వాటర్ – 1 టీ స్పూన్, నువ్వులు – గార్నిష్‌కి
►చీజ్ – పావు కప్పు(ముక్కలుగా)
►నూనె – సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఉడికిన రొయ్యలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. అందులో కిడ్నీ బీన్స్ మిశ్రమం, బీట్‌రూట్ గుజ్జు వేసుకుని తిప్పుతూ ఉండాలి. 2 నిమిషాల తర్వాత అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్‌చూర్ పౌడర్, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, శనగపిండి, ఆల్మండ్ పొడి, కారం, బంగాళదుంప గుజ్జు, రోజ్ వాటర్ వేసుకుని గరిటెతో బాగా కలపాలి. మూతపెట్టి 20 నిమిషాల పాటు చిన్న మంటపైన మధ్య మధ్యలో తిప్పుతూ మగ్గనివ్వాలి. అనంతరం చల్లారనిచ్చి.. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని, మధ్యలో చిన్న చీజ్ ముక్క పెట్టుకుని మళ్లీ బాల్‌లా చేసుకుని కట్లెట్ మాదిరి ఒత్తుకుని.. ఓవెన్‌లో బేక్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి.. కొద్దిగా నూనె పూసిన చేతులతో ప్రతి కట్లెట్‌కి నువ్వులు అతికించి బేక్ చేసుకుంటే భలే రుచికరంగా ఉంటాయి.
చదవండి: నోరూరించే స్వీట్ పాన్ లడ్డూ.. ఇలా తయారు చేసుకోవాలి..
Comments
Please login to add a commentAdd a comment