నేలమాళిగ | Funday Horror Story Nelamaliga | Sakshi
Sakshi News home page

నేలమాళిగ

Published Sun, Jun 30 2019 8:55 AM | Last Updated on Sun, Jun 30 2019 10:00 AM

Funday Horror Story Nelamaliga - Sakshi

ఒంటిగంట రాత్రి... గడ్డకట్టే చలి.. నిర్మానుష్యంగా ఉంది అంతా!
ఆ ఇంట్లో నేల.. ఉన్నట్టుండి శబ్దం చేయసాగింది. ఫ్లోరింగ్‌లో లోపలి నుంచి ఎవరో బలంగా కొడ్తున్న శబ్దం... అంతకంతకూ ఎక్కువై... మార్బుల్‌ ఫ్లోర్‌ మీదున్న మంచం కిందపడిపోయింది.  మంచం పడిపోగానే నేల సద్దుమణిగింది.
గాఢ నిద్రలో ఉన్న నరేంద్ర.. తలకు దెబ్బతగలడంతో టక్కున కళ్లు తెరిచాడు. చూసుకుంటే  .. పక్కకు ఒరిగి పోయిన మంచం నుంచి జారి ఉన్నాడు. తలకిందులుగా కనిపించింది గది.. తలంతా దిమ్ముగా ఉంది. ‘‘ఎలా పడ్డాను?’’ .. ‘‘ఇదేంటి?’’ అన్న ఆశ్చర్యం కించిత్తు కూడా లేదు అతని మొహంలో. 
62 ఏళ్ల అతను లేచి.. రెండు చేతులతో తలను పట్టుకొని కాసేపు అలాగే కూర్చున్నాడు. కాస్త స్థిమితపడ్డాక..  
మంచానికి కాస్త దూరంగా మూలన ఉన్న గది లైట్‌ స్విచ్‌వేసి.. . వంటింట్లోకి వెళ్లి మంచినీళ్లు తాగి వచ్చాడు.

ఆ గదిలోకి వచ్చేసరికి లైట్‌ ఆరిపోయి ఉంది.  
మళ్లీ నేల లోపలి నుంచి చప్పుడు  మొదలైంది. అది తనకు అలవాటే అన్నట్టుగా ఆ శబ్దాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. బలమంతా ఉపయోగించి ఒరిగిన మంచాన్ని నాలుగు కాళ్ల మీద నిలబెట్టాడు. 
ఆ మంచం మీద అతను కూర్చోబోతుంటే.. నరేంద్ర కాళ్లను కింద నుంచి తన్నింది నేల. 
మళ్లీ లైట్‌ వేయడానికి మంచం దగ్గర్నుంచి కదిలాడు నరేంద్ర. 
నేలలోపల ఓ ఆకారం .. అది గమనించి..  అతని కంటే ముందే  గబగబా లోపలి నుంచే గది ఆ మూలకు వెళ్లింది.. దానితో పోటీ పడుతున్నట్టుగా అతనూ వెళ్లి స్విచ్‌ వేశాడు.. వెలగలేదు. మళ్లీ ట్రై చేశాడు. వెలగలేదు. 
‘‘ఏయ్‌ వదులు..’’ అన్నాడు కిందకు కాస్త వంగి నేల లోపలి ఆకారాన్ని ఉద్దేశిస్తూ!
‘‘నేను చెప్పింది విను మరి’’ అంది ఆ నేలమాళిగలోని ఆకారం. 
తల పంకించి ఆ చీకట్లోనే వచ్చి మంచం మీద కూర్చున్నాడు అతను. 
‘‘అలా చీకట్లోనైనా కూర్చుంటావ్‌ కాని.. నేను చెప్పింది చేయవ్‌ అన్నమాట’’ అంది లోపలి ఆకారం. 
ఏమీ మాట్లాడకుండా.. మాళిగలోని ఆ ఆకారం వైపే చూడసాగాడు. 
చిత్రంగా... అక్కడంతా వెలుగు. ఆ ఆకారం ఉన్న మేరా!
కాళ్లు కిందకు వేసి... తల కాస్త కిందకు వంచి.. మోకాళ్ల మీద మోచేతులు ఉంచి... కుడి అరచేత్తో ఎడమ అరచేతిని మడుస్తూ చుబుకం దగ్గర పెట్టుకొని ఆలోచనల్లో పడ్డాడు నరేంద్ర..
నేలమాళిగలోని ఆకారం కూడా సైలెంట్‌ అయిపోయి.. అతణ్ణే పరిశీలిస్తూ  ఉంది.

నరేంద్ర రిటైర్‌ అయ్యి రెండేళ్లవుతోంది. పిల్లలిద్దరూ యూరప్‌లో ఉన్నారు వాళ్ల కుటుంబాలతో. ఇండియాకు వచ్చే ఆలోచన కూడాలేదు.. కనీసం చుట్టపుచూపుగా కూడా. భార్య పోయాక.. సొంతూళ్లో.. అంత పెద్ద ఇంట్లో.. ఒంటరిగా.. భార్య జ్ఞాపకాలతో బతకడం కష్టమనిపించింది. అందుకే ఆ ఇంటికి.. ఆ ఊరికి.. తన వాళ్లకు దూరంగా.. హిల్‌స్టేషన్‌లాంటి ఈ చోటికి వచ్చేశాడు. ఇప్పుడుంటున్న చిన్న ఇల్లు కొనుక్కున్నాడు.. కొంచెం వాలు మీద.. చుట్టుపక్కల ఏ ఇల్లూ లేక.. ఏకాంతంగా.. ఉందని. కొనేటప్పుడు ఆ ఊళ్లోని చాలా మంది హెచ్చరించారు.. ఆ ఇంటి జోలికి వెళ్లొద్దని.  ముప్పై ఏళ్ల నాటిది ఆ ఇల్లు.  అంతకుముందెప్పుడో .. ఓ యాభై ఏళ్ల కిందట ఓ జమీందారు అక్కడ వేసవి విడిది కట్టుకున్నాడట. కోటలా ఉండేదట అది. అక్కడ ఆయనకు అన్నీ చూసిపెట్టడానికి ఒక వ్యక్తి ఉండేవాడట. ప్రతి వేసవిలో అక్కడికి  వచ్చేవాడట జమీందారు. జమీందారీ రద్దతువుతున్నప్పుడు తన దగ్గరున్న డబ్బు, బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు అన్నీ తెచ్చి.. ఇక్కడ కోటలో పాతి పెట్టాడట. ఒకసారి.. వాటికి ఆశపడ్డ ఆ కోటలోని జమీందారు బాగోగులు చూసుకునే వ్యక్తి ... వాటిని పెద్ద మూటలో కట్టి.. తీసుకెళ్లబోతూ జమీందారుకు పట్టుబడ్డాడని.. వాటితోనే అతణ్ణి.. ఆ జమీందారు అదే గొయ్యిలో సజీవ సమాధి చేశాడనీ.. తర్వాత జమీందారు పాము కుట్టి చనిపోయాడని.. ప్రచారంలో ఉంది. 
అప్పటి నుంచి చాలా ఏళ్ల దాకా.. ఆ కోటను పట్టించుకునేవారే లేకుండిరట. ఆ బంగారం కోసం.. డబ్బు కోసం తవ్వకాలూ జరిగాయట. అలా తవ్వకాలు జరిపిన వాళ్లు .. కొన్ని రోజులకు ఆ చుట్టుపక్కలే ఏదో రకంగా మృత్యువాత పడ్డారని పుకారు.

ఏదేమైతేనేం.. కొన్నాళ్లకు.. ఓ ఫ్రెంచ్‌ వ్యక్తి ..  జమీందారు కుటుంబ సభ్యుల దగ్గర్నుంచి ఆ కోటను కొనుక్కున్నాడు. దాన్నంతా పడగొట్టించి.. చుట్టూ ప్లేస్‌ అలాగే పెట్టి.. చిన్న ఇల్లు కట్టించుకొని అందులో ఉండసాగాడు. ఆ ఫ్రెంచ్‌ వ్యక్తి ఆ జాగను కొనుక్కున్నాడని తెలిశాక.. ఊర్లో చాలామంది గుసగులు.. అతనికి ఆ నేలమాళిగలోని బంగారం బయటకు తీయడం తెలిసిందని. 
కానీ.. కొన్నాళ్లకే ఆ ఫ్రెంచ్‌ వ్యక్తి  ఇంట్లోని బెడ్‌రూమ్‌లో మంచం మీద నుంచి కిందపడి.. తలకు బలమైన దెబ్బ తగిలి చనిపోయాడు. తర్వాత ఆ ఫ్రెంచ్‌ వ్యక్తి కుటుంబీకులు వచ్చి ఆ ఇంటిని ఇంకెవరికో అమ్మేశారు. ఆ కొనుక్కున్న వ్యక్తీ అలాగే చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు భయపడి ఆ ఇంటిని వేరే ఊరి వాళ్లకు అమ్మేసి వెళ్లిపోయారు. ఆనక వచ్చిన వాళ్లదీ అదే అనుభవం. వాళ్లు నరేంద్రకు అమ్మారు. అప్పుడు నరేంద్రను ఊళ్లో వాళ్లంతా భయపెట్టారు... నచ్చజెప్పారు.. హెచ్చరించారు ఇల్లు కొనద్దని. అయినా అలాంటివి నమ్మని నరేంద్ర ఇల్లు కొన్నాడు. 
కొన్ని మరుసటి రోజు నుంచే నేలమాళిగలోంచి చప్పుళ్లు ప్రారంభమయ్యాయి. మొదట్లో భయపడ్డాడు. యేడాదిగా అలవాటు పడ్డాడు. ఇప్పుడు ఆ ఆకారంతో మాట్లాడుతున్నాడు కూడా. 
చాలాసార్లు ఆ ఆకారం అతనికి తన దగ్గరున్న బంగారం.. వెండి.. వజ్రాలను ఆశ చూపింది.. తనను బయటకు తీస్తే వాటిని ఇస్తానని. 
నవ్వుతూ దాటవేస్తూనే ఉన్నాడు నరేంద్ర.

‘‘నాకు తెలుసు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో?’’ లోపలి నుంచి ఆకారం అతని మౌనాన్ని, ఏకాంతాన్ని భంగపరిచింది.
‘‘ఈ ఇల్లు కొనుక్కున్నప్పుడే నా మొండితనం నీకు అర్థమై ఉంటుంది. ఇంకా నీ సహనాన్ని ఎందుకు పరీక్షించుకుంటావ్‌ చెప్పు?’’ అన్నాడు సౌమ్యంగా అతను. 
‘‘అర్థమైంది కాబట్టే.. నిజంగా నీకు ఈ సంపదనంతా ఇచ్చి గాల్లో కలిసిపోదామనుకుంటున్నా’’ అంది ఆ ఆకారం.
‘‘అది నాది కాదు.. నాది కానిది ఏదీ నాకు వద్దు. నువ్‌ ఇప్పుడు గాల్లోనే ఉన్నావ్‌!’’ అన్నాడు అంతే నింపాదిగా అతను.
ఆ ఆకారం అహం దెబ్బతిన్నది. మళ్లీ దబదబా  నేలను బాదింది.. గదంతా కలియతిరుగుతూ.. గదిలోని టేబుల్, కుర్చీ.. బట్టల అలమరా కాళ్లు గుంజింది. ఒకొక్కటిగా అవన్నీ కింద పడిపోయాయి. అయినా అతను కదల్లేదు.. బెదరలేదు.
‘‘ నన్ను ఒక్కసారి బయటకు రానివ్వవా ప్లీజ్‌.. .. ఆ జమీందారిగాడి కుటుంబంలోని ఒక్కొక్కళ్లను చావగొడ్తా.. తర్వాత నువ్వు ఉండమన్నా ఉండను’’అంటూ కాళ్లబేరానికి వచ్చింది.
నవ్వుతూ అన్నాడు అతను‘‘ఏ కాలం సంగతి నువ్వు మాట్లాడేది. అతనికి పుట్టిన వాళ్లంతా పోయారు’’అన్నాడు.
‘‘ఆయన మనవలు.. మునిమనవలు ఉంటారు కదా.. ’’ అంది అదే కసితో.
‘‘మనవలూ పోయారు. మునిమనమడు ఒక్కడే. ఉన్నాడు.. నీ ముందే’’ అన్నాడు నరేంద్ర.
ఆకారం నుంచి మాట లేదు. కదలికా లేదు.
‘‘చెప్పాగా.. నాకు నీ దగ్గరున్న సంపద మీద ఆశలేదు.  దాని మీద ఆశపడింది నువ్వు. దానితోనే ఉండిపో’’అని చెప్పి గది బయటకు నడిచాడు నరేంద్ర.
- సరస్వతి రమ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement