ఈ కాలం అమ్మాయిలు.. చదవని డిగ్రీ లేదు..
చేయని ఉద్యోగం లేదు.. పొందని అవకాశం లేదు..
రాష్ట్రాలూ ఏలుతున్నారు..అరే.. స్పేస్‌లోకీ వెళ్తుంటే!!
వాళ్లకు అండగా ఎన్ని చట్టాలు? 498 (ఏ), డొమెస్టిక్ వయొలెన్స్, నిర్భయ..!
బస్సుల్లో వాళ్లకు సీట్లు.. స్థానిక పాలనాసంస్థల్లో సీట్లు..
ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్స్..
ఇంకా..
ఆగొచ్చు అక్కడితో! ఎంత చదువుకుంటున్నా.. ఎన్నో కొలువుల్లో ఉన్నా.. ఆఖరికి అంతరిక్షంలోకి వెళ్లినా ఎక్కడా నాయకత్వంలో లేరు. మహిళాపాలకులనూ వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు!
ఎన్ని చట్టాలు వచ్చినా వాళ్ల మీద హింస మాత్రం ఆగట్లేదు. బస్సుల నుంచి స్థానిక పాలనా సంస్థల దాకా ఉన్న సీట్లూ వాళ్లను నాయకులుగా నిలబెట్టేవి కావు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లూ ఆడవాళ్లను బాసులుగా చేయట్లేదు. అన్నీ నేర్చుకొని.. లేదా నేర్చుకోవాలనే తపన చూపించి నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలనుకుంటే...
‘నేను డ్రైవింగ్ నేర్చుకోనా?’ ఉత్సుకతో అడిగిన భార్యకు ‘ముందు పరాఠా చేయడం నేర్చుకో.. డ్రైవింగ్ సంగతి తర్వాత’ అని భర్త చెప్పే సీన్ల (థప్పడ్ అనే బాలీవుడ్ సినిమాలోనిది)వంటివే ఎదురవుతుంటాయి. తప్ప ‘మిష్టర్ పెళ్లాం’ సినిమాలో లాగా ‘మీ సరకుల్లో చచ్చులు, పుచ్చులు ఉండవని.. ఉంటే చూపించమని సవాల్ చేయండి.. క్వాలిటీనే మీ బ్రాండ్‌గా మార్చుకోండి.. సేల్స్ ఎందుకు పెరగవో చూద్దాం’ అని సలహా ఇచ్చిన మహిళలోని ప్రతిభను మెచ్చి, ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాన్నీ గుర్తించి మేనేజర్ స్థాయి ఉద్యోగం ఇచ్చిన యాజమాన్యం.. అలాంటి సీన్లు కనిపించవు.
చర్విత చర్వణంలాంటి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి యూఎన్ విమెన్ ఈ ఏడు ప్రకటించిన థీమ్.. ‘‘విమెన్ ఇన్ లీడర్‌షిప్: అచీవింగ్ ఏన్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ ఏ కోవిడ్–19 వరల్డ్’’. మహిళలు నాయకత్వం వైపు అడుగులేస్తూ స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించాలని యూఎన్ విమెన్ వింగ్ ఏటా ఒక్కో థీమ్‌తో ప్రపంచాన్ని చైతన్య పరుస్తోంది. ఆ స్ఫూర్తిని అందుకుంటున్న దేశాలున్నాయి. ఆ ప్రయాణాన్ని ఇదివరకే ప్రారంభించిన దేశాలూ ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తున్న దేశాలూ లేకపోలేదు. మనం ఏ జాబితాలో ఉన్నామో మహిళలకు సంబంధించి తాజా పరిస్థితులు, పరిణామాలు, పర్యవసానాలను బట్టి అర్థమవుతూనే ఉంది. సందర్భం కాబట్టి ఇటీవల కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ చేసిన పన్నెండు పని గంటలు, మూడు రోజుల సెలవులు అనే ప్రతిపాదనను మహిళా కోణంలోంచి చూద్దాం. ప్రభుత్వాలు ఎలాంటి ప్రతిపాదన చేసినా.. చేయాలనుకున్నా దాని ప్రభావం స్త్రీల మీద ఎలా ఉంటుందో.. ఎలా ఉండబోతుందో ఒకటికిపదిసార్లు చర్చించి, తరచి చూసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. చట్టాలుగా తేవాలి. ప్రతిపాదన దశలో మహిళా వర్గం నుంచి వస్తున్న స్పందన, ప్రతిస్పందనలనూ పరిగణనలోకి తీసుకోవాలి.
కార్మికశాఖ ప్రతిపాదించిన ఈ పనిదినాల మార్పు మీద మెట్రో నగరాల్లో చర్చ మొదలై పోయింది. ‘రోజూ పన్నెండు గంటల చొప్పున వారానికి నాలుగు పనిదినాలు, మూడు వారాంతపు సెలవులు లేదా ఇప్పుడెలా ఉందో అలాగే అంటే రోజుకి ఎనిమిది గంటల చొప్పున వారానికి ఆరు పనిదినాలనే అనుసరించడం. ఇది ఐచ్ఛికం. ఈ రెండింటిలో ఉద్యోగి ఏ పద్ధతినైనా అవలంబించవచ్చు’ అనేదే ఆ ప్రతిపాదన.
ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదుకదా.. ఉద్యోగులు అందరికీ కదా? అవును. కానీ ప్రభావం మాత్రం మొత్తం స్త్రీల మీదే ఉంటుంది. అన్నేసి గంటల పనివేళలు ఎవరికైనా ఇబ్బంది. మగవాళ్లు రోజంతా ఆఫీస్‌లో గడిపితే ఇంట్లోని మహిళలు అదనపు భారాన్ని మోయాలి. ఆఫీస్‌కెళ్లే ఆడవాళ్ల తిప్పలైతే చెప్పక్కర్లేదు. విలువలేని ఇంటి చాకిరీతోపాటు ఎంతోకొంత విలువ చేసే ఆఫీస్ చాకిరీ కలసి రోజుకు 24 గంటలూ సరిపోవు. ‘ఎనిమిది, తొమ్మిది గంటల పనివేళలకే ఇంట్లోంచి ఉదయం బయలుదేరితే రాత్రికి గానీ ఇల్లు చేరని పరిస్థితి.
నగరాల్లోని ట్రాఫిక్ ఇక్కట్లు ఆ సమయాల్ని మరింత సాగదీస్తాయి. రోజుకి పన్నెండు గంటలంటే ఊహించుకోవడానికేమీ లేదు. ‘అయినా ఇది ఐచ్ఛికమే అంటున్నారు కదా?’ అని కొంతమంది ఉద్యోగినులు, ఉద్యోగులనూ అడిగితే.. ‘ముందు ఆప్షన్‌గానే ఇస్తారు తర్వాత అది తప్పనిసరి నిబంధనగా మారుతుంది. సపోజ్.. మా ఆఫీస్ (ప్రభుత్వ కార్యాలయం)లో కొంతమందిమి ట్వల్వ్ అవర్స్, త్రీ డేస్ వీకెండ్‌ను ఆప్షన్‌గా తీసుకున్నాం అనుకోండి. ఇంకొంతమంది వన్ డే వీకెండ్ ఆప్షన్‌లో ఉన్నారనుకోండి. ఒక పనికి సంబంధించి ఆ టూ కేటగిరీస్ మధ్య కో ఆర్డినేషన్ ఎలా కుదురుతుంది? యూనిఫార్మిటీ ఉన్నప్పుడే పనులు సవ్యంగా జరగడం కష్టం.. ఇక ఒకే సెక్షన్‌లో ఇలా డిఫరెంట్ కేటగిరీస్‌లో పనిచేసే వాళ్ల మధ్య ఎలా కుదురుతుంది? దాంతో అందరికీ పన్నెండు గంటల పనివేళలే తప్పనిసరి చేసేస్తారు’ అని చెప్పారు. ఉద్యోగినులు, అందులోనూ వర్కింగ్ మదర్స్‌ను కదిలిస్తే.. ‘ట్వల్వ్ వర్కింగ్ అవర్స్ కన్నా త్రీ డేస్ వీకెండే అట్రాక్ట్ చేస్తుంది ఎవరినైనా. అబ్బా.. మూడు రోజులు హాలీడేస్ అనిపిస్తుంది.
కానీ దానికి మొత్తం నాలుగు రోజులను పణంగా పెడుతున్నామన్న ధ్యాస రాదు. ఒకవేళ ఉద్యోగులుగా మనం లాజికల్‌గా ఉండి వన్ డే వీకెండ్ ఆప్షన్‌కి వెళితే ఇంట్లో ప్రెజర్ మొదలవుతుంది. మూడు రోజులు సెలవులిస్తుంటే హాయిగా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండక ఒక్క రోజు సెలవుకి వెళ్లడం ఎందుకు? అని. రోజూ పన్నెండు గంటలు ఆఫీస్‌లో.. ప్లస్ నాలుగ్గంటలు ట్రాఫిక్‌లో ప్రయాణాలతో పదహారు గంటలు బయటే గడిపితే ఇంటి పని ఎప్పుడు చేసుకోవాలి? ఎన్నింటికి నిద్రపోవాలి? ఉదయం ఎన్నింటికి లేవాలి? పిల్లలను ఎవరు చూసుకోవాలి? వాళ్ల తిండీతిప్పలకు అత్త, అమ్మ మీదో.. లేకపోతే సర్వెంట్ మెయిడ్ మీదో ఆధారపడ్డా.. వాళ్ల చదువుసంధ్యలు ఎవరు పట్టించుకోవాలి? దీని బదులు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవడం బెటర్ అనిపిస్తుంది. ఆ వెసులుబాటైనా కల్పించేలా లేవు కదా పెరిగిన ధరలు. మొండికేసి ఉద్యోగమే ముఖ్యం అనుకుంటే ఏదోకరోజు రోగాల కుప్పై సంపాదించుకున్నదంతా మెడికల్ బిల్లులకు పే చేయాల్సి వస్తుంది. అమ్మో... తలచుకుంటేనే భయంగా ఉంది’ అంటున్నారు.
నిజమే..
ఇంకా చట్టంగా రాకుండా.. కేవలం చర్చల్లోనే ఈ ప్రతిపాదన ఇంతగా వణికిస్తోంది. బయట పనుల్లో స్త్రీలు భాగస్వాములైనంత చొరవగా, వేగంగా ఇంటి పనుల్లో మగవాళ్లు భాగస్వాములు కాలేదు. మనకది నేటికీ వింత సంస్కృతే. అమ్మాయి ఉద్యోగం చేయాలి, ఇంట్లో పనీ చూసుకోవాలి. పిల్లల పెంపకమూ ఆమె బాధ్యతే.
అసలు మహిళా దినోత్సవం వచ్చిందే పనివేళల కుదింపు, శ్రమకు తగ్గ వేతనం, ఓటు వేసే హక్కు కావాలనే డిమాండ్‌తో. వందేళ్ల పైబడ్డ చరిత్ర ఆ విప్లవానిది. ఈ వందేళ్లలో సాధించిన నాగరికత ఆధునిక స్త్రీ సవాళ్లను గుర్తించాలి.. సమానత్వాన్ని చేకూర్చాలి. శ్రమకు తగ్గ వేతనం నుంచి సమాన వేతన లక్ష్యానికి చేరాలి. కానీ సాంకేతిక యుగంలో కూడా స్త్రీ విషయంలో ఇంకా ప్రాథమిక దశే మనది. మహిళలు గడప దాటితే ఎక్కడికి వెళ్తున్నారో పోలీస్‌స్టేషన్‌లో చెప్పి, వివరాలు నమోదు చేసి వెళ్లాలనే నిబంధన (మధ్యప్రదేశ్‌లో) పెట్టే స్థితిలో ఉంటే సమానత్వం మాటెక్కడిది?
పాశ్చాత్య దేశాలు మనకు భిన్నంగా ఉన్నాయి. ఫ్రాన్స్‌లో వారానికి 35 గంటల పని నియమం. అమెరికాలో వారానికి 40 గంటలు. మన దగ్గర వారానికి 48 గంటలు. లేబర్ యాక్ట్ ప్రకారం రోజుకి తొమ్మిది గంటలు గరిష్ట పరిమితి. ఏ రోజైనా తొమ్మిది గంటలకంటే ఎక్కువ పనిచేయించుకుంటే దాన్ని ఓటీగా పరిగణించి రెట్టింపు డబ్బులు చెల్లించాలి. స్వీడన్‌లో ఎనిమిది గంటల పనివేళలను ఆరు గంటలకు మార్చారు. దీనివల్ల ఉత్పత్తిలో ఎలాంటి ఆటంకాలు రాకపోగా పని సామర్థ్యం పెరిగినట్టుగా గమనించారు. అంతేకాదు ఉద్యోగుల ఇళ్లల్లోనూ ఆరోగ్యకర వాతావరణం నెలకొందని అధ్యయనాలు తెలిపాయి. కాలక్రమేణా ఈ పనిగంటల విధానాన్ని ఇలా సరళం చేసేలా ఆలోచించాలి కాని క్లిష్టతరం చేయడమేంటి? పారిశ్రామిక విప్లవ పూర్వకాలానికి వెళ్తున్నామా అనిపిస్తోంది కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆలోచనలు వింటూంటే’ అని ప్రశ్నిస్తున్నారు సామాజికవేత్తలు.
తలనొప్పి వ్యవహారంగా..
సాంకేతికత తెచ్చిన ఆధునికత ఎంత విస్తృతమైనా ఇంటా, బయటా మహిళల భద్రత విషయంలో మనం అనాగరికంగానే ఉన్నాం. ఆడవాళ్లకు ఉద్యోగాలిస్తే అన్నీ సవాళ్లే అని విసుక్కునే యాజమాన్యాలే ఎక్కువ. అమ్మాయిలకు ఉద్యోగాలంటే ఆఫీస్ డెకొరమ్‌ను డిసిప్లిన్‌లో పెట్టాలి, రాత్రి తొమ్మిది దాటితే రవాణా సౌకర్యం కల్పించాలి, యాంటీ సెక్సువల్ హెరాస్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేయాలి, మెటర్నిటీ లీవ్‌ను ఇవ్వాలి.. ఇదంతా తలనొప్పి వ్యవహారంగా భావించే యాజమాన్యాలు చాలానే ఉన్నాయి. దీని కన్నా మహిళలను తీసుకోకుండా ఉంటేనే నయం కదా అనే ఆచరణలోకి వచ్చేస్తున్నాయి. పని ప్రదేశాల్లో స్త్రీలకు ఎదురయ్యే ఇబ్బందులను అరికట్టే సరైన యంత్రాంగం లేదు. ఇప్పుడీ పనిగంటల పెంపు మహిళల ఉద్యోగ జీవితాన్ని మరింత అభద్రతలోకి నెట్టడమే కదా! మా ఉద్యోగ హక్కును, అవకాశాలను హరించేయడమే కదా? అంటున్నారు ఈ తరం అమ్మాయిలు.
నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడమే..
మహిళలు లీడర్‌షిప్ వైపు రావాలి. ఆర్థిక, సాంఘిక, రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి అని ఉపన్యాసాలు ఇస్తున్నాం.. వింటున్నాం. ఇలా మహిళా దినోత్సవాల పేరిట స్ఫూర్తినీ పంచుతున్నాం. ఇంకో వైపు ఈ గంటల పెంపు వంటివాటినీ అమలు చేయచూస్తున్నాం. మహిళా కోణంలోంచి చూస్తే పొమ్మనలేకుండా పొగబెట్టే కార్యక్రమంగానే తోస్తోంది. వాళ్లంతట వాళ్లు ఉద్యోగాల నుంచి తప్పుకునేలా చేసే ప్రణాళికే ఇది. యాజమాన్యాల కోసం చేస్తున్న ప్రతిపాదన. ఇలాంటి అడ్డంకులను పేరుస్తూ కమాన్ లేడీస్.. మీరు సాధించగలరు.. అన్నిరంగాల్లో మీరు లీడర్స్‌గా రావాలి అని ప్రోత్సహించడంలో అర్థం ఉందా? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా ఇది .. అని అభిప్రాయపడుతున్నారు నాయకత్వ బరిలో ఉన్న చాలా మంది మహిళలు. ఈ అభిప్రాయం అపోహ కాదనే అనిపిస్తోంది. దీని మీద చర్చలు విస్తృతం కావాలి. పురుషులూ పాలుపంచుకోవాలి. ఇంట్లో అయినా బయట అయినా శ్రమలో స్త్రీ, పురుషుల సమభాగస్వామ్యం ఉండాలి. మహిళలు ఐచ్ఛికంగా ఉద్యోగాలు వదులుకోవడం కాదు.. ఇన్నాళ్లుగా ఈ సమాజం పురుషుడికి ఇచ్చిన నాయకత్వ వరాన్ని వాళ్లు వదులుకోవాలి. స్త్రీలకూ ఆ అవకాశం ఉండాలని గ్రహించాలి. ఆ హక్కును మహిళలూ తీసుకోవాలి. దీని కోసం మహిళల పరిధిని కుదించే నిబంధనలు కాదు.. వాళ్ల స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, ప్రజ్ఞ, సామర్థ్యాలను గౌరవించే ప్రతిపాదనలు, చట్టాలు కావాలి.
సవాళ్లు..
అవకాశాల తీరు
► మన చట్టసభల్లో కేవలం 14 శాతం మంది మాత్రమే మహిళలు.
► పారిశ్రామిక సంస్థల విషయానికి వస్తే పేరున్న అయిదు వందల కంపెనీల్లో కేవలం అయిదు శాతం స్త్రీలు మాత్రమే సీఈఓలుగా ఉన్నారు.
ప్రపంచంలో మనం
► 193 దేశాల్లోని చట్టసభల్లో స్త్రీల భాగస్వామ్యం లెక్క తీస్తే మనం 150వ స్థానంలో ఉన్నాం.
భద్రత స్కేలు
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం 2018తో పోల్చితే 2019లో మహిళల మీద నేరాల సంఖ్య 7.3 శాతం పెరిగింది. ఈ నేరాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దళితుల మీద నేరాల విషయానికి వస్తే ఆ స్థానాన్ని రాజస్థాన్ తీసుకుంది.
► 2019లో మహిళల మీద జరిగిన నేరాల సంఖ్య 4,05,816 (నమోదైన కేసులు). 2018లో ఈ సంఖ్య 3,78,236.
► లైంగిక దాడుల విషయానికి వస్తే 5వేల 997 కేసులతో రాజస్థాన్ ఆ అపఖ్యాతిని మోస్తోంది. ఆ వరుసలో 3,065 కేసులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలబడింది.
► పోక్సోయాక్ట్ కింద నమోదైన నేరాల్లో 7,444 కేసులతో ఉత్తరప్రదేశ్ ముందుంది. తర్వాత మహారాష్ట్ర. అక్కడ నమోదైన కేసుల సంఖ్య 6,402.
► వరకట్న కేసుల్లోనూ ఉతర్తప్రదేశ్‌కే అపకీర్తి కిరీటం. నమోదైన కేసుల సంఖ్య 2,410. తర్వాత బిహార్. కేసుల సంఖ్య.. 1,220.
► యాసిడ్ దాడుల్లోనూ ఉత్తరప్రదేశ్‌దే ప్రథమ స్థానం. నమోదైన కేసులు 42. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. నమోదైన కేసులు 36. ( ఎన్‌సీఆర్‌బీ 2019 )
12 గంటల పనిదినం అకాల మరణమే!
ఉద్యోగుల చేత వారానికి 4 రోజులే పని చేయించి, రోజుకి 8 గంటల బదులు 12 గంటలు పని చేయించుకోవచ్చుననే ప్రతిపాదన వల్ల ప్రధానంగా స్త్రీలకు జరిగే నష్టం.. స్త్రీలు నాయకత్వ స్థానాల్లోకి ఎదగడానికి కావలిసిన పరిస్థితులు.. స్త్రీ–పురుష సమానత్వ సాధనకు పురుషులు చేయాల్సిన కృషి.. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఇప్పుడున్న పెట్టుబడిదారీ విధానాన్ని తీసెయ్యడమే. అది ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు కాబట్టి, తాత్కాలిక పరిష్కారాల గురించి ఆలోచించాలి. ప్రస్తుతం నూటికి 90 శాతం పని స్థలాల్లో, 8 గంటల పని దినం అయినా అమలులో లేదు, కాయితాల మీద తప్ప. రోజుకి 8 గంటల చొప్పున వారంలో 6 రోజుల పని అయినా, రోజుకి 12 గంటల చొప్పున వారంలో 4 రోజులే పని అయినా, పని చేసేది 48 గంటలే గదా? అని ప్రభుత్వమూ, యజమానులూ వాదించవచ్చును. కానీ, 12 గంటల పని దినంలో, 8 గంటల పని దినంలో కన్నా శ్రమ తీవ్రత ఘోరంగా వుంటుంది.
యజమానులు ఉత్పత్తి సాధనాలను, ఎప్పటికప్పుడు మార్చివేసి, ఉద్యోగులు (కార్మికులు) సృష్టించే అదనపు విలువని పెద్ద ఎత్తున గుంజు కోగలుగుతారు. 12 గంటల పని దినంలో వుండే శ్రమ తీవ్రత, మార్క్స్ తన ‘కాపిటల్’ పుస్తకం లో చెప్పినట్టు ‘‘అది కార్మికుని వాస్తవ ఆయుష్షును తగ్గించడం ద్వారా ఒక నిర్ణీత కాల పరిమితిలో అతని ఉత్పత్తి కాలాన్ని పొడిగిస్తుంది.’’ అది క్రమంగా ‘‘అకాల అశక్తతనీ, మరణాన్నీ ఉత్పత్తి చేస్తుంది.’’ కాబట్టి, కార్మికులు 8 గంటల పనిదినం అనే నియమాన్ని యజమానులు కచ్చితంగా అమలు పరచాలని డిమాండు చేయడమే తాత్కాలిక పరిష్కారం. ఇంటి పని అనేది ఇప్పటికీ ప్రధానంగా స్త్రీల బాధ్యతగానే వుంది కాబట్టి, 12 గంటల పని దినం వల్ల, బైటికి వెళ్ళి పనులు చేసే స్త్రీల మీద, శారీరకం గానూ, మానసికంగానూ ఒత్తిడి పెరుగుతుంది. ఆ స్త్రీలు పిల్లలకెప్పుడు తిండి పెడతారు? పిల్లల్ని ఎప్పుడు బడికి పంపుతారు? ఇంట్లో వుండే వృద్ధుల్ని ఎలా చూసుకుంటారు? రోజుకి 12 గంటల చొప్పున కాక, 24 గంటల చొప్పున అయితే, 2 రోజుల్లోనే కార్మికులు ఇళ్ళకు వెళ్ళకుండా 48 గంటలు పని ఇచ్చేస్తారు గదా! అది యజమానులకు ఎంత మేలు!
స్త్రీలు నాయకత్వ స్థానాలలోకి ఎదగడం అంటే, ఉద్యోగాలలో, పని స్థలాల్లో, శారీరక శ్రమలు చేసే వారిపైనా, కొన్ని రకాల మేధా శ్రమలు చేసే వారి పైనా‘అధికార’ స్థానాల్లో వుండడమే! ఇప్పుడు ఆ స్థానాల్లో మొగవాళ్ళే ఎక్కువగా వున్నారు కాబట్టి. ఆ అధికార స్థానాల్లో, పురుషులకైనా, స్త్రీలకైనా ‘పర్యవేక్షణ’ అనే సహజంగా అవసరమయ్యే పనీ వుంటుంది. ‘పెత్తనం’ అనే అసహజ కార్యమూ వుంటుంది. పర్యవేక్షణ శ్రమలు చేసే అవకాశం కోసం స్త్రీలు డిమాండు చెయ్యవచ్చును. పెత్తనం శ్రమ చేసే అవకాశం ఎవ్వరికీ వుండకూడదు. కానీ, ‘తప్పుడు సామాజిక సంబంధాల’(‘‘ఫాల్టీ సోషల్ రిలేష¯Œ ్స’’) వల్ల ఆ స్థానాలు అవసరం అయ్యాయి.
స్త్రీ–పురుష సమానత్వం కోసం స్త్రీలూ, పురుషులూ కృషి చేయవలిసింది, సమసమాజం కోసమే! అంటే, స్తీలకీ, పురుషులకీ ఇద్దరికీ ఇంటి పనీ, ఇద్దరికీ బైటి పనీ అనే శ్రమ విభజన అమలు జరిగే సమాజం కోసం కృషి చెయ్యాలి.
భిన్నంగా ఉంటుందని ఊహించలేం
ఆడవాళ్ల జీవితాలు ఎన్నో సమస్యలతో ముడిపడి ఉంటాయి. ఇంటి, వంట పని దగ్గర్నుంచి భర్తకు, పిల్లలకు లంచ్ బాక్స్‌లు సర్దివ్వడం వరకు ఒత్తిడి అంతా ఆడవాళ్లే భరించాల్సి వస్తోంది. కాబట్టి పన్నెండు గంటల ఆఫీస్ పనివేళల వల్ల రోజూ వారి జీవితం మరింత భారమవుతుంది. లాక్‌డౌన్ టైమ్‌లో మహిళల మీద పెరిగిన హింసను గమనిస్తే వారానికి మూడు సెలవులు ఆ హింసకు భిన్నంగా గడుస్తాయని ఊహించలేం. అలాగని పన్నెండు గంటల సమయాన్ని ఆఫీస్‌కూ వెచ్చించలేరు కదా. ఇంటి, వంట పనిలో మగవాళ్లు విధిగా భాగస్వాములైతే తప్ప మహిళలపై భారం, హింస తగ్గే సూచనలు లేవు. మారిన కాలానికి అనుగుణంగా మగవాళ్ల మనస్తత్వం మారకుండా ఎంతకాలం నిర్లజ్జగా, స్తబ్ధుగా, కటువుగా ఉంటుందో అంతకాలం స్త్రీ, పురుషుల సంబంధాలు హింసాపూరితంగానే ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ కోణంలో ఆలోచన చేయకుండా తెచ్చే ఎలాంటి పాలసీలైనా మహిళా సాధికారతకు అడ్డంకులే తప్ప వాళ్ల లీడర్‌షిప్‌ను పెంచే ప్రయత్నాలు కావు.
– అంకురం సుమిత్ర, సామాజిక కార్యకర్త
వలంటరీగా ఇంటికి పంపించే ప్రయత్నం
కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ ప్రతిపాదన వింటుంటే ఆ మధ్య జరిగిన ఓ సంఘటన గుర్తొస్తోంది. ఆడవాళ్లు ఆటోలు నడుపుతుంటే మేల్ ఆటోడ్రైవర్లంతా స్ట్రయిక్ చేశారు. ఇదొక్కటే కాదు గ్లోబలైజేషన్ తొలినాళ్లనాటి సంఘటనలూ గుర్తొస్తున్నాయి. అప్పుడూ ఇంతే.. అసంఘటిత రంగంలో ఉన్న ఆడవాళ్లంతా పనులు మానేసేట్టు చేశారు. దానికి అతీతంగా ఏమీ ఉండబోదు ఈ పన్నెండు గంటల పనివేళలు, మూడు రోజుల సెలవు దినాల ప్రతిపాదన. ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోంచి కూడా మహిళలను వలంటరీగా ఇంటికి పంపించే ప్రయత్నం ఇది. మళ్లీ మహిళలను నాలుగు గోడలకే పరిమితం చేసే కుట్ర ఇది. ఎన్టీఆర్ ఇలాగే ఇష్టం వచ్చినట్టు పనిగంటలను మార్చాడు. ప్రభావం ఆడవాళ్ల మీదే పడింది. ఇప్పుడూ అలాగే ఉంటుంది. కుటుంబంలోని స్త్రీ, పురుషుల మధ్య ఎలాంటి అవగాహన, అండర్‌స్టాండింగ్ పెంచే వాతావరణం కల్పించకుండా ఇలాంటి చట్టాలు తెస్తే బలయ్యేది మహిళలే. పురుషాధిపత్య మైండ్‌సెట్‌ను మార్చకుండా నాయకత్వం దిశగా మహిళలు నడవాలి అనడం మీనింగ్ లెస్.
– కొండవీటి సత్యవతి, భూమిక ఎడిటర్
మానవ హక్కుల ఉల్లంఘనే..
పన్నెండు గంటల పనివేళలు, మూడు రోజుల సెలవులు అనేది కచ్చితంగా రాంగ్ డైరెక్షనే. ఉద్యోగినులకే కాదు, ఇంట్లో ఉన్న స్త్రీలకూ ఇది భారమే. నిజానికి ఇప్పుడున్న వారానికి 48 గంటల పనివేళలన్నదే చాలా బర్డెన్. దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి కాని రోజులో శ్రమ భారాన్ని పెంచే ప్రయత్నం ఏంటి? ఇదంతా ఉద్యోగుల కోణంలోంచి జరుగుతున్న మేలు కాదు.. యాజమాన్యాలకు చేయాలనుకున్న మేలుగానే అనిపిస్తోంది. ఒకరంగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ప్రభావం తప్పకుండా మహిళ మీదే పడుతుంది. మహిళలు నాయకత్వం వైపుగా రావడానికి సహజంగా ఉండే అడ్డంకులే సవాలక్ష. వాటి దృష్ట్యా మహిళలకు వెసులుబాటు కల్పించాల్సింది పోయి ఇలాంటి ప్రతిపాదనలతో మరింత క్లిష్టం చేస్తున్నాం. ఈ ప్రతిపాదన ఆప్షన్ అంటున్నారు కాని ఒకసారి మొదలైతే అది ఆప్షన్‌గా ఉండదు. అనివార్యంగా మారుతుంది. తప్పనిసని అవుతుంది. ఈ సందర్భంగా గృహిణుల శ్రమనూ చర్చించాలి.
– విస్సా కిరణ్ కుమార్, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు.
లీడర్‌షిప్ ప్రతిబంధకాలు
ఇప్పటికే వర్క్‌ప్లేస్‌లో ఉన్న సెక్సువల్ హెరాస్‌మెంట్స్‌కి ఈ పని గంటల పెంపు కూడా తోడైతే ఆ స్ట్రెస్ తట్టుకోలేక మహిళలు ఉద్యోగాలు మానేసే అవకాశాలే ఎక్కువ. ఇంట్లో ఆడవాళ్ల పనినీ అన్‌పెయిడ్ లేబర్‌గా చూస్తున్నాం. ఆఫీస్ పని చేసినా ఇంటి పనీ ఆమె బాధ్యతే అన్నట్టుగా ఉంటుంది మన ధోరణి. ఈ క్రమంలో ఈ ప్రపోజల్, రిఫార్మ్స్ అన్నీ కూడా విమెన్ లీడర్‌షిప్‌కు ప్రతిబంధకాలుగా ఉంటున్నాయే తప్ప వాళ్లను ప్రోత్సహించేలా ఉండట్లేదు. ట్వల్వ్ అవర్స్ వర్కింగ్ అనేది అయితే కచ్చితంగా కంపెనీలకు లాభమయ్యేదే.
– స్వేచ్ఛ, న్యాయవాది
ప్రైవేట్ యాజమాన్యాలకు ఆహ్వానం
ఈ ప్రతిపాదన చాలా అశాస్త్రీయమైంది. ఇది ప్రైవేట్ యాజమాన్యాలకు ఆహ్వానంగా ఉందే తప్ప ఉద్యోగులకు ఒరగబెట్టేదేం లేదు. ముఖ్యంగా మహిళల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వాళ్ల మానసిక, శారీరక అరోగ్యాన్ని దెబ్బతినే ప్రమాదం ఉంది. రోజూ పన్నెండు గంటలు ఆఫీస్ పనితోనే సరిపోతే మిగిలిన వ్యక్తిగత పనుల సంగతేంటి? వాటికి వాళ్లెప్పుడు సమయం వెచ్చించాలి? అలాగే భద్రతా ప్రశ్నార్థకమే.
– గౌతమ్, న్యాయవాది
Comments
Please login to add a commentAdd a comment