
నేను అతి పేదవాడిని. మా నాన్న బతికినన్నాళ్ళు కులాసాగా కాలం గడిపి నా జీవనోపాధికేమీ ఏర్పాటు చేయకుండా కాలం చేశాడు. ఎవరార్డ్ కింగ్ మా నాన్న మేనల్లుడు. అతనొక్కడే మా దగ్గరి బంధువు. మా నాన్న అన్నగారైన సదరన్‌టన్ బ్రహ్మచారి. పెద్ద ఎస్టేటుకు యజమాని. నాకు బొత్తిగా ఆదాయం లేదు. ఖర్చులెక్కువైపోయాయి. రోజురోజుకూ జీవితం దుర్భరం కాసాగింది. అప్పులు పెరిగిపోయాయి. అప్పులిచ్చిన వాళ్ళు పీక్కుతినసాగారు.
ఎవరార్డ్ కింగ్ నా తండ్రికి స్వయానా మేనల్లుడు. నా పెదతల్లి సోదరుడు. అతడు ఇంతకుముందు బ్రెజిల్‌లో సాహసోపేత జీవితాన్ని గడిపి ప్రస్తుతం స్థిరనివాసమేర్పరుచుకోదలచి ఇంగ్లాండుకొచ్చాడు. సఫోక్ లో, క్లిప్టన్ దగ్గర గ్రేల్యాండ్స్ అనే పెద్ద ఎస్టేట్ కొన్నాడు. నా గురించి ఈషణ్మాత్రం పట్టించుకోని అతని నుండి గ్రేల్యాండ్స్ రమ్మని నాకు ఆహ్వానమందింది.
నాలో సంతోషం ఉప్పొంగింది. వెంటనే బయలుదేరి అక్కడికి రైల్లో చేరుకున్నాను. నేనొక బండిని బాడుగకు మాట్లాడుకున్నాను. బండి చోదకుడు మిస్టర్ ఎవరార్డ్ కింగ్ దాతృత్వం గురించి చాలా గొప్పగా పొగిడాడు. దానగుణసంపత్తిలో అతనికి సాటిరాగల వాడెవ్వరూ ఆ ప్రాంతంలో లేరని చాలా మంచిగానే చెప్పాడు.
పర్యావరణహితం కోరి ఆ గొప్పవ్యక్తి చాలా రకాల జంతువులను, వివిధజాతుల పక్షులను ఇంగ్లండులో పెంచి ఆయా జాతులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో బ్రెజిల్ నుంచి తీసుకొచ్చినట్టు చెప్పాడు. గ్రేల్యాండ్స్ పార్క్ గేటువద్దకొచ్చింది బండి. ఇంటి గడప మెట్ల మీద నిలబడి ఉన్న వ్యక్తే అంకుల్ అని ఊహించాను. ఇంతకుముందెన్నడూ అతన్ని చూసి ఉండలేదు. అంకుల్ కూడా నేనేనని ఊహించాడు. అంకుల్ వయస్సు సుమారు నలభై ఐదేళ్ళుండొచ్చు. పొట్టిగా లావుగా ఉన్నాడు. గుండ్రని ముఖం, నవ్వుతున్న కళ్ళు. ముఖం నిండా ముడతలు. తెల్లని దుస్తులు ధరించాడు. పెదవుల మధ్య సిగార్. తలవెనుక వేళ్ళాడుతున్న పనామా టోపీ. పిల్లర్ల మీద, రాతితో కట్టిన విశాలమైన బంగళా. నన్ను చూడగానే అతనిముఖంలో సంతోషతరంగాలు లేచాయి. ఉత్సాహం పరుగులు తీసింది.
అంకుల్ ఎవరార్డ్ భార్యకు నా రాక బొత్తిగా ఇష్టం లేదని నేను తక్షణమే లండన్‌కు తిరిగివెళితే బాగుంటుందనే ఉద్దేశం ఆమె మనసులో దాగుందని ఆమె ముఖకవళికల్నిబట్టి అన్యాపదేశంగా ఆమె చెబుతున్న మాటల్నిబట్టి గ్రహించాను. అయితే నేనక్కడికి వెళ్ళిన నా లక్ష్యం ఏమంటే భరించలేని అప్పులతో సతమతమౌతున్న నేను మిస్టర్ ఎవరార్డ్ కింగ్‌కు విన్నవించి ఎంతో కొంత ఆర్థికసహాయం పొందాలని. కానీ, ఆయన భార్యకు నేనక్కిడికిపోవడం సుతరామూ ఇష్టం లేదు. నన్నక్కడ్నుంచి వెళ్లగొట్టాలనే ఆలోచిస్తుండేది. ఎవరార్డ్ కింగ్ మాత్రం నాకు మద్దతుగా నిలిచాడు. ఆమె దురుసుతనానికి జడిసి లండన్‌కు వెనుదిరిగిపోదలచుకోలేదు.
‘‘మా ఇద్దరిమధ్యకు మూడో మనిషి ఎవరొచ్చినా నా భార్య ఓర్చుకోలేదు. అది ఆమె తత్వం. ఆమె మాటల్ని పట్టించుకోకు. ఈ సిగార్ వెలిగించు. నావెంట రామరి. నా జంతు ప్రదర్శనశాలను చూద్దువుగానీ.’’ అన్నాడు.
ఆ మధ్యాహ్నమంతా జంతుప్రదర్శనశాలను చూడ్డంతోనే సరిపోయింది. ఎన్నో జాతులపక్షులు, క్రూరమృగాలను విదేశాలనుంచి తెప్పించాడు మిస్టర్ ఎవరార్డ్. కొన్ని స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. కొన్ని బోన్లలో మరికొన్ని పంజరాలలో బంధించబడి ఉన్నాయి. చిట్టచివరకు ఒక పొడవైన నాపరాళ్ళ నడవాలోకి తీసుకెళ్ళాడు నన్ను. దానికి చివరలో పక్కలకు జరుపబడేటటువంటి ఒక బరువైన తలుపుంది. దానిపక్కనే ఇనుపచక్రానికీ డ్రమ్ముకూ అనుసంధానించబడి గోడలోనుండి పొడుచుకువచ్చిన ఇనుప హ్యాండిల్ ఉంది. నడవాకు అడ్డంగా లావుపాటి ఇనుపకమ్మీలు నిలువునా అమర్చబడి ఉన్నాయి.
‘‘ఇప్పుడు నీకు నా సేకరణలోకెల్ల అత్యుత్తమమైన ‘బ్లాక్ డైమండ్’ని చూపించబోతున్నాను. చూద్దువు గానీ రా’ అని నవ్వుతూ...లోపలికి చూడు.’’ అన్నాడు. చూశాను. లోపల విశాలమైన గది. రాతిపలకలు పరచబడిన నేల. మధ్యలో సూర్యకాంతి పడుతున్న చోటులో భారీ శరీరంగల నల్లపులి. సూర్యరశ్మిలోని వెచ్చదనాన్ననుభవిస్తూ ముడుచుకొని పడుకొని ఉంది. అచ్చం పిల్లిలాగే. దాని మీదనుండి చూపులు మళ్ళించుకోలేకపోయాను.
‘‘కొంతమంది దీన్ని చీటా అని అంటారు. కానీ అది చీటా కాదు. అది తలనుంచి తోకవరకూ దాదాపు పదుకొండు అడుగుల పొడవుంటుంది. నాలుగేళ్ళక్రితం దీన్ని కొన్నప్పుడు ఇది చిన్న నల్లని మెత్తని బొచ్చు ఉండలాగా ఉండేది. అందులోనుండి రెండు పసుపురంగు కళ్ళు కనబడుతుండేవి. ఇదిచాలా భయంకరమైనది. ఇంతవరకూ నెత్తురు రుచి చూడలేదు. ఒకసారి రుచిచూస్తే మాత్రం మహా క్రూరంగా మారిపోతుంది. ప్రస్తుతం నేను తప్ప దాని ముందర మరెవరూ నిల్చోలేరు. నేనే దానికి తల్లీతండ్రీ, అన్నీను. అది నన్నేమీ చేయదు.’’ అలా మాట్లాడుతూ, మాట్లాడుతూనే అకస్మాత్తుగా బోనులాంటి ఆ గది ఇనుప ఊచల తలుపు పక్కకు జరిపి లోపలికెళ్ళి మళ్ళీ మూసేశాడు. అతని స్వరం విని ఆ మృగం పైకి లేచి, ఆవులించి, దాని గుండ్రని, నల్లని తలను ప్రేమగా అతనికానించింది. అతడు దాన్నిచేత్తో తట్టి ముద్దుచేశాడు.
‘‘టామీ! ఇక వెళ్ళు’’ అని ఆజ్ఞాపించాడు. అది బుద్ధిగా గదిలో ఒకపక్కకెళ్ళి ముడుచుకొని కూర్చుంది. ఎవరార్డ్ కింగ్ బయటికొచ్చి ఇంతకుముందు పేర్కొన్న ఇనుప హ్యాండిల్‌ని తిప్పనారంభించాడు. అప్పుడు ఆ గది తలుపుకున్న లోహపు కడ్డీలు గోడకున్న రంధ్రాల్లోకి చొచ్చుకుపోయాయి. ఆ తలుపును చేత్తోకూడా కమ్మీలను పక్కకు జరిపి తెరవవచ్చు.
‘‘టామీ అటూ ఇటూ నడవడానికని కొంత స్థలం వదిలేశాను. కావాలంటే నువ్వు కూడా ఈ హ్యాండిల్‌ని తిప్పి టామీని బయటకు వదలొచ్చు. నేను చేసినట్లుగానే దాన్ని తిరిగి బోనులోకి పంపించవచ్చు కానీ నువ్వాపని చేయొద్దు.’’
నేను ఇనుపవూచల మధ్యకు చేయిపోనిచ్చి నున్నగా మెరుస్తున్న దాని మెడ పక్కభాగాన్ని నిమరబోయాను. అతను వెంటనే నన్ను వెనక్కి లాగాడు. నాకేసి కోపంగా చూస్తూ, ‘‘ఈ సమయంలో దాని మూడ్ బాగాలేదు. టామీ నాతో ఉన్నట్లుగా అందరితోనూ చనువుగా ఉండదు. జాగ్రత్త.’’
అంతలో నడవా మీద అడుగుల చప్పుడు చేస్తూ బాల్డ్ విన్ అనే బలిష్టమైన వ్యక్తి చేతిలో ఒక ట్రే పట్టుకొచ్చాడు. ఆ ట్రేలో జంతువు తొడమాంసం ఉంది. ఆకలితో ఉన్న నల్లపులి బోనులో అటూ ఇటూ అసహనంగా తిరుగుతూ ఉంది. పసుపురంగు కళ్ళు మెరుస్తున్నాయి. నోటినుండి వేళ్ళాడుతున్న ఎర్రని నాలుక జొళ్ళు కార్చుతూ ఉంది. తెల్లటి కోరపళ్ళు భయం గొల్పుతున్నాయి.
ఆ వ్యక్తి మాంసాన్ని ఐరన్ బార్స్ సందులో నుండి లోపలికి తోశాడు. అది మాంసాన్ని నోట కరచుకొని మూలకెళ్ళి కూర్చుని, పంజాల మధ్య ఇరికించుకొని చీల్చి తినసాగింది. అప్పుడప్పుడు ముట్టె పైకెత్తి మా వంక చూస్తూ ఉంది. ఆ దృశ్యం భయంగొల్పుతున్నా మనోహరంగానే ఉంది.
‘‘నేను నల్లపిల్లిని అమితంగా ప్రేమిస్తున్నా డియర్ మార్షల్ కింగ్! జూ వాళ్ళు దీన్ని ఇమ్మని అడుగుతున్నారు. కానీ నాకిష్టమైన దాన్ని నేను వదలుకోలేను. సరే. భోజనానికి వెళ్దాం పద.’’
ఆరు రోజులున్నానక్కడ. ఆ సమయంలో అంకుల్‌కు ఎన్నో టెలిగ్రాములొచ్చేటివి. అవి ఎక్కడ్నుంచి వస్తున్నాయో, ఏ వ్యాపార లావాదేవీల గురించి వస్తున్నాయో నాకు తెలిసేది కాదు.
ఆ ఆరురోజుల్లోనూ అంకుల్‌తో మంచిసంబంధాలే ఏర్పరుచుకోగలిగాను. అతడు తాను అమెరికాలో ఉన్నప్పడు చేసిన సాహస కృత్యాలగురించి కథలుకథలుగా చెప్పేవాడు. సమయం చూసుకొని నేను ఎదుర్కొంటున్న ఆర్థికసమస్యల గురించి ప్రస్తావించాను. అంకుల్ శ్రద్ధగా విన్నాడు.
‘‘అన్నట్టు నువ్వు మన బంధువు లార్డ్ సదరన్ టన్ ఆస్తికి వారసుడివట కదా!’’ అడిగాడు సిగార్ పీలుస్తూ.
‘‘అలా అని నేను కూడా అనుకుంటున్నాను. కానీ ఇంతవరకూ అతను నాకు సహాయం చేసింది లేదు.’’
‘‘అతని పిసినారితనం గురించి నేనూ విన్నానులే. ఏదేమైనా నీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఔనూ, అతని ఆరోగ్యమెలా ఉందో ఏమైనా కనుక్కున్నావా మార్షల్?’’
‘‘ఆయన ఆరోగ్యం చాలా అందోళనకరంగానే ఉందని నా చిన్నప్పటి నుంచీ వింటున్నాను.’’ అన్నాన్నేను.
‘‘సరిగ్గా చెప్పావు. వచ్చే ప్రాణం, పొయ్యే ప్రాణం లాగుంది ఆయన పరిస్థితి. అతని ఆస్తి నీ చేతికెప్పుడు దొరుకుతుందో చెప్పలేము. పాపం! నువ్వెంతటి కష్టాల్లో ఉన్నావు?’’ సానుభూతి చూపించాడు.
‘‘మీకన్ని విషయాలు తెలుసు. అతి త్వరలోనే ఆస్తి నా స్వాధీనంలోకొస్తుందనే నేను నమ్ముతున్నాను. అందుకని...ఆ లోపల ఏమైనా సహాయం చేస్తారేమోనని...’’
‘‘ఆ విషయంలో నన్నంతగా ప్రాధేయపడాలా? ఈ రాత్రికే అన్ని విషయాలూ మాట్లాడుకుందాం. నా శక్తి కొలది నిన్ను ఆపదనుండి గట్టెక్కించడానికి ప్రయత్నిస్తాను.’’
మరుసటి ఉదయం నేను అక్కడినుంచి నిష్క్రమించవలసి ఉంది. చివరిసారిగా అంకుల్‌ను కలసి నా కష్టాలు తీర్చే ఏర్పాటు చేయాలని అడగాలనుకున్నాను. కానీ ఆ రోజు పగలంతా అంకుల్‌కు ఎప్పుడూ రానన్ని టెలిగ్రాములొచ్చాయి. రాత్రి భోజనం ముగించుకొని అంకుల్ స్టడీ రూం కెళ్ళాడు. అలవాటు ప్రకారం అందరూ నిద్రపోయాక గదులకు తాళాలు వేసి ఆఖరుకు బిల్లియర్డ్స్ రూములో నన్ను కలుసుకున్నాడు. డ్రెస్సింగ్ గౌన్ ధరించి ఈజీ చెయిర్లో విశ్రాంతిగా కూర్చుని విస్కీ పుచ్చుకున్నాడు. నా సమస్యల జాబితా ఒక పేపర్ మీద రాసివ్వమన్నాడు. అప్పటికి సమయం రాత్రి ఒంటిగంటైంది.
‘‘పడుకోబోయేముందు నేను నా పెంపుడు పిల్లిని చూడాలి’’ అని చెప్పాడు. నన్నూ రమ్మని పిలిస్తే వెంట వెళ్ళాను.
హాలును దాటుకొని నడుచుకుంటూ వెళ్ళాము. రాతి నడవా చీకటిగా ఉంది. ఒక లాంతరు గోడకు తగిలించి ఉంది. మిస్టర్ ఎవరార్డ్ లాంతరును దించి వెలిగించాడు.
తలుపు తెరుస్తూ ‘లోపలికి రా!’ నన్ను పిలిచాడు. అంకుల్ ఉన్నాడనే ధైర్యంతో లోపలికి వెళ్ళాను.
లోపలున్న మృగం గుర్రుమంది. లాంతరు గుడ్డి వెలుగులో చూశాము. అది ఒక మూలలో పెద్ద నల్లనిముద్దలా ముడుచుకొని పడుకొని ఉంది. లాంతరు పట్టుకొని చూసి–
‘‘టామీ చాలా కోపం మీదున్నట్లుంది. ఇప్పుడు రాత్రి భోజనం పెట్టి దాని కోపం తగ్గించాలి. దయచేసి ఈ లాంతరు పట్టుకో మార్షల్!’’
నేను లాంతరును చేత్తో పట్టుకున్నాను. అతను లోహపుకడ్డీల తలుపు కేసి నడిచాడు.
‘‘మాంసం నిలవ ఉంచే కప్ బోర్డ్ బయట ఉంది. ఇప్పుడే వస్తాను.’’ అని చెబుతూ బయటికెళ్ళాడు. వెంటనే అతని వెనకే లోహపుకడ్డీల తలుపు మూసుకుపోయింది–క్లిక్ మనే చిన్న శబ్దంతో. ఆ శబ్దం స్పష్టంగా వినబడింది. భయంతో నా తనువెల్లా వొణికిపోయింది. వొళ్ళు మంచులా చల్లబడింది. ఒక్క గంతులో తలుపు వద్దకు చేరుకున్నాను. లోపలివైపు నుంచి తలుపుకు హ్యాండిల్ లేదు. తలుపు తెరువుమని ఆక్రందించాను. అది అరణ్యరోదనమైంది. లాంతరు వెలుతుర్లో చూశాను. లోహపు కడ్డీలు మెల్లగా గోడలోని గాడివైపు కదులుతున్నాయి. అప్పటికే చిట్టచివర ఒక అడుగుమేర తెరుచుకొని ఉంది. నేను గట్టిగా అరుస్తూ ఆ చిట్ట చివరి ఊచను చేతులతో నాకున్న బలమంతా ప్రయోగించి అడ్డుకొన్నాను. ఒకట్రెండు నిముషాలు అది కదలకుండా ఆపగలిగాను. బయట అతను చక్రాన్ని శక్తినంతా కూడదీసుకొని తిప్పుతున్నాడు. నా చేతులు, వేళ్ళు నొప్పిపెడుతున్నాయి. గాయాలు కూడా అయ్యాయి. లోహపు కడ్డీల తలుపు పూర్తిగా గోడకు అతుక్కుపోతుందని తెలుసు. నా ప్రాణాలు కాపాడమని వేడుకున్నాను. అతని హృదయం కరగలేదు. తలుపు మూసుకోకుండా నిలువరించే ప్రయత్నంలో విఫలమై విసురుగా వెనక్కి పడిపోయాను. తలుపు మూసుకుపోయింది పెద్ద శబ్దంతో. ఎవరార్డ్ వెళ్ళిపోయాడు.
నేనలా పడ్డంతో ఆ మృగం నా వంక తీక్షణంగా చూసింది. అప్పటికే నా చేతిలోని లాంతరు నేలమీద పడి వుంది. అయినా వెలుగుతూనే ఉంది. లాంతరు నా చేతిలో ఉంటే మంచిదని దాన్నందుకోవాలని కొంచెం కదిలాను. అది గుర్రుమంది. నేను నిలబడిపోయాను. నా శరీరంలోని అణువణువూ ప్రాణ భయంతో వొణికిపోతూ ఉంది. ఆ నల్లపులి నాకు పది అడుగులదూరంలో ఉంది. ఆ చీకట్లో దానికళ్ళు వెలుగుతున్న రెండు గుండ్రని దీపాల్లాగున్నాయి. అది కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నట్టుండి మూసుకుంది. బహుశా అది నిద్రపోతూవుండొచ్చు. అది తక్షణం నా మీద దాడి చేస్తుందనుకోవడం లేదు. ఒకటి మాత్రం నిజం. రాత్రంతా నేనూ ఆ మృగం ఆ బోనులో కలిసుండకతప్పదు. ఉచ్చుబిగించి నన్ను ఈ బోనులో రాత్రంతా ఉండేట్టు కుట్రపన్నిన ఆ దుర్మార్గునికన్నా ఈ నల్లపులి ఇంకా క్రూరమైనది. ఉదయం దాకా ఒక రాత్రంతా ఎలా గడపాలి? కిటికీల ఊచలు చాలా దగ్గరదగ్గరగా బిగించబడి ఉన్నాయి. తలదాచుకొనడానికెక్కడా స్థావరం లేదు. ఎంత అరచినా ఎవ్వరికీ వినబడదు. ఈ గుహకు అనుసంధానించబడిన నడవా, ఔట్ హౌస్‌కు కనీసం వంద అడుగుల దూరంలో ఉంటుంది. గుహబయట వీస్తున్న హోరుగాలిలో నా అరుపులు బయటికి వినిపించవు. ఇప్పుడు నా స్వంత బలం, గుండె ధైర్యమే దిక్కు.
తరువాత నా దృష్టి లాంతరు మీద పడింది. దాని వత్తి ఊగిసలాడుతూ ఉంది. పదినిమిషాల్లో అది ఆరిపోవడం ఖాయం. తరువాత చీకట్లో నేనేమీ చేయలేను. ఆ లోపల నేను ఏదో ఒకటి చేయాలి. భయాన్నంతా కళ్ళల్లో దాచుకొని ఆ మృత్యుగహ్వరం కేసి చుట్టూ చూశాను. అప్పుడు ఒక చోటు మీద నా చూపులు ఆగాయి. లోహపుకడ్డీల డోర్ పక్కనే గోడవారగా కొంచెం ఎత్తులో ఇనుప ఊచలతో చేసిన షెల్ఫ్ మాదిరి నిర్మాణమొకటి కనబడింది. అది భద్రమైన చోటు కాకపోవచ్చు. కానీ, నేలమీదఉండడం కన్నా అది కొంచెం నయం. కడ్డీకి కడ్డీకీ మధ్య రెండుమూడంగుళాల ఎడం ఉంది. షెల్ఫును కింద బలమైన ఇనుపస్తంభాలు మోస్తున్నాయి. పైకప్పుకూ షెల్ఫుకీ మధ్య అంతరం రెండుమూడడుగులుంటుంది. నేను దానిపైకి చేరుకుంటే? దీపం ఆరిపోకముందే ఆ పని చేయాలి. ఒక్కసారి గుండెలనిండా ఊపిరితీసుకుని క్షణంలో స్ప్రింగులా పైకి ఒకే ఒక ఎగురు ఎగిరాను. షెల్ఫ్ యొక్క ముందుభాగపు ఇనుప కమ్మీ అంచును పట్టుకుని అలాగే శ్వాస బిగబట్టాను. నా ముఖం షెల్ఫ్ ముందువైపుకు వచ్చేలా నా శరీరాన్ని చుట్లు తిప్పాను. నన్ను చూసి వొళ్ళువిరుచుకొని ఆవలిస్తున్న ఆ నల్లపులి కళ్ళల్లోకి చూశాను. అది నా వైపు కోపంగా కాక ఆసక్తిగా చూసింది. దాని నుంచి వెలువడిన దుర్గంధపు వాయువు గుప్పున కొట్టింది. వొళ్ళువిదిలించుకొని అది నా వైపు వచ్చింది. వెనుక కాళ్ళ మీద నిలబడి ఒక పంజాను గోడకానించి తరువాత రెండో కాలును కూడా ఎత్తి నా కిందున్న అడ్డం నిలువు ఇనుపతీగల చట్రాన్ని గోళ్ళతో గోకింది. అప్పుడు నేనింకా సాయంకాలం దుస్తుల్లోనే ఉన్నాను. తెల్లని గోరుతో నా ట్రౌజరు పర్రున చింపేసింది. ఫలితంగా నా మోకాలు గీసుకుపోయింది. నొప్పికి తాళలేక గట్టిగా కేకవేశాను. దాంతో అది కాళ్లను కిందకు దించింది. నేనింకా వెనక్కి జరిగి సర్దుకున్నాను. నేను పడుకున్న చిన్న పడక కింద అది అటూ ఇటూ పచార్లు చేస్తూ అప్పుడప్పుడు నా వైపు చూడసాగింది. దీపం పూర్తిగా ఆరిపోయింది. ఆ నల్లపులితో నల్లని చీకటిలో ఒంటరిగా మిగిలిపోయాను.
అప్పటికి రాత్రి రెండుగంటలైవుంటుందని ఊహించాను. నాలుగ్గంటలకు పూర్తిగా వెలుగొచ్చేస్తుంది. ఆ నల్లని చీకటిలో నల్లపులి సవ్వడి వినరావడం లేదు. అదెక్కడుందో అంచనాకందడం లేదు. నా కజిన్ దుర్మార్గాన్నీ, వంచననూ, కాపట్యాన్నీ, కుట్రనూ తలచుకుంటుంటే రక్తం మరిగిపోతూ ఉంది. అతని నవ్వు ముఖం వెనుక నా పైన ఇంత ద్వేషం దాగిఉందా? మధ్యయుగ కాలంలో ఇంత ఘోరమైన హత్యలు చేయించేవారని విన్నాను. నిద్రపోవడానికి అతని గదికి వెళ్తుండగా చూసిన సాక్షులున్నారు. కానీ వాళ్ళకు తెలియని విషయమేమంటే...వాళ్ళు చూడకుండా నన్ను పులిబోనులో వదలి తలుపు బిగించి చల్లగా జారుకోవడం.
అతను ప్రజలకు చెప్పబోవు కథ అందరినీ నమ్మించేట్టుగా ఉంటుంది. ‘మార్షల్ కింగ్ సిగారు పీల్చడం కోసం బిలియర్డ్స్ గదిలోకి వెళ్ళి ఆసక్తిని అణచుకోలేక అతను చివరిసారిగా పులిని చూడాలని వెళ్ళాడు. ఆ సమయంలో బోను తెరుచుకోవుందని తెలియక లోపలికి వెళ్ళిన అతన్ని పులి చంపేసింది.’
అటువంటి ఘోరహత్య చేసి తేలిగ్గా తప్పించుకోగలడు. ఒకవేళ ఎవరికైనా అనుమానం కలిగినా రుజువులు దొరకడం అసాధ్యం.
తెల్లారడానికి మిగిలిన రెండు గంటలు చాలా భారంగా భయంకరంగా గడిచిపోయాయి. నల్లపులి తన వొంటిమీదున్న బొచ్చును నాలుకతో నాకుతున్నట్లుందేమో? ఆ శబ్దం వినిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి దాని రెండు పచ్చని కళ్ళు చీకట్లో నా వైపే చూస్తున్నట్లు అనిపించినా నన్నే లక్ష్యంగా చేసుకున్నట్లనిపించలేదు. కాబట్టి అది నా ఉనికిని అది గుర్తించలేదని నాకు అర్థమవటంతో నా గుండె దడ తగ్గింది. అబ్బ! ఎలాగైతేనేం? తెల్లారిన సూచనగా కిటికిలోంచి సన్నగా వెలుతురు లోపలికి ప్రసరించింది. అప్పుడు నల్లపులిని స్పష్టంగా చూడగలిగాను. ఇంతకుముందుకన్నా దాని కోపం హెచ్చుస్థాయిలో ఉంది. ఉదయపు చల్లదనం దానిలో అసహనం రేగించింది. పైగా ఆకలితో ఉంది. భయంకరంగా గర్జిస్తూ నాకు దూరంగా అటూ ఇటూ వేగంగా పచార్లు చేయసాగింది. దాని మీసాలు ఆగ్రహంతో అదురుతున్నాయి. తోకను విపరీతంగా ఝాడిస్తూ ఉంది. అలా తిరిగేటప్పుడు అకస్మాత్తుగా అది నా వైపు చూసింది. అంతే. నేను భయంతో బిగుసుకుపోయాను. నా పైప్రాణాలు పైన్నే పోయాయి. అది నన్ను చంపాలని నిశ్చయించుకున్నట్టు నాకర్థమై పోయింది. అది చేసే ఎడతెరిపిలేని గర్జనలు తీవ్రమయ్యాయి. ఆ ఇరుకైన కటాంజనాల మీద ముడుచుకొని పడుకున్నాను. నేను ధరించిన వదులు దుస్తులు చలినుండి నన్ను కాపాడలేకపోతున్నాయి.
అక్కడ్నుంచి తప్పించుకోడమెలా? అని ఆలోచిస్తున్నాను. ఒక విషయం మాత్రం స్పష్టమైంది. బోను యొక్క ఇనుప ఊచల తలుపు ముందరిభాగం మొత్తం చక్రాలమీద నడుస్తుంది. దాని చివరి కడ్డీ నేనున్న షెల్ఫుకు తలవైపునే వుంది. నా చేతికందుబాటులో ఉంది. దాన్ని కొంచెం వెనక్కి లాగితే? నాకది సాధ్యమౌతుందా? అసలు కడ్డీ జరిపితే జరుగుతుందా? రాకపోతే? అయినా ఒకసారి ప్రయత్నిస్తే? కదిలే ధైర్యం చేయలేను. అలా కదిలితే వెంటనే నల్లపులి నా మీద దాడి చేస్తుంది. మెల్లమెల్లగా నా చేతిని ముందుకు జరపసాగాను. ఆవలిగోడ అంచును ఆనుకొని ఉన్న చివరి ఇనుపకమ్మీ చేతికి తగిలేవరకూ. అది సులభంగానే వెనక్కి జరగడంతో నేను ఆశ్చర్యపోయాను. ఇంకా వెనక్కి లాగాను. మూడు అంగుళాలమేర ఇవతలికి జరిగింది. ఆ గేట్–చక్రాలమీద నడుస్తుందని ముందుగానే చెప్పాను కదా. ఇంకొకసారి లాగాను. అయితే ఆ క్రూరప్రాణి నా వైపుకు ఊహించని వేగంతో లంఘించింది. నేను భీతిల్లిపోయాను. దాని ఉధృతధాటికి నేను పడుకున్నషెల్ఫు ఊగులాడింది. అగ్నిగోళాల్లా రగిలే దాని కళ్ళు, సమతలంగా ఉన్న పెద్ద తల, దవడలమధ్య వేలాడుతున్న ఎర్రని నాలుక, తెల్లని కత్తుల్లాంటి కోరలు నాకు అతి దగ్గరగా ఉన్నాయి. ఇనుపషెల్ఫ్ ఊడి కిందికి పడిపోతుందేమోనని అనుమానం కలిగింది. అది షెల్ఫ్ అంచుమీద ముందరి కాళ్ళు ఆనించి కొన్ని క్షణాలు నిలబడింది. వెనుకకాళ్ళు రాతి నేలపై పట్టు చిక్కించుకునేందుకు చేసిన ప్రయత్నంలోవిఫలమై అంత భారీ శరీరం దబ్బున కిందకు పడిపోయింది. అది ఊరుకోలేదు. శరీరాన్ని వెనక్కి వంచి మళ్ళీ ఎగరడానికి సిద్ధమైంది.
మరికొన్ని క్షణాలవ్యవధిలో నా చావో, ప్రాణాలతో బతికి బయటపడడమో నిర్ణయమౌతుంది. ఈ సారి దాని గురి తప్పదు. ప్రాణాలకు తెగించాలి. అప్పటికప్పుడే పథకం రచించుకున్నాను. వెంటనే నా కోటును తీసేసి చేత్తోపట్టుకున్నాను. నా మీదకు ఎగురబోతున్న ఆ మృగం ముఖం మీదకు పడేట్టు కిందకు విసిరేశాను. అదే క్షణంలో షెల్ఫ్ అంచుమీదనుంచి కిందకు దుమికి గేటు చివరి కమ్మీని పట్టుకొని పిచ్చిపట్టినట్లు లాగాను. గేటు చివరిలో ఏర్పడ్డ సందులోంచి నా శరీరాన్ని దూర్చి బయటికురికాను. కానీ క్షణంలో వెయ్యోవంతు ఆలశ్యమైంది. ఆ వ్యవధిచాలు ఆ క్రూరమృగానికి. కోటు ముఖం మీద పడ్డంతో కొన్ని క్షణాలు గుడ్డిదైపోయిన నల్లపులి దాన్ని పక్కకు విదిలించి కొట్టింది. సందులోంచి దూరి అవతలకు దాటుకుంటూ గేటును మూసేశాను. కానీ నా దేహం పూర్తిగా బయట పడకముందే పులి–పంజాతో నా పిక్కమీద కొట్టింది. ఆ దెబ్బతో కత్తితో చెక్కను చెక్కినట్లు పిక్కకండ ఊడొచ్చింది. విపరీతంగా రక్తం కారిపోయింది. నేను ఏదో విధంగా బయటికొచ్చేశాను. ఇప్పుడు నా క్షతగాత్ర దేహం బయట గేటు ఇనుపకమ్మీల అవతల దుర్గంధపూరితమైన ఎండుగడ్డిలో పడిఉంది.
ప్రస్తుతం నాకూ పులికీ మధ్య అడ్డుగా ఇనుప ఊచల గేటు నిలిచిఉంది. వెనుక కాళ్ళమీద నిలబడి ముందు రెండు పంజాలతో ఊచలను వొళ్ళు తెలియని ఉన్మాదంతో విపరీతంగా బాదుతూ ఉంది నల్లపులి. విపరీతంగా గాయపడిన నేను చచ్చానో బతికానో నాకే తెలీదు. బోను లోపలున్న పులి నా కోటును చీలికలు పేలికలకింద మార్చింది. బోనులో చిక్కుకున్న ఎలుకను చూస్తూ చెలరేగిపోతున్న పిల్లిలా ఉంది లోపలున్న పులి. దాని నల్లని ముఖం, ఎర్రటి నాలుక నా కళ్ళముందే మెదులుతూ ఉన్నాయి. తరువాత, రెండుగంటలపాటు నేను తెలివితప్పి పడున్నాను. ఏదో శబ్దం వినిపించడంతో నాకు మెలకువ వచ్చింది. నా కజిన్ తలుపు తీసి లోపలికి తొంగి చూశాడు. ఏం జరిగిందో చూసి అవాక్కయ్యాడు. బోనులోపల పులి ముందరికాళ్ళ మీద తలపెట్టుకొని కూర్చొని ఉంది. అంకుల్ నా వైపు పదేపదే చూశాడు. తలుపు మూసి నా వద్దకొచ్చాడు–నేను నిజంగా చచ్చిపోయానా లేదా అని చూడ్డానికి. తరువాత నేనేమీ గమనించే స్థితిలో లేను. నాకు ఉన్నట్టుండి స్పృహ వచ్చి చూసేసరికి అతని వీపు నాకు కనిపిస్తూ ఉంది.
‘‘సెభాష్ టామీ! సెభాష్! చాలా మంచిపనిచేశావు.’’ అంటూ బోను కమ్మీలదగ్గరికి వెళ్ళాడు. అంతే...
‘‘నేను టామీ! నేను నీ మాస్టర్ ని. నన్నే గుర్తుపట్టలేదా? వదులు. నన్నొదులు... ’’ అని భయంకరంగా కేకలు పెట్టాడు.
ఆ సమయంలో అంకుల్ చెప్పిన మాటలు జ్ఞాపకమొచ్చాయి. ‘‘ఒకసారి ఆ నల్లపులి రక్తం రుచిచూసిందంటే అది మనకు శత్రువుగా మారిపోతుంది’’ అని. నా రక్తాన్ని అది అప్పటికే రుచిచూసిఉంది. కానీ అతడు ఖరీదు చెల్లించవలసివచ్చింది.
‘‘దూరంగా వెళ్ళిపో రాక్షసీ! బాల్డ్ విన్..బాల్డ్ విన్..’’ అతను పెడుతున్న చావుకేకలు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. చివరకు అవి మెల్లగా గాలిలో కలిసిపోయాయి. అతడు చనిపోయాడనుకుంటాను. అతని శరీరం రక్తంలో ముంచితీసినట్టుంది. అతడు ఆ గదంతా పిచ్చిపట్టినట్టు తిరిగి పడిపోయాడు. అదే అతన్ని చివరిసారి చూడడం. కొన్ని క్షణాల తరువాత తెలివితప్పి పడిపోయాను.
నేను నా జీవితపు చివరి రోజు దాకా చేతికర్ర సహాయంతోనే బతికాను పులితో గడిపిన ఆ రాత్రి గుర్తుగా. నల్లపులి సంరక్షకుడైన బాల్డ్ విన్, ఇతర పనివాళ్లు చెప్పిన ప్రకారం...
యజమాని చావుకేకలు వినబడగానే అందరూ బోను దగ్గరికి పరుగెత్తారు. నేను ఊచల వెనుక పడుండడం చూశారు. చిందరవందరగా విసిరేసినట్టు పడి ఉన్నయజమాని ఛిద్రమైన శరీర భాగాల్ని చూశారు. తాను ఎంతో మక్కువతో పెంచుకొన్న నల్లపులే అతని ప్రాణాల్ని తీసింది. ఇనుప ఊచల గుండా పులిని తుపాకితో కాల్చి చంపేశారు. నన్ను నా పడకగదికి చేర్చి డాక్టర్ను, నర్సును పిలిపించి చికిత్స ఇప్పించారు. నేను కొన్నివారాల పాటు చావుబతుకుల మధ్య పోరాడాను. ఒక నెల తరువాత నేను తిరిగి లండన్ చేరుకున్నాను.
ఒకరోజు రాత్రి మిస్టర్ ఎవరార్డ్ భార్య నన్ను కలుసుకుంది.
‘‘ఒంట్లో కులాసాగా ఉందా?’’ అని అడిగింది. నేను నెమ్మదిగా తల ఊపాను.
‘‘మొదట్నుంచీ లండన్ తిరిగి వెళ్ళిపొమ్మని నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. నా భర్త పన్నిన కుట్రకు బలికాకుండా నిన్ను కాపాడాలనుకున్నాను. నిన్నెప్పటికీ తిరిగి వెనక్కి పంపించే ఉద్దేశమేలేదు అతనికి. నన్ను కూడా చంపాలనుకున్నాడు. అతని కబంధహస్తాల నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక యమయాతన పడ్డాను. అతని చావు కారణంగా నేను స్వేచ్ఛాగాలులు పీల్చుకోగలిగాను.’’ ఆమె చరచరా వెళ్ళిపోయింది. తరువాత మిగిలి ఉన్న భర్త ఆస్తిని వెంట తీసుకొని స్వదేశానికెళ్ళిపోయింది. చావు నుంచి తప్పించుకున్నా అప్పులబాధ వదల్లేదు. అంతలో వకీలు సమ్మర్స్ వచ్చాడు. మొదట అభినందనలు తెలిపాడు.
‘‘ఇంగ్లాండ్ లో అత్యంత ధనికులలో ఒకరైన లార్డ్ సదరన్ టన్ ఆస్తికి మీరు యజమానైపోయారు. ఈ విషయం మీకు ముందుగా తెలిస్తే ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న మీ ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపిస్తుందేమోనని చెప్పలేదు.’’
ఆ వార్త విని నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. తరువాత ఇంకొక ఆలోచన తట్టింది. ఆరు వారాల కిందట! అంటే నేను గాయాలపాలైంది కూడా ఆరునెలలు కిందటే కదా? ఈ రెండు సంఘటనలు ఎలా ఒకేసారి సంభవించాయి? కాకతాళీయమా?
‘‘అలా ఐతే నేను గాయపడిన సమయంలోనే లార్డ్ సదరన్ టన్ చనిపోయి ఉండాలి.’’
‘‘అవును. అదే రోజే లార్డ్ సదరన్ టన్ చనిపోయాడు.’’ అని చెబుతూ, ‘‘ మీకు తెలుసు కదా మీ తరువాతి వారసుడు మీ కజిన్ ఎవరార్డ్ కింగ్ అని. అతనికి బదులుగా మీరు పులివాత పడి ఉంటే, అతనికే సదరన్ టన్ ఆస్తి దక్కి ఉండేది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం లార్డ్ సదరన్ టన్ సేవకునికి డబ్బిచ్చి సదరన్ టన్ ఆరోగ్య పరిస్థితిని గురించి కొన్ని గంటలకొకసారి టెలిగ్రాముల ద్వారా తెలియజేసే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. మీరు అక్కడికి వెళ్ళిన సమయంలో ఆ ప్రక్రియ మొదలైంది. ఆ విధమైన సమాచారం తెలుసుకోవడం వెనుక ఉన్న కారణమేమంటే...అంకుల్ ఎవరార్డ్ ప్రథమశ్రేణి వారసుడు కాకపోవటమే.’’
‘‘మిస్టర్ సమ్మర్స్! నేను చెల్లించాల్సిన బాకీలకు సంబంధించిన పత్రాలు తీసుకురండి. అలాగే కొత్త చెక్ బుక్ కూడా. వాటిని పరిష్కరిద్దాం.’’ అని చెప్పాను.
Comments
Please login to add a commentAdd a comment