Ramadan 2022: Significance And All Details You Need To Know In Telugu - Sakshi
Sakshi News home page

Ramadan 2022: రమజాన్‌ విశిష్టత.. సంప్రదాయం.. మరిన్ని విశేషాలు!

Published Tue, May 3 2022 2:10 PM | Last Updated on Tue, May 3 2022 4:04 PM

Ramadan 2022: Significance And All Details You Need To Know - Sakshi

సృష్టిలోని విభిన్న జీవరాశులకు విభిన్నమైన పేర్లు ఉన్నట్లుగానే, మానవ సంతతిని మనిషి లేక మానవుడు అంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనిషివేరు, మానవత్వం వేరు. మనిషి అనబడే ప్రతివారిలోనూ మానవత్వం ఉండాలన్న నిబంధనేమీ లేదు. ప్రాణులుగా, జీవులుగా అంతా సమానమే! మానవులైనా, జంతువులైనా లేక మరే జీవి అయినా... కనుక జీవం కలిగి ఉండడం అనేది జంతుజాలంపై మనిషికి ఉన్న ప్రత్యేకత ఏమీ కాదు.

జంతువూ ఒక ప్రాణే మనిషి కూడా ఒక ప్రాణే అయినప్పుడు జంతువుపై మనిషికి ఏ విధంగానూ ప్రత్యేకత, శ్రేష్ఠత, ప్రాధాన్యతా ఉండవు. జంతువులపై మనిషికి విశిష్ఠత, ప్రత్యేకత ప్రాప్తం కావాలంటే మనిషిలో  మానవత్వం, మానవీయ విలువల సుగంధం ఉండాలి. ఇవి మాత్రమే మానవుడికి ప్రత్యేకతను ప్రసాదించి, మానవ ఔన్నత్యాన్ని పెంచుతాయి. మనిషిలో  మానవీయ విలువలు లేకపోతే, అతడు మానవ సంతతి అయినప్పటికీ, మానవ సమాజంలోనే ఉంటున్నప్పటికీ అలాంటి వాణ్ణి మనం మనిషి అని సంబోధించడానికి వెనుకాడతాం.

లోలోపల ఎక్కడో ఏహ్యభావం పాదుకొని ఉంటుంది. అలాంటివాణ్ణి మానవ రూపంలోఉన్న దానవుడు అనుకోవచ్చు. మరి మానవత్వం అంటే ఏమిటి, మానవీయ విలువలు అంటే ఏమిటి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సమాధానంగా చాలామంది చాలా అభిప్రాయాలు చెబుతారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కొలమానం, ఒక్కొక్క ప్రమాణం. కాని మానవత్వం, మానవీయ విలువల అసలు కొలమానం దైవ గ్రంథంలో, ప్రవక్తవారి జీవితంలో మనకు లభిస్తుంది. సమాజంలో మానవత్వాన్ని జాగృతం చేయడానికి, మానవుల హృదయాల్లో దాన్ని పాదుగొల్పడానికి దైవం కొన్ని నియమాలను ఏర్పరచాడు.

ఆ దైవదత్తమైన మార్గదర్శక తరంగాల్లోంచి పెల్లుబికి వచ్చేదే అలౌకికమైన మానవీయ ఆధ్యాత్మిక ఆనందం. నిత్య నూతనత్వాన్ని, మానసిక ఆనందాన్ని పొందడం కోసం, మనిషి మనిషి కలిసి, సామూహిక నైతికతను సమాజంలో పాదు గొల్పడానికే వ్రతాలు, నోములు, పండుగలు, పబ్బాలు. కొద్దికాలంపాటు మనిషి తన శరీరంలో, దైనందిన జీవనక్రమంలో కొన్ని అనూహ్యమైన మార్పులను ఆహ్వానించి తద్వారా నూతనోత్తేజ ఆధ్యాత్మిక భావ తరంగాల్లో తేలిపోతాడు. పవిత్ర రమజాన్‌ పండుగను మనం ఆ దృష్టికోణం నుంచి చూడాలి.

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింసోదరులు జరుపుకొనే రెండు ప్రధాన పండుగల్లో ‘ఈదుల్‌ ఫిత్ర్‌ ’ మొట్టమొదటిది, అత్యంత ప్రాముఖ్యం కలది. ఇస్లామీయ కేలండరు ప్రకారం, సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెలగా ఉన్న ‘రమజాన్‌’ ముప్పయి రోజులు ఉపవాస దీక్షలు పాటించి పదవ నెల అయిన షవ్వాల్‌ మొదటి తేదీన జరుపుకునే పండుగే ఈదుల్‌ ఫిత్ర్‌ . సాధారంగా దీన్ని రంజాన్‌ పండుగ అని వ్యవహరిస్తుంటారు.

రమజాన్‌ పేరువింటూనే ప్రతి ఒక్కరికీ సేమియా, షీర్‌ ఖుర్మా గుర్తుకు వస్తాయి. పట్టణ వాసులకైతే ‘హలీమ్‌’, ‘హరీస్‌’లాంటి వంటకాలూ నోరూరిస్తాయి. ఈ పండుగను ముస్లింలు ఇంత నియమ నిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోడానికి కారణం, ఇది ఒక్కరోజు పండుగ కాదు. నెలరోజులపాటు ఆనందంగా, ఆరాధనా భావతరంగాల్లో తేలియాడుతూ జరుపుకొనే ముగింపు ఉత్సవం.

ఈనెల రోజులూ ముస్లింల ఇళ్లు, వీధులన్నీ సేమియా, షీర్‌ ఖుర్మా, బగారా, బిరియానీల ఘుమఘుమలతో, అత్తరు పన్నీర్ల పరిమళాలతో, ఉల్లాస పరవళ్ల హడావిడితో కళకళలాడుతూ ఉంటాయి. సహెరి, ఇఫ్తార్‌ల సందడితో నిత్యనూతనంగా, కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ, సేవాభావాన్ని పంచుతుంటాయి. పవిత్రగ్రంథ పారాయణంలో, తరావీ నమాజుల తన్మయత్వంలో ఓలలాడుతూ ఉంటారు.

నిజం చెప్పాలంటే, ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, అహ్లాదాల సమ్మేళనాన్నే ‘పండుగ’ అనడం సమంజసం. ఇలాంటి అపూర్వ, అపురూప సందర్భమే ‘ఈదుల్‌ ఫిత్ర్‌ ’. అదే రమజాన్‌ పండుగ. ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం, విలువలకు లోబడి, హద్దులను అతిక్రమించకుండా, దుబారాకు పాల్పడకుండా, విశృంఖలత్వానికి, అనైతికత, అసభ్యతలకు చోటీయ కుండా, దైవానుగ్రహాలను స్మరించుకుంటూ, ఆయన ఘనతను కీర్తిస్తూ సంతోషాన్ని వ్యక్తంచేయడం, హర్షాతిరేకంతో సంబరాలు జరుపుకోవడమే పండుగ.

నిజానికి పండుగలు మానవ జీవన స్రవంతిలో భాగమై, సమైక్యతకు, సంస్కృతీ సంప్రదాయ వికాసాలకు దోహదం చేస్తున్నాయి. పండుగ అనేది ఏ మత ధర్మానికి సంబంధించినదైనా దాని వెనుక ఒక సందేశం, ఒక స్ఫూర్తి ఉంటుంది. పండుగ మానవాళి హితం కోరుతుంది, హితం బోధిస్తుంది. ముస్లిములు అత్యంత శ్రద్ధాభక్తులతో జరుపుకొనే ఈదుల్‌ ఫిత్ర్‌ (రమజాన్‌) పర్వం సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.

ప్రాచీనకాలం నుంచి ప్రతిదేశంలోనూ, ప్రతిజాతిలోనూ పండుగల సంప్రదాయం చలామణీలో ఉంది. మానవులకు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని, వ్యక్తిగతంగా కాని, సామూహికంగా కాని ఏదైనా మేలు జరిగినప్పుడు, ప్రయోజనం చేకూరినప్పుడు వారి అంతరంగాల్లోంచి ఆనందం తన్నుకొచ్చి బహిర్గత మవుతుంది. ఇది చాలా సహజం. అలాంటి మానవ సహజ భావోద్రేకాల ప్రత్యక్ష ప్రతిస్పందనల ప్రతిరూపమే పండుగలు.

ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే ‘ఈదుల్‌ ఫిత్ర్‌’ పర్వదినం కూడా అలాంటి భావోద్రేకాలు, ఆనంద తరంగాల ప్రతిస్పందనల ప్రత్యక్ష ప్రతిరూపమే. అసలు రమజాన్‌ పేరు వినగానే ఎవరికైనా ఒక రకమైన దివ్యానుభూతి కలుగుతుంది. మనసు, తనువు తన్మయత్వంతో పులకిస్తాయి. భక్తిభావంతో శిరస్సు వినమ్రంగా వంగిపోతుంది. గుండెలనిండా ఆనందం ఉప్పొంగుతుంది.

ఆనందం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. భక్తి ముక్తిని ప్రసాదిస్తుంది. మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. వాటిలో పండుగలు ముఖ్యమైనవి. మనిషికి ఏదైనా మేలు జరిగినప్పుడు అంతరంగం ఆనందంతో పులకించడం, హృదయం ఉల్లాసభరితమవడం, మదిలో మధురానుభూతులు సుడులు తిరగడం సహజం. 
అసలు రమజాన్‌ అన్నది పండుగ పేరుకాదు. అదొక నెల పేరు.

సంవత్సరంలోని పన్నెండునెలల్లో తొమ్మిదవది రమజాన్‌. అయితే దైవం పవిత్ర ఖురాన్‌లాంటి మానవ సాఫల్య గ్రంథరాజాన్ని అవతరింప జేయడానికి, అత్యుత్తమ ఆరాధనా విధానమైన ‘రోజా’ను విధిగా చేయడానికి ఈనెలను ఎన్నుకున్నాడు. అందుకే దీనికి ఇంతటి ఔన్నత్యం ప్రాప్తమైంది. మానవుల మార్గదర్శక గ్రంథమైన ఖురాన్‌తోను, ఆనవాయితీగా పాటించే రోజాలతో ఈనెలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఈ విషయాన్ని దైవం ఇలా ప్రకటించాడు: ‘ఖురాన్‌ అవతరించిన నెల రమజాన్‌ నెల. ఇది సమస్త మానవాళికీ సంపూర్ణ మార్గదర్శిని. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుచేసే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి (2 – 185). 

మనం ఒక్కసారి మనసుపెట్టి ఆలోచిస్తే, మానవులపై దేవుని అనుగ్రహం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆయన తన అపార ప్రేమానురాగాలతో మానవ మనుగడకోసం అనేక ఏర్పాట్లు చేశాడు. శిశువు మాతృగర్భం నుంచి భూమిపై పడగానే అతని/ ఆమె ఊడిగం చెయ్యడానికి సృష్టి మొత్తం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు సృష్టి సమస్తం మానవుడి కోసమేనంటే అతిశయోక్తికాదు. అపారమైన ఆయన కారుణ్యానుగ్రహాలను వర్ణించడం ఎవరివల్లా అయ్యేపనికాదు.

సృష్టిలోని వృక్ష సంపదనంతా కలాలుగా మార్చి, సముద్ర జలాలన్నింటినీ సిరాగా చేసి దైవానుగ్రహాలను రాయదలచినా, వృక్షాలు అంతరించిపోతాయి, జలాలన్నీ ఇంకిపోతాయి కాని ఆయన కారుణ్యానుగ్రహాలు ఇంకా అనంతంగా మిగిలే ఉంటాయి. ఇంతటి అనుగ్రహశీలి కనుకనే దేవుడు మానవుల ఆధ్యాత్మిక వికాసం కోసం, నైతిక, మానవీయ విలువల మార్గదర్శనం కోసం పవిత్ర ఖురాన్‌ లాంటి మహదానుగ్రహాన్ని ప్రసాదించాడు.

రోజా లాంటి మహత్తర ఆరాధనను పరిచయం చేశాడు. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాలను, నైతిక సుగుణాలను, మానవీయ విలువలను జనింపజేయడానికి నెల్లాళ్లపాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దైవాదేశ పాలనకు మనిషిని బద్ధునిగా చేయడమే రమజాన్‌ శిక్షణలోని అసలు ఉద్దేశం. నెల్లాళ్లపాటు నియమబద్ధంగా, నిష్ఠగా సాగే ఆరాధనా విధానాలు మనిషిని ఒక క్రమశిక్షణాయుత జీవన విధానానికి, బాధ్యతాయుత జీవన విధానానికి, దైవభక్తి పరాయణతతో కూడిన జీవన విధానానికి అలవాటు చేస్తాయి.

మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే రమజాన్‌ దీక్షలను పరాత్పరుడైన దైవం తమకు అనుగ్రహించినందుకు, వాటిని వారు శక్తివంచన లేకుండా చిత్తశుధ్ధితో ఆచరించగలిగినందుకు సంతోషంగా, దైవానికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రవక్త మహనీయుల వారి సంప్రదాయం వెలుగులో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. దైవ ప్రసన్నతను చూరగొనడానికి వ్రతం పాటించడంతోపాటు, ఫర్జ్, సున్నత్, నఫిల్, తరావీహ్‌ నమాజులు ఆచరిస్తూ, అనేక సదాచరణలను ఆచరిస్తారు. ఆర్థికంగా కలిగిన వాళ్లు ఈ రోజుల్లోనే జకాత్‌ చెల్లిస్తారు.

నిల్వ ఆదాయంలోంచి రెండున్నర శాతం చొప్పున ప్రతి సంవత్సరం జకాత్‌ చెల్లించాలి. ఇస్లామ్‌ మూలసూత్రాల్లో ఇది ఒక మౌలిక విధి. రమజాన్‌ శుభాల కారణంగా ఇది కూడా ఈ నెలలోనే నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ఫిత్రాలు చెల్లిస్తారు. ఫిత్రా కచ్చితంగా పండుగకు ముందే చెల్లించాలి. ఫిత్రాలకు ఆర్థిక స్థోమతతో సంబంధంలేదు. కాస్తోకూస్తో కలిగిన వాళ్లు తమ నిరుపేద సోదరులను ఆదుకోడానికి ప్రయత్నించాలి.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా పండుగ జరుపుకునే స్థోమతలేని వారికి ఫిత్రాలు ఎంతగానో తోడ్పడతాయి. ఫిత్రా పైకంతో వారుకూడా పండుగ సామగ్రో, కొత్తబట్టలో కొనుక్కుని పండుగ సంతోషంలో పాలు పంచుకో గలుగుతారు. ఉపవాసం పాటించినా, పాటించక పోయినా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది తరఫునా ఫిత్రాలు చెల్లించాలి. ముస్లిం, ముస్లిమేతర అన్న తారతమ్యం లేకుండా అర్హులైన పేదసాదలకు ఇవ్వాలి. సమాజంలోని పేదసాదల పట్ల సంపన్నులు తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలి. అనవసర కార్యక్రమాల్లో, వినోదాలకు, భోగవిలాసాలకు ధనం వృథా చేయకుండా నలుగురికీ మేలు జరిగే మంచి పనుల్లో ఖర్చుపెట్టాలి.

సత్కార్యాలకు, సమాజ సంక్షేమానికి వినియోగమయ్యే ధన వ్యయాన్నే దైవం స్వీకరిస్తాడు. ఈ విధంగా రమజాన్‌ నెలవంక దర్శనంతో ప్రారంభమయ్యే ఉపవాస దీక్షలు నిరంతరాయంగా నెలరోజులపాటు కొనసాగి షవ్వాల్‌ చంద్రవంక దర్శనంతో ముగుస్తాయి. ‘షవ్వాల్‌ ’ మొదటి తేదీన జరుపుకునే పండుగే ‘ఈదుల్‌ ఫిత్ర్‌ ’. నిజానికిది దేవుని మన్నింపు లభించే మహత్తరమైన రోజు. మనిషి ఎలాంటి స్థితిలోనైనా పశ్చాత్తాప హృదయంతో దైవం వైపు మరలితే అలాంటి వారిని దైవం తన కారుణ్యఛాయలోకి తీసుకుంటాడు.

ఆయన కరుణామయుడు, కృపాశీలుడు. ఈద్‌ తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయము అని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా దానికి అనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి.

పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదన్న విషయం సత్యం. ఈ అశాశ్వత దేహం నుంచి ఆత్మ ఎప్పుడు వీడిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఈ ఆత్మజ్యోతి ఆరిపోకముందే జాగృతమై దైవం వైపు మరలాలి. జరిగిపోయిన తప్పులను సవరించుకొని రుజుమార్గం పైకిరావాలి. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పవిత్ర రమజాన్‌ దీనికి చక్కని అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే  ముస్లిములందరూ పండుగపూట పెందలకడనే లేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్‌ నమాజు ఆచరిస్తారు. అనంతరం నూతనవస్త్రాలు ధరించి, అత్తరు పన్నీరులాంటి సుగంధ పరిమళం వినియోగించి, ఆనందోత్సాహాలతో ఈద్‌ గాహ్‌కు వెళతారు.

అందరూ ఒకచోట గుమిగూడి తమకు రోజావ్రతం ఆచరించే మహాభాగ్యం కలగజేసి, మానవుల మార్గదర్శనం కోసం, సమాజంలో విలువల విస్తృతి కోసం పవిత్ర ఖురాన్‌ గ్రంథం అవతరింప జేసినందుకు దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ రెండు రకతులు నమాజ్‌ చేస్తారు. తరువాత ఇమామ్‌ ఖురాన్, హదీసుల వెలుగులో నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తాడు. అందరూ కలిసి అల్లాహ్‌ గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తారు.

తమ కోసం, తమ కుటుంబం కోసం, బంధుమిత్రుల కోసం, తమ దేశం కోసం, దేశవాసుల సుఖ సంతోషాల కోసం, యావత్‌ ప్రపంచ శాంతి సంతోషాల కోసం ఆయనను ప్రార్థిస్తారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అభివాదాలు, ఆలింగనాలు చేసుకుంటూ తమ అంతరంగాల్లోని ఆనందాన్ని పంచుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన తీపి వంటకాలను తమ హిందూ ముస్లిం, క్రైస్తవ, సిక్కు సోదరులందరికీ రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు.

‘ఈద్‌ ముబారక్‌ ’ అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ విధంగా ‘ఈదుల్‌ ఫిత్ర్‌ ’ పండుగ మానవుల్లో అత్యున్నత మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొదిస్తుంది. పరోపకార గుణాన్ని, సహనం , త్యాగం, కరుణ, సానుభూతి భావాలను ప్రోదిచేసి, సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్య వాతావరణాన్ని సృజిస్తుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది.

కనుక రమజాన్‌ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలి. నెల్లాళ్ల శిక్షణ ప్రభావం భావి జీవితంలో ప్రతిఫలించాలి. మళ్లీ రమజాన్‌ వరకు ఈ తీపి అనుభూతులు మిగిలి ఉండాలి. అల్లాహ్‌ సమస్త మానవాళినీ సన్మార్గ పథంలో నడిపించాలని, పుడమిపై శాంతి వర్ధిల్లాలని, యావత్‌ ప్రపంచం  సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుందాం.

ఈద్‌ రోజు సంప్రదాయం
రమజాన్‌ నెల పూర్తి రోజాలను నెరవేర్చడమంటే, దైవాదేశ పాలనలో ఒక గురుతరమైన బాధ్యతను నెరవేర్చడం. ఇలాంటి సందర్భంలో ఒక మనిషిగా అతని హృదయం ఆనందంతో పొంగిపోవడం, ఒక విశ్వాసిగా అల్లాహ్‌ పట్ల కృతజ్ఞతా భావంతో నిండిపోవడం సహజం. ఈ సహజ భావోద్రేకాలే ‘ఈదుల్‌ ఫిత్ర్‌’ రూపంలో బహిర్గతమవుతాయి.

ఈ పండుగలో విశ్వాసి తాను రోజా విధి నెరవేర్చిన సందర్భంగా తన హృదయంలోని సంతోషాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తాడు. మరోవైపు ఒకవిధిని నియమానుసారం నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించినందుకు దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాడు. ఇస్లాంలో పండుగ సంబరాలు ప్రాపంచిక లక్ష్యాలు పూర్తిచేసుకున్నందుకు కాక, ఒక ఆరాధనా విధి నెరవేర్చి పరలోక మోక్షానికి అర్హత సంపాదించుకున్నామన్న సంతోషంలో ముస్లింలు ఈసంబరాలు జరుపుకుంటారు.

పండుగనాడు ఇలా చేయడం సున్నత్‌ 
గుసుల్‌ చేయడం: ముహమ్మద్‌ ప్రవక్త (స)సంప్రదాయాన్ని అనుసరించి, ఈద్‌ గాహ్‌కు వెళ్లే ముందు గుసుల్‌ (స్నానం) చేయాలి. సుగంధ ద్రవ్యాలు వాడడం: ఉన్నంతలోనే అత్యుత్తమ సుగంధ ద్రవ్యాలు వాడాలి.

మంచివస్త్రాలు ధరించడం: పండుగ సందర్భంగా అవకాశాన్ని బట్టి ఉన్నంతలో మంచి వస్త్రాలు ధరించాలి.

ఈద్‌ గాహ్‌కు వెళుతూ బిగ్గరగా తక్బీర్‌ పలకడం: ‘అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ , లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ వలిల్లాహిల్‌ హంద్‌’ అని బిగ్గరగా పలుకుతూ ఉండాలి. కాలినడకన ఈద్‌ గాహ్‌కు వెళ్ళడం: నమాజు కోసం ఈద్‌ గాహ్‌కు కాలినడకన వెళ్లాలి. ఒకదారిన వెళ్లి,  మరోదారిన తిరిగి రావాలి.

ఖర్జూరాలు తినడం: ఈద్‌ గాహ్‌కు వెళ్లే ముందు బేసిసంఖ్యలో ఉండేలా పచ్చి, లేక ఎండు ఖర్జూరాలు తినాలి. ఖర్జూరం లేని పక్షంలో ఏదైనా తీపివస్తువు తినవచ్చు. 3, 5, 7 ఇలా బేసి సంఖ్యలో ఖర్జూరాలు తినే ప్రవక్త మహనీయులు ఈద్‌ గాహ్‌కు వెళ్లేవారు. 

ఈదుల్‌ ఫిత్ర్‌ ఇలా..
పండుగ నమాజును ముహమ్మద్‌ ప్రవక్త (స) వారు ఈద్‌ గాహ్‌లో చేసేవారు. ప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించి ‘ఈద్‌ ’ నమాజును ఊరిబయట బహిరంగ ప్రదేశంలో (ఈద్‌ గాహ్‌లో) నెరవేర్చడం శుభదాయకమని ప్రపంచదేశాల ధార్మిక విద్వాంసుల ఏకాభిప్రాయం. అయితే అనివార్య పరిస్థితుల్లో ఈద్‌ నమాజును మస్జిద్‌లోనే చేసుకోవచ్చు. ప్రవక్తవారు, ఒకసారి వర్షం కారణంగా ఈద్‌ నమాజును మసీదులోనే చేశారు.

కాబట్టి ఈద్‌ గాహ్‌లో పండుగ నమాజు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. పండుగనాడు ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించడంతో పాటు, సుగంధ ద్రవ్యాలు వాడడంకూడా ప్రవక్త సంప్రదాయమే. ఈద్‌ గాహ్‌కు వెళ్ళేముందు కొద్దిగా అల్పాహారం తీసుకోవాలి. బక్రీద్‌ పండుగకు మాత్రం అసలు ఏమీ తినకుండానే ఈద్‌ గాహ్‌కు వెళ్లాలి. ఈదుల్‌ ఫిత్ర్‌ (రమజాన్‌ )నమాజును కాస్త ఆలస్యంగా, ఈదుల్‌ అజ్‌ హా (బక్రీద్‌ ) నమాజును చాలా తొందరగా చేయాలి.

ఈదుల్‌ ఫిత్ర్‌లో సదఖా, ఫిత్రా.. ఈదుల్‌ అజ్‌ హాలో ఖుర్బానీ ముఖ్యవిధులు. యావత్‌ ప్రపంచంలో ఈ పండుగను అత్యంత భక్తిప్రపత్తులతో, ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. ఇదిలా ఉంటే, కొందరు నిరుపేదలు, అభాగ్యులు ఈ పండుగ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తారు. ఎందుకంటే, సంపన్నులు, స్థితిమంతులు సదఖా, జకాత్, ఫిత్రా తదితర దానధర్మాల పేరుతో తమలాంటి పేదవారిని ఆదుకుంటారనే కొండంత ఆశతో. కనుక కలిగినవారు, స్థితిమంతులు సమాజంలోని నిరుపేద సోదరుల పట్ల తమ బాధ్యతను గుర్తెరగాలి.

పండుగ పేరుతో మితిమీరిన విలాసాలకు తమ సంపదను ఖర్చు చేయకుండా అభాగ్యులు, అగత్యపరులకు సహాయం చేసివారి ఆర్థిక స్థితిని మెరుగుపరచే ప్రయత్నం చెయ్యాలి. దీనివల్ల లబ్ధిదారుల సంతోషం, వారి దీవెనలతో పాటు, దేవుని ప్రసన్నత, పరలోక సాఫల్యం సిధ్ధిస్తుంది. పేదసాదల దీవెనలూ తోడుగా నిలుస్తాయి. అందుకే ఇస్లామీ ధర్మశాస్త్రం ధన దుబారాను తీవ్రంగా గర్హించింది. దుబారా ఖర్చు చేసేవారు షైతాన్‌ సోదరులని చెప్పింది. అవసరార్థులకు, పేదసాదలకు ధనసహాయం చేయడాన్ని ప్రోత్సహించింది.

అందుకని పండుగ నమాజు కంటే ముందు కుటుంబ సభ్యులందరూ ఫిత్రాలు చెల్లించాలని ఆదేశించింది. స్వీయ ఆనందంతోపాటు, సమాజమంతా ఆనందంగా, సంతోషంగా ఉండాలన్నది ముహమ్మద్‌ ప్రవక్త(స) వారి ఉపదేశాల సారం. ఈదుల్‌ ఫిత్ర్‌ పండుగ సమాజంలో ఈవిధమైన సంతోషాన్ని, శాంతిని, సోదరభావాన్ని, సామరస్య వాతావరణాన్ని సృజిస్తుంది. సేమియా, షీర్‌ ఖుర్మాల తీపితోపాటు, కులమతాలకు అతీతంగా, అందరిమధ్య ప్రేమ, ఆత్మీయత, అనురాగం, అనుబంధాలను ప్రోదిచేస్తుంది. 

(అందరికీ ఈదుల్‌ ఫిత్ర్‌ శుభాకాంక్షలు.)
-యండి. ఉస్మాన్‌ ఖాన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement