కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణంరాజు శివుడు, వాణిశ్రీ పార్వతిగా నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...
‘‘గజాసురుడు మహాభక్తుడు. అతని ఆరాధన అచంచలమైనది’’ అన్నాడు శివుడు తన భక్తుడైన గజాసురుడి గురించి.
‘‘స్వామీ! అతని ఆంతర్యం కుటిలమైనది. ఆ తపస్సులో బలీయమైన కుతంత్రం ఉన్నది. అటువంటి దుష్టుడికి వరాలు ఇవ్వడం మంచిది కాదు’’ అన్నది పార్వతి.
‘‘మంచిచెడులు ఎంచుకొని వరాలు ఇవ్వడం ధర్మం కాదు’’ అన్నాడు శివుడు.
‘‘ఒకరికి ఇచ్చిన వరం మరొకరికి శాపం కారాదు’’ అన్నది పార్వతి.
‘‘ఆరాధించే భక్తులను అనుగ్రహించకపోవడం మాకు వీలుకాదు’’ అన్నాడు శివుడు.
‘‘దానివల్ల లోకం నాశనమైతే?’’ అడిగింది పార్వతి.
‘‘నూతన సృష్టికి నాంది పలుకుతుంది. విలయం నుండి నవయురాగారంభం అవుతుంది’’ అన్నాడు శివుడు.
‘‘అయితే మీ అర్ధాంగి మాట...’’ పార్వతి.
‘‘మన్నించలేదని మథనపడకు. అకుంఠితదీక్షతో మమ్మల్ని ఆరాధిస్తున్న ఆ మహాభక్తున్ని చూడు...’’ అన్నాడు శివుడు.
భూలోకంలో...
‘‘ఓం...నమశ్శివాయ’’ అంటూ గజాసురుడు భీకరంగా తపస్సు చేస్తున్నాడు.
శివుడు ఎంతకీ ప్రత్యక్షం కాకపోవడంతో... ‘‘పరమేశ్వరా! భక్తవత్సలుడవని కరుణామయుడవని అంటారే! ఈ దాసునిపై నీకు ఇంకా దయ రాలేదా! నీ మనసు కరగలేదా? ఈ దాసునికి నీ దివ్యమంగళ రూపం దర్శించే భాగ్యం కలిగించవా ప్రభూ! నీ కరుణకు పాత్రం కాని ఈ జన్మ నాకెందుకు...’’ అని ఖడ్గంతో గజాసురుడు శిరచ్ఛేధనం చేసుకోబోతుండగా శివుడు ప్రత్యక్షమై...‘‘ఆగు గజాసురా!’’ అని వారించాడు.
శివుడిని చూడగానే గజాసురుడి కళ్లల్లో వెలుగు నిండింది.
‘‘స్వామీ! ముక్కంటి దేవరా! గౌరీ మనోహరా... గంగాధరా! కరుణించవా స్వామీ!’’ భక్తి పారవశ్యంతో అన్నాడు గజాసురుడు.
‘‘అనితరసాధ్యమైన నీ ఆరాధననకు సంతసించాను. నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను. ఏం కావాలో కోరుకో!’’ భక్తుణ్ణి అడిగాడు శివుడు.
అప్పుడు గజాసురుడు తన మనసులో మాట సూటిగా అడిగాడు...
‘‘ప్రభూ! నీ దివ్యరూపం నా ఒక్కరికే దక్కాలి. నువ్వు నా గర్భకుహరంలో కొలువుండాలి’’
‘‘గజాసురా! ఏమి ఈ విపరీతమైన కోరిక. అనంతమూ, సకల జనాదరణీయమైన శివస్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా?’’ అడిగాడు శివుడు.
‘‘స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామీ! నా కోరికను మన్నించవలె’’ అని తన విపరీత కోరికను సమర్థించుకున్నాడు గజాసురుడు.
‘‘గజాసురా! దుర్భరమైన ఈ వరం ఏ విపరీతాలకు దారి తీస్తుందో తెలుసా?’’ హెచ్చరించాడు శివుడు.
‘‘నీ చరణాలను నమ్ముకున్న నేను ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను స్వామీ!’’ అన్నాడు పట్టు వదలని గజాసురుడు.
ఇక చేసేదేమీ లేక శివుడు గజాసురుడు అడిగిన వరాన్ని ఇచ్చాడు.
గజాసురుడి ముందు జంగమయ్యలు ప్రదర్శన ఇచ్చారు.
‘‘మీ ప్రదర్శనకు మెచ్చినాము. ఏమి కావలెనో కోరుకోండి’’ అన్నాడు గజాసురుడు.
పక్కనే ఉన్న నారదుడు మాత్రం– ‘‘గజాసురా! తొందరపడి వాగ్దానం చేయవద్దు. వారు ఏం కోరుతారో ఏమో’’ అని హెచ్చరించాడు.
‘‘ఏం కోరినా ఇస్తా నారదా! మేము అపరపరమేశ్వర అవతారులం. వరాలను అనుగ్రహించడంలో ఆ శివునికి ఏమీ తీసిపోం’’ అన్నాడు. ఆ మాటల్లో గర్వం ప్రతిధ్వనిస్తోంది.
‘‘అది నిజమే. ఈ అపరపరమేశ్వరుడు ఆడిన మాట తప్పనివాడు. మీ అదృష్టం ఫలించింది. మీ ప్రదర్శనకు తగిన బహుమానం లభిస్తుంది. కోరుకోండి. సందేహించకండి’’ అన్నారు వందిమాగధులు.
‘‘మేము అందరిలాంటి యాచకులం కాదు జంగమయ్యలం. మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి’’ అని అడిగారు జంగమయ్యలు.
‘‘ఏమిటి ఈ విపరీతమై కోరిక!’’
‘‘వీరు గంగిరెద్దుల వారు కాదు. కపట వేషధారులు... బ్రహ్మ, విష్ణువులు..’’ అంటున్నారు గజాసురుడి పరివారం.
నిజమే... వారు గంగిరెద్దుల వారు కాదు... బ్రహ్మ, విష్ణువులు.
‘‘ఎంత మోసం!’’ అన్నాడు గజాసురుడు.
‘‘మోసం కాదు గజాసురా! లోకక్షేమం కోసం ఈ వేషాలు వేయాల్సి వచ్చింది. అందరివాడైన ఆదిశంకరుడు నీ ఒక్కడికే దక్కాలనుకోవడం స్వార్థం కాదా?’’
‘‘అందరి హృదయంలో వెలిగే ఆ ఆరని జ్యోతిని నీ గర్భకుహరంలో బంధించడం దుశ్చర్య కాదా! ఆదిదంపతులను వేరు చేయుట దురుద్దేశం కాదా!’’... అన్నారు బ్రహ్మ, విష్ణువులు.
‘‘నారాయణ! మాట ఇచ్చేముందు నా మాట విని ఉంటే ఇంతవరకు వచ్చేదా?’’ అన్నాడు నారదుడు.
‘‘ఏమంటావు గజాసురా! అపరపరమేశ్వరుడిలా ఆడిన మాట తప్పనని ప్రగల్భాలు పలికావే. ఇప్పుడేమంటావు ఆడిన మాట తప్పుతావా?’’ ఎత్తిపొడిచారు బ్రహ్మ, విష్ణువులు.
‘‘అన్నమాట కాదన్నమాట మేమెరుగం. అయినా చేతులతో తీసివ్వడానికి శివుడేమీ ఆటబొమ్మ కాదు. చేతనైతే ఫాలలోచనుడిని బయటికి రప్పించి తీసుకెళ్లండి’’ అన్నాడు గజాసురుడు.
‘‘శివున్ని రప్పించడం అంటే కుప్పిగంతులు వేసినట్లు కాదు. తీసుకెళ్లమనండి చూద్దాం’’ అని రెచ్చగొట్టారు వందిమాగధులు.
‘సాంబ సదాశివ శంభోశంకర
పరమ దయాకర భక్త వశంకర
నంది వాహన నాగభూషణ
భయవిమోచన... కాలలోచన... కడుపు చీల్చుకొని రా’ అంటూ గానం చేస్తున్నారు బ్రహ్మ, విష్ణువులు.
అంతే... గజాసురుడి కడుపులో భరించలేని నొప్పి మొదలైంది. కొద్దిసేపట్లోనే... అతడి కడుపును చీల్చుకుంటూ శివలింగం బయటికి వచ్చింది.
‘‘భక్త వశంకరా! సుర పక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా! వరం ఇచ్చినట్లే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామీ!’’ మరణశయ్యపై ఉన్నాడు గజాసురుడు.
అప్పుడు శివుడు ప్రత్యక్షమై...
‘‘గజాసురా! విపరీతమై వరాలు విపత్కరాలని ఆనాడే నిన్ను హెచ్చరించాను’’ అంటూ గతాన్ని గుర్తు చేశాడు.
‘‘నిజమే స్వామీ! అజ్ఞానంతో నీ ఆదేశంలోని పరమార్థాన్ని గ్రహించలేకపోయాను. కాని దానికి ఇంత శిక్ష విధిస్తావా! అనంతకోటి కాంతిపుంజాలతో ప్రకాశించిన ఈ శరీరాన్ని అంధకారబంధురం చేసి వెళ్లిపోతావా!’’ అని దుఃఖిస్తున్నాడు మృత్యువుకు చేరువులో ఉన్న గజాసురుడు.
సమాధానం - శ్రీ వినాయక విజయం
Comments
Please login to add a commentAdd a comment