పదకొండు భాషల తారలతో సంతోషంగా అవార్డుల వేడుక
పదకొండు భాషల తారలతో సంతోషంగా అవార్డుల వేడుక
Published Sun, Sep 1 2013 11:56 PM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
11 భాషలకు చెందిన సినీ ప్రముఖుల ఆగమనంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం కళకళలాడింది. ‘సంతోషం’ సినీ వారపత్రిక 11వ వార్షికోత్సవ వేడుక ఈ తారల ఆగమనానికి వేదిక అయ్యింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ‘సంతోషం ఫిలిం అవార్డు వేడుక’ను ఆ పత్రిక సంపాదకుడు, నిర్మాత సురేష్ కొండేటి ఘనంగా నిర్వహించారు.
రెండేళ్ల క్రితం వరకూ తెలుగు సినిమాకే పరిమితమైన ఈ అవార్డు వేడుకను... గత ఏడాదితో దక్షిణభారతానికి చెందిన అన్ని భాషలకూ విస్తరింపజేశారు సురేష్. అయితే... ఈ ఏడాది అంతకంటే ఘనంగా... దేశంలోని 11 భాషల చిత్రాలకు ఈ అవార్డులను అందించారు సురేష్. 2012వ సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డు వేడుకలో తెలుగు సినిమాకు గాను ఉత్తమనటునిగా మహేష్‌బాబు (బిజినెస్‌మేన్), ఉత్తమనటిగా సమంత(ఈగ) అవార్డులను గెలుచుకున్నారు.
ఇంకా వివిధ భాషల్లోని పలువురు సినీ ప్రముఖులకు సంతోషం అవార్డులు వరించాయి. దాసరి నారాయణరావు, డి.రామానాయుడు, కృష్ణ, కృష్ణంరాజు, జమున, వాణిశ్రీ, విజయనిర్మల, జయంతి, వెంకటేష్, రవిచంద్రన్, డా.రాజేంద్రప్రసాద్, రామ్‌చరణ్, రానా, ఆర్.నారాయణమూర్తి, గీతాంజలి, రోజారమణి, రావు బాలసరస్వతి, తార, మమతామోహన్‌దాస్, హన్సిక, నిఖిషాపటేల్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చార్మి, అక్ష, రేష్మ, అభినయల నాట్యం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా... కృష్ణంరాజు, వాణిశ్రీ కూడా ఈ వేడుకపై కలిసి స్టెప్పులేయడం విశేషం.
Advertisement
Advertisement