‘ఎవడిదిరా ఈ భూమి? ఎవ్వడురా భూస్వామి?దున్నేవాడిదె భూమి... పండించేవాడే ఆసామి’. తీవ్రమైన ఆ ప్రశ్నలు... తెగువతో కవి కలం ఇచ్చిన ఆ బలమైన ఆ సమాధానాలు వింటే – ఇప్పుడంటే మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి తరహా ఎర్ర సినిమాలు గుర్తొస్తాయి. కానీ, వాటికన్నా ముందే ఓ స్టార్ సినిమా... వెండితెరపై విప్లవం పండించిందని తెలుసా? ఎన్టీ రామారావు లాంటి స్టార్ హీరో, వరుస విజయాల మీదున్న దాసరి నారాయణరావు లాంటి దర్శకుడు కలసి నాలుగున్నర దశాబ్దాల క్రితమే చేసిన సమసమాజ నినాదం ‘మనుషులంతా ఒక్కటే’ (1976 ఏప్రిల్ 7). ఆ సినిమాకు 45 వసంతాలు.
ఆనాటి పరిస్థితులే... అలా తెరపై...
వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భూ సంస్కరణలు మొదలయ్యాయి. 1950లోనే జమీందారీ వ్యవస్థ రద్దు బిల్లు వచ్చింది. 1956లో అనేక ప్రాంతాలు ఆ బిల్లును చట్టం చేశాయి. ఆర్థిక అసమానతలెన్నో ఉన్న మన దేశానికి కమ్యూనిజమ్, సోషలిజమ్ తారక మంత్రాలయ్యాయి. నెహ్రూ, శాస్త్రి తర్వాత ప్రధాని అయిన ఇందిరా గాంధీ 1970లో రాజభరణాలను రద్దు చేశారు. 1971 ఎన్నికల్లో ‘గరీబీ హఠావో’ నినాదం మారుమోగించారు. ఆ సామాజిక పరిస్థితుల్లో, జనంలో బలపడుతున్న భావాలతో తెరకెక్కిన కథ – ‘మనుషులంతా ఒక్కటే’. బ్రిటీషు కాలం నాటి పెత్తందారీ జమీందారీ వ్యవస్థనూ, సమకాలీన సామ్య వాద భావనలనూ అనుసంధానిస్తూ తీసిన చిత్రం ఇది.
తాతను మార్చే మనుమడి కథ
కథ చెప్పాలంటే... జమీందారు సర్వారాయుడు (కైకాల సత్యనారాయణ), ఆయన కొడుకు రాజేంద్రబాబు (ఎన్టీఆర్) పేదలను ఈసడించే పెత్తందార్లు. కానీ, పేదింటి రైతు పిల్ల రాధ (జమున) వల్ల పెద్ద ఎన్టీఆర్ మారతాడు. ఆమెను పెళ్ళాడతాడు. పేదల పక్షాన నిలిచి, న్యాయం కోసం పోరా డతాడు. ప్రాణాలు కూడా కోల్పోతాడు. కానీ, ఆ పేదింటి అమ్మాయికీ, అతనికీ పుట్టిన రాము (రెండో ఎన్టీఆర్) పెరిగి పెద్దవాడై, జమీందారు తాతకు బుద్ధి చెబుతాడు. వర్గ భేదాలు, వర్ణ భేదాలు లేకుండా మనుషులంతా ఒక్కటే అని వాణిజ్యపంథాలో చెప్పడంలో సూపర్ హిట్టయిందీ చిత్రం.
విప్లవ కథాచిత్రాలకు కమర్షియల్ మూలం
కళాదర్శకుడు– పబ్లిసిటీ డిజైనింగ్ ‘స్టూడియో రూప్ కళా’ ఓనరైన వి.వి. రాజేంద్ర కుమార్ కు సినిమా చేస్తానంటూ అప్పటికి చాలా కాలం ముందే ఎన్టీఆర్ మాటిచ్చారు. మాటకు కట్టుబడి, డేట్లిచ్చారు. పౌరాణికం తీయాలని రాజేంద్ర కుమార్ మొదట అనుకున్నారు. చివరకు ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్‌కు శ్రీకారం చుడుతూ, సాంఘికం ‘మనుషులంతా ఒక్కటే’ తీశారు. రాజేంద్ర కుమార్ సమర్పణలో, ఆయన సోదరుడు – కథా, నవలా రచయిత వి. మహేశ్, గుంటూరుకు చెందిన దుడ్డు వెంకటేశ్వరరావు నిర్మాతలుగా ఈ సినిమా నిర్మాణమైంది.
‘మనుషులంతా ఒక్కటే’ అనే పేరు, ‘దున్నేవాడిదే భూమి’ లాంటి అంశాలు అచ్చంగా వామపక్ష భావజాలంతో కూడిన సినిమాల్లో కనిపిస్తాయి. కానీ ప్రజాపోరాటంతో పాటు, పెద్ద కుటుంబానికి చెందిన హీరో తక్కువ కులపు పేదింటి అమ్మాయిని పెళ్ళాడడం లాంటివన్నీ ఈ కమర్షియల్ చిత్రంలో ఉన్నాయి. అలా చూస్తే ‘భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం’ అనే విప్లవ భావాలతో వచ్చిన తర్వాతి సినిమాలకు ఒక రకంగా ‘మనుషులంతా ఒక్కటే’ మూలమనేవారు దాసరి. అంతకు మునుపు కూడా పెత్తందార్లపై, రైతు సమస్యలపై సినిమాలు వచ్చినా, అవన్నీ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోవే! బ్లాక్ అండ్ వైటే!! ఇలా కమర్షియల్, కలర్ చిత్రాలు కావనేది గమనార్హం.
కథ వెనుక కథేమిటంటే...
దాసరి రచయితగా, దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌కు తెలుసు. ‘ఒకే కుటుంబం’ (1970 డిసెంబర్ 25)తో సెట్స్‌పై దాసరి దర్శకత్వ ప్రతిభ కూడా ఎన్టీఆర్‌కు తెలిసింది. మరో హిందీ షూటింగుతో క్లాష్ వచ్చి, దర్శకుడు ఎ. భీమ్‌సింగ్ అందుబాటులో లేనప్పుడు కొద్దిరోజులు ‘ఒకే కుటుంబం’ షూటింగ్ చేసింది ఆ చిత్రానికి సహ రచయిత, అసోసియేట్ డైరెక్టరైన దాసరే! అంతకు ముందు రచయితగానూ దాసరి ఒకటి రెండు కథలతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళినా, రకరకాల కారణాలతో అవేవీ సెట్స్ పైకి రాలేదు. ఈ ‘మనుషులంతా ఒక్కటే’కు దాసరి ముందు అనుకున్న మూలకథ కూడా వేరే ఎన్టీఆర్ నిర్మాతల దగ్గరకు వెళ్ళిందట! ఎన్టీఆర్, జమునలతో తీయాలనేది ప్లాన్. కానీ, అప్పటికే వచ్చిన ‘మంగమ్మశపథం’(1965)తో పోలికలున్నాయంటూ, ఆ నిర్మాత వెనక్కి తగ్గారట!
ఆ తరువాత చాలాకాలానికి దాసరి దర్శకుడయ్యాక ఆ మూల కథే మళ్ళీ ఎన్టీఆర్, జమునలతోనే తెరకెక్కడం విచిత్రం. ‘మనుషులంతా ఒక్కటే’ నిర్మాతల్లో ఒకరైన నవలా రచయిత వి. మహేశ్ గతంలో దాసరి దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్ స్టోరీ రైటర్. చాలాకాలం క్రితం తాను అనుకున్న కథలో మహేశ్, ఆర్కే ధర్మరాజు సహకారంతో మార్పులు, చేర్పులు చేశారు దాసరి. దాంతో, ఈ కథ నేపథ్యమే మారింది. దున్నేవాడిదే భూమి, జమీందారీ వ్యవస్థ, తాతకు మనుమడు బుద్ధి చెప్పడం లాంటి అంశాలతో కథ కొత్త హంగులు దిద్దుకుంది. నిర్మాత మహేశ్, ఆర్కే ధర్మరాజులకే కథారచన క్రెడిట్ ఇచ్చి, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వ బాధ్యతల క్రెడిట్ తీసుకున్నారు దాసరి. ఈ సినిమాలో తెరపై రెండో ఎన్టీఆర్‌ను హోటల్ రిసెప్షన్ దగ్గర పలకరించే చిరువేషంలోనూ మెరిశారు మహేశ్. సమాజానికి మంచి చెప్పే ఈ కథతో ఆ ఏటి ద్వితీయ ఉత్తమ కథారచయితగా మహేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు.
క్రేజీ కాంబినేషన్! దాసరి కొడుకుకు ఎన్టీఆర్ పేరు!!
దర్శకుడిగా దాసరికి ఇది 12వ సినిమా. అంతకు ముందు 11 సినిమాల్లో ‘సంసారం – సాగరం’, ‘రాధమ్మ పెళ్ళి’, ‘తిరపతి’, యావరేజ్ ‘యవ్వనం కాటేసింది’ పోగా మిగతా 7 సక్సెస్. ఆ మాటకొస్తే ‘మనుషులంతా ఒక్కటే’ రిలీజైన 1976కు ముందు సంవత్సరం 1975లో రిలీజైన దాసరి చిత్రాలు నాలుగూ శతదినోత్సవ చిత్రాలే. దాసరి మంచి క్రేజు మీదున్నారు. అయితే, శోభన్‌బాబు ‘బలిపీఠం’ మినహా అప్పటి దాకా ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైటే! స్టార్ల కన్నా కథకే ప్రాధాన్యమున్న లోబడ్జెట్ చిత్రాలే! ఆ టైములో ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్‌తో, కలర్‌లో, ఔట్‌డోర్‌లో, భారీ బడ్జెట్‌తో తొలిసారిగా దర్శకత్వం వహించే ఛాన్స్ రాగానే దాసరి రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు.
1975 నాటికి శోభన్‌బాబు జోరు మీదున్నారు. టాప్ స్టార్‌గా ఎన్టీఆర్ కెరీర్ కొనసాగుతోంది. అప్పట్లో ఎన్టీఆర్ సెంటిమెంటల్ క్రైమ్ కథ ‘అన్నదమ్ముల అనుబంధం’ (1975 జూలై 4), ప్రయోగాత్మక ‘తీర్పు’(1975 అక్టోబర్ 1), మాస్‌ఫార్ములా ‘ఎదురులేని మనిషి’ (1975 డిసెంబర్ 12), విభిన్నమైన క్లాస్ ప్రేమకథ ‘ఆరాధన’ (1976 మార్చి 12) చిత్రాలతో 9 నెలల కాలంలో 4 హిట్లు, చారిత్రక కథా చిత్రం ‘వేములవాడ భీమకవి’ (1976 జనవరి 8) తర్వాత ‘మనుషులంతా ఒక్కటే’తో జనం ముందుకొ చ్చారు. జమీందారీ కథకు తగ్గట్టు రాతి కట్టడంతో కోటలా కనిపించే బెంగళూరులోని మైసూర్ మహారాజా ప్యాలెస్‌లో షూటింగ్ చేసిన తొలి తెలుగు చిత్రమూ ఇదే. అంతకు ముందొచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ (1973) లాంటివన్నీ తెల్లగా, పాలరాతితో చేసినట్టు తోచే మైసూరులోని లలితమహల్ ప్యాలెస్‌లో తీసినవి. చిత్రమేమిటంటే, ఏ.వి.ఎం స్టూడియోలో ‘మనుషులంతా ఒక్కటే’ షూటింగ్ ప్రారంభమైనరోజునే దాసరికి అబ్బాయి పుట్టాడు. ఆ సంతోష వార్త తెలియగానే ఎన్టీఆర్‌తో పంచుకున్న దాసరి, ‘తారక రామారావు అనే మీ పేరు కలిసొచ్చేలా మా తొలి సంతానానికి నామకరణం చేస్తున్నాం’ అని చెప్పారు. కొడుకుకి‘తారక హరిహర ప్రభు’ అని పేరు పెట్టారు.
ఎస్పీబీ గాత్రానికి ఓ కొత్త ఊపు
ఇద్దరు ఎన్టీఆర్‌లు, ఇద్దరు హీరోయిన్లున్నా – ‘మనుషులంతా...’లో ఎన్టీఆర్‌కు ఒక్క డ్యుయెటైనా ఉండదు. బాపు సూపర్ హిట్ ‘ముత్యాల ముగ్గు’ సహా అక్కినేని ‘సెక్రటరీ’, కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ తదితర చిత్రాల ఆడియోలతో గాయకుడు రామకృష్ణ హవా నడుస్తున్న రోజులవి. ఆ పరిస్థితుల్లో అప్పటికి ఇంకా వర్ధమాన గాయకుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ‘మనుషులంతా ఒక్కటే’లోని సోలో పాటలన్నీ ఎస్. రాజేశ్వరరావు స్వరసారథ్యంలో పాడి, ఆకట్టుకున్నారు. ‘అను భవించు రాజా..’, ‘తాతా బాగున్నావా..’, ‘ఎవడిదిరా ఈ భూమి..’ (రచన సినారె), ‘కాలం కాదు కర్మా కాదు..’ (ఆత్రేయ) – ఇలా ఆ సోలో సాంగ్స్ అన్నీ పాపులరే.
ఇక, ‘ముత్యాలు వస్తావా...’ డ్యూయట్‌లో అచ్చంగా అల్లు రామలింగయ్యే పాడారేమో అనేట్టుగా ఎస్పీబీ తన గళంతో మాయాజాలం చేయడం మరో విశేషం. అలా ఆయన కెరీర్‌కు ఈ చిత్రం ఓ కొత్త ఊపు. హాస్యనటి రమాప్రభ ఈ సినిమాలో అల్లు రామలింగయ్య, నాగేశ్‌ల సరసన ద్విపాత్రాభినయం చేయడం ఓ గమ్మత్తు! అల్లుతో రమాప్రభకు ‘ముత్యాలు వస్తావా... అడిగింది ఇస్తావా...’ అంటూ డ్యూయెట్ పెట్టడం మరో గమ్మత్తు!! రాజేశ్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించిన హిందీ సినిమా ‘ఆరాధన’ (1969 సెప్టెంబర్ 27)లో ఎస్.డి. బర్మన్ బాణీకి ఆయన కుమారుడు ఆర్.డి. బర్మన్ హంగులు చేర్చగా, దేశమంతటినీ ఊపేసిన పాపులర్ శృంగారగీతం ‘రూప్ తేరా మస్తానా.’ సరిగ్గా ఆ బాణీనే అనుసరిస్తూ, కొసరాజు రాసిన ‘ముత్యాలు వస్తావా..’ అప్పట్లో రేడియోలో మారుమోగింది.
ఇప్పటికీ ఎమోషనల్‌గా... ఆ బుర్రకథలు
ఇదే సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు పెద్ద ఎన్టీఆర్ పాత్ర ఒంటరిగా దుండగుల చేతిలో చనిపోయే ఉద్విగ్నభరిత ఘట్టం ఉంటుంది. ఆ సందర్భానికి తగ్గట్టు మహాభారతంలోని అభిమన్యుడి బుర్రకథను సినారె ప్రత్యేకంగా రాశారు. ప్రసిద్ధ బుర్రకథకుడు నాజర్ బృందంతో ఈ బుర్రకథ తీయాలనుకున్నారు. అయితే, ఆయన వయోభారం అడ్డమైంది. దాంతో, సినారె సూచనతో హైదరాబాద్‌కు చెందిన మరో ప్రముఖ బుర్రకథకుడు పి. బెనర్జీ బృందంతో ఆ బుర్రకథ తీశారు. ఆ బుర్రకథ, తెరపై దాని చిత్రీకరణ ఓ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్. నాలుగున్నరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ –దాసరి కాంబినేషన్‌లోనే వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ లోనూ ఇంటర్వెల్ ముందు ఇదే బెనర్జీ బృందంతో శ్రీశ్రీ రాసిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ పెట్టడం విశేషం.
యాభైకే... 100 రోజుల వసూళ్ళు
తరువాతి కాలంలో దర్శకులైన కె. దుర్గానాగేశ్వరరావు ‘మనుషులంతా ఒక్కటే’కు కో–డైరెక్టరైతే, శతచిత్ర దర్శకుడైన కోడి రామకృష్ణ అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్. దాసరి శిష్యుడు – ఇప్పటి విప్లవ చిత్రాలకు చిరునామాగా మారిన ఆర్. నారాయణమూర్తి కూడా ఈ విప్లవాత్మక కథాచిత్రంలో క్లైమాక్స్‌లో ఒక చిన్న డైలాగు వేషంలో కనిపిస్తారు. తమిళనాడులోని మద్రాసు, కర్ణాటకలోని బెంగళూరు, నందీహిల్స్, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు పరిసరాల్లో – ఇలా 3 రాష్ట్రాల్లో భారీ వ్యయంతో ఈ సినిమా చిత్రీకరణ సాగింది.
33 ప్రింట్లతో 50 థియేటర్లలో రిలీజైన ఈ కలర్ చిత్రం అప్పట్లో దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు ఆడింది. నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. విజయవాడ లక్ష్మీ టాకీస్‌లో అత్యధికంగా 128 రోజులు ప్రదర్శితమైంది. ఇక, హైదరాబాద్ కేంద్రంలో షిఫ్టింగులతో, సంయుక్త రజతోత్సవం మాత్రం జరుపుకొంది. క్లైమాక్స్ చిత్రీకరణ సాగిన నెల్లూరులో విపరీతంగా ఆదరణ లభించింది. అలా నెల్లూరు, గుంటూరు లాంటి కొన్ని కేంద్రాలలో సర్వసాధారణంగా ఒక సినిమాకు వందరోజులకు వచ్చే వసూళ్ళను ‘మనుషులంతా ఒక్కటే’ కేవలం యాభై రోజులకే సాధించడం అప్పట్లో చర్చ రేపింది. ఆ ఏడాది జూలై 26న మద్రాస్ తాజ్ కోరమాండల్ హోటల్‌లో దర్శకుడు పి. పుల్లయ్య, నిర్మాత డి.వి.ఎస్ రాజు ముఖ్య అతిథులుగా సినిమా వంద రోజుల వేడుక ఘనంగా చేశారు. అప్పట్లో ఎమ్జీఆర్‌తో తమిళంలో ఈ సినిమాను రీమేక్ తీయాలనుకున్నారు. కానీ, ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కావడంతో అది కుదరలేదు. ఏది ఎలా ఉన్నా, మనుషులంతా ఒక్కటే అనే సార్వకాలిక సత్యాన్ని జనరంజకంగా చెప్పిన చిత్రంగా ‘మనుషులంతా ఒక్కటే’ ఎప్పటికీ గుర్తుంటుంది.
ఎన్టీఆర్ సహకారంతో...
‘మనుషులంతా...’ తరువాత రాజేంద్ర కుమార్‌కు ఎన్టీఆర్ ఇంకో సినిమా చేశారు. ‘రక్తసంబంధం’ ఫక్కీలోని ఆ అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ చిత్రం – ‘మహాపురుషుడు’. ‘ఆబాలగోపాలుడు’ టైటిల్ మధ్యలో అనుకొని, చివరకు ‘మహాపురుషుడు’ (1981 నవంబర్ 21)గానే రిలీజైందా సినిమా. నిర్మాణం సగంలో ఉండగానే రాజేంద్ర కుమార్ హఠాత్తుగా కన్నుమూశారు.చిత్ర నిర్మాణం సందిగ్ధంలో పడి, ఆలస్యమైంది. ఎన్టీఆర్ సహకరించి, సినిమా పూర్తి చేయించి, రిలీజ్ చేయించడం విశేషం.
పబ్లిసిటీలో... పేరు వివాదం!
‘మనుషులంతా ఒక్కటే’తో మొదలైన ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్‌లో ఆ తరువాత మరో 4 సినిమాలు వచ్చాయి. ఈ సినిమా తీసేనాటికే ప్రింట్, పోస్టర్ పబ్లిసిటీలో దర్శకుడిగా దాసరి పేరు సినిమా టైటిల్ కన్నా పైన మేఘాలకు ఎక్కింది. కానీ, ఎన్టీఆర్‌తో తొలిసారి తీస్తున్న ‘మనుషులంతా ఒక్కటే’ ప్రిరిలీజ్ పబ్లిసిటీకి దాసరి తన పేరును సినిమా టైటిల్ కన్నా కిందే వేసుకున్నారు. ఆ పైన తమ కాంబినేషన్‌లో రెండో సినిమా ‘సర్కస్ రాముడు’ (1980 మార్చి 1)కు మాత్రం ఎందుకనో టైటిల్ పైన తన పేరు వేసుకున్నారు దాసరి. అది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాసరి దగ్గర పంచాయతీ పెట్టారు. దాంతో, ఇకపై ప్రధాన పబ్లిసిటీలో ముందుగా పైన ఎన్టీఆర్ నటించిన అని పేరు వేసి, ఆ తరువాతే మరోవైపు తన పేరు మేఘాలలో వేయడానికి దాసరి రాజీ కొచ్చారు. ఒప్పుకున్నట్టే, ఆ తరువాత తీసిన ‘సర్దార్ పాపారాయుడు’ (1980 అక్టోబర్ 30), ‘విశ్వరూపం’ (1981 జూలై 25) ప్రధాన పబ్లిసిటీకి ఆ పద్ధతే అనుసరించారు. ఆఖరుగా వచ్చిన ‘బొబ్బిలిపులి’ (1982 జూలై 9)కి సైతం ‘‘నవరస నాయకుడు నటరత్న యన్.టి.ఆర్. నటనా వైభవం’’ అని ముందు వేసి, ఆ తరువాతే మేఘాలలో తన పేరు పబ్లిసిటీలో కనిపించేలా చూశారు. పబ్లిసిటీలో పేరెక్కడ ఉండాలనే ఈ వివాదం సినీప్రియుల్లో అప్పట్లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది.
నాగభూషణం లాస్... సత్యనారాయణకు గెయిన్!
ఈ సినిమాలో కీలకమైనది – మనుమడైన రెండో ఎన్టీఆర్ ఢీ కొట్టే తాత పాత్ర. అహంకారం నిండిన జమీందారుగా ఆ విలనీ తాత పాత్ర, ఆ గెటప్ అప్పట్లో నటుడు నాగభూషణం ట్రేడ్ మార్క్. నిజానికి, ఎన్టీఆర్ కూడా ఆయన పేరే సూచించారట. కానీ, నాగభూషణం సమర్పించిన ‘ఒకే కుటుంబం’కి పనిచేసిన దాసరి ఆ మాట వినలేదు. ‘తాత – మనవడు’లో నాగభూషణం బదులు గుమ్మడితో వేషం వేయించిన దాసరి ఈసారీ వ్యక్తిగత కారణాల రీత్యా నాగభూషణాన్ని వద్దనే అనుకొన్నారు. సత్యనారాయణ పేరు పైకి తెచ్చారు. అదేమంటే, ‘నన్ను నమ్మండి. ఆయన అద్భుతంగా చేస్తారని నిరూపిస్తా’ అని వాదించి మరీ ఒప్పించారు. నిరూపించారు. ‘ఎన్టీఆర్‌కు తాతగా మహామహులు చేయాల్సింది నేను చేయడమేమిట’ని సత్యనారాయణ సైతం భయపడ్డారు. కానీ, తాత పాత్రకు ప్రాణం పోశారు. ఆయన అభినయం, ‘తాతా బాగున్నావా’ లాంటి పాటలతో నేటికీ ఆ పాత్ర చిరస్మరణీయమైంది.
‘కర్ణ’ ఛాన్స్ ఇచ్చిన... జమున కెమేరా అందం
పెద్ద ఎన్టీఆర్‌కు భార్యగా, చిన్న ఎన్టీఆర్‌కు తల్లిగా, ఆత్మాభిమానం ఉన్న పేదింటి రైతుబిడ్డగా జమునది క్లిష్టమైన పాత్ర. ఆ పాత్రను ఆమె అభినయంతో మెప్పించారు. నలభై ఏళ్ళ వయసులోనూ జమున లంగా, ఓణీలతో సినిమా ఫస్టాఫ్‌లో ఆకర్షణీయంగా, చలాకీగా కనిపిస్తారు. ఆ వయసులోనూ, ఆ కాస్ట్యూమ్స్‌తో ఆమెను అందంగా, హుందాగా చూపడంలో కెమేరామ్యాన్ కన్నప్ప ప్రతిభ కూడా ఉంది. ఆ పనితనం ఎన్టీఆర్‌కు బాగా నచ్చింది. ఆ వెంటనే ఎన్టీఆర్ తన 54వ ఏట స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, త్రిపాత్రాభినయం చేస్తున్న పౌరాణిక చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (1977 జనవరి 14)కు కన్నప్పనే కెమేరామ్యాన్‌గా తీసుకున్నారు. కర్ణుడు, సుయోధనుడు, శ్రీకృష్ణుడు – ఈ మూడు పాత్రల్లోనూ తెరపై అందంగా కనువిందు చేశారు.
ఆ పాట... అలా స్పెషల్!
ఇదే సినిమాలో దాసరి చేసిన మరో మ్యాజిక్ – సినిమాల టైటిల్స్‌తోనే ఏకంగా ఓ పాటంతా రాసి, మెప్పించడం! ‘నిన్నే పెళ్ళాడుతా... రాముడూ భీముడూ...’ అంటూ ఆ పాట అంతా ఎన్టీఆర్ నటించిన సినిమాల టైటిల్స్‌తోనే సాగుతుంది. పి. సుశీల గానంలో హీరోయిన్ మంజుల స్టేజీపై నర్తిస్తుండగా, ఎన్టీఆర్ మీదే దాన్ని చిత్రీకరించడం విశేషం. అంతకు ముందు ‘ఒకే కుటుంబం’ లాంటి సినిమాల్లో గీతరచన చేసినా, దర్శకుడయ్యాక దాసరికి ఇదే ఫస్ట్ సాంగ్.
ఈ సినిమాలో ఈ సందర్భం కోసం మొదట వేరే పాట అనుకున్నారు. ఎన్టీఆర్ పౌరాణిక గెటప్పుల్లో కనిపించేలా సినారె రాశారు. అయితే, ఆఖరి నిమిషంలో ఆ గెటప్పుల ప్రతిపాదన విరమించుకొని, ఆపద్ధర్మంగా దాసరి ఈ సినిమా టైటిల్స్‌పాట రాశారు. సినీటైటిల్స్‌తోనే ఓ పాట రావడం తెలుగులో అదే తొలిసారి. అప్పటికే ఎన్టీఆర్ దాదాపు 250 సినిమాల్లో నటించారు. అందులోని 34 టైటిల్స్ ఈ పాటలో ఉన్నాయి. అలా ఒక హీరోపై ఆయన సినీటైటిల్స్‌తోనే ఓ పాట రాసి, ఆయనపైనే చిత్రీకరించడం తెలుగులో ఇదొక్కసారే జరిగింది. తర్వాత ‘మరోచరిత్ర’ లాంటి సినిమాల్లో వేర్వేరు సినిమాల టైటిల్స్ తోనే పాటంతా రాయడమనే ధోరణి కొనసాగింది.
- రెంటాల జయదేవ
Comments
Please login to add a commentAdd a comment