శోభన్‌ ‘బాబు’ను చేసిన తాసిల్దారు గారి అమ్మాయి | Tahsildar Gari Ammayi completes 50 years | Sakshi
Sakshi News home page

శోభన్‌ ‘బాబు’ను చేసిన తాసిల్దారు గారి అమ్మాయి

Published Mon, Nov 15 2021 5:48 AM | Last Updated on Mon, Nov 15 2021 5:58 AM

Tahsildar Gari Ammayi completes 50 years - Sakshi

జమున, శోభన్‌బాబు, చంద్రకళ

‘అవకాశం వస్తే, మీ నాన్న గారి సినిమాల్లో ఏది రీమేక్‌ చేస్తారు?’

  ‘ప్రేమనగర్‌’ లాంటి సూపర్‌ హిట్లు తీసిన దర్శకుడు కె.ఎస్‌. ప్రకాశరావు గురించి, కమర్షియల్‌ విజయాలలో తండ్రిని మించిన తనయుడిగా ఎదిగిన దర్శకుడు కె. రాఘవేంద్రరావును కొన్నేళ్ళ క్రితం అడిగాం. దానికి, రాఘవేంద్రరావు ఊహకందని జవాబిచ్చారు. ‘‘ఏయన్నార్‌ నటించిన ‘ప్రేమనగర్‌’ (1971 సెప్టెంబర్‌ 24)ను ఇవాళ మారిన టెక్నాలజీతో బ్రహ్మాండంగా తీసే అవకాశం ఉన్నా... ఆ కథను మా నాన్న గారు తీసినదాని కన్నా గొప్పగా ఎవరూ తీయలేరు. గతంలో ఆ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని నేను, హీరో నాగార్జున, నిర్మాత రామానాయుడు గారు అనుకున్నా, మళ్ళీ వదిలేశాం. అయితే, నాన్న గారు తీసిన ‘తాసిల్దారు గారి అమ్మాయి’ చాలా మంచి స్క్రిప్టు. వీలుంటే, అది రీమేక్‌ చేయాలని ఉంది’’ – ఇదీ ‘అడవి రాముడు’ లాంటి అనేక ఇండస్ట్రీ హిట్స్‌ తీసిన రాఘవేంద్రుడి ‘సాక్షి’కి చెప్పిన మనసులో మాట. 

    తండ్రి కె.ఎస్‌. ప్రకాశరావు దర్శకత్వంలో, తనయుడు కె. రాఘవేంద్రరావు సహాయ దర్శకుడిగా పనిచేసిన అలనాటి శతదినోత్సవ చిత్రం ‘తాసిల్దారు గారి అమ్మాయి’ (రిలీజ్‌ 1971 నవంబర్‌ 12). ఆ చిత్రానికి ఇప్పుడు 50 వసంతాలు. ఇంతకీ, శోభన్‌బాబు వర్ధమాన నటుడిగా ఉన్న రోజుల్లో, జమున టైటిల్‌ రోల్‌ పోషించిన ‘తాసిల్దారు గారి అమ్మాయి’లో అంత ప్రత్యేకత ఏముంది? చరిత్ర తరచి చూస్తే – చాలానే ఉంది. 

    సోలో హీరోగా... కెరీర్‌కు కొత్త మలుపు! 

    శోభన్‌బాబు సినీరంగానికి వచ్చి అప్పటికి పుష్కరకాలం. చిన్న వేషాల నుంచి పెద్ద వేషాలు, కథానాయక పాత్రల దాకా ఆ పన్నెండేళ్ళలో 70కి పైగా సినిమాల్లో చేశారు. ఎన్టీఆర్, ఏయన్నార్‌ లాంటి స్టార్ల పక్కన, సమకాలీన హీరో కృష్ణతోనూ కలసి నటిస్తున్నారు. ‘వీరాభిమన్యు’ (1965), విడిగా ‘మనుషులు మారాలి’ (1969), ‘కల్యాణమంటపం’ (1971) లాంటి హిట్లొచ్చినా, సోలో హీరోగా నిలదొక్కుకోలేదు. అలాంటి పెద్ద బ్రేక్‌ కోసం ఈ అందగాడు నిరీక్షిస్తున్నారు. సరిగ్గా అప్పుడు శోభన్‌ కెరీర్‌లో 80వ సినిమాగా రిలీజైన ‘తాసిల్దారు గారి అమ్మాయి’తో ఆ నిరీక్షణ ఫలించింది. వెనక్కి తిరిగి చూసుకోకుండా, సింగిల్‌ హీరోగా నిలబెట్టేసింది. ‘తాసిల్దారు..’లో తండ్రి – కండక్టర్‌. కొడుకు – కలెక్టర్‌. తండ్రీకొడుకులుగా శోభన్‌ ద్విపాత్రధారణ ప్రజలకు నచ్చింది. చిత్ర విజయానికి కారణమైంది. ఒకేసారి తెరపై రెండు విభిన్న పాత్రల్ని సమర్థంగా చేయడం... నటుడిగా ఆయనలో ఆత్మవిశ్వాసం పెంచింది. జమున – చంద్రకళ హీరోయిన్లుగా మెప్పించారు. నాగభూషణం, రావికొండలరావు, సాక్షి రంగారావు, హాస్యపాత్రలో రాజబాబు అలరించారు.

    వయసు 34... పాత్ర 64...

    శోభన్‌ తన కెరీర్‌లో పలుమార్లు ద్విపాత్రాభినయం చేశారు. కానీ, ఆయన ద్విపాత్రాభినయానికీ, విభిన్న పాత్రపోషణకూ మొట్టమొదట గుర్తింపు తెచ్చింది ‘తాసిల్దారు...’ చిత్రమే! నిజానికి, అంతకు అయిదేళ్ళ ముందే కమెడియన్‌ పద్మనాభం నిర్మించిన ‘పొట్టి ప్లీడరు’ (1966)లో అన్నదమ్ములుగా తొలిసారి రెండు రోల్స్‌ పోషించారు శోభన్‌. కానీ, పెద్ద వయసు తండ్రి ప్రసాదరావుగా – కుర్రకారు కొడుకు వాసుగా రెండు భిన్న వయసు పాత్రలు... అదీ కథకు కీలకమైన కథానాయక పాత్రలు పూర్తిస్థాయిలో పోషించి, మెప్పించారీ చిత్రంలో! మనిషి తీరు, మాట, నడక – అన్నీ వేర్వేరైన ఆ పాత్రలను ఏకకాలంలో తెరపై రక్తికట్టించేందుకు శారీరకంగా, మానసికంగా చాలానే కష్టపడ్డారు. ముఖ్యంగా – తండ్రీ కొడుకులు పాత్రలు పరస్పరం సంభాషించుకొనే ఘట్టాలలో! ఒక రోజునైతే... ఒక పూటంతా శ్రమపడ్డా ఒక్క షాట్‌ కూడా ఓకే కాలేదు. ఇక ఆ రోజు చేయలేనని వెళ్ళిపోయి, రాత్రంతా రిహార్సల్‌ చేసుకున్నారు. మరునాడు వెళ్ళీ వెళ్ళడంతోనే ఫస్ట్‌ టేక్‌ ఓకే చేశారు. అదీ ఆయన పట్టుదల. అలా 34 ఏళ్ళ నిజజీవిత ప్రాయంలో చత్వారపు కళ్ళజోడు, చేతిలో కర్రతోడు ఉన్న అరవై ఏళ్ళు దాటిన ముసలి తండ్రి పాత్రలోనూ జనాన్ని మెప్పించారు. దటీజ్‌ శోభన్‌!

    కాలేజీ కలలరాణి సరసనే హీరోగా...

    కాలేజీ రోజుల నుంచి శోభన్‌ పిచ్చిగా ప్రేమించి, ఆరాధించి, అభిమానిగా జవాబు రాని ఉత్తరాలెన్నో రాసి, నిద్ర పట్టని కలలతో మద్రాసు వాహినీ స్టూడియోలో అష్టకష్టాలు పడి ‘ఇల్లరికం’ (1959) సెట్స్‌లో దగ్గర నుంచి చూసిన ఆనాటి స్టార్‌ హీరోయిన్‌ జమున. హృదయరాణి జమున సరసన జంటగా నటించాలని తపించిన ఆయనకు తొలిసారిగా ఆమెతో నటించే అదృష్టం వరించింది ‘తాసిల్దారు గారి అమ్మాయి’లోనే. నిర్మాతలు కొత్తవాళ్ళయినా, పేరున్న దర్శకుడు ప్రకాశరావు అడగడంతో వర్ధమాన హీరో శోభన్‌ పక్కన నటించేందుకు జమున కాదనలేకపోయారు. అలా తెరపై తొలిసారే ఆమెకు భర్తగా, కొడుకుగా రెండు పాత్రలు పోషించే అవకాశం శోభన్‌కు దక్కింది. 1971 మార్చి 15న మద్రాసు వాహినీ స్టూడియోలో ప్రసిద్ధ నిర్మాత బి. నాగిరెడ్డి క్లాప్‌ ఇవ్వగా, పంపిణీదారులు ‘లక్ష్మీఫిలిమ్స్‌’ అధినేత బి. శివరామయ్య కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, జమున మీద మొదటి షాట్‌తో చిత్రీకరణ మొదలైంది. సెట్స్‌లో మొదట ఒకటి రెండు సీన్లకు భయపడ్డా, జమున సహకారంతో శోభన్‌∙విజృంభించారు. భర్తను అనుమానించి, బంధానికి దూరంగా బతికిన భార్యగా, కష్టపడి కొడుకును ప్రయోజకుడిగా పెంచే తల్లిగా బరువైన మధుమతి పాత్రను జమున రక్తి కట్టించారు. జనం మెచ్చిన ఈ జంట అభినయంతో సినిమా దిగ్విజయం... సభలు– సమావేశాలు... శతదినోత్సవాలు. కానీ, మారిన సినిమా గ్లామర్, గ్రామర్‌తో ఆ తరువాత ఆరేళ్ళకు కానీ వారిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా (‘గడుసు పిల్లోడు’– 1977) రాకపోవడం విచిత్రం! శోభన్‌ – జమున కాంబినేషన్‌లో ఆఖరి సినిమా కూడా అదే!

    తండ్రి శిక్షణలో... రాటుదేలిన రాఘవేంద్రుడు!

    యాభై ఏళ్ళ క్రితం... ఈ సినిమా తీస్తున్ననాటికి... రాఘవేంద్రరావు ఇంకా దర్శకుడు కాలేదు. దర్శకులు పి. పుల్లయ్య, కమలాకర కామేశ్వరరావు, వి. మధుసూదనరావు లాంటి వారి వద్ద పనిచేసి, కన్నతండ్రి వద్ద ఆయన దర్శకత్వ పాఠాలు నేర్చుకుంటున్న రోజులవి. ఆ సమయంలో ‘తాసిల్దారు గారి అమ్మాయి’ సెట్స్‌లో కె.ఎస్‌. ప్రకాశరావు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బాధ్యతను కుమారుడికి అప్పగించి, తాను దూరంగా కుర్చీలో కూర్చొని పరిశీలిస్తూ, ప్రాక్టికల్‌ శిక్షణనిచ్చారు. అలా దర్శకుడు కాక ముందే రాఘవేంద్రరావు కొన్ని సీన్లకు దర్శకత్వ బాధ్యత వహించారీ చిత్రానికి. ఆ రకంగా ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ఓ మధుర జ్ఞాపకం. ఆ తరువాత సరిగ్గా ఆరేళ్ళలో అదే ‘సత్యచిత్ర’ పతాకంపై, అదే నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణలకు అగ్ర హీరో ఎన్టీఆర్‌తో ‘అడవి రాముడు’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ రూపొందించే స్థాయికి రాఘవేంద్రరావు ఎదగడం విశేషం. 
    ఆ మాటకొస్తే, ఇవాళ శతాధిక చిత్ర దర్శకుడైన ఆయనను అసలు డైరెక్టర్‌ని చేసిన తొలి చిత్రం ‘బాబు’ (1975)కు ఛాన్స్‌ ఇచ్చింది శోభన్‌బాబే! అప్పటికే నూటికి పైగా సినిమాల్లో నటించి, వరుస విజయాలతో స్టార్‌ హీరోగా వెలుగుతున్నారు శోభన్‌. కలవడానికి కూడా భయపడుతూ, తండ్రి ప్రకాశరావు ప్రోద్బలంతో వచ్చిన రాఘవేంద్రరావు భుజం తట్టి, తొలి చిత్రంలో నటించడానికి వెంటనే అంగీకరించిన పెద్దమనసు శోభన్‌బాబుది. అలా ఇన్నేళ్ళ దర్శకేంద్రుడి కెరీర్‌కు అప్పట్లో కొబ్బరికాయ కొట్టిన హీరో ఈ ఆంధ్రుల అందాల నటుడు. 

    రెండు నవలలు – రెండూ హిట్టే!

    ఒక వైపు ‘ప్రేమనగర్‌’, మరోవైపు ‘తాసిల్దారు గారి అమ్మాయి’ – రెండు చిత్రాలనూ ఏకకాలంలో, ఏకాగ్రతతో తీర్చిదిద్దారు దర్శకుడు కె.ఎస్‌. ప్రకాశరావు. రెండూ నవలా చిత్రాలే! రెండు నవలలూ ‘ఆంధ్రప్రభ’ వీక్లీలో హిట్‌ సీరియల్సే! మొదటిది – కోడూరి కౌసల్యాదేవి ‘ప్రేమనగర్‌’. రెండోది – కావిలిపాటి విజయలక్ష్మి ‘విధి విన్యాసాలు’. ‘కండక్టరు కొడుకు కలెక్టరవుతాడా?’ అనే ఆసక్తికరమైన ప్రశ్న ఉపశీర్షికగా ‘విధి విన్యాసాలు’ వారం వారం పాఠకులను పట్టువిడవకుండా చదివించింది. కమర్షియల్‌ ఎలిమెంట్లున్న ఆ నవల హక్కులు కొనుక్కొని, సినిమా తీద్దామని వచ్చారు నిర్మాతలు. దర్శకుడు ప్రకాశరావు వారికి అండగా నిలిచారు. వెండితెరకు కావాల్సిన పాత్రోచిత మార్పులతో స్క్రీన్‌ప్లే సిద్ధం చేశారు. అందుకు తోడ్పడ్డ నవలా – నాటక రచయిత ఎన్‌.ఆర్‌. నందిని మాటల రచయితగా పెట్టుకున్నారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో కండక్టర్‌ కొడుకైన హీరో చివరకు అసామాన్యుడైన కలెక్టర్‌గా ఎదిగి, తండ్రి ఆశ నెరవేర్చడమనే ఇతివృత్తం ఆ తరంలో చిగురిస్తున్న ఆశలకు తగ్గట్టు, మధ్యతరగతి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనుమానించి, అహంకారంతో అవమానించి, భర్తకు దూరమైన ఇల్లాలి జీవితం – చివరకు తన తప్పును తెలుసుకొన్న ‘తాసిల్దారు గారి అమ్మాయి’గా టైటిల్‌ రోల్‌లో జమున అభినయం మహిళా ప్రేక్షకులకు పట్టేసింది. వెరసి, సినిమా విజయవంతమైంది. భార్యాభర్తల మధ్య అపోహలు – అపార్థాలు, కన్నబిడ్డ పెరిగి పెద్దయ్యాక చాలా ఏళ్ళకు వారు తిరిగి కలుసుకోవడం అనే ఈ సెంటిమెంటల్‌ ఫ్యామిలీ కమర్షియల్‌ కథాంశం ఆ తరువాత మరిన్ని సినిమాలకు స్ఫూర్తినిచ్చింది.

    పాపులర్‌ పాటల అదే కాంబినేషన్‌!

    ‘ప్రేమనగర్‌’ కలిసొచ్చిన దర్శక – సంగీత దర్శక – గీత రచయితల త్రయమే (ప్రకాశరావు – కె.వి. మహదేవన్‌ – ఆత్రేయ) ‘తాసిల్దారు...’కీ పనిచేసింది. ‘ప్రేమనగర్‌’ రిలీజైన సరిగ్గా 50వ రోజున ‘తాసిల్దారు...’ జనం ముందుకు వచ్చింది. కలర్‌ సినిమాల హవా మొదలైపోయిన ఆ రోజుల్లో అన్ని రకాల కలర్‌ఫుల్‌ ‘ప్రేమనగర్‌’ సంగీతపరంగానూ అపూర్వ విజయం సాధించింది. ఏటికి ఎదురీది బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీసిన ‘తాసిల్దారు...’ అంత మ్యూజికల్‌ హిట్‌ కాలేదు. అయితేనేం, శతదినోత్సవ చిత్రమై, కొన్ని పాపులర్‌ పాటలను అందించింది. పెద్ద శోభన్‌బాబుపై వచ్చే ‘కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం...’ (గానం కె.బి.కె. మోహనరాజు) తాత్త్విక రీతిలో సాగుతూ, తరచూ రేడియోలో వినిపించేది. అలాగే, పెద్ద శోభన్‌బాబు – జమునలపై వచ్చే యుగళగీతం ‘నీకున్నది నేననీ – నాకున్నది నీవనీ...’ పాట ‘కలసిపోయాము ఈనాడు, కలసి ఉంటాము ఏనాడు’ అనే క్యాచీ లైన్‌తో ఇవాళ్టికీ ఆకర్షిస్తుంది. చిన్న శోభన్‌బాబు – చంద్రకళ జంటపై వచ్చే డ్యూయట్‌ ‘అల్లరి చేసే వయసుండాలి – ఆశలు రేపే మనసుండాలి...’ (గానం పి. సుశీల, జేవీ రాఘవులు) ఆనాటి కుర్రకారు పాట.  

    తొలి తెలుగు లేడీ ఆర్ట్‌ డైరెక్టర్‌తోనే..!
    
    సినీరంగంలో కెమేరా, కళ లాంటి కొన్ని శాఖల్లో ఆడవాళ్ళు ఇవాళ్టికీ చాలా అరుదు. అలాంటిది – 50 ఏళ్ళ క్రితమే ఓ తెలుగు మహిళ ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సినిమా ‘తాసిల్దారు గారి అమ్మాయి’. శ్రీమతి మోహన ఆ సినిమాకు కళా దర్శకురాలు. ఆమె కె.ఎస్‌. ప్రకాశరావుకు దూరపు బంధువు. మేనకోడలు వరుస. అంతేకాదు... తెలుగు సినీ చరిత్రలో తొలి లేడీ ఆర్ట్‌ డైరెక్టర్‌ కూడా ఆవిడే! మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డిప్లమో పట్టా సాధించిన మోహన తన విద్యార్థి దశలోనే సినిమాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌ కావడం చెప్పుకోదగ్గ విషయం. కె.ఎస్‌. ప్రకాశరావు రూపొందించిన ‘రేణుకాదేవి మహాత్మ్యం’ (1960)తో ఆమె కళాదర్శకురాలయ్యారు. ఆ తరువాత ప్రకాశరావు, జి. వరలక్ష్మిల తమిళ చిత్రం ‘హరిశ్చంద్ర’కూ, అలాగే మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన ‘చిన్నారిపాపలు’, ‘ప్రాప్తమ్‌’ (ఏయన్నార్‌ ‘మూగ మనసులు’కు తమిళ రీమేక్‌) చిత్రాలకూ కళాదర్శకురాలిగా పనిచేశారు. ఆ రోజుల్లో వివిధ మ్యాగజైన్లకు బొమ్మలు కూడా వేసిన మోహన, ప్రముఖ కమెడియన్‌ – మెజీషియన్‌ అయిన రమణారెడ్డికి మేజిక్‌ ప్రదర్శనల్లో సహాయకురాలిగానూ వ్యవహరించేవారు. తమిళ నటుడు టి.ఎస్‌. బాలయ్య కుమారుణ్ణి ఆమె వివాహమాడారు. దురదృష్టవశాత్తూ, చిన్న వయసులోనే అనారోగ్యంతో ఆమె కన్నుమూశారు. తొలి తెలుగు లేడీ ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రస్థానం అలా అర్ధంతరంగా ముగిసిపోయింది.

    ఉత్తమ నటుడిగా... తొలి గుర్తింపు!
    
    కలర్‌ సినిమాలు జోరందుకుంటున్న ఆ రోజుల్లో బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే చేసిన సాహసం ‘తాసిల్దారు..’. ఈ  సెంటిమెంటల్‌ కుటుంబ కథాచిత్రం అప్పట్లో 29 కేంద్రాల్లో రిలీజైంది. 5 (విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు) కేంద్రాల్లో డైరెక్టుగా, మరో కేంద్రం (హైదరాబాద్‌)లో షిఫ్టుతో – మొత్తం 6 కేంద్రాల్లో ఈ చిత్రం వంద రోజులు ఆడింది. విశేష మహిళాదరణతో విజయవాడ విజయా టాకీస్‌లో, గుంటూరు లిబర్టీలో, రాజమండ్రి వీరభద్ర పిక్చర్‌ ప్యాలెస్‌లో అత్యధికంగా 105 రోజులు ఆడింది. ఆరు కేంద్రాలలో వందరోజులు ఆడిన సందర్భంగా, రాజమండ్రిలోని నవభారతి గురుకులం ఆవరణలో 1972 ఫిబ్రవరి 19న చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం, పంపిణీదారులు, థియేటర్‌ యజమానుల మధ్య ఘనంగా శతదినోత్సవం జరిపారు. స్టార్‌ హీరో అక్కినేని ఆ సభకు అధ్యక్షుడిగా రావడం విశేషం.

    రివార్డులే కాదు అవార్డులూ ‘తాసిల్దారు గారి అమ్మాయి’కి దక్కాయి. ప్రసిద్ధ జాతీయ సినీ పత్రిక ‘ఫిల్మ్‌ఫేర్‌’ ఆ ఏడాది తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డుకు ఈ సినిమానే ఎంపిక చేసింది. అలాగే, ఈ చిత్రం అందాల నటుడు శోభన్‌బాబు అభినయానికీ గుర్తింపునిచ్చింది. అవార్డులు తెచ్చింది. ఫిలిమ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నుంచి ఉత్తమ నటుడిగా ఆయన అవార్డు అందుకున్నారు. బెస్ట్‌ యాక్టర్‌గా ఆయన అందుకున్న తొలి అవార్డు అదే. ఈ చిత్ర నిర్మాతలు ఆ తర్వాత అయిదేళ్ళకు మళ్ళీ శోభన్‌బాబుతోనే తమ ‘సత్యచిత్ర’ బ్యానర్‌పై, కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘ప్రేమబంధం’ (1976) అనే కలర్‌ సినిమా తీయడం గమనార్హం. 

    ముందు శోభన్‌బాబు... తర్వాత చిరంజీవి – నిజమైన ఆ జోస్యం!
    
    అప్పట్లో అక్కినేని, వర్ధమాన హీరో శోభన్‌బాబును మెచ్చుకుంటూ ‘హి ఈజ్‌ ఎ గుడ్‌ యాక్టర్‌. ఫ్యూచర్‌ హోప్‌ ఆఫ్‌ ది ఫిల్మ్‌ ఇండస్ట్రీ’ అన్నారు. ఆ జోస్యం ఫలించింది. ఒక్క 1971లోనే ఏకంగా 16 చిత్రాల్లో నటించిన శోభన్‌బాబుకు సోలో హీరోగా దశ తిరిగింది – ‘తాసిల్దారు...’తోనే. ఆ వెంటనే కె. విశ్వనాథ్‌ ‘చెల్లెలి కాపురం’ (1971), మరుసటేడు  ‘సంపూర్ణ రామాయణం’, ‘మానవుడు – దానవుడు’ – ఇలా వరుస హిట్లతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్‌ హీరో అయ్యారు. దశాబ్దిన్నర పైగా ఆ హోదాలో అలరించారు. ‘తాసిల్దారు...’ విడుదలైన సరిగ్గా పదేళ్ళకు... 1981లో లక్ష్మి – చిరంజీవి అక్కాతమ్ముళ్ళుగా ‘చట్టానికి కళ్ళు లేవు’ రిలీజైంది. హైదరాబాద్‌లో ఆ సినిమా హండ్రెడ్‌ డేస్‌ ఫంక్షన్‌. మద్రాసు నుంచి ముఖ్య అతిథిగా వచ్చిన శోభన్‌బాబు నోట యాదృచ్ఛికంగా సరిగ్గా పదేళ్ళ క్రితం అక్కినేని అన్న మాటే వచ్చింది. ‘ఫ్యూచర్‌ హోప్‌ ఆఫ్‌ ది ఫిల్మ్‌ ఇండస్ట్రీ చిరంజీవి’ అన్నారు ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు. శోభన్‌ మనస్ఫూర్తిగా అన్న ఆ మాటే నిజమైంది. వర్ధమాన నటుడు చిరంజీవిని సోలో హీరోగా ‘చట్టానికి కళ్ళు లేవు’ నిలబెట్టింది. ఆయన దశ తిరిగింది. బ్లాక్‌బస్టర్‌ ‘ఖైదీ’ (1983) మీదుగా ఆయన మెగాస్టార్‌ దాకా ఎదిగారు. సినిమా చరిత్రలో ఊహకందని ‘విధి విన్యాసాలు’ అలానే ఉంటాయి మరి!

– రెంటాల జయదేవ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement