ప్రేమాభిషేకం: అక్కినేని ప్రేమకు... దాసరి పట్టాభిషేకం | Premabhishekam Movie Completes 40 years In Telugu Film Industry | Sakshi
Sakshi News home page

అక్కినేని ప్రేమకు... దాసరి పట్టాభిషేకం

Published Thu, Feb 18 2021 12:29 AM | Last Updated on Thu, Feb 18 2021 12:42 PM

Premabhishekam Movie Completes 40 years In Telugu Film Industry - Sakshi

ప్రేమకథలు... అందులోనూ భగ్న ప్రేమకథలు... తెరపై ఎప్పుడూ హిట్‌ ఫార్ములా! ఆ ఫార్ములాతో అక్కినేని, దాసరి కాంబినేషన్‌ తెలుగు సినీ చరిత్రలో సృష్టించిన అపూర్వ వాణిజ్య విజయం ‘ప్రేమాభిషేకం’. సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం 1981 ఫిబ్రవరి 18న రిలీజైన సినిమా అది. కానీ ఇవాళ్టికీ ఆ పాటలు, మాటలు – ఇలా అన్నీ సినీ ప్రియులకు గుర్తే! ‘ప్రేమకు అర్థం– త్యాగ’మనే మరువలేని అంశాన్ని మరపురాని రీతిలో చెప్పిన ‘ప్రేమాభిషేకం’... అజరామర ప్రేమకు వెండితెర పట్టాభిషేకం!

అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణా స్టూడియోస్‌(1976 జనవరి 14) స్థాపించి, అప్పటికి నాలుగేళ్ళవుతోంది. స్టూడియో పేరుపై ఆయన ‘రామకృష్ణు్ణలు’ (జగపతి రాజేంద్రప్రసాద్‌తో కలసి –1978), ‘కళ్యాణి’ (’79), ‘పిల్ల జమీందార్‌’ (’80) తీశారు. అదే కాలంలో ఎ.ఎ. కంబైన్స్‌ బ్యానర్‌పై ‘మంచి మనసు’ (’78), ‘బుచ్చిబాబు’ (’80) నిర్మించారు. ఇవన్నీ స్టూడియో మొదలెట్టాక, అక్కినేని సమర్పించిన చిత్రాలే. కానీ, ఏవీ అనుకున్నంత సక్సెస్‌ ఇవ్వలేదు. మరోపక్క ఖర్చులతో స్టూడియో కష్టనష్టాలూ ఎక్కువగానే ఉన్నాయి.

కాశ్మీర్‌లో పుట్టిన కథ!
సరిగ్గా అప్పుడే... అక్కినేని వీరాభిమాని, అన్నపూర్ణా స్టూడియోస్‌కు ‘కళ్యాణి’, ‘బుచ్చిబాబు’ తీసిన పాపులర్‌ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు తన అభిమాన హీరోతో కాశ్మీర్‌లో ‘శ్రీవారి ముచ్చట్లు’ చిత్రీకరిస్తున్నారు. ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ (’78)తో మొదలుపెట్టి అక్కినేనితో దాసరికి అది 5వ సినిమా. ఓ రోజు కాశ్మీర్‌ డాల్‌ లేక్‌లో షూటింగ్‌ ముగించుకొని, పడవలో వస్తుండగా దాసరి మనసులో ఏవో ఆలోచనలు. అవన్నీ ఓ కొలిక్కి వచ్చి, ‘ప్రేమాభిషేకం’ కథాంశం మనసులో రూపుదిద్దుకుంది. ఓ అమ్మాయి ప్రేమ కోసం పరితపించే హీరో. కష్టపడి ఆ అమ్మాయి ప్రేమ గెలుస్తాడు. తీరా ఆమె ఓకే అన్నాక, ఊహించని పరిస్థితులు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఆమె క్షేమం, సౌభాగ్యం కోసం హీరో తన నుంచి దూరం పెట్టి ప్రేమను త్యాగం చేస్తే? ఈ కథాంశం చెప్పగానే అక్కినేని డబుల్‌ ఓకే. సొంత స్టూడియో బ్యానర్‌ మీదే తీద్దామన్నారు. అలా అక్కినేని సొంత చిత్రంగా, కుమారులు వెంకట్, నాగార్జున నిర్మాతలుగా ‘ప్రేమాభిషేకం’ పట్టాలెక్కింది.

ఆగిన షూటింగ్‌! అన్నపూర్ణ మధ్యవర్తిత్వం!!
మొదటి నుంచి ఈ కథపై దాసరికి గట్టి నమ్మకం. తీరా షూటింగ్‌ చేస్తున్నప్పుడు అక్కినేనికి ఓ డౌట్‌ వచ్చింది. పెళ్ళిచూపుల్లో నటి కవితలో శ్రీదేవిని ఊహించుకొని, పెళ్ళికి ఓకే చెప్పి వస్తాడు హీరో. తీరా తరువాత కవిత పూలబొకేతో ఎదురైతే, ‘నువ్వెవరో నాకు తెలీదు, నిన్ను చూసి ఓకే చెప్పలేదు’ అంటాడు. ముందు ఓకే అన్నా, ఆ సీన్‌ తీస్తున్నప్పుడు తన లేడీస్‌ ఫాలోయింగ్‌ ఇమేజ్‌కు అది భంగం కలిగిస్తుందని అక్కినేని అనుమానించారు. ఆ సీను మార్చాల్సిందే అన్నారు. దాసరితో వాదించారు. కానీ, కథానుసారం ఇంటర్వెల్‌ వద్ద కథను కీలకమైన మలుపు తిప్పే సీనుకు ఈ సీనే లింకు అంటూ దాసరి పట్టుబట్టారు. వ్యవహారం ముదిరి ఒకరోజు షూటింగ్‌ ఆగింది. అక్కినేని, దాసరి – ఇద్దరూ భీష్మించుకున్న పరిస్థితుల్లో చివరకు అక్కినేని శ్రీమతి అన్నపూర్ణ కలగజేసుకొని, మధ్యవర్తిత్వం వహించారు. చివరకు దాసరి ‘‘ఆ సీనులో సారం చెడిపోకుండా, ఒకటి రెండు సవరణలు చేసి, అక్కినేనిని ఒప్పించా’’రు. అద్భుతంగా తీసి, మెప్పించారు.

ఆ దేవదాసు పాత్రలే... మళ్ళీ!
గమనిస్తే ఒకప్పటి దేవదాసు, పార్వతి, చంద్రముఖులే ఈ ‘ప్రేమాభిషేకం’లో అక్కినేని, శ్రీదేవి, జయసుధలు వేసిన పాత్రలు. పార్వతి ప్రేమ కన్నా చంద్రముఖి ప్రేమ గొప్పదనే చర్చ ఈ చిత్రంలోని శ్రీదేవి, జయసుధల పాత్ర ద్వారా చెలరేగింది. సూపర్‌ హిట్స్‌ ‘దేవదాసు’, ‘ప్రేమ్‌నగర్‌’ కథలను కలగలిపి, కొత్తగా వండి వడ్డించారు దాసరి. అయితే, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వంలో దాసరి బహుముఖ ప్రజ్ఞ ఓ సంచలనం.  

ఆ పాటలకు వందనం... అభివందనం!
చక్రవర్తి సంగీతంలో ‘దేవీ మౌనమా’, ‘కోటప్పకొండకు’, ‘తారలు దిగివచ్చిన’, ‘నా కళ్ళు చెబుతున్నాయి’, ‘ఒక దేవుడి గుడిలో’, ‘వందనం’, ‘ఆగదూ’– ఇలా దాసరి రాసిన అన్ని పాటలూ ఆల్‌టైమ్‌ హిట్‌. ఎస్పీబీకి సింగర్‌గా నంది అవార్డూ వచ్చింది. నిజానికి, ‘వందనం...’ పాట స్థానంలో దాసరి మొదట ‘జీవితాన్ని చూడు రంగు రంగుల అద్దంలో’ అనే పాట రాశారు. పాట ఇంకా బాగుండాలన్నారు అక్కినేని. అప్పుడు చేసిన కొత్త పాట ‘వందనం’ అయితే, ఆడియోలో మాత్రం ‘జీవితాన్ని చూడు’ పాట కూడా రిలీజ్‌ చేశారు. సినిమాలో లేకపోయినా, ఆ పాటా ఆ రోజుల్లో తెగ వినపడింది. 57వ ఏట ‘ప్రేమాభిషేకం’తో అంత పెద్ద సక్సెస్‌ రావడం అక్కినేనికి అన్ని విధాలా తృప్తినిచ్చింది. ‘‘ఈ క్రెడిట్‌ అంతా దాసరిదే. చక్రవర్తి సంగీతానిదీ మేజర్‌ కంట్రిబ్యూషన్‌’’ అని అక్కినేని తరచూ చెబుతుండేవారు.  

మరపురాని డైలాగ్‌ డ్రామా!
నిజం చెప్పాలంటే – సీన్ల రూపకల్పనలో, డైలాగ్‌ డ్రామాలో దాసరి ప్రతిభకు ‘ప్రేమాభిషేకం’ ఓ మచ్చుతునక. ‘‘ఈ లోకంలో అందరికీ తెలుసు’’ అంటూ హీరోయిన్‌కు తన మీద అసహ్యం కలిగించడం కోసం హీరో డైలాగులు చెప్పే సీన్, శ్రీదేవి– జయసుధ– అక్కినేనివ మధ్య మాటల యుద్ధం సీను లాంటివి సినిమాను వేరే స్థాయిలో నిలిపాయి. ఆ డైలాగుల్ని జనం అందరూ తెగ చెప్పుకున్నారు. హీరో మరణించినా, మరణం లేని ప్రేమను తెరపై పదే పదే చూస్తూ, రిపీట్‌ ఆడియన్స్‌ కాసుల వర్షం కురిపించారు.

పాత్ర చిన్నదే... ఆమె అభినయం పెద్దది!
మొదట ఈ సినిమాలో వేశ్య పాత్ర ఎవరితో వేయించాలనే చర్చ జరిగింది. ఒక దశలో నటి లక్ష్మి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అప్పటికే టాప్‌ హీరోయినైన జయసుధ అయితేనో అన్నారు దాసరి. కానీ ‘కేవలం 2పాటలు, 6 సీన్లే ఉన్న పది రోజుల్లోపు పాత్రను, అదీ వేశ్య పాత్రను ఆమె ఒప్పుకుంటుందా’ అన్నది అక్కినేని అనుమానం. ఇంతలో ‘ప్రేమాభిషేకం’లో ఓ చిన్నపాత్రకు తనను అనుకుంటున్నారని జయసుధ దాకా వెళ్ళింది. ‘ఆ పాత్ర నేనే చేయాలని దాసరి అనుకుంటే, అది వేశ్య పాత్ర అయినా సరే చేస్తా’ అని జయసుధ యథాలాపంగా అనేశారు. తీరా అది వేశ్య పాత్రే!

‘ఏ–బి–సి–డి అండ్‌ జె’ హిట్‌ కాంబినేషన్‌!
అప్పట్లో ‘అక్కినేని – బాలు – చక్రవర్తి – దాసరి అండ్‌ జయసుధ’ల కాంబినేషన్‌ వరుస హిట్లు అందించింది. విజయవాడలో ఈ చిత్ర విజయోత్సవంలో వీళ్ళను ‘ఏ–బి–సి–డి అండ్‌ జె’ హిట్‌ కాంబినేషన్‌ అని జర్నలిస్టులు ప్రస్తావించారు. చాలాకాలం ఫ్యాన్స్‌లో, ట్రేడ్‌లో ఆ పదం పాపులరైంది.

బాక్సాఫీస్‌ చరిత్రలో... సువర్ణాధ్యాయం
‘ప్రేమాభిషేకం’ తెలుగు సినీ బాక్సాఫీస్‌ చరిత్రలో కొన్ని అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. రిలీజుకు ముందు మంచి రేటొచ్చినా, దాసరి సలహా మేరకు హక్కులు అమ్మలేదు అక్కినేని. నెల్లూరు, సీడెడ్‌ ప్రాంతాల హక్కులు మాత్రం అమ్మి, మిగతాచోట్ల సొంత అన్నపూర్ణా ఫిలిమ్స్‌ ద్వారా రిలీజ్‌ చేశారు. 31 కేంద్రాలలో రిలీజైన చిత్రం (గూడూరులో 32 రోజులకు తీసేయగా, 28 కేంద్రాల్లో డైరెక్ట్‌గా, ఒక కేంద్రంలో షిఫ్టుతో, మరో కేంద్రంలో నూన్‌షోలతో) మొత్తం 30 కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం చేసుకుంది. అలాగే, 24 కేంద్రాల్లో డైరెక్టుగా, 2 కేంద్రాల్లో షిప్టుతో, 4 కేంద్రాలు సికింద్రాబాద్, ఖమ్మం, గుడివాడ, ఆదోనిల్లో నూన్‌షోలతో మొత్తం 30 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. 16 కేంద్రాల్లో డైరెక్ట్‌గా, 3 కేంద్రాల్లో షిఫ్టుతో, 10 కేంద్రాల్లో నూన్‌ షోలతో మొత్తం 29 కేంద్రాల్లో సిల్వర్‌ జూబ్లీ (25 వారాలు) ఆడింది.

తెలుగులో తొలిసారిగా గుంటూరు విజయా టాకీస్‌లో నేరుగా 365 రోజులు ప్రదర్శితమై, ‘ప్రేమాభిషేకం’ కొత్త రికార్డ్‌ సృష్టించింది. ఆ హాలులో 380 రోజుల ప్రదర్శన చేసుకుంది. గుంటూరు కాక, మరో 3 కేంద్రాల్లో షిఫ్టులతో, 4 కేంద్రాలలో నూన్‌ షోలతో – మొత్తం 8 కేంద్రాల్లో ఈ విషాద ప్రేమకథ గోల్డెన్‌ జూబ్లీ (50 వారాలు) ఆడింది. అటు పైన 5 కేంద్రాల్లో డైమండ్‌ జూబ్లీ (60 వీక్స్‌) నడిచింది. తర్వాత విజయవాడ, హైదరాబాద్‌లలో షిఫ్టులు, నూన్‌షోలతో కలిపి, ఏకంగా 527 రోజులు ప్రదర్శితమై, అప్పటి ఉమ్మడి ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్లాటినమ్‌ జూబ్లీ (75 వీక్స్‌) ఆడిన తొలిచిత్రం’గా రికార్డు సృష్టించింది.

అక్కడ ‘మరో చరిత్ర’... ఇక్కడ ‘ప్రేమాభిషేకం’
నిజానికి, ‘ప్రేమాభిషేకం’ కన్నా ముందే 1978లో కమలహాసన్‌ – కె. బాలచందర్‌ల నేరు తెలుగు చిత్రం ‘మరో చరిత్ర’ తమిళనాట మద్రాసులో ప్లాటినమ్‌ జూబ్లీ చేసుకొంది. అక్కడి సఫైర్‌ థియేటర్‌లో నూన్‌షోలతో ఏకధాటిగా 596 రోజులు ఆడి, ‘ప్లాటినమ్‌ జూబ్లీ జరుపుకొన్న తొలి తెలుగు చిత్రం’గా నిలిచింది. అలా మద్రాసులో ‘మరో చరిత్ర’, మన తెలుగునాట ‘ప్రేమాభిషేకం’ తొలి తెలుగు ప్లాటినమ్‌ జూబ్లీ చిత్రాలయ్యాయి. కానీ, విచిత్రంగా ఇక్కడి పబ్లిసిటీలో మాత్రం ‘ప్రేమాభిషేకం’ చిత్రాన్ని ‘తెలుగులోనే తొలి ప్లాటినమ్‌ జూబ్లీ చిత్రం’గా ప్రకటించుకున్నారు.

ఇంకా గమ్మత్తేమిటంటే, దీని తరువాత ప్లాటినమ్‌ జూబ్లీ (525 రోజులు) రికార్డు దగ్గర దాకా వచ్చిన ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ (1982లో– హైదరాబాద్‌లో 517 రోజులకు), ‘సాగర సంగమం’ (1983లో– బెంగుళూరులో 511 రోజులకు) ఎందుకో అర్ధంతరంగా హాళ్ళ నుంచి అదృశ్యమయ్యాయి. దాని వెనుక ‘ప్రేమాభిషేకం’ పెద్దల మంత్రాంగం ఉందని అప్పట్లో ట్రేడ్‌ వర్గాల టాక్‌. చివరకు 1984లో ‘మంగమ్మ గారి మనవడు’ (హైద్రాబాద్‌లో–565 రోజులు) ఆడి ప్లాటినమ్‌ జూబ్లీ చిత్రాల లిస్టుకెక్కింది.

రన్‌లోనూ... కలెక్షన్లలోనూ... కోస్తా ఆంధ్రలో కొత్త రికార్డ్‌!
ఏది ఏమైనా, ‘ప్రేమాభిషేకం’ మాత్రం బాక్సాఫీస్‌ వద్ద ఓ కొత్త చరిత్ర అయింది. లేట్‌ రన్‌లోనూ మరో 50 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం చేసుకుంది. మరో 11 కేంద్రాలలో (డైరెక్టుగా – మదనపల్లి, తుని, చిలకలూరిపేట, బెంగుళూరు, మద్రాసుల్లో, నూన్‌షోలతో – శ్రీకాళహస్తి (తొలి శతదినోత్సవం), నంద్యాల, హిందూపురం, నరసరావుపేట, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో) వంద రోజులాడింది. లేట్‌ రిలీజులోనే బెంగుళూరులో నూన్‌ షోలతో 365 రోజులకు పైగా ప్రదర్శితమైంది. మొత్తం 41 శతదినోత్సవ కేంద్రాలకు గాను 14 కేంద్రాల్లో అక్కినేని చిత్రాలలో ఏకైక  శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. ‘భార్యాభర్తలు’ (1961) తరువాత మళ్ళీ రెండు దశాబ్దాలకు బెంగుళూరులో అక్కినేనికి ఓ శతదినోత్సవాన్ని అందించింది.

ఆ రోజుల్లో ‘ప్రేమాభిషేకం’ కోస్తా ఆంధ్రలోని ప్రధాన కేంద్రాలలో అటు ఆడిన రోజుల్లోనూ, ఇటు వసూళ్ళలోనూ కొత్త రికార్డులు సృష్టించింది. అలా విజయవాడ, గుడివాడ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, ఏలూరు, తణుకు, తుని, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర కేంద్రాల్లో రన్‌లోనూ, కలెక్షన్లలోనూ అప్పటికి ‘ప్రేమాభిషేకం’దే సరికొత్త రికార్డ్‌. అలా తన అభిమాన హీరో అక్కినేనికి దాసరి ఇచ్చిన అపురూప కానుక ఇది.

ఊరూవాడా... ఎన్నెన్నో విజయోత్సవాలు
ఇన్ని విజయాలు సాధించిన ‘ప్రేమాభిషేకం’కి ఉత్సవాలు చాలా జరిగాయి. విజయవాడలో శతదినోత్సవం, హైదరాబాద్‌ అన్నపూర్ణా స్టూడియోలో సిల్వర్‌జూబ్లీ, నెల్లూరులో త్రిశతదినోత్సవం, ఆ తరువాత మద్రాసులో స్వర్ణోత్సవం నిర్వహించారు. ఇక, ఊరూవాడా ఫ్యాన్స్‌ చేసిన వేడుకలకైతే అంతే లేదు. అలా అక్కినేని కెరీర్‌కు కిరీటమైందీ చిత్రం.

ఫస్ట్‌ రిలీజైన నాలుగున్నరేళ్ళ తరువాత 1985 సెప్టెంబర్‌ 20న అక్కినేని బర్త్‌డేకి భారీ పబ్లిసిటీతో, రాష్ట్రమంతటా ‘ప్రేమాభిషేకా’న్ని సెకండ్‌ రిలీజ్‌ చేశారు. అయితే, రిపీట్‌ రన్లలో అక్కినేని చిత్రాలలో ఎప్పుడూ ముందుండే ‘ప్రేమ్‌నగర్‌’ లాగా ‘ప్రేమాభిషేకం’ ఆశించిన ఆదరణ పొందలేదు. కానీ అదే ‘ప్రేమాభిషేకం’ మరో పదేళ్ళకు 1995లో ఏ హడావిడీ, అంచనాలూ లేకుండా తెలుగునాట అంచెలంచెలుగా రీ–రిలీజైనప్పుడు మంచి వసూళ్ళు తేవడం విశేషం. అందుకే, ‘ప్రేమాభిషేకం’ జనంలోనూ, బాక్సాఫీస్‌ జయంలోనూ అసలైన ప్రేమకు జరిగిన అపురూప పట్టాభిషేకం.     

వరుసగా మూడేళ్ళూ... ఆమెకే అవార్డ్‌!
నిడివి చిన్నదైనా, ‘ప్రేమాభిషేకం’లో వేశ్యగా జయసుధదే కీలకపాత్ర అయింది. అందులోనూ గ్లామర్‌ నటి శ్రీదేవి ఎదుట ఏ మేకప్పూ లేకుండా ఆమె చూపిన సహజమైన నటన సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించింది. ఆ ఏడాది ఉత్తమ నటిగా నంది అవార్డూ జయసుధకే దక్కింది. ‘ప్రేమాభిషేకం’తో మొదలుపెట్టి వరుసగా మూడేళ్ళు (‘ప్రేమాభిషేకం–1981, మేఘసందేశం–1982, ధర్మాత్ముడు–1983’) ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకొని, జయసుధ హ్యాట్రిక్‌ సాధించారు. దర్శకుడు కె. విశ్వనాథ్‌ (ఉత్తమ చిత్రాలు ‘చెల్లెలి కాపురం–1971, కాలం మారింది – 1972, శారద–1973’) తర్వాత అలాంటి హ్యాట్రిక్‌ మళ్ళీ జయసుధకే సాధ్యమైంది.

అక్కినేని, జయసుధ

చిత్రం... భళారే విచిత్రం!
గమ్మత్తేమిటంటే, 1980లో అక్కినేని పుట్టినరోజైన సెప్టెంబర్‌ 20న ‘ప్రేమాభిషేకం’ షూటింగ్‌ మొదలైంది. హైదరాబాద్, చెన్నైలలో 32 షూటింగ్‌ డేస్‌లో పూర్తయింది. 1981లో సరిగ్గా అక్కినేని పెళ్ళిరోజైన ఫిబ్రవరి 18న రిలీజైంది. గమ్మత్తుగా ఎన్టీఆర్‌ పుట్టినరోజైన మే 28కి వంద రోజులు పూర్తి చేసుకుంది. అదే రోజున ఎన్టీఆర్, ఏయన్నార్ల కాంబినేషన్‌లో ఆఖరి చిత్రం ‘సత్యం – శివం’ రిలీజైంది.

ఆ భాషల్లో మాత్రం వట్టి రీ ‘మేకు’!
గమ్మత్తేమిటంటే, తెలుగులో ఇంత పెద్ద కమర్షియల్‌ సక్సెస్‌ అయిన ఈ కథ ఇతర భాషల్లో రీమేక్‌ అయినప్పుడు ఆశించినంత ఆడలేదు. తమిళంలో ఈ కథను ‘వాళ్వే మాయమ్‌’ (1982)గా కమలహాసన్‌తో రీమేక్‌ చేశారు. ఆ తమిళ చిత్రాన్నే మలయాళంలో ‘ప్రేమాభిషేకం’ పేరుతోనే డబ్‌ కూడా చేసి, రిలీజ్‌ చేశారు. ఇక హిందీలో సాక్షాత్తూ దాసరి దర్శకత్వంలోనే జితేంద్ర, రీనారాయ్, రేఖ నటించగా ‘ప్రేమ్‌ తపస్యా’ (1983) పేరుతో అక్కినేనే నిర్మించారు. కానీ, అవేవీ ఆదరణకు నోచుకోలేదు. కమలహాసనైతే అక్కినేనిలా తాను చేయలేకపోయానని బాహాటంగా చెప్పేశారు.

కోటి అంటే... కోటిన్నర!
ప్రేయసి బాగు కోసం తన ప్రేమనే త్యాగం చేసే క్యాన్సర్‌ పేషెంట్‌ హీరో కథకు జనం బ్రహ్మరథం పట్టారు. ‘‘ఈ సినిమా కథ చెప్పినప్పుడే ‘నన్ను నమ్మండి. మీకు మాట ఇస్తున్నా. ఇది బాక్సాఫీస్‌ వద్ద కోటి రూపాయలు వసూలు చేసే కథ అవుతుంది’ అని నాతో దాసరి అన్నారు. దాసరి అన్నమాట నిలబెట్టడమే కాక, అంతకు మించి ‘ప్రేమాభిషేకం’ కోటీ 30 లక్షలు వసూలు చేసింది’’ అని మద్రాసులో గోల్డెన్‌ జూబ్లీ ఫంక్షన్‌లో అక్కినేని సభాముఖంగా చెప్పారు. అటుపైనా ఆ సినిమా అప్రతిహతంగా ఆడి, ఏకంగా 75 వారాల ప్లాటినమ్‌ జూబ్లీ చేసుకుంది. చివరకు కోటిన్నర దాకా వసూలు చేసింది. అక్కినేని కెరీర్‌లో తొలి రూ. కోటి వసూలు చిత్రం ఇదే! ఆయన కెరీర్‌లో రెండో గోల్డెన్‌ జూబ్లీ చిత్రం (మొదటిది ‘దసరా బుల్లోడు’) కూడా ఇదే!! ఇంతటి బాక్సాఫీస్‌ విజయంతో, ‘ప్రేమాభిషేకం’ అప్పట్లో అన్నపూర్ణా స్టూడియోస్‌ను బాలారిష్టాల నుంచి బయటపడేసింది.


- రెంటాల జయదేవ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement