best movie
-
బయటపడ్డ బహిరంగ రహస్యం
ప్రపంచమంతా మలయాళ సినిమాలను పొగుడుతూ, తాజా జాతీయ అవార్డుల్లోనూ దేశమంతటిలోకీ ఉత్తమ సినిమాగా మలయాళ చిత్రమే నిలిచిన పరిస్థితుల్లో... ఆ పరిశ్రమలో పైకి కనిపిస్తున్న మంచితో పాటు కనిపించని దుర్లక్షణాలూ అనేకం ఉన్నాయని బహిర్గతమైంది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై కేరళ ప్రభుత్వం 2017 జూలైలో వేసిన హేమ కమిటీ నివేదిక బయటకు రావడంతో తేనెతుట్టె కదిలింది. నాలుగేళ్ళ పైచిలుకుగా కేరళ ప్రభుత్వం గుట్టుగానే అట్టి పెట్టిన ఈ నివేదిక న్యాయస్థానంలో, రాష్ట్ర సమాచార కమిషన్‌లో అనేక పోరాటాల అనంతరం సోమవారం బాహ్యప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. సున్నిత సమాచారం, వ్యక్తుల వివరాల పేజీలను మినహాయించి బయటకొచ్చిన మిగతా నివేదిక అంశాలపై దేశవ్యాప్త చర్చ రేగుతోంది. ఏడెనిమిదేళ్ళ క్రితమే అంతర్జాతీయంగా ‘మీ టూ’ ఉద్యమం, ఆపైన భారత సినీరంగంలోనూ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదాలు, ఆడవాళ్ళు పని కావాలంటే లైంగిక లబ్ధి కలిగించేలా ‘కమిట్మెంట్’ ఇచ్చి, ‘కాంప్రమైజ్’ కావాల్సి వస్తోందనే ఆరోపణలు చూశాం. అయినా సరే... మలయాళ నటులు, పరిశ్రమ నిపుణుల్ని పలువురిని ఇంటర్వ్యూ చేసి హేమ కమిటీ వెల్లడించిన అంశాలు నివ్వెర పరుస్తున్నాయి. సెట్లో స్త్రీలపై లైంగిక వేధింపులు, తాగివచ్చి వారు బస చేసిన గది తలుపులు కొట్టడాలు, 10–15 మంది శక్తిమంతమైన లాబీ గుప్పెట్లో మలయాళ చిత్రసీమ లాంటి సంగతులను కమిటీ కుండబద్దలు కొట్టింది. కోల్‌కతాలో విధినిర్వహణలో డాక్టర్‌పై హత్యాచార ఘటనతో అట్టుడుకుతున్న దేశంలో సినీరంగ స్త్రీల పరిస్థితీ ఏమంత భిన్నంగా లేదని తేలిపోయింది.అత్యంత సంచలన అంశాలేమీ బయటపెట్టకుండా కమిటీ పెద్దమనిషి తరహాలో నివేదికను ఇచ్చిందనే అధిక్షేపణలూ లేకపోలేదు. ఆ మాటెలా ఉన్నా పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణుల్ని బయటపెట్టి, ప్రజాక్షేత్రంలో వాటిపై చర్చ లేవనెత్తడంలో విజయం సాధించింది. స్టెనోగ్రాఫర్ కానీ, కనీస ఇతర సౌకర్యాలు కానీ లేకున్నా సరే, అనేక అవరోధాలను అధిగమించి మరీ ఈ కమిటీ 233 పేజీల నివేదిక సిద్ధం చేసింది. నివేదికలో బలాబలాలు ఏమైనప్పటికీ, సినీసీమలోని చీకటి కోణంపై దర్యాప్తు జరిపి ఇలాంటి నివేదిక ఒకటి వెలువడడం దేశంలో ఇదే తొలిసారి. నిజానికి, అనివార్య పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఈ సంఘాన్ని వేయాల్సి వచ్చింది. ఓ ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి, హీరో దిలీప్ కదులుతున్న కారులో జరిపిన లైంగిక అత్యాచారంతో 2017 ఫిబ్రవరిలో మలయాళ చిత్రసీమ అట్టుడికింది. రాష్ట్రమంతా నిరసనలు, ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ బృందం డిమాండ్ల మేరకు కేరళ సర్కార్ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి కె. హేమ సారథ్యంలో త్రిసభ్య సంఘం వేయక తప్పలేదు. తెలుగు టి శారద కూడా అందులో మెంబరే! ఆ కమిటీ 2019 డిసెంబర్ 31కే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఉద్యమకారులు పదే పదే అభ్యర్థించినా, సినిమావాళ్ళ ప్రైవసీకి భంగమంటూ సర్కార్ ఇన్నేళ్ళుగా ఆ నివేదికను తొక్కిపెట్టింది. అదేమంటే, అది న్యాయవిచారణ సంఘం కాదు గనక నివేదిక బయటపెట్టాల్సిన బాధ్యత లేదు పొమ్మంది. నివేదిక విడుదలను ఆపాలన్న ఓ నటి అభ్యర్థనను సైతం హైకోర్ట్ తాజాగా తోసిపుచ్చడంతో... చివరకు నివేదిక బహిర్గతమైంది. తళుకుబెళుకుల సినీరంగానికి అంచున... సహజంగానే అనేక బలహీనతల నీలి నీడలు పరుచుకొని ఉంటాయని ప్రపంచానికి తెలుసు. అది ఒక్క మలయాళ సినీసీమకే పరిమితం కాదు. అందం, ఆనందం, ఆర్థిక ప్రయోజనం, పదుగురిలో పాపులారిటీ, పలుకుబడి పోగుబడినందున అన్ని భాషల సినీ రంగాల్లోనూ ఉన్నదే! కాకపోతే, తొందరపడి ఎవరూ బాహాటంగా ప్రస్తావించని చేదు నిజమది. లైంగిక వేధింపులు సహా ఆవేదన కలిగించే అనుభవాలు అనేకమున్నా, ఆడవాళ్ళు ఆ మాట బయటకు చెప్పరు. చెబితే పరిశ్రమలో అప్రకటిత నిషేధం సహా ఇంకా అనేక ఇతర వేధింపులు తప్పని దుఃస్థితి. ఆది నుంచి ఈ రుగ్మతలు ఉన్నవే. ‘సినీరంగంలో స్త్రీలు నిత్యం ఎదుర్కొంటున్న భూతం లైంగిక వేధింపులు’ అని కమిటీ తెగేసి చెప్పడంతో మేడిపండు పగిలింది. మన యావత్ భారతీయ సినీ రంగానికి ఇది ఒక మేలుకొలుపు. అన్ని భాషల్లోనూ కలల వ్యాపారంలో కొనసాగుతున్న పితృస్వామ్య భావజాలం, లైంగిక దుర్విచక్షణ, వేతన వ్యత్యాసాలు సహా అనేక అవలక్షణాలపై మనకు చెంపపెట్టు. చిత్రం ఏమిటంటే, ప్రైవేట్ పరిశ్రమల్లో పని పరిస్థితులకు సైతం ప్రభుత్వ షరతులు, చట్టాలు వర్తిస్తాయి. ఎప్పుడో సినీరంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించినట్టు కేంద్ర సర్కార్ ప్రకటించినా దాని వల్ల ఒనగూడిన ప్రయోజనాలేవో అర్థం కాదు. కళ, వ్యాపారపు కల కలగలిసిన సృజనశీల పరిశ్రమకు చట్టాలు చేయడం అంత సులభం కాకపోవచ్చు. కానీ, మగవారితో సమానంగా ఆడవారికి వేతనం మాట దేవుడెరుగు... మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొనే మరుగు స్థలాల లాంటి కనీస వసతులైనా కల్పించలేమా? సమ్మతితో పని లేకుండా ఆడవారితో ఎలాగైనా ప్రవర్తించవచ్చని భావిస్తున్న పని ప్రదేశంలో తగినంత బాధ్యత, భద్రత పెంపొందించేలా చేయలేమా? సమాజంగా మనం, సర్కారుగా పాలకులు సినీ పరిశ్రమపై ఆలోచించాల్సిన ఇలాంటి అంశాలు అనేకం. ఎప్పటి నుంచో ప్రత్యేక సినిమా విధానం తెస్తామని ఊరిస్తున్న కేరళ సర్కార్ సినీసీమలో వేతన ఒప్పందాలు, భద్రత అమలుకు సంబంధించి హేమ కమిటీ సిఫార్సులపై ఇకనైనా దృష్టి పెట్టాలి. పనిచేయడానికి ఒకమ్మాయి ఇంటి గడప దాటి వచ్చిందంటే సర్వం సమర్పించడానికి సిద్ధమైనట్టేనని చూసే పురుషాహంకార దృష్టి ఇకనైనా మారాలి. అన్ని పనిప్రదేశాల లానే సినీ రంగంలోనూ స్త్రీలకు సురక్షితమైన, భద్రమైన వాతావరణం కల్పించడం అంతర్జాతీయ స్థాయికి ఎదిగామని భుజాలు ఎగరేస్తున్న మన సినీ పరిశ్రమ కనీస బాధ్యత. -
ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలు మనకు బాగా అలవాటు అయిపోయాయి. ఎంతలా అంటే కొన్నాళ్ల ముందు వరకు తెలుగు సినిమాలు మాత్రమే మనోళ్లు చూసేవాళ్లు. ఇప్పుడు బాగుందని తెలిస్తే భాషతో సంబంధం లేకుండా ఏ మూవీని వదలట్లేదు. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ మూవీస్ తీసేది ఎవరని అడిగితే చాలామంది చెప్పే పేరు కొరియన్. థ్రిల్లర్, డ్రామా, యాక్షన్.. ఇలా ఏ జానర్ చిత్రాలు అయినా కొరియన్స్ బాగా తీస్తారనే పేరుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)అలా ఇప్పుడు పలు ఓటీటీల్లో ది బెస్ట్ అని చూసిన ప్రతి ఒక్కరూ అంటున్న కొన్ని కొరియన్ మూవీస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇంతకీ ఇవి ఏ ఓటీటీలో ఉన్నాయి. స్టోరీ లైన్ ఏంటనేది దిగువన లిస్టులో చూద్దాం.ఫర్గాటెన్ (2017) - ఇదో మిస్టరీ థ్రిల్లర్. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. గతం మరిచిపోయిన ఓ వ్యక్తి.. సొంత తమ్ముడినే కిడ్నాప్ చేస్తాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ.మెమొరీస్ ఆఫ్ మర్డర్ (2003) - ఇది మర్డర్ మిస్టరీ మూవీ. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఇద్దరు డిటెక్టివ్స్... వరస హత్యల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. వాళ్లకు తెలిసిన నిజమేంటనేదే మెయిన్ స్టోరీ.ఐ సా ద డెవిల్ (2010) - ఇదో యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఓ ఊరిలో సంబంధం లేకుండా కొన్ని హత్యలు జరుగుతుంటాయి. ఇంతకీ ఎవరు చేస్తున్నారు? సీక్రెట్ ఏజెంట్ కనిపెట్టాడా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))ద గ్యాంగస్టర్ ద కాప్ ద డెవిల్ (2019) - ఇదో యాక్షన్ మూవీ, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఓ సైకోని.. గ్యాంగస్టర్, పోలీస్ కలిసి ఎలా మట్టుబెట్టారనేదే స్టోరీ.ట్రెన్ టూ బుసాన్ (2016) - ఇది హారర్ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. బుసాన్ అనే ఊరికి వెళ్లేందుకు ఓ వ్యక్తి, కూతురితో కలిసి ట్రైన్ ఎక్కుతాడు. కానీ అందులోని మనుషులు.. జాంబీలుగా మారి అందరినీ చంపేస్తుంటారు. మరి వీళ్లు బతికి బయటపడ్డారా లేదా అనేదే స్టోరీ.ద ఔట్ లాస్ (2017) - ఇది క్రైమ్ యాక్షన్ సినిమా. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. కొరియన్, చైనీస్ గ్యాంగ్స్ మధ్య గొడవ జరిగితే.. ఓ డిటెక్టివ్ దాన్ని ఎలా డీల్ చేసాడనేదే స్టోరీ.ద హ్యాండ్ మెయిడెన్ (2016) - ఇది రొమాంటిక్ థ్రిల్లర్. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. 1930ల్లో ఓ రాజకుమారి దగ్గర పనిచేయడానికి ఓ అమ్మాయి వెళ్తుంది. కానీ తర్వాతర్వాత ఊహించని సంఘటనలు జరుగుతాయి. అదే స్టోరీ. 18 ప్లస్ సీన్లు ఉంటాయి. ఒంటరిగానే చూడండి!.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా)పారాసైట్ (2019) - ఆస్కార్ గెలుచుకున్న కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఓ నిరుపేద ఫ్యామిలీ.. మాయమాటలు చెప్పి ఓ ధనవంతుల ఇంట్లో పనికి చేరుతారు. ఆ తర్వాత జరిగే సంఘటనల సమహారమే అసలు కథ.ద క్లాసిక్ (2003) - ఇది రొమాంటిక్ డ్రామా. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఓ కాలేజీ స్టూడెంట్‌కి పాత డైరీ దొరుకుతుంది. అందులో తన తల్లి ట్రాయాంగిల్ లవ్ స్టోరీ గురించి ఉంటుంది. చివరకు ఆ కుర్రాడికి ఏం తెలిసిందనేదే స్టోరీ.ఓల్డ్ బాయ్ (2003) - ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఏమి లేనీ ఓ ఖైదీకి అన్ని వసతులు సమకూర్చిన.. లేని పోని గొడవల్లో ఇరుక్కుంటాడు. చివరకు ఏమైందనేదే అసలు కథ.ద అడ్మైరల్ (2014) - ఇది పీరియాడికల్ యాక్షన్ మూవీ. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. కేవలం 13 యుద్ధనౌకలు ఉన్న ఓ యోధుడు.. 300 యుద్ధ నౌకలున్న జపాన్ యోధులతో ఎలా తలపడ్డాడనేదే స్టోరీ.ఏ ట్యాక్సీ డ్రైవర్ (2017) - ఇది యాక్షన్ కామెడీ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. రియల్ లైఫ్ సంఘటనలతో తీసిన ఈ సినిమా ఓ సాధారణ ట్యాక్సీ డ్రైవర్, ఊహించని వివాదాల్లో చిక్కుకుంటే ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'ఈ-మెయిల్స్' వివాదంలో మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?) -
Thalaivar 169: జైలర్‌గా రజనీకాంత్!
తమిళ సినిమా: తలైవా రజనికాంత్ 169వ చిత్రానికి రెడీ అవుతున్నారు. అన్నాత్తే తరువాత ఈయన నటించనున్న తాజా చిత్రం జైలర్. రజనీకాంత్ చిత్రాలు అంటేనే భారీ తారాగణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటాయని.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజా చిత్రానికి మరింత భారీ విలువలు సంతరించుకోనున్నాయి. బీస్ట్ చిత్రం ఫేమ్ నెల్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇకపోతే అందాల భామ ఐశ్వర్యరాయ్ ఎందిరన్ తరువాత ఈ చిత్రంలో మరోసారి రజనీకాంత్‌తో జోడీ కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. నటి ప్రియాంక మోహన్ మరో నాయకిగా, రమ్యకృష్ణ, దర్శకుడు కేఎస్ రవికుమార్, కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, హీరో శివకార్తికేయన్ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. కాగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. జైలులోని ఖైదీలు నేపథ్యంలో రూపొందబోతున్నట్లు సమాచారం. జూలైలో షూటింగ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. మరో విశేషం ఏమిటంటే జూలై నాటికి రజనీకాంత్ నటుడిగా 47ఏళ్ల మైలు రాయిని చేరుకోనున్నా రు. దీంతో తాజా చిత్రానికి సంబంధించి ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిసింది. -
IIFA Awards 2022: ఈ సినిమాకు అత్యధికంగా అవార్డులు..
చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కరాల్లో ఒకటి ‘ఐఫా’ అవార్డ్స్. 22వ 'ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ' (IIFA Awards 2022)) అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం (జూన్ 4) రాత్రి ముగిసింది. జూన్ 3న అబుదాబిలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలో సినీ అతిరథుల మధ్య పురస్కారాలను అందజేశారు. ఈ వేడకకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, మనీష్ పాల్ హోస్ట్‌గా వ్యవహరించారు. అలాగే షాహిద్ కపూర్, నోరా ఫతేహీలా డ్యూయెట్ సాంగ్ కనులవిందు చేసింది. ఐఫా అవార్డ్స్ గ్రీన్ కార్పెట్‌లో సినీ తారలు సందడి చేశారు. హీరోయిన్స్ తమ గ్లామర్‌తో కట్టిపడేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదిలా ఉంటే ఉత్తమ నటీనటులకు, చిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. అత్యధికంగా కియరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర నటించిన 'షేర్షా' మూవీ అత్యధిక పురస్కరాలు సాధించింది. ఉత్తమ చిత్రం: షేర్షా (హిరో యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్‌వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ) ఉత్తమ దర్శకుడు: విష్ణువర్ధన్ (షేర్షా) ఉత్తమ నటుడు: విక్కీ కౌషల్ (సర్దార్ ఉద్ధమ్) ఉత్తమ నటి: కృతి సనన్ (మిమి) ఉత్తమ నటుడు (డెబ్యూ): అహన్ శెట్టి (తడప్ 2) ఉత్తమ నటి (డెబ్యూ): శర్వారీ వాఘ్ (బంటీ ఔర్ బబ్లీ 2) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (లూడో) ఉత్తమ సహాయ నటి: సయూ తమ్హాంకర్ మ్యూజిక్ డైరెక్షన్ (టై): ఏఆర్ రెహమాన్ (ఆత్రంగి రే), తనిష్క్ బగ్చీ, జస్లీన్ రాయల్, జావేద్-మోసిన్, విక్రమ్ మాంత్రోస్, బి ప్రాక్, జానీ (షేర్షా) ఉత్తమ నేపథ్య గాయకుడు: జుబిన్ నటియాల్ (రాతాన్ లంబియాన్-షేర్షా) ఉత్తమ నేపథ్య గాయకురాలు: అసీస్ కౌర్ (రాతాన్ లంబియాన్-షేర్షా) ఉత్తమ కథ (ఒరిజినల్): అనురాగ్ బసు (లూడో) ఉత్తమ కథ (అడాప్టెడ్): (కబీర్ ఖాన్, సంజయ్ పురాన్ సింగ్ చౌహన్ ఐసీసీ వరల్డ్ కప్ 1983 ఆధారంగా వచ్చిన 83) సాహిత్యం: కౌసర్ మునీర్ (లెహ్రే దో పాట-83) -
కమర్షియల్ విప్లవనాదం.. మనుషులంతా ఒక్కటే
‘ఎవడిదిరా ఈ భూమి? ఎవ్వడురా భూస్వామి?దున్నేవాడిదె భూమి... పండించేవాడే ఆసామి’. తీవ్రమైన ఆ ప్రశ్నలు... తెగువతో కవి కలం ఇచ్చిన ఆ బలమైన ఆ సమాధానాలు వింటే – ఇప్పుడంటే మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి తరహా ఎర్ర సినిమాలు గుర్తొస్తాయి. కానీ, వాటికన్నా ముందే ఓ స్టార్ సినిమా... వెండితెరపై విప్లవం పండించిందని తెలుసా? ఎన్టీ రామారావు లాంటి స్టార్ హీరో, వరుస విజయాల మీదున్న దాసరి నారాయణరావు లాంటి దర్శకుడు కలసి నాలుగున్నర దశాబ్దాల క్రితమే చేసిన సమసమాజ నినాదం ‘మనుషులంతా ఒక్కటే’ (1976 ఏప్రిల్ 7). ఆ సినిమాకు 45 వసంతాలు. ఆనాటి పరిస్థితులే... అలా తెరపై... వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భూ సంస్కరణలు మొదలయ్యాయి. 1950లోనే జమీందారీ వ్యవస్థ రద్దు బిల్లు వచ్చింది. 1956లో అనేక ప్రాంతాలు ఆ బిల్లును చట్టం చేశాయి. ఆర్థిక అసమానతలెన్నో ఉన్న మన దేశానికి కమ్యూనిజమ్, సోషలిజమ్ తారక మంత్రాలయ్యాయి. నెహ్రూ, శాస్త్రి తర్వాత ప్రధాని అయిన ఇందిరా గాంధీ 1970లో రాజభరణాలను రద్దు చేశారు. 1971 ఎన్నికల్లో ‘గరీబీ హఠావో’ నినాదం మారుమోగించారు. ఆ సామాజిక పరిస్థితుల్లో, జనంలో బలపడుతున్న భావాలతో తెరకెక్కిన కథ – ‘మనుషులంతా ఒక్కటే’. బ్రిటీషు కాలం నాటి పెత్తందారీ జమీందారీ వ్యవస్థనూ, సమకాలీన సామ్య వాద భావనలనూ అనుసంధానిస్తూ తీసిన చిత్రం ఇది. తాతను మార్చే మనుమడి కథ కథ చెప్పాలంటే... జమీందారు సర్వారాయుడు (కైకాల సత్యనారాయణ), ఆయన కొడుకు రాజేంద్రబాబు (ఎన్టీఆర్) పేదలను ఈసడించే పెత్తందార్లు. కానీ, పేదింటి రైతు పిల్ల రాధ (జమున) వల్ల పెద్ద ఎన్టీఆర్ మారతాడు. ఆమెను పెళ్ళాడతాడు. పేదల పక్షాన నిలిచి, న్యాయం కోసం పోరా డతాడు. ప్రాణాలు కూడా కోల్పోతాడు. కానీ, ఆ పేదింటి అమ్మాయికీ, అతనికీ పుట్టిన రాము (రెండో ఎన్టీఆర్) పెరిగి పెద్దవాడై, జమీందారు తాతకు బుద్ధి చెబుతాడు. వర్గ భేదాలు, వర్ణ భేదాలు లేకుండా మనుషులంతా ఒక్కటే అని వాణిజ్యపంథాలో చెప్పడంలో సూపర్ హిట్టయిందీ చిత్రం. విప్లవ కథాచిత్రాలకు కమర్షియల్ మూలం కళాదర్శకుడు– పబ్లిసిటీ డిజైనింగ్ ‘స్టూడియో రూప్ కళా’ ఓనరైన వి.వి. రాజేంద్ర కుమార్ కు సినిమా చేస్తానంటూ అప్పటికి చాలా కాలం ముందే ఎన్టీఆర్ మాటిచ్చారు. మాటకు కట్టుబడి, డేట్లిచ్చారు. పౌరాణికం తీయాలని రాజేంద్ర కుమార్ మొదట అనుకున్నారు. చివరకు ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్‌కు శ్రీకారం చుడుతూ, సాంఘికం ‘మనుషులంతా ఒక్కటే’ తీశారు. రాజేంద్ర కుమార్ సమర్పణలో, ఆయన సోదరుడు – కథా, నవలా రచయిత వి. మహేశ్, గుంటూరుకు చెందిన దుడ్డు వెంకటేశ్వరరావు నిర్మాతలుగా ఈ సినిమా నిర్మాణమైంది. ‘మనుషులంతా ఒక్కటే’ అనే పేరు, ‘దున్నేవాడిదే భూమి’ లాంటి అంశాలు అచ్చంగా వామపక్ష భావజాలంతో కూడిన సినిమాల్లో కనిపిస్తాయి. కానీ ప్రజాపోరాటంతో పాటు, పెద్ద కుటుంబానికి చెందిన హీరో తక్కువ కులపు పేదింటి అమ్మాయిని పెళ్ళాడడం లాంటివన్నీ ఈ కమర్షియల్ చిత్రంలో ఉన్నాయి. అలా చూస్తే ‘భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం’ అనే విప్లవ భావాలతో వచ్చిన తర్వాతి సినిమాలకు ఒక రకంగా ‘మనుషులంతా ఒక్కటే’ మూలమనేవారు దాసరి. అంతకు మునుపు కూడా పెత్తందార్లపై, రైతు సమస్యలపై సినిమాలు వచ్చినా, అవన్నీ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోవే! బ్లాక్ అండ్ వైటే!! ఇలా కమర్షియల్, కలర్ చిత్రాలు కావనేది గమనార్హం. కథ వెనుక కథేమిటంటే... దాసరి రచయితగా, దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌కు తెలుసు. ‘ఒకే కుటుంబం’ (1970 డిసెంబర్ 25)తో సెట్స్‌పై దాసరి దర్శకత్వ ప్రతిభ కూడా ఎన్టీఆర్‌కు తెలిసింది. మరో హిందీ షూటింగుతో క్లాష్ వచ్చి, దర్శకుడు ఎ. భీమ్‌సింగ్ అందుబాటులో లేనప్పుడు కొద్దిరోజులు ‘ఒకే కుటుంబం’ షూటింగ్ చేసింది ఆ చిత్రానికి సహ రచయిత, అసోసియేట్ డైరెక్టరైన దాసరే! అంతకు ముందు రచయితగానూ దాసరి ఒకటి రెండు కథలతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళినా, రకరకాల కారణాలతో అవేవీ సెట్స్ పైకి రాలేదు. ఈ ‘మనుషులంతా ఒక్కటే’కు దాసరి ముందు అనుకున్న మూలకథ కూడా వేరే ఎన్టీఆర్ నిర్మాతల దగ్గరకు వెళ్ళిందట! ఎన్టీఆర్, జమునలతో తీయాలనేది ప్లాన్. కానీ, అప్పటికే వచ్చిన ‘మంగమ్మశపథం’(1965)తో పోలికలున్నాయంటూ, ఆ నిర్మాత వెనక్కి తగ్గారట! ఆ తరువాత చాలాకాలానికి దాసరి దర్శకుడయ్యాక ఆ మూల కథే మళ్ళీ ఎన్టీఆర్, జమునలతోనే తెరకెక్కడం విచిత్రం. ‘మనుషులంతా ఒక్కటే’ నిర్మాతల్లో ఒకరైన నవలా రచయిత వి. మహేశ్ గతంలో దాసరి దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్ స్టోరీ రైటర్. చాలాకాలం క్రితం తాను అనుకున్న కథలో మహేశ్, ఆర్కే ధర్మరాజు సహకారంతో మార్పులు, చేర్పులు చేశారు దాసరి. దాంతో, ఈ కథ నేపథ్యమే మారింది. దున్నేవాడిదే భూమి, జమీందారీ వ్యవస్థ, తాతకు మనుమడు బుద్ధి చెప్పడం లాంటి అంశాలతో కథ కొత్త హంగులు దిద్దుకుంది. నిర్మాత మహేశ్, ఆర్కే ధర్మరాజులకే కథారచన క్రెడిట్ ఇచ్చి, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వ బాధ్యతల క్రెడిట్ తీసుకున్నారు దాసరి. ఈ సినిమాలో తెరపై రెండో ఎన్టీఆర్‌ను హోటల్ రిసెప్షన్ దగ్గర పలకరించే చిరువేషంలోనూ మెరిశారు మహేశ్. సమాజానికి మంచి చెప్పే ఈ కథతో ఆ ఏటి ద్వితీయ ఉత్తమ కథారచయితగా మహేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. క్రేజీ కాంబినేషన్! దాసరి కొడుకుకు ఎన్టీఆర్ పేరు!! దర్శకుడిగా దాసరికి ఇది 12వ సినిమా. అంతకు ముందు 11 సినిమాల్లో ‘సంసారం – సాగరం’, ‘రాధమ్మ పెళ్ళి’, ‘తిరపతి’, యావరేజ్ ‘యవ్వనం కాటేసింది’ పోగా మిగతా 7 సక్సెస్. ఆ మాటకొస్తే ‘మనుషులంతా ఒక్కటే’ రిలీజైన 1976కు ముందు సంవత్సరం 1975లో రిలీజైన దాసరి చిత్రాలు నాలుగూ శతదినోత్సవ చిత్రాలే. దాసరి మంచి క్రేజు మీదున్నారు. అయితే, శోభన్‌బాబు ‘బలిపీఠం’ మినహా అప్పటి దాకా ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైటే! స్టార్ల కన్నా కథకే ప్రాధాన్యమున్న లోబడ్జెట్ చిత్రాలే! ఆ టైములో ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్‌తో, కలర్లో, ఔట్‌డోర్‌లో, భారీ బడ్జెట్‌తో తొలిసారిగా దర్శకత్వం వహించే ఛాన్స్ రాగానే దాసరి రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. 1975 నాటికి శోభన్‌బాబు జోరు మీదున్నారు. టాప్ స్టార్‌గా ఎన్టీఆర్ కెరీర్ కొనసాగుతోంది. అప్పట్లో ఎన్టీఆర్ సెంటిమెంటల్ క్రైమ్ కథ ‘అన్నదమ్ముల అనుబంధం’ (1975 జూలై 4), ప్రయోగాత్మక ‘తీర్పు’(1975 అక్టోబర్ 1), మాస్‌ఫార్ములా ‘ఎదురులేని మనిషి’ (1975 డిసెంబర్ 12), విభిన్నమైన క్లాస్ ప్రేమకథ ‘ఆరాధన’ (1976 మార్చి 12) చిత్రాలతో 9 నెలల కాలంలో 4 హిట్లు, చారిత్రక కథా చిత్రం ‘వేములవాడ భీమకవి’ (1976 జనవరి 8) తర్వాత ‘మనుషులంతా ఒక్కటే’తో జనం ముందుకొ చ్చారు. జమీందారీ కథకు తగ్గట్టు రాతి కట్టడంతో కోటలా కనిపించే బెంగళూరులోని మైసూర్ మహారాజా ప్యాలెస్‌లో షూటింగ్ చేసిన తొలి తెలుగు చిత్రమూ ఇదే. అంతకు ముందొచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ (1973) లాంటివన్నీ తెల్లగా, పాలరాతితో చేసినట్టు తోచే మైసూరులోని లలితమహల్ ప్యాలెస్‌లో తీసినవి. చిత్రమేమిటంటే, ఏ.వి.ఎం స్టూడియోలో ‘మనుషులంతా ఒక్కటే’ షూటింగ్ ప్రారంభమైనరోజునే దాసరికి అబ్బాయి పుట్టాడు. ఆ సంతోష వార్త తెలియగానే ఎన్టీఆర్‌తో పంచుకున్న దాసరి, ‘తారక రామారావు అనే మీ పేరు కలిసొచ్చేలా మా తొలి సంతానానికి నామకరణం చేస్తున్నాం’ అని చెప్పారు. కొడుకుకి‘తారక హరిహర ప్రభు’ అని పేరు పెట్టారు. ఎస్పీబీ గాత్రానికి ఓ కొత్త ఊపు ఇద్దరు ఎన్టీఆర్‌లు, ఇద్దరు హీరోయిన్లున్నా – ‘మనుషులంతా...’లో ఎన్టీఆర్‌కు ఒక్క డ్యుయెటైనా ఉండదు. బాపు సూపర్ హిట్ ‘ముత్యాల ముగ్గు’ సహా అక్కినేని ‘సెక్రటరీ’, కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ తదితర చిత్రాల ఆడియోలతో గాయకుడు రామకృష్ణ హవా నడుస్తున్న రోజులవి. ఆ పరిస్థితుల్లో అప్పటికి ఇంకా వర్ధమాన గాయకుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ‘మనుషులంతా ఒక్కటే’లోని సోలో పాటలన్నీ ఎస్. రాజేశ్వరరావు స్వరసారథ్యంలో పాడి, ఆకట్టుకున్నారు. ‘అను భవించు రాజా..’, ‘తాతా బాగున్నావా..’, ‘ఎవడిదిరా ఈ భూమి..’ (రచన సినారె), ‘కాలం కాదు కర్మా కాదు..’ (ఆత్రేయ) – ఇలా ఆ సోలో సాంగ్స్ అన్నీ పాపులరే. ఇక, ‘ముత్యాలు వస్తావా...’ డ్యూయట్లో అచ్చంగా అల్లు రామలింగయ్యే పాడారేమో అనేట్టుగా ఎస్పీబీ తన గళంతో మాయాజాలం చేయడం మరో విశేషం. అలా ఆయన కెరీర్‌కు ఈ చిత్రం ఓ కొత్త ఊపు. హాస్యనటి రమాప్రభ ఈ సినిమాలో అల్లు రామలింగయ్య, నాగేశ్‌ల సరసన ద్విపాత్రాభినయం చేయడం ఓ గమ్మత్తు! అల్లుతో రమాప్రభకు ‘ముత్యాలు వస్తావా... అడిగింది ఇస్తావా...’ అంటూ డ్యూయెట్ పెట్టడం మరో గమ్మత్తు!! రాజేశ్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించిన హిందీ సినిమా ‘ఆరాధన’ (1969 సెప్టెంబర్ 27)లో ఎస్.డి. బర్మన్ బాణీకి ఆయన కుమారుడు ఆర్.డి. బర్మన్ హంగులు చేర్చగా, దేశమంతటినీ ఊపేసిన పాపులర్ శృంగారగీతం ‘రూప్ తేరా మస్తానా.’ సరిగ్గా ఆ బాణీనే అనుసరిస్తూ, కొసరాజు రాసిన ‘ముత్యాలు వస్తావా..’ అప్పట్లో రేడియోలో మారుమోగింది. ఇప్పటికీ ఎమోషనల్‌గా... ఆ బుర్రకథలు ఇదే సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు పెద్ద ఎన్టీఆర్ పాత్ర ఒంటరిగా దుండగుల చేతిలో చనిపోయే ఉద్విగ్నభరిత ఘట్టం ఉంటుంది. ఆ సందర్భానికి తగ్గట్టు మహాభారతంలోని అభిమన్యుడి బుర్రకథను సినారె ప్రత్యేకంగా రాశారు. ప్రసిద్ధ బుర్రకథకుడు నాజర్ బృందంతో ఈ బుర్రకథ తీయాలనుకున్నారు. అయితే, ఆయన వయోభారం అడ్డమైంది. దాంతో, సినారె సూచనతో హైదరాబాద్‌కు చెందిన మరో ప్రముఖ బుర్రకథకుడు పి. బెనర్జీ బృందంతో ఆ బుర్రకథ తీశారు. ఆ బుర్రకథ, తెరపై దాని చిత్రీకరణ ఓ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. నాలుగున్నరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ –దాసరి కాంబినేషన్లోనే వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ లోనూ ఇంటర్వెల్ ముందు ఇదే బెనర్జీ బృందంతో శ్రీశ్రీ రాసిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ పెట్టడం విశేషం. యాభైకే... 100 రోజుల వసూళ్ళు తరువాతి కాలంలో దర్శకులైన కె. దుర్గానాగేశ్వరరావు ‘మనుషులంతా ఒక్కటే’కు కో–డైరెక్టరైతే, శతచిత్ర దర్శకుడైన కోడి రామకృష్ణ అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్. దాసరి శిష్యుడు – ఇప్పటి విప్లవ చిత్రాలకు చిరునామాగా మారిన ఆర్. నారాయణమూర్తి కూడా ఈ విప్లవాత్మక కథాచిత్రంలో క్లైమాక్స్‌లో ఒక చిన్న డైలాగు వేషంలో కనిపిస్తారు. తమిళనాడులోని మద్రాసు, కర్ణాటకలోని బెంగళూరు, నందీహిల్స్, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు పరిసరాల్లో – ఇలా 3 రాష్ట్రాల్లో భారీ వ్యయంతో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. 33 ప్రింట్లతో 50 థియేటర్లలో రిలీజైన ఈ కలర్ చిత్రం అప్పట్లో దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు ఆడింది. నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. విజయవాడ లక్ష్మీ టాకీస్‌లో అత్యధికంగా 128 రోజులు ప్రదర్శితమైంది. ఇక, హైదరాబాద్ కేంద్రంలో షిఫ్టింగులతో, సంయుక్త రజతోత్సవం మాత్రం జరుపుకొంది. క్లైమాక్స్ చిత్రీకరణ సాగిన నెల్లూరులో విపరీతంగా ఆదరణ లభించింది. అలా నెల్లూరు, గుంటూరు లాంటి కొన్ని కేంద్రాలలో సర్వసాధారణంగా ఒక సినిమాకు వందరోజులకు వచ్చే వసూళ్ళను ‘మనుషులంతా ఒక్కటే’ కేవలం యాభై రోజులకే సాధించడం అప్పట్లో చర్చ రేపింది. ఆ ఏడాది జూలై 26న మద్రాస్ తాజ్ కోరమాండల్ హోటల్లో దర్శకుడు పి. పుల్లయ్య, నిర్మాత డి.వి.ఎస్ రాజు ముఖ్య అతిథులుగా సినిమా వంద రోజుల వేడుక ఘనంగా చేశారు. అప్పట్లో ఎమ్జీఆర్తో తమిళంలో ఈ సినిమాను రీమేక్ తీయాలనుకున్నారు. కానీ, ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కావడంతో అది కుదరలేదు. ఏది ఎలా ఉన్నా, మనుషులంతా ఒక్కటే అనే సార్వకాలిక సత్యాన్ని జనరంజకంగా చెప్పిన చిత్రంగా ‘మనుషులంతా ఒక్కటే’ ఎప్పటికీ గుర్తుంటుంది. ఎన్టీఆర్ సహకారంతో... ‘మనుషులంతా...’ తరువాత రాజేంద్ర కుమార్‌కు ఎన్టీఆర్ ఇంకో సినిమా చేశారు. ‘రక్తసంబంధం’ ఫక్కీలోని ఆ అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ చిత్రం – ‘మహాపురుషుడు’. ‘ఆబాలగోపాలుడు’ టైటిల్ మధ్యలో అనుకొని, చివరకు ‘మహాపురుషుడు’ (1981 నవంబర్ 21)గానే రిలీజైందా సినిమా. నిర్మాణం సగంలో ఉండగానే రాజేంద్ర కుమార్ హఠాత్తుగా కన్నుమూశారు.చిత్ర నిర్మాణం సందిగ్ధంలో పడి, ఆలస్యమైంది. ఎన్టీఆర్ సహకరించి, సినిమా పూర్తి చేయించి, రిలీజ్ చేయించడం విశేషం. పబ్లిసిటీలో... పేరు వివాదం! ‘మనుషులంతా ఒక్కటే’తో మొదలైన ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్లో ఆ తరువాత మరో 4 సినిమాలు వచ్చాయి. ఈ సినిమా తీసేనాటికే ప్రింట్, పోస్టర్ పబ్లిసిటీలో దర్శకుడిగా దాసరి పేరు సినిమా టైటిల్ కన్నా పైన మేఘాలకు ఎక్కింది. కానీ, ఎన్టీఆర్‌తో తొలిసారి తీస్తున్న ‘మనుషులంతా ఒక్కటే’ ప్రిరిలీజ్ పబ్లిసిటీకి దాసరి తన పేరును సినిమా టైటిల్ కన్నా కిందే వేసుకున్నారు. ఆ పైన తమ కాంబినేషన్లో రెండో సినిమా ‘సర్కస్ రాముడు’ (1980 మార్చి 1)కు మాత్రం ఎందుకనో టైటిల్ పైన తన పేరు వేసుకున్నారు దాసరి. అది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాసరి దగ్గర పంచాయతీ పెట్టారు. దాంతో, ఇకపై ప్రధాన పబ్లిసిటీలో ముందుగా పైన ఎన్టీఆర్ నటించిన అని పేరు వేసి, ఆ తరువాతే మరోవైపు తన పేరు మేఘాలలో వేయడానికి దాసరి రాజీ కొచ్చారు. ఒప్పుకున్నట్టే, ఆ తరువాత తీసిన ‘సర్దార్ పాపారాయుడు’ (1980 అక్టోబర్ 30), ‘విశ్వరూపం’ (1981 జూలై 25) ప్రధాన పబ్లిసిటీకి ఆ పద్ధతే అనుసరించారు. ఆఖరుగా వచ్చిన ‘బొబ్బిలిపులి’ (1982 జూలై 9)కి సైతం ‘‘నవరస నాయకుడు నటరత్న యన్.టి.ఆర్. నటనా వైభవం’’ అని ముందు వేసి, ఆ తరువాతే మేఘాలలో తన పేరు పబ్లిసిటీలో కనిపించేలా చూశారు. పబ్లిసిటీలో పేరెక్కడ ఉండాలనే ఈ వివాదం సినీప్రియుల్లో అప్పట్లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. నాగభూషణం లాస్... సత్యనారాయణకు గెయిన్! ఈ సినిమాలో కీలకమైనది – మనుమడైన రెండో ఎన్టీఆర్ ఢీ కొట్టే తాత పాత్ర. అహంకారం నిండిన జమీందారుగా ఆ విలనీ తాత పాత్ర, ఆ గెటప్ అప్పట్లో నటుడు నాగభూషణం ట్రేడ్ మార్క్. నిజానికి, ఎన్టీఆర్ కూడా ఆయన పేరే సూచించారట. కానీ, నాగభూషణం సమర్పించిన ‘ఒకే కుటుంబం’కి పనిచేసిన దాసరి ఆ మాట వినలేదు. ‘తాత – మనవడు’లో నాగభూషణం బదులు గుమ్మడితో వేషం వేయించిన దాసరి ఈసారీ వ్యక్తిగత కారణాల రీత్యా నాగభూషణాన్ని వద్దనే అనుకొన్నారు. సత్యనారాయణ పేరు పైకి తెచ్చారు. అదేమంటే, ‘నన్ను నమ్మండి. ఆయన అద్భుతంగా చేస్తారని నిరూపిస్తా’ అని వాదించి మరీ ఒప్పించారు. నిరూపించారు. ‘ఎన్టీఆర్‌కు తాతగా మహామహులు చేయాల్సింది నేను చేయడమేమిట’ని సత్యనారాయణ సైతం భయపడ్డారు. కానీ, తాత పాత్రకు ప్రాణం పోశారు. ఆయన అభినయం, ‘తాతా బాగున్నావా’ లాంటి పాటలతో నేటికీ ఆ పాత్ర చిరస్మరణీయమైంది. ‘కర్ణ’ ఛాన్స్ ఇచ్చిన... జమున కెమేరా అందం పెద్ద ఎన్టీఆర్‌కు భార్యగా, చిన్న ఎన్టీఆర్‌కు తల్లిగా, ఆత్మాభిమానం ఉన్న పేదింటి రైతుబిడ్డగా జమునది క్లిష్టమైన పాత్ర. ఆ పాత్రను ఆమె అభినయంతో మెప్పించారు. నలభై ఏళ్ళ వయసులోనూ జమున లంగా, ఓణీలతో సినిమా ఫస్టాఫ్‌లో ఆకర్షణీయంగా, చలాకీగా కనిపిస్తారు. ఆ వయసులోనూ, ఆ కాస్ట్యూమ్స్‌తో ఆమెను అందంగా, హుందాగా చూపడంలో కెమేరామ్యాన్ కన్నప్ప ప్రతిభ కూడా ఉంది. ఆ పనితనం ఎన్టీఆర్‌కు బాగా నచ్చింది. ఆ వెంటనే ఎన్టీఆర్ తన 54వ ఏట స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, త్రిపాత్రాభినయం చేస్తున్న పౌరాణిక చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (1977 జనవరి 14)కు కన్నప్పనే కెమేరామ్యాన్‌గా తీసుకున్నారు. కర్ణుడు, సుయోధనుడు, శ్రీకృష్ణుడు – ఈ మూడు పాత్రల్లోనూ తెరపై అందంగా కనువిందు చేశారు. ఆ పాట... అలా స్పెషల్! ఇదే సినిమాలో దాసరి చేసిన మరో మ్యాజిక్ – సినిమాల టైటిల్స్‌తోనే ఏకంగా ఓ పాటంతా రాసి, మెప్పించడం! ‘నిన్నే పెళ్ళాడుతా... రాముడూ భీముడూ...’ అంటూ ఆ పాట అంతా ఎన్టీఆర్ నటించిన సినిమాల టైటిల్స్‌తోనే సాగుతుంది. పి. సుశీల గానంలో హీరోయిన్ మంజుల స్టేజీపై నర్తిస్తుండగా, ఎన్టీఆర్ మీదే దాన్ని చిత్రీకరించడం విశేషం. అంతకు ముందు ‘ఒకే కుటుంబం’ లాంటి సినిమాల్లో గీతరచన చేసినా, దర్శకుడయ్యాక దాసరికి ఇదే ఫస్ట్ సాంగ్. ఈ సినిమాలో ఈ సందర్భం కోసం మొదట వేరే పాట అనుకున్నారు. ఎన్టీఆర్ పౌరాణిక గెటప్పుల్లో కనిపించేలా సినారె రాశారు. అయితే, ఆఖరి నిమిషంలో ఆ గెటప్పుల ప్రతిపాదన విరమించుకొని, ఆపద్ధర్మంగా దాసరి ఈ సినిమా టైటిల్స్పాట రాశారు. సినీటైటిల్స్తోనే ఓ పాట రావడం తెలుగులో అదే తొలిసారి. అప్పటికే ఎన్టీఆర్ దాదాపు 250 సినిమాల్లో నటించారు. అందులోని 34 టైటిల్స్ ఈ పాటలో ఉన్నాయి. అలా ఒక హీరోపై ఆయన సినీటైటిల్స్తోనే ఓ పాట రాసి, ఆయనపైనే చిత్రీకరించడం తెలుగులో ఇదొక్కసారే జరిగింది. తర్వాత ‘మరోచరిత్ర’ లాంటి సినిమాల్లో వేర్వేరు సినిమాల టైటిల్స్ తోనే పాటంతా రాయడమనే ధోరణి కొనసాగింది. - రెంటాల జయదేవ -
వెండితెర 2019
-
వెండితెర 2018
-
నా జీవితంలో మరుపురానిది తలైమురైగళ్
నా జీవితంలో తలైమురైగళ్ చిత్రం మరపురానిదంటూ నటుడు, నిర్మాత, దర్శకుడు శశికుమార్ వ్యాఖ్యానించారు.ఆయన తాజాగా తన కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం కిడారి. ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల నాయకిగా నటించారు. ఇతను ముఖ్య పాత్రల్లో నెపోలియన్, నటి సుజా నటించారు. తర్పుక శివ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర వివరాలను తెలియజేయడానికి శనివారం సాయంత్రం స్థానిక ఆర్కేవీ.స్టూడియోలో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, నిర్మాత శశికుమార్ మాట్లాడుతూ కడారి చిత్ర కథ దర్శకుడు ప్రసాద్ మురుగేశ న్ చెప్పగానే తెగ నచ్చేసిందన్నారు. సాధారణంగా చిత్రాల కథలు హీరోనే సెంటర్ పాయింట్ చేసుకుని ఉంటాయన్నారు. అయితే ఈ కిడారిలో పలు పాత్రల చుట్టూ కథ తిరుగుతుందని తెలిపారు. అదే విధంగా కథ నచ్చగానే నటించాలనిపిస్తుందని, తనకీ కథ వినగానే దర్శకత్వం వహించాలన్న ఆశ కలిగిందని చెప్పారు. తాను నటించిన చిత్రాలన్నింటిలోకి తక్కువ కాలంలో అంటే 64 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేసిన చిత్రం కిడారి అని తెలిపారు. ఆ క్రెడిడ్ దర్శకుడికే చెందుతుందన్నారు. దర్శకుడు, ఛాయాగ్రహకుడు ఈ చిత్రాన్ని ఇంకా వేగంగా పూర్తి చేయాలని భావించారని.. తానే మరో రెండు రోజులు చేద్దామని అన్నానని చెప్పారు. ఇక నటి సుజాను చాలా చిత్రాల్లో గ్లామరస్ పాత్రలోనే చూసి ఉంటారని, అలాంటిది ఈ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా బాగా నటించారని తెలిపారు. అదే విధంగా నటి నిఖిల వెట్రివేలన్ చిత్రం తరువాత తనకు జంటగా రెండో సారి నటించిన చిత్రం కిడారి అన్నారు. తన చంబా అనే పాత్రలో చాలా చలాకీగా నటించారని తెలిపారు.ఇంతకు ముందు తనతో లక్ష్మీమీనన్, స్వాతి, అనన్న రెండేసి చిత్రాల్లో నటించారని, ఆ కోవలో నిఖిలా చేరారని అన్నారు. నిజానికి ఈ చిత్రంలో కొత్త నటిని నాయకిగా పరిచయం చేయాలని భావించామని.. అయితే పాత్రకు తగ్గ నటి లభించకపోవడంతో నిఖిలనే ఎంపిక చేసినట్లు వివరించారు. తన సంస్థలో రూపొందిస్తున్న ఎనిమిదో చిత్రం కిడారి అని పేర్కొన్నారు. అయితే బాలు మహేంద్ర దర్శకత్వంలో తలైమురైగళ్, బాలా దర్శకత్వంలో తారైతప్పట్టై చిత్రాలు తాను నిర్మించడం గర్వంగా ఉందన్నారు. తలైమురైగళ్ చిత్రం అయితే మరపురానిదని శశికుమార్ పేర్కొన్నారు. -
ఉన్నత శిఖరంపై ‘బాహుబలి’
సగటు ప్రేక్షకులను కలల లోకంలో విహరింపజేయగల బలమైన మాధ్యమం సినిమా. అలాంటి రంగంలో శిఖరాయమానమైన కళాఖండం రూపుదిద్దుకోవడం ఎప్పుడోగానీ సాధ్యం కాదు. 2015 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం బహుమతిని గెల్చుకున్న ‘బాహుబలి’ అలాంటి అపురూపమైన దృశ్య కావ్యం. ఉత్తమ కళాఖండాన్ని నిర్మించి చరితార్ధులం కావాలని స్వప్నించేవారు చాలామందే ఉండవచ్చు. కానీ దాన్ని సాకారం చేసుకోగలిగిన ప్రతిభావ్యుత్పత్తులు, సృజనాత్మకత, అంకితభావం గలవారు అరుదుగా ఉంటారు. ‘బాహుబలి’ నిర్మించడం ద్వారా తనకు అలాంటి అరుదైన లక్షణాలున్నాయని ఎస్.ఎస్. రాజమౌళి నిరూపించుకోవడంతోపాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కీర్తి ప్రతిష్టలను ఆకాశపుటంచులకు తీసుకెళ్లారు. ఎలా మొదలైందో గానీ సినిమాల్లో కమర్షియల్ సినిమాలు, అవార్డు సినిమాలంటూ ఒక తెలియని విభజన రేఖ ఏర్పడింది. దాని ఆధారంగా మిగిలిన వాదనలు బయల్దేరాయి. కమర్షియల్ సినిమాలకు వసూళ్లు బాగా ఉంటాయి గనుక చాలామంది ఆ తరహా సినిమాలు తీసేందుకే మొగ్గు చూపుతారని...అవార్డు సినిమాలకు పెట్టుబడులు పెట్టేవారు దొరకరని అంటారు. అందుకే ‘మంచి’ సినిమాలు రావడం లేదని కూడా చెబుతుంటారు. కానీ ‘బాహుబలి’ అలాంటి వాదనలన్నిటినీ పటాపంచలు చేసింది. ‘మంచి’ సినిమాలు, ‘పాపులర్’ సినిమాలన్న పేరుతో విభజన చేసుకున్నది మనమేనని...తగిన సత్తా ఉంటే ఆ రెండూ ఒకటి కావడం అసాధ్యమేమీ కాదని ఆ చిత్రం తేటతెల్లం చేసింది. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మిస్తే, ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగలిగితే వాణిజ్యపరంగా సూపర్‌హిట్ కావడంతోపాటు జ్యూరీ సభ్యుల మన్ననల్ని పొంది అవార్డుల్ని కూడా సునాయాసంగా సాధించవచ్చునని ‘బాహుబలి’ నిరూపించింది. దీనికి ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు స్పెషల్ ఎఫెక్ట్ కేటగిరీలోనూ అవార్డు లభించడమే రుజువు. చలనచిత్రాలకు జాతీయ స్థాయి అవార్డులిచ్చే సంప్రదాయం మొదలుపెట్టకముందు...అంటే 1953కు ముందు తెలుగులో ‘పాతాళభైరవి’, ‘మల్లీశ్వరి’ వంటి గొప్ప చిత్రాలొచ్చాయి. ఆ తర్వాత ‘లవకుశ’, ‘మాయాబజార్’ వంటి కళాఖండాలు వచ్చాయి. కానీ 1964లో ‘నర్తనశాల’ జాతీయస్థాయిలో ఉత్తమ ద్వితీయచిత్రంగా అవార్డుగా ఎంపికయ్యేవరకూ మన చిత్రాలకు సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 1979లో ‘శంకరాభరణం’ మళ్లీ అరుదైన గుర్తింపు తెచ్చుకుని స్వర్ణకమలాన్ని సాధించినా అది జాతీయ ఉత్తమ చిత్రంగా కాదు...స్పెషల్ జ్యూరీ అవార్డు కేటగిరీలో ఆ అవార్డును సాధించింది. ఇన్నాళ్లకు రాజమౌళి తెలుగు చలనచిత్రానికి మళ్లీ జాతీయస్థాయి గుర్తింపును తీసుకొచ్చారు. వాస్తవానికి ‘బాహుబలి’ దీనికి చాలా ముందే దేశంలో మాత్రమే కాదు...ఖండాంతరాల్లో కూడా తెలుగు సినిమా గొప్పదనాన్ని చాటింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ‘కంచె’ సినిమా కూడా ‘బాహుబలి’ తరహాలోనే యుద్ధ నేపథ్యంతో రూపొందిన చిత్రం. రెండో ప్రపంచ యుద్ధ సమయంనాటి సామాజిక సంబంధాలను ప్రతిభావంతంగా చర్చించి, ఆ సంబంధాల్లో భాగమైన వ్యక్తుల భావోద్వేగాలను ఎంతో హృద్యంగా చూపిన సినిమా ‘కంచె’. సమాజంలోని కుల,మతాల కంచెను కూల్చాలని ఈ చిత్రం ప్రబోధిస్తుంది. మన పొరుగునున్న తమిళ, మళయాళ చలనచిత్ర పరిశ్రమలు వాణిజ్యపరమైన విలువలతోపాటు కళాత్మకతను కూడా రంగరిస్తూ... సామాజిక సమస్యలను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తూ ఆయా రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశం నలుమూలలా ప్రేక్షకుల మన్ననల్ని పొందేవి. అలాగే చిత్ర నిర్మాణానికి సంబంధించినంతవరకూ రాశిలోనూ, వాసిలోనూ హిందీ చిత్రాలకు తెలుగు చిత్రాలతోసహా మరే భాషా చిత్రాలూ పోటీ కాదన్న పేరుండేది. తెలుగు చలనచిత్ర రంగం చాన్నాళ్లక్రితమే వాటన్నిటినీ అధిగమించే యత్నం చేసింది. అందుకు పరాకాష్టగా ‘బాహుబలి’నీ, ‘కంచె’నూ చెప్పుకోవచ్చు. ఈసారి ఉత్తమ పాపులర్ చిత్రంగా అవార్డు సొంతం చేసుకున్న ‘బజ్రంగీ భాయ్‌జాన్’ సైతం సామాజిక విలువలను చర్చించిన చిత్రం. ‘బాహుబలి’కి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కూడా కథా రచయిత కావడం విశేషం. మన దేశం వచ్చిన పాకిస్తాన్‌కు చెందిన తల్లినుంచి తప్పిపోయిన ఒక చిన్నారిని ఆంజనేయుడి భక్తుడైన హీరో ఎన్నో అవరోధాలనూ, అవాంతరాలనూ అధిగమించి మళ్లీ ఆమె దేశానికి చేర్చడం ఈ చిత్రం ఇతివృత్తం. అందువల్లే ఈ చిత్రం మన దేశంతోపాటు పాకిస్తాన్లో కూడా విజయవంతమైంది. సరిహద్దులకు రెండు వైపులా ఉండే పరస్పర అపనమ్మకాలనూ, అనుమానాలనూ చూపడంతో పాటు నిజాలు తెలుసుకున్నాక కథానాయకుడికి నీరాజనాలు పట్టడం ఇందులో కనిపిస్తుంది. ఇరు దేశాల పౌరులమధ్యా సుహృద్భావ వాతావరణం నెలకొనడానికి ఇలాంటి చిత్రాలు దోహదం చేస్తాయి. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డుకు ఎంపిక చేయడం హర్షించదగింది. మహారాష్ట్రను పాలించిన బాజీరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘బాజీరావు మస్తానీ’కి దర్శకత్వం వహించిన సంజయ్ లీలా బన్సాలీకి ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. దీంతో పాటు మరో ఆరు కేటగిరీలో కూడా అవార్డులు వచ్చాయి. పీష్వాల కాలంలో ఉండే సంప్రదాయాలు, జీవనం, ఆనాటి భవంతులు వగైరాలను కళ్లకు కట్టేలా చిత్రించడంలో బన్సాలీ ఎంతో శ్రమించారు. అందుకోసం ఆయన లోతైన పరిశోధనలు చేశారు. ‘పీకూ’ చిత్రం లో అద్భుతంగా నటించిన అమితాబ్ బచ్చన్‌కు ఉత్తమ నటుడిగా, ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’ చిత్రంలో ప్రతిభావంతమైన నటన చూపిన కంగనా రనౌత్‌కి ఉత్తమ నటిగా అవార్డులు లభించాయి. సెరెబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతున్న పాత్రలో జీవించిన కల్కి కోషెలిన్కూ ప్రత్యేక జ్యూరీ అవార్డు వచ్చింది. తొలిసారి దర్శకత్వం చేపట్టి ప్రతిభను ప్రదర్శించిన వారికిచ్చే ఇందిరాగాంధీ అవార్డును ‘మసాన్’కు దర్శకత్వం వహించిన నీరజ్ ఘైవాన్ దక్కించుకున్నారు. పెద్ద పెద్ద తారలు లేకుండా, భారీ పబ్లిసిటీ లేకుండా విడుదలైన ఈ చిత్రం సమకాలీన జీవితంలోని భావోద్వేగాలనూ, సంఘర్షణనూ అద్భుతంగా ఆవిష్కరించింది. మొత్తానికి రమేష్ సిప్పీ నేతృత్వంలోని జాతీయ అవార్డుల కమిటీ జనం మెచ్చిన చిత్రాలకూ, ప్రతిభావంతులైన నటులకూ, సాంకేతిక నిపుణులకూ పట్టంగట్టిందని చెప్పవచ్చు.