ప్రపంచమంతా మలయాళ సినిమాలను పొగుడుతూ, తాజా జాతీయ అవార్డుల్లోనూ దేశమంతటిలోకీ ఉత్తమ సినిమాగా మలయాళ చిత్రమే నిలిచిన పరిస్థితుల్లో... ఆ పరిశ్రమలో పైకి కనిపిస్తున్న మంచితో పాటు కనిపించని దుర్లక్షణాలూ అనేకం ఉన్నాయని బహిర్గతమైంది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై కేరళ ప్రభుత్వం 2017 జూలైలో వేసిన హేమ కమిటీ నివేదిక బయటకు రావడంతో తేనెతుట్టె కదిలింది.
నాలుగేళ్ళ పైచిలుకుగా కేరళ ప్రభుత్వం గుట్టుగానే అట్టి పెట్టిన ఈ నివేదిక న్యాయస్థానంలో, రాష్ట్ర సమాచార కమిషన్‌లో అనేక పోరాటాల అనంతరం సోమవారం బాహ్యప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. సున్నిత సమాచారం, వ్యక్తుల వివరాల పేజీలను మినహాయించి బయటకొచ్చిన మిగతా నివేదిక అంశాలపై దేశవ్యాప్త చర్చ రేగుతోంది.
ఏడెనిమిదేళ్ళ క్రితమే అంతర్జాతీయంగా ‘మీ టూ’ ఉద్యమం, ఆపైన భారత సినీరంగంలోనూ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదాలు, ఆడవాళ్ళు పని కావాలంటే లైంగిక లబ్ధి కలిగించేలా ‘కమిట్‌మెంట్’ ఇచ్చి, ‘కాంప్రమైజ్’ కావాల్సి వస్తోందనే ఆరోపణలు చూశాం. అయినా సరే... మలయాళ నటులు, పరిశ్రమ నిపుణుల్ని పలువురిని ఇంటర్వ్యూ చేసి హేమ కమిటీ వెల్లడించిన అంశాలు నివ్వెర పరుస్తున్నాయి.
సెట్‌లో స్త్రీలపై లైంగిక వేధింపులు, తాగివచ్చి వారు బస చేసిన గది తలుపులు కొట్టడాలు, 10–15 మంది శక్తిమంతమైన లాబీ గుప్పెట్లో మలయాళ చిత్రసీమ లాంటి సంగతులను కమిటీ కుండబద్దలు కొట్టింది. కోల్‌కతాలో విధినిర్వహణలో డాక్టర్‌పై హత్యాచార ఘటనతో అట్టుడుకుతున్న దేశంలో సినీరంగ స్త్రీల పరిస్థితీ ఏమంత భిన్నంగా లేదని తేలిపోయింది.
అత్యంత సంచలన అంశాలేమీ బయటపెట్టకుండా కమిటీ పెద్దమనిషి తరహాలో నివేదికను ఇచ్చిందనే అధిక్షేపణలూ లేకపోలేదు. ఆ మాటెలా ఉన్నా పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణుల్ని బయటపెట్టి, ప్రజాక్షేత్రంలో వాటిపై చర్చ లేవనెత్తడంలో విజయం సాధించింది. స్టెనోగ్రాఫర్ కానీ, కనీస ఇతర సౌకర్యాలు కానీ లేకున్నా సరే, అనేక అవరోధాలను అధిగమించి మరీ ఈ కమిటీ 233 పేజీల నివేదిక సిద్ధం చేసింది.
నివేదికలో బలాబలాలు ఏమైనప్పటికీ, సినీసీమలోని చీకటి కోణంపై దర్యాప్తు జరిపి ఇలాంటి నివేదిక ఒకటి వెలువడడం దేశంలో ఇదే తొలిసారి. నిజానికి, అనివార్య పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఈ సంఘాన్ని వేయాల్సి వచ్చింది. ఓ ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి, హీరో దిలీప్ కదులుతున్న కారులో జరిపిన లైంగిక అత్యాచారంతో 2017 ఫిబ్రవరిలో మలయాళ చిత్రసీమ అట్టుడికింది.
రాష్ట్రమంతా నిరసనలు, ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ బృందం డిమాండ్ల మేరకు కేరళ సర్కార్ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి కె. హేమ సారథ్యంలో త్రిసభ్య సంఘం వేయక తప్పలేదు. తెలుగు టి శారద కూడా అందులో మెంబరే! ఆ కమిటీ 2019 డిసెంబర్ 31కే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
ఉద్యమకారులు పదే పదే అభ్యర్థించినా, సినిమావాళ్ళ ప్రైవసీకి భంగమంటూ సర్కార్ ఇన్నేళ్ళుగా ఆ నివేదికను తొక్కిపెట్టింది. అదేమంటే, అది న్యాయవిచారణ సంఘం కాదు గనక నివేదిక బయటపెట్టాల్సిన బాధ్యత లేదు పొమ్మంది. నివేదిక విడుదలను ఆపాలన్న ఓ నటి అభ్యర్థనను సైతం హైకోర్ట్ తాజాగా తోసిపుచ్చడంతో... చివరకు నివేదిక బహిర్గతమైంది.
తళుకుబెళుకుల సినీరంగానికి అంచున... సహజంగానే అనేక బలహీనతల నీలి నీడలు పరుచుకొని ఉంటాయని ప్రపంచానికి తెలుసు. అది ఒక్క మలయాళ సినీసీమకే పరిమితం కాదు. అందం, ఆనందం, ఆర్థిక ప్రయోజనం, పదుగురిలో పాపులారిటీ, పలుకుబడి పోగుబడినందున అన్ని భాషల సినీ రంగాల్లోనూ ఉన్నదే! కాకపోతే, తొందరపడి ఎవరూ బాహాటంగా ప్రస్తావించని చేదు నిజమది.
లైంగిక వేధింపులు సహా ఆవేదన కలిగించే అనుభవాలు అనేకమున్నా, ఆడవాళ్ళు ఆ మాట బయటకు చెప్పరు. చెబితే పరిశ్రమలో అప్రకటిత నిషేధం సహా ఇంకా అనేక ఇతర వేధింపులు తప్పని దుఃస్థితి. ఆది నుంచి ఈ రుగ్మతలు ఉన్నవే. ‘సినీరంగంలో స్త్రీలు నిత్యం ఎదుర్కొంటున్న భూతం లైంగిక వేధింపులు’ అని కమిటీ తెగేసి చెప్పడంతో మేడిపండు పగిలింది.
మన యావత్ భారతీయ సినీ రంగానికి ఇది ఒక మేలుకొలుపు. అన్ని భాషల్లోనూ కలల వ్యాపారంలో కొనసాగుతున్న పితృస్వామ్య భావజాలం, లైంగిక దుర్విచక్షణ, వేతన వ్యత్యాసాలు సహా అనేక అవలక్షణాలపై మనకు చెంపపెట్టు. చిత్రం ఏమిటంటే, ప్రైవేట్ పరిశ్రమల్లో పని పరిస్థితులకు సైతం ప్రభుత్వ షరతులు, చట్టాలు వర్తిస్తాయి. ఎప్పుడో సినీరంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించినట్టు కేంద్ర సర్కార్ ప్రకటించినా దాని వల్ల ఒనగూడిన ప్రయోజనాలేవో అర్థం కాదు.
కళ, వ్యాపారపు కల కలగలిసిన సృజనశీల పరిశ్రమకు చట్టాలు చేయడం అంత సులభం కాకపోవచ్చు. కానీ, మగవారితో సమానంగా ఆడవారికి వేతనం మాట దేవుడెరుగు... మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొనే మరుగు స్థలాల లాంటి కనీస వసతులైనా కల్పించలేమా? సమ్మతితో పని లేకుండా ఆడవారితో ఎలాగైనా ప్రవర్తించవచ్చని భావిస్తున్న పని ప్రదేశంలో తగినంత బాధ్యత, భద్రత పెంపొందించేలా చేయలేమా? సమాజంగా మనం, సర్కారుగా పాలకులు సినీ పరిశ్రమపై ఆలోచించాల్సిన ఇలాంటి అంశాలు అనేకం.
ఎప్పటి నుంచో ప్రత్యేక సినిమా విధానం తెస్తామని ఊరిస్తున్న కేరళ సర్కార్ సినీసీమలో వేతన ఒప్పందాలు, భద్రత అమలుకు సంబంధించి హేమ కమిటీ సిఫార్సులపై ఇకనైనా దృష్టి పెట్టాలి. పనిచేయడానికి ఒకమ్మాయి ఇంటి గడప దాటి వచ్చిందంటే సర్వం సమర్పించడానికి సిద్ధమైనట్టేనని చూసే పురుషాహంకార దృష్టి ఇకనైనా మారాలి. అన్ని పనిప్రదేశాల లానే సినీ రంగంలోనూ స్త్రీలకు సురక్షితమైన, భద్రమైన వాతావరణం కల్పించడం అంతర్జాతీయ స్థాయికి ఎదిగామని భుజాలు ఎగరేస్తున్న మన సినీ పరిశ్రమ కనీస బాధ్యత.
బయటపడ్డ బహిరంగ రహస్యం
Published Wed, Aug 21 2024 12:21 AM | Last Updated on Wed, Aug 21 2024 5:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment