Malayalam cinema
-
పుష్ప నటుడి థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ చూశారా?
పుష్ప నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సైకలాజికల్ థ్రిల్లర్ బౌగెన్‌విల్లా. ఈ సినిమాకు అమల్ నీరద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, జ్యోతిర్మయి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.కాగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పుష్ప మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప సీక్వెల్ పార్ట్-2 లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ ఉండాలి!
మలయాళ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక సినిమా రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇతర భాషల్లోనూ హేమా తరహా కమిటీని ఏర్పాటు చేయాలని పలువురు నటీనటులు కోరుతున్నారు. వేధింపుల ఘటనలపై తాజాగా నటి, మాజీ ఎంపీ సుమలత స్పందిస్తూ– ‘‘చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపుల అనుభవాలను నాతో చాలామంది పంచుకున్నారు. సెట్స్‌లో చాలా మందికి భయానక అనుభవాలు ఎదురవుతున్నాయని విన్నాను. అవకాశాల కోసం వేధింపులు ఎదుర్కొన్నామని పలువురు మహిళలు నాతో చె΄్పారు. అయితే నాకు ఇలాంటి ఘటనలు ఎప్పుడూ ఎదురవలేదు. నేను చూడలేదు కాబట్టి వేధింపులు జరగలేదని కాదు. కేవలం సినిమా అనే కాదు.. రాజకీయ రంగంతోపాటు ప్రతి రంగంలోనూ ఇలాంటి పవర్ గ్రూపులు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. ఈ విషయాలను ధైర్యంగా బయటపెట్టిన మహిళలకు, అందుకు బాటలు వేసిన డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్)కి ధన్యవాదాలు. తమకు జరిగిన చేదు అనుభవాలను బయట పెడుతోన్న మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. సెట్స్‌లో మహిళలకు భద్రత కల్పించేలా నిబంధనలను తీసుకురావడం, అలాగే వాటిని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఒక పరిష్కారం. ఒకవేళ ఫిర్యాదు చేసినా యూనియన్లు, సినిమా పరిశ్రమలోని ఇతర విభాగాలు వినకపొవచ్చు. అందుకే సెన్సార్ బోర్డు ఉన్నట్లే మహిళలకు సంబంధించిన భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఉండాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను’’ అని పేర్కొన్నారు. -
బయటపడ్డ బహిరంగ రహస్యం
ప్రపంచమంతా మలయాళ సినిమాలను పొగుడుతూ, తాజా జాతీయ అవార్డుల్లోనూ దేశమంతటిలోకీ ఉత్తమ సినిమాగా మలయాళ చిత్రమే నిలిచిన పరిస్థితుల్లో... ఆ పరిశ్రమలో పైకి కనిపిస్తున్న మంచితో పాటు కనిపించని దుర్లక్షణాలూ అనేకం ఉన్నాయని బహిర్గతమైంది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై కేరళ ప్రభుత్వం 2017 జూలైలో వేసిన హేమ కమిటీ నివేదిక బయటకు రావడంతో తేనెతుట్టె కదిలింది. నాలుగేళ్ళ పైచిలుకుగా కేరళ ప్రభుత్వం గుట్టుగానే అట్టి పెట్టిన ఈ నివేదిక న్యాయస్థానంలో, రాష్ట్ర సమాచార కమిషన్‌లో అనేక పోరాటాల అనంతరం సోమవారం బాహ్యప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. సున్నిత సమాచారం, వ్యక్తుల వివరాల పేజీలను మినహాయించి బయటకొచ్చిన మిగతా నివేదిక అంశాలపై దేశవ్యాప్త చర్చ రేగుతోంది. ఏడెనిమిదేళ్ళ క్రితమే అంతర్జాతీయంగా ‘మీ టూ’ ఉద్యమం, ఆపైన భారత సినీరంగంలోనూ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదాలు, ఆడవాళ్ళు పని కావాలంటే లైంగిక లబ్ధి కలిగించేలా ‘కమిట్మెంట్’ ఇచ్చి, ‘కాంప్రమైజ్’ కావాల్సి వస్తోందనే ఆరోపణలు చూశాం. అయినా సరే... మలయాళ నటులు, పరిశ్రమ నిపుణుల్ని పలువురిని ఇంటర్వ్యూ చేసి హేమ కమిటీ వెల్లడించిన అంశాలు నివ్వెర పరుస్తున్నాయి. సెట్లో స్త్రీలపై లైంగిక వేధింపులు, తాగివచ్చి వారు బస చేసిన గది తలుపులు కొట్టడాలు, 10–15 మంది శక్తిమంతమైన లాబీ గుప్పెట్లో మలయాళ చిత్రసీమ లాంటి సంగతులను కమిటీ కుండబద్దలు కొట్టింది. కోల్‌కతాలో విధినిర్వహణలో డాక్టర్‌పై హత్యాచార ఘటనతో అట్టుడుకుతున్న దేశంలో సినీరంగ స్త్రీల పరిస్థితీ ఏమంత భిన్నంగా లేదని తేలిపోయింది.అత్యంత సంచలన అంశాలేమీ బయటపెట్టకుండా కమిటీ పెద్దమనిషి తరహాలో నివేదికను ఇచ్చిందనే అధిక్షేపణలూ లేకపోలేదు. ఆ మాటెలా ఉన్నా పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణుల్ని బయటపెట్టి, ప్రజాక్షేత్రంలో వాటిపై చర్చ లేవనెత్తడంలో విజయం సాధించింది. స్టెనోగ్రాఫర్ కానీ, కనీస ఇతర సౌకర్యాలు కానీ లేకున్నా సరే, అనేక అవరోధాలను అధిగమించి మరీ ఈ కమిటీ 233 పేజీల నివేదిక సిద్ధం చేసింది. నివేదికలో బలాబలాలు ఏమైనప్పటికీ, సినీసీమలోని చీకటి కోణంపై దర్యాప్తు జరిపి ఇలాంటి నివేదిక ఒకటి వెలువడడం దేశంలో ఇదే తొలిసారి. నిజానికి, అనివార్య పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఈ సంఘాన్ని వేయాల్సి వచ్చింది. ఓ ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి, హీరో దిలీప్ కదులుతున్న కారులో జరిపిన లైంగిక అత్యాచారంతో 2017 ఫిబ్రవరిలో మలయాళ చిత్రసీమ అట్టుడికింది. రాష్ట్రమంతా నిరసనలు, ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ బృందం డిమాండ్ల మేరకు కేరళ సర్కార్ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి కె. హేమ సారథ్యంలో త్రిసభ్య సంఘం వేయక తప్పలేదు. తెలుగు టి శారద కూడా అందులో మెంబరే! ఆ కమిటీ 2019 డిసెంబర్ 31కే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఉద్యమకారులు పదే పదే అభ్యర్థించినా, సినిమావాళ్ళ ప్రైవసీకి భంగమంటూ సర్కార్ ఇన్నేళ్ళుగా ఆ నివేదికను తొక్కిపెట్టింది. అదేమంటే, అది న్యాయవిచారణ సంఘం కాదు గనక నివేదిక బయటపెట్టాల్సిన బాధ్యత లేదు పొమ్మంది. నివేదిక విడుదలను ఆపాలన్న ఓ నటి అభ్యర్థనను సైతం హైకోర్ట్ తాజాగా తోసిపుచ్చడంతో... చివరకు నివేదిక బహిర్గతమైంది. తళుకుబెళుకుల సినీరంగానికి అంచున... సహజంగానే అనేక బలహీనతల నీలి నీడలు పరుచుకొని ఉంటాయని ప్రపంచానికి తెలుసు. అది ఒక్క మలయాళ సినీసీమకే పరిమితం కాదు. అందం, ఆనందం, ఆర్థిక ప్రయోజనం, పదుగురిలో పాపులారిటీ, పలుకుబడి పోగుబడినందున అన్ని భాషల సినీ రంగాల్లోనూ ఉన్నదే! కాకపోతే, తొందరపడి ఎవరూ బాహాటంగా ప్రస్తావించని చేదు నిజమది. లైంగిక వేధింపులు సహా ఆవేదన కలిగించే అనుభవాలు అనేకమున్నా, ఆడవాళ్ళు ఆ మాట బయటకు చెప్పరు. చెబితే పరిశ్రమలో అప్రకటిత నిషేధం సహా ఇంకా అనేక ఇతర వేధింపులు తప్పని దుఃస్థితి. ఆది నుంచి ఈ రుగ్మతలు ఉన్నవే. ‘సినీరంగంలో స్త్రీలు నిత్యం ఎదుర్కొంటున్న భూతం లైంగిక వేధింపులు’ అని కమిటీ తెగేసి చెప్పడంతో మేడిపండు పగిలింది. మన యావత్ భారతీయ సినీ రంగానికి ఇది ఒక మేలుకొలుపు. అన్ని భాషల్లోనూ కలల వ్యాపారంలో కొనసాగుతున్న పితృస్వామ్య భావజాలం, లైంగిక దుర్విచక్షణ, వేతన వ్యత్యాసాలు సహా అనేక అవలక్షణాలపై మనకు చెంపపెట్టు. చిత్రం ఏమిటంటే, ప్రైవేట్ పరిశ్రమల్లో పని పరిస్థితులకు సైతం ప్రభుత్వ షరతులు, చట్టాలు వర్తిస్తాయి. ఎప్పుడో సినీరంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించినట్టు కేంద్ర సర్కార్ ప్రకటించినా దాని వల్ల ఒనగూడిన ప్రయోజనాలేవో అర్థం కాదు. కళ, వ్యాపారపు కల కలగలిసిన సృజనశీల పరిశ్రమకు చట్టాలు చేయడం అంత సులభం కాకపోవచ్చు. కానీ, మగవారితో సమానంగా ఆడవారికి వేతనం మాట దేవుడెరుగు... మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొనే మరుగు స్థలాల లాంటి కనీస వసతులైనా కల్పించలేమా? సమ్మతితో పని లేకుండా ఆడవారితో ఎలాగైనా ప్రవర్తించవచ్చని భావిస్తున్న పని ప్రదేశంలో తగినంత బాధ్యత, భద్రత పెంపొందించేలా చేయలేమా? సమాజంగా మనం, సర్కారుగా పాలకులు సినీ పరిశ్రమపై ఆలోచించాల్సిన ఇలాంటి అంశాలు అనేకం. ఎప్పటి నుంచో ప్రత్యేక సినిమా విధానం తెస్తామని ఊరిస్తున్న కేరళ సర్కార్ సినీసీమలో వేతన ఒప్పందాలు, భద్రత అమలుకు సంబంధించి హేమ కమిటీ సిఫార్సులపై ఇకనైనా దృష్టి పెట్టాలి. పనిచేయడానికి ఒకమ్మాయి ఇంటి గడప దాటి వచ్చిందంటే సర్వం సమర్పించడానికి సిద్ధమైనట్టేనని చూసే పురుషాహంకార దృష్టి ఇకనైనా మారాలి. అన్ని పనిప్రదేశాల లానే సినీ రంగంలోనూ స్త్రీలకు సురక్షితమైన, భద్రమైన వాతావరణం కల్పించడం అంతర్జాతీయ స్థాయికి ఎదిగామని భుజాలు ఎగరేస్తున్న మన సినీ పరిశ్రమ కనీస బాధ్యత. -
ఓటీటీకి సూపర్ హిట్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమలు. నెస్లన్ కే గపూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మలయాళంలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి తనయుడు కార్తికేయ. అదే పేరుతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ అప్డేట్స్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం కేవలం మలయాళంలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయంపై అధికారిక ప్రకటనైతే రాలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ఫిబ్రవరి 9వ తేదీన మలయాళంలో ప్రేమలు థియేటర్లలో రిలీజ్ అయింది. రూ.5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. -
ఆస్కార్ నుంచి '2018' సినిమా ఔట్.. ఆ చిత్రానికి దక్కిన ఛాన్స్
ఆస్కార్ 2024 అవార్డుల కోసం భారత్ నుంచి మలయాళం బ్లాక్‌బస్టర్ ‘2018’ అధికారికంగా ఎంపిక కావడంతో భారతీయ చిత్రపరిశ్రమలోని అందరూ చాలా సంతోషించారు. తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించిన 15 చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో 2018 సినిమా పేరు లేదు. ఇదే విషయాన్ని ఆ సినిమా డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. జార్ఖండ్ గ్యాంగ్‌రేప్ ఆధారంగా తీసిన 'టు కిల్ ఎ టైగర్' అనే చిత్రం బెస్ట్ డాక్యుమెంటరీ క్యాటగిరీలో చోటు దక్కింది. టొరంటో ఫిల్మ్ మేకర్ నిషా పహుజా దీన్ని డైరెక్ట్ చేశాడు. 2018 సినిమా ఆస్కార్ రేసు నుంచి తప్పుకోవడంతో ఆ మూవీ డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఇన్‌స్టా ద్వారా తన బాధను వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 88 అంతర్జాతీయ భాషా చిత్రాలు పోటీ పడ్డాయని ఆయన తెలిపారు. కానీ ఫైనల్ చేసిన 15 చిత్రాల్లో 2018 సినిమా స్థానాన్ని దక్కించుకోలేకపోయిందని చెప్పారు. అవార్డు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న అందరినీ ఎంతగానో నిరాశపరిచానని. అందుకు గాను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు. ఏదేమైనా ఆస్కార్ బరిలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన తెలిపాడు. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో '2018'ని ఎంపిక చేశారు. టోవినో థామస్ ప్రధాన పాత్రలో జూడ్ ఆంథోనీ జోసెఫ్ తెరకెక్కిన ఈ చిత్రం అందరి అభిమానాన్ని పొందింది. 2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా రియల్స్టిక్గా జరిగిన కొన్న సంగటనల ఆధారం చేసుకుని ఈ కథను వెండితెరపైకి తీసుకొచ్చారు. ఈ సినిమాను భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినీ ప్రేక్షకులను కూడా మెప్పించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆస్కార్-96 నుంచి ఈ సినిమా తప్పుకోవడంతో భారతీయ చలనచిత్ర అభిమానుల్లో కొంతమేరకు నిరాశ కలిగింది. View this post on Instagram A post shared by Jude Anthany Joseph (@judeanthanyjoseph) -
ఇండస్ట్రీని వదిలేసిన ప్రముఖ దర్శకుడు.. కారణం ఆ జబ్బు!?
సినిమా అనేది వ్యసనం లాంటిది. ఒక్కసారి ఇండస్ట్రీలోకి వస్తే తిరిగి బయటకెళ్లాలి అనిపించదు. కొందరు డైరెక్టర్స్ అయితే కెరీర్ ఖతం అయిపోయినా సరే పిచ్చి సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు టార్చర్ చూపిస్తుంటారు. అలాంటిది బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా తీసిన ఓ దర్శకుడు మాత్రం ఇండస్ట్రీని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ కారణమేంటో తెలుసా? (ఇదీ చదవండి: యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు!) తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం జనరేషన్‌కి ఈ భాషా చిత్రాలు పరిచయమైంది 'ప్రేమమ్'తోనే. సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా పరిచయమైన ఈ మలయాళ మూవీ.. 2015లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి దర్శకత్వం వహించిన అల్ఫోన్స్ పుత్రెన్కి బోలెడంత క్రేజ్ తీసుకొచ్చింది. దర్శకుడు కావడానికి ముందు పలు షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ తీసిన అల్ఫోన్స్.. 2013లో 'నేరమ్' మూవీతో దర్శకుడిగా మారాడు. 'ప్రేమమ్'తో వేరే లెవల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత అవియల్ (2016), గోల్డ్ (2022), గిఫ్ట్ (2023) సినిమాలు తీశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్) కొన్నాళ్ల ముందు అల్ఫోన్స్ ఫొటోలు కొన్ని బయటకొచ్చాయి. వీటిలో బక్కచిక్కి పోయి, నెరిసిన గడ్డంతో కనిపించాడు. దీంతో అనారోగ్యానికి గురయ్యారా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఓ జబ్బుతో బాధపడుతున్నట్లు చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అందుకే దర్శకుడి కెరీర్‌కి పుల్‌స్టాప్ పెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. 'నా సినిమా థియేటర్ కెరీర్ ఆపేస్తున్నాను. అటిజం స్పెక్ర్టమ్ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్నాను. నేను ఎవరికీ భారంగా ఉండలనుకోవట్లేదు. సాంగ్, వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ మాత్రం చేస్తాను. ఓటీటీ కంటెంట్ కూడా చేస్తాను. నిజానికి సినిమాలు ఆపేయాలనుకోవడం లేదు. కానీ వేరే అవకాశం లేకుండా పోయింది. చేయలేని వాటి గురించి ప్రామిస్ చేయలేను. అనారోగ్యం ఉన్నప్పుడు జీవితంలో ఇంటర్వెల్ పంచ్ లాంటి ట్విస్ట్ ఇలా వస్తుంది' అని అల్ఫోన్ రాసుకొచ్చాడు. కానీ ఈ పోస్ట్ కాసేపటికే డిలీట్ చేశాడు. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) -
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బుల్లితెర నటి ఆత్మహత్య!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ బుల్లితెర నటి రెంజూష మీనన్ ఆత్మహత్యకు పాల్పడింది. తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించింది. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ షాకయ్యారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. రెంజూషా మీనన్ మలయాళ సీరియల్ 'స్త్రీ'తో నటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆణె అనేక చిత్రాలలో కీలక పాత్రల్లో నటించింది. తన భర్తతో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తోంది. అయితే ఆమె మరణానికి కొన్ని గంటల ముందే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో రీల్స్ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించింది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం. ఆ కారణంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు. రెంజూషా టీవీ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. కొచ్చికి చెందిన రెంజూషా ఒక మొదట యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత 'స్త్రీ' సీరియల్‌తో బుల్లితెరపై మెరిసింది. 'నిజలాట్టం,' 'మగలుడే అమ్మ,' బాలామణి' లాంటి ధారావాహికల్లో కనిపించింది. అంతే కాకుండా 'సిటీ ఆఫ్ గాడ్' మరియు 'మెరిక్కుండోరు కుంజడు' అనే సినిమాల్లో కూడా కనిపించింది. చివరిసారిగా 'ఆనందరాగం' అనే టీవీ షోలో లీడ్ రోల్ పాత్ర పోషించింది. View this post on Instagram A post shared by Sumesh Surya (@sumeshsurya) #Malayalam TV and film actress Renjusha Menon found dead in her flat Renjusha Menon made her debut as an actor with the Malayalam serial 'Sthree'. She also played many supporting roles in several films.https://t.co/iGKNsYWFvZ — South First (@TheSouthfirst) October 30, 2023 View this post on Instagram A post shared by Sreedevi Anil (@anil_sreedevi) -
ఆస్కార్ బరిలో చిన్న సినిమా.. అవార్డ్ దక్కేనా?
కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన చిత్రం 2018. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. చిన్న సినిమాగా వచ్చి భారీ వసూళ్లు సాధించింది. అయితే తాజాగా ఈ చిత్రం భారత్ తరఫున ప్రతిష్టాత్మక ఆస్కార్ రేసులో నిలిచింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మలయాళంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. (ఇది చదవండి: 2018 మూవీ రివ్యూ) ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్‌తోనే భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. 2024 ఆస్కార్ అకాడమీ అవార్డులకు భారతదేశం అధికారిక ఎంట్రీ చిత్రంగా ఎంపిక చేసినట్లు కన్నడ చిత్ర దర్శకుడు గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని జ్యూరీ ప్రకటించింది. నామినేషన్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంటేనే ఈ చిత్రం అవార్డుకు అర్హత సాధిస్తుంది. కాగా.. 96వ ఆస్కార్ వేడుకలు మార్చి 10, 2024న లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో జరగనున్నాయి. (ఇది చదవండి: ఈ అమ్మాయి ఎవరో తెలుసా?.. ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్!) ఆస్కార్-2023 ఏడాదిలో ఎంట్రీకి ఛెలో షో (2022), కూజాంగల్ (2021), జల్లికట్టు (2020), గల్లీ బాయ్ (2019), విలేజ్ రాక్‌స్టార్స్ (2018), న్యూటన్ (2017), విసరాని (2016) చిత్రాలు ఎంపిక కాగా.. ఏది ఎంపిక అవ్వలేదు. ఇప్పటివరకు మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్ చిత్రాలు మాత్రమే ఆస్కార్‌కు నామినేట్ భారతీయ సినిమాలుగా నిలిచాయి. ఆస్కార్ 2023లో ఇండియా సినిమాలు రెండు అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ రాగా.. డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. కార్తికీ గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో దక్కించుకుంది. -
దేశవ్యాప్తంగా చర్చ రేపుతున్న ‘గ్రేట్ ఇండియన్ కిచెన్’ రివ్యూ
వంట గదిలో పొయ్యి వెలుగుతూ ఉండాలి. వెలిగించే పని ఆమెదే. సింక్‌లో గిన్నెలు పడుతూ ఉండాలి. కడిగే పని ఆమెదే. మనిషికో కూర కావాలి. అమర్చే పని ఆమెదే. ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి... ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి... ఏళ్లకు ఏళ్లు... ఎవరికో ఒకరికి విసుగు పుడుతుంది. తీసి మురికినీళ్లు కుమ్మరించాలనిపిస్తుంది. ఆ కోడలు అదే పని చేసింది. దేశవ్యాప్తంగా చర్చ రేపుతున్న మలయాళ సినిమా ‘గ్రేట్ ఇండియన్ కిచెన్’ రివ్యూ ఇది. ఒక ప్రయోగం చేసి చూద్దాం. ఈ పూట భర్తకు నాలుగు ఉల్లిపాయలు ఇచ్చి ‘సరదాగా తరగరాదూ’ అని భార్య అనేలా చేద్దాం. ‘ఓ’ అని సరదాగా టీవీ చూస్తూ తరుగుతాడు. ఏదైనా జోక్ కూడా వేస్తాడు. అయిపోతుంది. మధ్యాహ్నం అవుతుంది. ‘ఇదికో ఈ రెండు బీరకాయలు తొక్క తీసి ఇవ్వరాదూ’ అని భార్య చేత ఇచ్చేలా చేద్దాం. ‘బీరకాయలా?’ అని ఎగాదిగా చూస్తాడు. ఈసారి జోకులేయడు. తొక్క తీసి ఇచ్చేస్తాడు. రాత్రవుతుంది. వంట చేసే వేళవుతుంది. ‘ఇదిగో... నిన్నే... ఈ ఆలుగడ్డ కొంచెం వొలిచీబ్బా’ అని భార్య భర్తతో అనాలి. అప్పుడు భర్త ఏం చేస్తాడు? ఒక్కరోజుకే. ఆహా... ఇల్లు నెత్తికెత్తుకుంటావేం. మరి రోజూ.. రోజూ.. రోజూ.. నెలలు... సంవత్సరాలు.. మూడు పూట్లా ఆమె వొలుస్తూ... తరుగుతూ.. కోస్తూ.. వేయిస్తూ.. ఉడకబెడ్తూ.. దించుతూ.. ఎక్కిస్తూ... చేయి కాల్చుకుంటూ పని చేస్తూ ఉందే... ఆమె ఎందుకు ఇల్లును గిరాటు వేసి వెళ్లకూడదు? వంట ఎవరిది? ఈ ఆదిమ ప్రశ్నకు సమాధానంగా పురుషుడు అనాదిగా స్త్రీ వైపు వేలు చూపిస్తూ వచ్చాడు. స్త్రీ ఇంట్లో ఉండాలి. ఉత్తినే ఉండకూడదు.. వంట చేస్తూ ఉండాలి. పురుషుడు ఇంటికొచ్చే వేళకు ఆమె భోజనం సిద్ధం చేయాలి. పురుషుడు కూడా తెలివైనవాడు. అందుకు బదులుగా ఆమెకు ఒక నగ చేయిస్తాడు. ఒక చీర కొనిపెడతాడు. ‘నేనేమైనా వంట గదిలోకి వస్తున్నానా? అక్కడి పెత్తనమంతా నీదేగా’ అని ఇంట్లో మూలగా ఉండే వంట గదిని ఆమెకు రాసిస్తాడు. ఆ పనిలో ఎప్పటికీ సాయం చేయడు. అది తన పని కాదు. అది ఆమెదే. కిచెన్ కే సైడ్ ఎఫెక్ట్స్ వంట అంటే కేవలం వంటేనా? పొయ్యి మీద నుంచి దించడమేనా? కాదు... కాదు.. వంట అంటే కప్‌బోర్డ్‌లో సరుకులు ఉన్నాయో లేవో చూసుకుంటూ ఉండాలి.. ఫ్రిజ్‌లో పాలున్నాయో లేవో చూసుకుంటూ ఉండాలి... గిన్నెలు శుభ్రంగా ఉన్నాయో లేవో చూసుకుంటూ ఉండాలి... మిగిలినవి పారబోయకుండా వాటిని మళ్లీ ఎలా వాడాలా చూసుకుంటూ వుండాలి... మూడు పూట్లా తిన్నాక పడే ముప్పై అంట్లను తిరిగి తోమితోమి మర్నాటికి సిద్ధం చేసుకుంటూ ఉండాలి... ఇంట్లో వాళ్లకు ఏం కావాలన్నా మనమే వొండాలి. మనకు ఏం కావాలన్నా మనమే వొండిపెట్టుకోవాలి. ఇంతా అయ్యాకా? ‘ఇంకొంచెం ఉడకనివ్వాల్సింది’... ‘కొంచెం కారం తక్కువైంది’.. ‘మా అమ్మైతే ఇలా చచ్చినా చేయదు’... ‘ఏనాడు సరిగ్గా వొండావు కనుక’... ‘ఒక్క కూరే తగలడ్డావేం’.. ఇలాంటి మాటలు వినాలి. వినాలి. వినాలి. వింటూ ఉండటమేనా పని. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ ‘నేను వినను’ అనుకుంది ఆ ఇంటి కోడలు. ‘నేను వినదలుచుకోలేదు’ అని కూడా అనుకుంటుంది గట్టిగా ఆ సినిమాలో. చదువుకున్న అమ్మాయి తను. డాన్సర్. సరే అందరూ పెళ్లి చేసుకోవాల్సిందే కనుక పెళ్లి చేసుకుంది. పెళ్లి ఎందుకు చేసుకుంది. జీవించడానికి. జీవితంలో వంట ఉంటుందని ఆమెకు కూడా తెలుసు. కాని అతనికి మాత్రం వంట మధ్య ఆమె ఉంటుంది. ఉదయం లేస్తే మావగారికి, భర్త గారికి వొండి వొండి ఆమెకు సరిపోతూ ఉంటుంది. మామగారు కట్టెల మీద ఉడికించిన అన్నాన్నే తింటారు. భర్త గారు మధ్యాహ్నం మిగిలిన అన్నం ఉందిరా మగడా అంటే ‘రాత్రయితే నేను చపాతీయే తింటాను’ అంటాడు. మిక్సీలో పచ్చడి వేయకూడదట. రోటి పచ్చడి చేయాలట. రాత్రి మిగిలిన కూరను పొద్దునకు వేడి చేసి పెట్టకూడదట. ఫ్రెష్‌గా చేయాలట. అంట్లు సింకులో ఇన్నిన్ని. దానికి లీకేజీ ప్రాబ్లమ్. ‘ప్లంబర్ని పిలువు తండ్రీ’ అని భర్తతో అంటే అదేమైనా పెద్ద సమస్యా పట్టించుకోవడానికి? ఆమెకు కలలో, శృంగారం లో కూడా అంట్లే గుర్తుకొస్తుంటాయి. ఇంట్లో అత్తగారు లేరా? ఉంది. ఆమె చేసి చేసి చేసి సున్నమై ఉంది. ఆమెను వొదులుతారా? కూతురు కడుపు తో ఉంటే అల్లుడిగారికి అన్నీ వొండి పెట్టడానికి పిలిపిస్తారు. ప్రతి ఇంట్లో పొయ్యి మండుతూ ఉండాలి. ఇల్లాలి చెమట కారుతూ ఉండాలి. ఎంత కాలం? ప్రతిఘటన ఇంతలో భర్త, మామగారు అయ్యప్ప మాల వేస్తారు. ఆ మాల వేసినప్పటి నుంచి ఆమెకు టెన్షన్. ఎదురు పడకూడదు. పొరపాటున కూడా భర్తను తాకకూడదు. బహిష్టు అయితే గదిలో దాక్కుని ఉండాలి. స్త్రీల గర్భం నుంచే లోపలి మలినాన్ని చీల్చుకునే పుడతారు అందరూ. కాని ఆమెకు మలినం ఉండే రోజులను లెక్కగడతారు. ఉన్న ఇద్దరికి వొండలేక కోడలు సతమతమవుతుంటే ఈ అయ్యప్ప భక్తుల రాకపోకలు, పూజలు దానికి సంబంధించిన వంట చాకిరి... ఆమె విసిగిపోతుంది. నిజమే. ఇంట్లో పనులు చేయదగ్గ శక్తి ఉంటే చేయొచ్చు. కాని ఆ పనిలో భాగస్వామ్యం అక్కర్లేదా? తోడు అక్కర్లేదా? ఏం చేస్తావులే.. ఈ పూటకు రెస్ట్ తీసుకో అనే మాట అక్కర్లేదా... ఎలాగోలా వండుతున్నావో అదే పదివేలు అనే కృతజ్ఞత అక్కర్లేదా? లోకంలో వంట మనిషితో మర్యాదగా వ్యవహరిస్తారు జనం ఎక్కడ మానేస్తుందో అని. ఈమె కోడలు? ఎక్కడకు పారిపోతుంది? తాగిన టీ కప్పు అయినా కడిగి పెట్టరా గాడిదా అని భర్త గురించి ఆమె మనుసులో అనుకుంటూ ఉంటుందో లేదోకాని ప్రేక్షకులకు అనిపిస్తూ ఉంటుంది. చివరకు ఆమె క్లయిమాక్స్‌లో తీవ్రంగా విసిగిపోతుంది. భర్త మీద, మామగారి మీద మురికి నీళ్లు పోసి ఆ ఇంటి నుంచి శాశ్వతంగా బయటపడుతుంది. ఇది ఈ సమస్యకు పరిష్కారమా? అంటే కాకపోవచ్చు. ఇది ఈ సమస్యను ముఖాన గుద్ది చూపిన ఒక ప్రతిఘటన అనుకోవాలి. తెలుగు సాహిత్యంలో ఎన్నో కథలు వంట బాధతో అల్లాడే స్త్రీల వ్యధను చెప్పాలి. ఇవాళ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ చాలా శక్తిమంతంగా స్త్రీ వేదనను చూపింది. వంటలో ఉండే శ్రమ, వొత్తిడి, పురుషుడి యజమాని పాత్ర ఎంత అమానమీయమైనవో ఈ సినిమా చూపుతుంది. ఇంట్లో స్త్రీ పురుషులు ఇద్దరూ ఉన్నప్పుడు వంట పని స్త్రీది మాత్రమే ఎలా అవుతుంది? వంట మీద వ్యతిరేకత కాదు ఈ సినిమా. వంటకు సంబంధించిన శ్రమలో విభజన, మానవీయత అవసరం గురించి మాట్లాడటమే ఈ సినిమా. కట్టెల పొయ్యి వెళ్లి గ్యాస్ స్టౌ వచ్చి ఉండొచ్చు. కాని ఏ ఇంటిలో అయినా స్త్రీ ఆ గ్యాస్ స్టౌ ఎదుట రోజూ ఎన్ని గంటలు నిలుచుంటున్నదో లెక్క వేసుకుంటే అలా నిలుచోబెట్టడం ఎంత న్యాయమైన పనో ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. సినిమా క్లయిమాక్స్‌లో ‘ఏరా.. నీ నీళ్లు నువ్వు తాగలేవా’ అని తమ్ముణ్ణి తిడుతుంది అక్క, అత్తారింటి నుంచి పారిపోయి వచ్చాక, వాడు చెల్లెల్ని నీళ్లు అడుగుతుంటే. ఇంట్లో ఉండే అబ్బాయిలకు ముందు నుంచి ఈ సంస్కారం నేర్పిస్తే వంట గదులు ఇద్దరూ కలిసి పని చేసే గదులు అవుతాయి. ఆ రోజు రావాలని హెచ్చరించే సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ జనవరి 15న ‘నీస్ట్రీమ్’ అనే ఓటిటి ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదలైన మలయాళ సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’. జో బేబీ దీని దర్శకుడు. నిమిష సజయన్, సూరజ్ వంజర మూడు నటించారు. సినిమా అంతా కేవలం ఒక ఇంట్లో జరుగుతుంది. దాదాపుగా ఇన్‌డోర్‌లో ఎక్కువగా కిచెన్‌లో జరుగుతుంది. క్లయిమాక్స్‌లో మాత్రమే ఒక్కసారి ఔట్‌డోర్ కనిపిస్తుంది. దర్శకుడు ఈ సినిమాలో స్త్రీలు వంట చేయడానికి పడే శ్రమను వారి అప్రమత్తతను శక్తిమంతంగా చూపిస్తాడు. వండకపోయినా కనీసం టేబుల్ మేనర్స్ కూడా పాటించని మగవాళ్లను ఈసడించుకునేలా చేస్తాడు. తిన్నాక మిగిలిన దానిని డస్ట్‌బిన్‌లో వేసి కంచం శుభ్రం చేసి పెట్టే పని కూడా చేయని మగవారు ఉంటే ఆ ఇంటి ఆడవాళ్లు ఆ రోతను ఎలా భరిస్తూ వెళతాడో చూపిస్తాడు. వంట పనిని ఆడవాళ్లకు అప్పజెప్పడంలో ఏ కులమూ ఏ మతమూ వెనుకాడలేదు. ఫలానా మతంలోకి మారితే వంట పని ఉండదు అనంటే ఈ దేశంలో బహుశా ప్రపంచమంతా ఆ మతంలోకి ఆడవారు మారిపోతారని నిర్వివాదాంశంగా చెప్పవచ్చు. వంట గురించి స్త్రీల మొత్తుకోళ్లు సాగుతూనే ఉంటాయి. ఇది మాత్రం మాడుకోలు. అంటే మగవారి మాడును పగలగొట్టిన సినిమా అని మాత్రం చెప్పక తప్పదు. – సాక్షి ఫ్యామిలీ -
మూవీ మాఫియా ఇళ్లల్లో దాక్కుంది
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ రూటే సెపరేటు. మనసులో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తుంటారు. ఈ కారణంగా ఆమెను అభినందించేవాళ్లూ ఉన్నారు.. విమర్శించేవాళ్లు కూడా ఉన్నారు. ఒక్కోసారి ఆమె మాటలు, పోస్టులు వివాదాలకు దారి తీస్తూ తీవ్ర దుమారం సృష్టిస్తుంటాయి. తాజాగా మరోసారి బాలీవుడ్‌పై, అక్కడి సినీ ప్రముఖులపై ఘాటైన వ్యాఖ్యలతో మండిపడ్డారామె. 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి ‘ఉత్తమ విదేశీ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో భారతదేశం తరఫున మలయాళ సినిమా ‘జల్లికట్టు’ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా టీమ్‌ను ప్రశంసిస్తూ కంగన ఓ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖులను కూడా విమర్శించారు. ‘‘అందరిపై అధికారం చెలాయించాలని చూసే బుల్లీడవుడ్ (బుల్లీ అంటే ర్యాగింగ్ అనొచ్చు... బాలీవుడ్ ‘బుల్లీడవుడ్’ అని కంగనా ఉద్దేశం) గ్యాంగ్‌కు సరైన ఫలితాలు వచ్చాయి. భారతీయ చిత్రపరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాలకు చెందినది మాత్రమే కాదు.. మూవీ మాఫియా గ్యాంగ్ ఇళ్లలోనే దాక్కుని, జ్యూరీని తన పనిని తాను చేసేలా చేసింది. ‘జల్లికట్టు’ చిత్రబృందానికి అభినందనలు’’ అని కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
ఓటీటీలో ఓనమ్
కేరళ పెద్ద పండగ ఓనమ్. మలయాళ సినిమాకి ప్రియమైన పండగ. ప్రతీ ఏడాది కనీసం నాలుగు కొత్త సినిమాలు ఓనమ్ స్పెషల్‌గా థియేటర్లోకి వస్తాయి. అయితే ప్రతీ ఏడాది పండగ థియేటర్స్‌లో జరిగేది. ఈ ఏడాది ఇంట్లోనే జరగనుంది. పని ఆగిపోయుండొచ్చు. కానీ పండగ ఆగకూడదు. సంబరం అస్సలు ఆగకూడదు. తాజాగా మూడు మలయాళీ సినిమాలు ఓనమ్ స్పెషల్‌గా ఇంటికి (ఓటీటీ)లోకి వస్తున్నాయి. ‘ఓటీటీలో ఓనమ్’ విశేషాలేంటో చూద్దాం. కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ టోవినో థామస్ హీరోగా జో బేబీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’. కేరళ టూరిజమ్‌ని ఆస్వాదించడానికి వచ్చిన ఓ విదేశీ అమ్మాయికి కేరళను పరిచయం చేసే పాత్రలో టోవినో పాత్ర ఉంటుంది. ఇదో రోడ్ మూవీ. హీరో హీరోయిన్ తమ బైక్ మీద కేరళను ఎలా చుట్టేస్తారనేది కథలో ముఖ్యభాగం. హీరోగా నటించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించారు టొవినో. ఈ చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. అంతే కాదు ఆగస్ట్ 31న ఈ చిత్రాన్ని నేరుగా టీవీలోనూ (ఏషియానెట్ ఛానెల్) ప్రసారం చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. సీ యూ సూన్ లాక్డౌన్ వల్ల సినిమా పరిశ్రమ స్తంభించిపోయింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఓ కొత్త ఛాలెంజ్ స్వీకరించారు ఫాహద్ అండ్ టీమ్. లాక్డౌన్ నిబంధనలు అనుసరిస్తూ ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించారు. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలో ఫాహద్, రోషన్ మాథ్యూ, దర్శన ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘సీ యూ సూన్’. ఈ చిత్రాన్ని చాలా శాతం వరకూ ఐ ఫోన్లోనే చిత్రీకరించారు. తప్పిపోయిన స్నేహితుడి గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటర్నెట్ సహాయంతో ఎలా వెతికి పట్టుకున్నారన్నది కథాంశం. 98 నిమిషాలు నిడివి ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. మణియరాయిలే అశోకన్ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవలే నిర్మాతగానూ మారారు. ఆయన నిర్మాణంలో వస్తున్న మరో సినిమా ‘మణియరాయిలే అశోకన్’. జాకోబ్, అనుమపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి షామ్జూ జేబా దర్శకత్వం వహించారు. అనుపమ హీరోయిన్గా నటించడం మాత్రమే కాకుండా ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగానూ పని చేశారు. ‘‘ఇలాంటి ముద్దొచ్చే ప్రేమకథను నిర్మించడం చాలా గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు నటుడు దుల్కర్. ఈ సినిమాలో దుల్కర్ ఓ అతిథి పాత్ర చేశారని కూడా టాక్. ఈ చిత్రం నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. -
కన్నడ సినిమా... ఛలో అమెరికా!
సినిమా రాబడికి సంబంధించి ఇండియాతో పాటు విదేశాల్లో వసూళ్ళు చాలా కీలకం. హిందీతో పాటు తమిళ, తెలుగు చిత్రాలకు ఈ ఓవర్సీస్ మార్కెట్ చాలా పెద్దది. మలయాళ సినిమాలకూ కొన్ని దేశాల్లో చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది. ఇప్పుడు క్రమంగా కన్నడ సినిమాలు కూడా ఆ బాట పడుతున్నాయి. గడచిన 2015 గణాంకాలను బట్టి చూస్తే, కన్నడ చిత్రాలు కూడా అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల్ని ప్రేక్షకులుగా మలుచుకుంటూ, క్రమంగా ఓవర్సీస్లో విస్తరిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా. 2015లో దాదాపు 14 కన్నడ సినిమాలు అమె రికాలో రిలీజయ్యాయి. అందులో మన సాయి కుమార్ నటించగా, కొత్తవాళ్ళు తీసిన ప్రయోగా త్మక థ్రిల్లర్ చిత్రం ‘రంగి తరంగ’, ఉపేంద్ర చేసిన ‘ఉప్పి2’ లాంటివి బాగా ఆడాయి. ఈ కన్నడ చిత్రాలన్నీ కలిపి 4.2 లక్షల డాలర్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు పేర్కొ న్నాయి. ఇతర దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ లతో పోలిస్తే, అమెరికాలో రిలీజవు తున్న కన్నడ సినిమాల సంఖ్య, వాటి వసూళ్ళు కొద్దిపాటే కావచ్చు. కానీ క్రమంగా పెరిగే సూచ నలు కనబడుతున్నాయి. కొత్త ఏడాదిలో మరిన్ని కన్నడ ఫిల్మ్స్ యుఎస్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. గతంలో అమెరికాలోని కన్నడ సంఘాలు స్పాన్సర్ చేసి, ఒకటి రెండు రోజుల పాటు ఈ సినిమాల్ని ప్రదర్శించేవి. ఆ సంఘాల సభ్యులు టికెట్లు కొనుక్కొని, ప్రదర్శనలు జరుగుతున్న చోటుకెళ్ళి చూసొచ్చే వారు. కానీ, ‘రంగి తరంగ’ ఏకంగా 40 చోట్ల రిలీజైంది. నిరుడు అమెరికాలో వచ్చిన కన్నడ సినీ వసూళ్ళలో అధిక భాగం ఈ చిత్రం సంపాదించినవే. ఇక, ‘ఉప్పి-2’ కూడా 25 చోట్ల విడుదలైంది. ఈ చిత్ర యూనిట్లు అమెరికాలో ఈ ప్రాంతాలు తిరిగి, అక్కడి ప్రేక్షకుల్ని కలిశారు. ఆ పబ్లిసిటీ వసూళ్ళకి తోడ్పడింది. ‘కేరాఫ్ ఫుట్‌పాత్ 2’, ‘మిస్టర్ ఐరావత’, ‘ప్లస్’ లాంటి చిత్రాలు గత ఏడాది బాగా ఆకర్షించాయి. దాంతో, ఈ కొత్త ఏడాది మరిన్ని కన్నడ సినిమాలు ఓవర్సీస్ రిలీజ్‌కు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే, తెలుగు, తమిళాలకు భిన్నంగా కన్నడ సినిమాలు ఇండియాలో రిలీజయ్యాక ఒకటి, రెండు వారాలు ఆలస్యంగా అమెరికాకు వెళుతున్నాయి. -
అలాంటి సినిమాల్లోనే చేస్తాను
సంచలన తారలుగా పేరొందిన హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. మనసులో ఒకటి బయట మరొకటి చెప్పే వ్యక్తిత్వం కాదామెది. ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా చెప్పే మనస్తత్వం. అలాంటి ప్రవర్తనతో కొన్ని వివాదాలను కొని తెచ్చుకున్నారు. మలయాళంలో చిత్రాలు చెయ్యకపోయినా ఇతర భాషలైన తమిళం తెలుగు భాషల్లో ఈ బ్యూటీకి మంచి డిమాండ్ ఉంది. నటిగాను మంచి పేరుపొందిన నిత్యామీనన్ తన మనసులోని భావాలను ఆవిష్కరించారు. అవేమిటో చూద్దాం. ప్ర: నటిగా వెనుకబడినట్లున్నారు? జ: నా కంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని మీరను. ఎన్ని చిత్రాలు చేశామన్నది ముఖ్యం కాదు. ఎన్ని మంచి చిత్రాలు చేశాం అన్నదే ప్రధానం. ప్ర: స్టార్ హీరోల సరసన నటించరాదని నిర్ణయించుకున్నారా ఏమిటి? జ: పెద్ద హీరోలా, చిన్న హీరోలా అన్న విషయం గురించి నేను అస్సలు పట్టించుకోను. కథలో నా పాత్ర ప్రాముఖ్యత ఏమిటి? దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న అంశాలనే పరిగణనలోకి తీసుకుంటాను. అలాగే బ్యాడ్ భారీ చిత్రాల్లో నటించే కంటే చిన్న హీరోలైనా మంచి కథా చిత్రాల్లో చేయాలని ఆశిస్తాను. మరో విషయం ఏమిటంటే నేను నటించే పాత్ర నాకు సంతృప్తిని కలిగించాలి. అలాంటి పాత్రలకు నేనెప్పుడూ సిద్ధమే. నటిగా నేనిప్పటికీ 30 చిత్రాలు చేశాను. జయాపజయాలను పక్కన పెడితే ఈ చిత్రాలన్నీ నాకు సంతోషాన్నిచ్చినవే. ప్ర: చాలా గ్యాప్ తరువాత మళ్లీ మాతృభాషలో నటిస్తున్నారట? జ: అవును. బెంగుళూర్ డేస్ అనే చిత్రంలో అతిథి పాత్ర పోషిస్తున్నాను. నిజానికి ఈ చిత్రంలో హీరోయిన్‌గానే నటించాల్సింది. చిత్ర దర్శకురాలు అంజలి మీనన్ నాకు మంచి స్నేహితురాలు. షాహద్ ఫాజిల్ హీరోగా ఆమె తెరకెక్కిస్తున్న బెంగుళూర్ డేస్ చిత్రంలో హీరోయిన్గా నటించమని అంజలి అడిగారు. అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా ఆమె అవకాశాన్ని స్వీకరించలేకపోయాను. దీంతో చిన్న గెస్ట్‌రోల్ అయినా చెయ్యమని అంజలి కోరడంతో ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉందనిపించి నటించడానికి అంగీకరించాను. ప్ర: ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు? జ: తమిళంలో జేకే ఎన్నుమ్ న్బనిన్ వాళ్కై చిత్రం విడుదలకు సిద్ధం అయ్యింది. ప్రస్తుతం అప్పావిన్ మీసై చిత్రంలో నటిస్తున్నాను. తెలుగులో ఏమిటో ఈ మాయ అనే చిత్రం చేస్తున్నాను. మరికొన్ని కథలను వింటున్నాను.