అలాంటి సినిమాల్లోనే చేస్తాను
సంచలన తారలుగా పేరొందిన హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. మనసులో ఒకటి బయట మరొకటి చెప్పే వ్యక్తిత్వం కాదామెది. ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా చెప్పే మనస్తత్వం. అలాంటి ప్రవర్తనతో కొన్ని వివాదాలను కొని తెచ్చుకున్నారు. మలయాళంలో చిత్రాలు చెయ్యకపోయినా ఇతర భాషలైన తమిళం తెలుగు భాషల్లో ఈ బ్యూటీకి మంచి డిమాండ్ ఉంది. నటిగాను మంచి పేరుపొందిన నిత్యామీనన్ తన మనసులోని భావాలను ఆవిష్కరించారు. అవేమిటో చూద్దాం.
ప్ర: నటిగా వెనుకబడినట్లున్నారు?
జ: నా కంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని మీరను. ఎన్ని చిత్రాలు చేశామన్నది ముఖ్యం కాదు. ఎన్ని మంచి చిత్రాలు చేశాం అన్నదే ప్రధానం.
ప్ర: స్టార్ హీరోల సరసన నటించరాదని నిర్ణయించుకున్నారా ఏమిటి?
జ: పెద్ద హీరోలా, చిన్న హీరోలా అన్న విషయం గురించి నేను అస్సలు పట్టించుకోను. కథలో నా పాత్ర ప్రాముఖ్యత ఏమిటి? దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న అంశాలనే పరిగణనలోకి తీసుకుంటాను. అలాగే బ్యాడ్ భారీ చిత్రాల్లో నటించే కంటే చిన్న హీరోలైనా మంచి కథా చిత్రాల్లో చేయాలని ఆశిస్తాను. మరో విషయం ఏమిటంటే నేను నటించే పాత్ర నాకు సంతృప్తిని కలిగించాలి. అలాంటి పాత్రలకు నేనెప్పుడూ సిద్ధమే. నటిగా నేనిప్పటికీ 30 చిత్రాలు చేశాను. జయాపజయాలను పక్కన పెడితే ఈ చిత్రాలన్నీ నాకు సంతోషాన్నిచ్చినవే.
ప్ర: చాలా గ్యాప్ తరువాత మళ్లీ మాతృభాషలో నటిస్తున్నారట?
జ: అవును. బెంగుళూర్ డేస్ అనే చిత్రంలో అతిథి పాత్ర పోషిస్తున్నాను. నిజానికి ఈ చిత్రంలో హీరోయిన్‌గానే నటించాల్సింది. చిత్ర దర్శకురాలు అంజలి మీనన్ నాకు మంచి స్నేహితురాలు. షాహద్ ఫాజిల్ హీరోగా ఆమె తెరకెక్కిస్తున్న బెంగుళూర్ డేస్ చిత్రంలో హీరోయిన్‌గా నటించమని అంజలి అడిగారు. అయితే కాల్‌షీట్స్ సమస్య కారణంగా ఆమె అవకాశాన్ని స్వీకరించలేకపోయాను. దీంతో చిన్న గెస్ట్‌రోల్ అయినా చెయ్యమని అంజలి కోరడంతో ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉందనిపించి నటించడానికి అంగీకరించాను.
ప్ర: ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు?
జ: తమిళంలో జేకే ఎన్నుమ్ న్బనిన్ వాళ్కై చిత్రం విడుదలకు సిద్ధం అయ్యింది. ప్రస్తుతం అప్పావిన్ మీసై చిత్రంలో నటిస్తున్నాను. తెలుగులో ఏమిటో ఈ మాయ అనే చిత్రం చేస్తున్నాను. మరికొన్ని కథలను వింటున్నాను.