ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలీపై గతంలోనే లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశం పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ యువ నటి ఫిర్యాదు చేసింది. దుబాయ్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురిపై యువతి ఆరోపణలు చేసింది. దీంతో అప్పట్లోనే నివిన్ పౌలీతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటులపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.
అయితే ఆ తర్వాత జరిగిన విచారణలో నటుడు నివిన్ పౌలీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. తాజాగా ఈ కేసులో నివిన్ పౌలీకి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. యువతి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంఘటన జరిగిన సమయంలో నివిన్ పౌలీ అక్కడ లేరని గుర్తించినట్లు తెలిపారు. అతను లైంగికంగా వేధించినట్లు స్పష్టమైన ఆధారాలు తమకు లభించలేదని కొత్తమంగళం కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. దీంతో ఆరో నిందితుడిగా ఉన్న ఆయన పేరును తొలగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే మిగిలిన నిందితుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా.. నివిన్ పౌలీ మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ప్రేమమ్ చిత్రంలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment