
నాకు హానికరమైన ఔషధాలు ఇచ్చి నా ఆరోగ్యం చెడగొట్టారు అంటున్నాడు మలయాళ నటుడు బాలా (Actor Bala). రెండేళ్ల క్రితం ఆయనకు కాలేయ మార్పిడి జరిగింది. ఆ సమయంలో తను కోలుకోకుండా చేయాలన్న ప్రయత్నాలు జరిగాయంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలా మాట్లాడుతూ.. నాకు ఇప్పటివరకు రెండు సర్జరీలు జరిగాయి. రెండేళ్ల క్రితం నేను చనిపోయానని వదంతులు పుట్టుకొచ్చాయి. కానీ, చూడండి నేను మీ ముందు ఇలా ఆరోగ్యంగా నిలబడ్డాను.
తనెవరో చెప్పను
అయితే సర్జరీ జరిగాక గతేడాది నాకు మంచి మెడిసిన్ ఇవ్వలేదు. దానికి బదులుగా నా ఆరోగ్యాన్ని దిగజార్చే ఔషధాలు ఇచ్చారు. రాంగ్ మెడిసిన్ ఎవరిచ్చారన్నది నేను చెప్పను. అయితే ఆ విషయం తెలియక గుడ్డిగా అవే ఉపయోగించాను. తీవ్ర అనారోగ్యంతో పదిరోజులపాటు ఆస్పత్రిపాలయ్యాను. అప్పుడు నా బంధువైన కోకిల ఒక తల్లిలా నాకు సేవ చేసింది. అప్పుడే తను నన్నెంత ప్రేమిస్తుందో అర్థమైంది.
చనిపోయానని అనుకున్నారు
నేను ఐసీయూలో ఉన్నప్పుడు మరణించానన్న వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో నాకు వెంటిలేటర్ తీసేయాలనుకున్నారు. అంతర్గత అవయవాలు పని చేయడం లేదన్నారు. కిడ్నీ, లివర్, బ్రెయిన్.. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ పని చేయడం ఆగిపోతున్నాయి. అప్పుడు మా అమ్మ చెన్నైలో ఉంది. నా చావు ఖాయమని అర్థమై పోస్ట్‌మార్టమ్ చేయాలని నిర్ణయించుకున్నారు. నాకోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రార్థించారు. ముఖ్యంగా నా సినిమాలు చూసిన చిన్నపిల్లలు నేను బతకాలని బలంగా కోరుకున్నారు. అలాగే 25 ఏళ్లుగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాను.

అరగంటలో అద్భుతం
వీటన్నిటి ఫలితమో ఏమో కానీ.. అరగంటలో అద్భుతం జరిగింది. నాలో ప్రాణం తిరిగి వచ్చింది. నన్ను ఎంతో ప్రేమించిన కోకిలతో నా పెళ్లి జరిగి మూడు నెలలవుతోంది. ఈ మధ్యకాలంలో కూడా ఒకరికి హార్ట్ సర్జరీ చేయించాను, స్కూల్ కట్టించాను. కోకిల స్థానంలో మరొకరుంటే కచ్చితంగా నాపై ఫిర్యాదు చేసేవారు. కానీ కోకిలకు నా లక్ష్యం ఏంటో తెలుసు. రేపు మాకు పుట్టబోయే బిడ్డ కూడా ఇదే సేవా మార్గంలో వెళ్లాలని కోరుకుంటాను అని పేర్కొన్నాడు.
చిత్రహింసలు పెట్టాడన్న మూడో మాజీ భార్య
కాగా మలయాళ నటుడు బాలా ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రెండో మాజీ భార్య అమృత గతేడాది అతడిపై వేధింపుల కేసు పెట్టింది. మూడో మాజీ భార్య ఎలిజబెత్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా బాలా తనను చిత్రహింసలు పెట్టాడన్న విషయాన్ని వెల్లడించింది. బాలాకు విషపూరితమైన మెడిసిన్ ఇచ్చారన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ.. అది నిజమని నిరూపించమని సవాల్ విసిరింది. ఈ క్రమంలోనే బాలా పై కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment