సినీ పరిశ్రమలో మహిళల భద్రతపై సుమలత
మలయాళ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక సినిమా రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇతర భాషల్లోనూ హేమా తరహా కమిటీని ఏర్పాటు చేయాలని పలువురు నటీనటులు కోరుతున్నారు. వేధింపుల ఘటనలపై తాజాగా నటి, మాజీ ఎంపీ సుమలత స్పందిస్తూ– ‘‘చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపుల అనుభవాలను నాతో చాలామంది పంచుకున్నారు. సెట్స్‌లో చాలా మందికి భయానక అనుభవాలు ఎదురవుతున్నాయని విన్నాను. అవకాశాల కోసం వేధింపులు ఎదుర్కొన్నామని పలువురు మహిళలు నాతో చె΄్పారు.
అయితే నాకు ఇలాంటి ఘటనలు ఎప్పుడూ ఎదురవలేదు. నేను చూడలేదు కాబట్టి వేధింపులు జరగలేదని కాదు. కేవలం సినిమా అనే కాదు.. రాజకీయ రంగంతోపాటు ప్రతి రంగంలోనూ ఇలాంటి పవర్ గ్రూపులు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. ఈ విషయాలను ధైర్యంగా బయటపెట్టిన మహిళలకు, అందుకు బాటలు వేసిన డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్)కి ధన్యవాదాలు.
తమకు జరిగిన చేదు అనుభవాలను బయట పెడుతోన్న మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. సెట్స్‌లో మహిళలకు భద్రత కల్పించేలా నిబంధనలను తీసుకురావడం, అలాగే వాటిని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఒక పరిష్కారం. ఒకవేళ ఫిర్యాదు చేసినా యూనియన్లు, సినిమా పరిశ్రమలోని ఇతర విభాగాలు వినకపొవచ్చు. అందుకే సెన్సార్ బోర్డు ఉన్నట్లే మహిళలకు సంబంధించిన భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఉండాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment