కేరళ పెద్ద పండగ ఓనమ్. మలయాళ సినిమాకి ప్రియమైన పండగ. ప్రతీ ఏడాది కనీసం నాలుగు కొత్త సినిమాలు ఓనమ్ స్పెషల్‌గా థియేటర్‌లోకి వస్తాయి. అయితే ప్రతీ ఏడాది పండగ థియేటర్స్‌లో జరిగేది. ఈ ఏడాది ఇంట్లోనే జరగనుంది. పని ఆగిపోయుండొచ్చు. కానీ పండగ ఆగకూడదు. సంబరం అస్సలు ఆగకూడదు. తాజాగా మూడు మలయాళీ సినిమాలు ఓనమ్ స్పెషల్‌గా ఇంటికి (ఓటీటీ)లోకి వస్తున్నాయి. ‘ఓటీటీలో ఓనమ్’ విశేషాలేంటో చూద్దాం.
కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్
టోవినో థామస్ హీరోగా జో బేబీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’. కేరళ టూరిజమ్‌ని ఆస్వాదించడానికి వచ్చిన ఓ విదేశీ అమ్మాయికి కేరళను పరిచయం చేసే పాత్రలో టోవినో పాత్ర ఉంటుంది. ఇదో రోడ్ మూవీ. హీరో హీరోయిన్ తమ బైక్ మీద కేరళను ఎలా చుట్టేస్తారనేది కథలో ముఖ్యభాగం. హీరోగా నటించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించారు టొవినో. ఈ చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. అంతే కాదు ఆగస్ట్ 31న ఈ చిత్రాన్ని నేరుగా టీవీలోనూ (ఏషియానెట్ ఛానెల్) ప్రసారం చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది.
సీ యూ సూన్
లాక్‌డౌన్ వల్ల సినిమా పరిశ్రమ స్తంభించిపోయింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఓ కొత్త ఛాలెంజ్ స్వీకరించారు ఫాహద్ అండ్ టీమ్. లాక్‌డౌన్ నిబంధనలు అనుసరిస్తూ ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించారు. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలో ఫాహద్, రోషన్ మాథ్యూ, దర్శన ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘సీ యూ సూన్’. ఈ చిత్రాన్ని చాలా శాతం వరకూ ఐ ఫోన్‌లోనే చిత్రీకరించారు. తప్పిపోయిన స్నేహితుడి గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటర్నెట్ సహాయంతో ఎలా వెతికి పట్టుకున్నారన్నది కథాంశం. 98 నిమిషాలు నిడివి ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
మణియరాయిలే అశోకన్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవలే నిర్మాతగానూ మారారు. ఆయన నిర్మాణంలో వస్తున్న మరో సినిమా ‘మణియరాయిలే అశోకన్’. జాకోబ్, అనుమపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి షామ్జూ జేబా దర్శకత్వం వహించారు. అనుపమ హీరోయిన్‌గా నటించడం మాత్రమే కాకుండా ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగానూ పని చేశారు. ‘‘ఇలాంటి ముద్దొచ్చే ప్రేమకథను నిర్మించడం చాలా గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు నటుడు దుల్కర్. ఈ సినిమాలో దుల్కర్ ఓ అతిథి పాత్ర చేశారని కూడా టాక్. ఈ చిత్రం నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment