సగటు ప్రేక్షకులను కలల లోకంలో విహరింపజేయగల బలమైన మాధ్యమం సినిమా. అలాంటి రంగంలో శిఖరాయమానమైన కళాఖండం రూపుదిద్దుకోవడం ఎప్పుడోగానీ సాధ్యం కాదు. 2015 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం బహుమతిని గెల్చుకున్న ‘బాహుబలి’ అలాంటి అపురూపమైన దృశ్య కావ్యం. ఉత్తమ కళాఖండాన్ని నిర్మించి చరితార్ధులం కావాలని స్వప్నించేవారు చాలామందే ఉండవచ్చు. కానీ దాన్ని సాకారం చేసుకోగలిగిన ప్రతిభావ్యుత్పత్తులు, సృజనాత్మకత, అంకితభావం గలవారు అరుదుగా ఉంటారు. ‘బాహుబలి’ నిర్మించడం ద్వారా తనకు అలాంటి అరుదైన లక్షణాలున్నాయని ఎస్.ఎస్. రాజమౌళి నిరూపించుకోవడంతోపాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కీర్తి ప్రతిష్టలను ఆకాశపుటంచులకు తీసుకెళ్లారు.
ఎలా మొదలైందో గానీ సినిమాల్లో కమర్షియల్ సినిమాలు, అవార్డు సినిమాలంటూ ఒక తెలియని విభజన రేఖ ఏర్పడింది. దాని ఆధారంగా మిగిలిన వాదనలు బయల్దేరాయి. కమర్షియల్ సినిమాలకు వసూళ్లు బాగా ఉంటాయి గనుక చాలామంది ఆ తరహా సినిమాలు తీసేందుకే మొగ్గు చూపుతారని...అవార్డు సినిమాలకు పెట్టుబడులు పెట్టేవారు దొరకరని అంటారు. అందుకే ‘మంచి’ సినిమాలు రావడం లేదని కూడా చెబుతుంటారు.
కానీ ‘బాహుబలి’ అలాంటి వాదనలన్నిటినీ పటాపంచలు చేసింది. ‘మంచి’ సినిమాలు, ‘పాపులర్’ సినిమాలన్న పేరుతో విభజన చేసుకున్నది మనమేనని...తగిన సత్తా ఉంటే ఆ రెండూ ఒకటి కావడం అసాధ్యమేమీ కాదని ఆ చిత్రం తేటతెల్లం చేసింది. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మిస్తే, ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగలిగితే వాణిజ్యపరంగా సూపర్‌హిట్ కావడంతోపాటు జ్యూరీ సభ్యుల మన్ననల్ని పొంది అవార్డుల్ని కూడా సునాయాసంగా సాధించవచ్చునని ‘బాహుబలి’ నిరూపించింది. దీనికి ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు స్పెషల్ ఎఫెక్ట్ కేటగిరీలోనూ అవార్డు లభించడమే రుజువు.
చలనచిత్రాలకు జాతీయ స్థాయి అవార్డులిచ్చే సంప్రదాయం మొదలుపెట్టకముందు...అంటే 1953కు ముందు తెలుగులో ‘పాతాళభైరవి’, ‘మల్లీశ్వరి’ వంటి గొప్ప చిత్రాలొచ్చాయి. ఆ తర్వాత ‘లవకుశ’, ‘మాయాబజార్’ వంటి కళాఖండాలు వచ్చాయి. కానీ 1964లో ‘నర్తనశాల’ జాతీయస్థాయిలో ఉత్తమ ద్వితీయచిత్రంగా అవార్డుగా ఎంపికయ్యేవరకూ మన చిత్రాలకు సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 1979లో ‘శంకరాభరణం’ మళ్లీ అరుదైన గుర్తింపు తెచ్చుకుని స్వర్ణకమలాన్ని సాధించినా అది జాతీయ ఉత్తమ చిత్రంగా కాదు...స్పెషల్ జ్యూరీ అవార్డు కేటగిరీలో ఆ అవార్డును సాధించింది.
ఇన్నాళ్లకు రాజమౌళి తెలుగు చలనచిత్రానికి మళ్లీ జాతీయస్థాయి గుర్తింపును తీసుకొచ్చారు. వాస్తవానికి ‘బాహుబలి’ దీనికి చాలా ముందే దేశంలో మాత్రమే కాదు...ఖండాంతరాల్లో కూడా తెలుగు సినిమా గొప్పదనాన్ని చాటింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ‘కంచె’ సినిమా కూడా ‘బాహుబలి’ తరహాలోనే యుద్ధ నేపథ్యంతో రూపొందిన చిత్రం. రెండో ప్రపంచ యుద్ధ సమయంనాటి సామాజిక సంబంధాలను ప్రతిభావంతంగా చర్చించి, ఆ సంబంధాల్లో భాగమైన వ్యక్తుల భావోద్వేగాలను ఎంతో హృద్యంగా చూపిన సినిమా ‘కంచె’. సమాజంలోని కుల,మతాల కంచెను కూల్చాలని ఈ చిత్రం ప్రబోధిస్తుంది. మన పొరుగునున్న తమిళ, మళయాళ చలనచిత్ర పరిశ్రమలు వాణిజ్యపరమైన విలువలతోపాటు కళాత్మకతను కూడా రంగరిస్తూ... సామాజిక సమస్యలను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తూ ఆయా రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశం నలుమూలలా ప్రేక్షకుల మన్ననల్ని పొందేవి. అలాగే చిత్ర నిర్మాణానికి సంబంధించినంతవరకూ రాశిలోనూ, వాసిలోనూ హిందీ చిత్రాలకు తెలుగు చిత్రాలతోసహా మరే భాషా చిత్రాలూ పోటీ కాదన్న పేరుండేది. తెలుగు చలనచిత్ర రంగం చాన్నాళ్లక్రితమే వాటన్నిటినీ అధిగమించే యత్నం చేసింది. అందుకు పరాకాష్టగా ‘బాహుబలి’నీ, ‘కంచె’నూ చెప్పుకోవచ్చు.
ఈసారి ఉత్తమ పాపులర్ చిత్రంగా అవార్డు సొంతం చేసుకున్న ‘బజ్‌రంగీ భాయ్‌జాన్’ సైతం సామాజిక విలువలను చర్చించిన చిత్రం. ‘బాహుబలి’కి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కూడా కథా రచయిత కావడం విశేషం. మన దేశం వచ్చిన పాకిస్తాన్‌కు చెందిన తల్లినుంచి తప్పిపోయిన ఒక చిన్నారిని ఆంజనేయుడి భక్తుడైన హీరో ఎన్నో అవరోధాలనూ, అవాంతరాలనూ అధిగమించి మళ్లీ ఆమె దేశానికి చేర్చడం ఈ చిత్రం ఇతివృత్తం. అందువల్లే ఈ చిత్రం మన దేశంతోపాటు పాకిస్తాన్‌లో కూడా విజయవంతమైంది.
సరిహద్దులకు రెండు వైపులా ఉండే పరస్పర అపనమ్మకాలనూ, అనుమానాలనూ చూపడంతో పాటు నిజాలు తెలుసుకున్నాక కథానాయకుడికి నీరాజనాలు పట్టడం ఇందులో కనిపిస్తుంది. ఇరు దేశాల పౌరులమధ్యా సుహృద్భావ వాతావరణం నెలకొనడానికి ఇలాంటి చిత్రాలు దోహదం చేస్తాయి. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డుకు ఎంపిక చేయడం హర్షించదగింది. మహారాష్ట్రను పాలించిన బాజీరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘బాజీరావు మస్తానీ’కి దర్శకత్వం వహించిన సంజయ్ లీలా బన్సాలీకి ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. దీంతో పాటు మరో ఆరు కేటగిరీలో కూడా అవార్డులు వచ్చాయి. పీష్వాల కాలంలో ఉండే సంప్రదాయాలు, జీవనం, ఆనాటి భవంతులు వగైరాలను కళ్లకు కట్టేలా చిత్రించడంలో బన్సాలీ ఎంతో శ్రమించారు. అందుకోసం ఆయన లోతైన పరిశోధనలు చేశారు.
‘పీకూ’ చిత్రం లో అద్భుతంగా నటించిన అమితాబ్ బచ్చన్‌కు ఉత్తమ నటుడిగా, ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’ చిత్రంలో ప్రతిభావంతమైన నటన చూపిన కంగనా రనౌత్‌కి ఉత్తమ నటిగా అవార్డులు లభించాయి. సెరెబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతున్న పాత్రలో జీవించిన కల్కి కోషెలిన్‌కూ ప్రత్యేక జ్యూరీ అవార్డు వచ్చింది. తొలిసారి దర్శకత్వం చేపట్టి ప్రతిభను ప్రదర్శించిన వారికిచ్చే ఇందిరాగాంధీ అవార్డును ‘మసాన్’కు దర్శకత్వం వహించిన నీరజ్ ఘైవాన్ దక్కించుకున్నారు. పెద్ద పెద్ద తారలు లేకుండా, భారీ పబ్లిసిటీ లేకుండా విడుదలైన ఈ చిత్రం సమకాలీన జీవితంలోని భావోద్వేగాలనూ, సంఘర్షణనూ అద్భుతంగా ఆవిష్కరించింది. మొత్తానికి రమేష్ సిప్పీ నేతృత్వంలోని జాతీయ అవార్డుల కమిటీ జనం మెచ్చిన చిత్రాలకూ, ప్రతిభావంతులైన నటులకూ, సాంకేతిక నిపుణులకూ పట్టంగట్టిందని చెప్పవచ్చు.
ఉన్నత శిఖరంపై ‘బాహుబలి’
Published Tue, Mar 29 2016 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM
Advertisement
Advertisement