‘దసరా బుల్లోడు’ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అక్కినేని–హీరోయిన్ వాణిశ్రీ. 1971 జనవరి 13న రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. వాస్తవానికి ఈ సినిమా కోసం హీరోయిన్‌గా తొలుత అనుకున్నది జయలలితను. ఈమెతో నిర్మాతల సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ‘దసరా బుల్లోడు’లో నటించడానికి జయలలిత గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అయితే అదే సమయంలో ఆమె ఎన్టీఆర్‌తో ‘శ్రీకృష్ణ విజయము’, ఎమ్జీఆర్‌తో మరో సినిమాలో నటిస్తున్నారు. దీంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక చివరి నిమిషంలో ఏఎన్నార్ ‘దసరా బుల్లోడు’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం అందించారు. కేవలం వారం రోజుల ముందు ఈ విషయం తెలియడంతో అప్పటికప్పుడు వాణిశ్రీని హీరోయిన్‌గా అనుకున్నారట.
ఏఎన్నార్ కంటే వాణిశ్రీకి డబుల్ రెమ్యునరేషన్
ఈ సినిమాకు అక్కినేని పారితోషికం పాతిక వేలైతే వాణిశ్రీకి యాభై వేలు చెల్లించాల్సి వచ్చిందట. అప్పటికి వాణిశ్రీకి పెద్ద హీరోయిన్‌గా గుర్తింపు కూడా లేదు. అయినా అంత మొత్తం చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అయితే... ‘దసరా బుల్లోడు’ హిట్‌తో వాణిశ్రీ కూడా స్టార్ హీరోయిన్‌గా మారి పోయారు. ఆ తర్వాత ‘ప్రేమ్‌నగర్’ లాంటి ఆల్‌టైమ్ బెస్ట్ రావడానికి దసరాబుల్లోడే పునాది వేసింది. దీంతో అక్కినేని–వాణిశ్రీలది హిట్ పెయిర్ అనే పేరొచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో 20కి పైగా సినిమాలొచ్చాయంటే‘దసరాబుల్లోడు’ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా
చెప్పాల్సిన పని లేదు.
12 రోజుల రీ షూట్
హీరా లాల్ డ్యాన్స్ డైరక్షన్‌లో ‘పచ్చగడ్డి కోసేటి...’ సాంగ్ షూటింగ్‌తో షూటింగ్ ప్రారంభమైంది. భారీ సంఖ్యలో డ్యాన్సర్లతో పెద్ద పండగలా షూటింగ్ చేశారు. 12 రోజుల పాటు షూటింగయ్యాక మొదటి రోజు మినహా మిగతాది ఏదీ కెమేరాలో క్యాప్చర్ కాలేదని తెలిసి అంతా షాకయ్యారు. దీంతో చేసేది లేక మళ్లీ ఆ 12 రోజుల షూటింగ్ మొత్తాన్ని తిరిగి తీయాల్సి వచ్చింది. ఇక ‘దసరా బుల్లోడు’ పాటలు ఓ సంచలనమనే చెప్పాలి. అప్పట్లో రేడియోలో ఈ పాటలు మోగని రోజు లేదు. ఏ గడప దగ్గర నించున్నా ఈ సినిమాలో పాటలు వినపడాల్సిందే. కేవీ మహదేవన్ మ్యూజిక్ ఓ వైపు... ఆత్రేయ సాహిత్యం మరోవైపు జనాల్ని ఓ ఊపు ఊపేశాయి. ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా...’, ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ...’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా...’, ‘నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే...’ ఇలా అన్ని పాటలూ బంపర్ హిట్. అప్పట్లో ‘దసరా బుల్లోడు’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. రిలీజైన తొలి 4 వారాలకే 25 లక్షల గ్రాస్ వసూలు చేయడం తెలుగు సినీ చరిత్రలో అప్పటి వరకూ కనీవినీ ఎరుగని రికార్డు.
హీరోగా సూపర్ హిట్ కెరీర్‌ని చూసి, ఇప్పుడు విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ దూసుకెళుతున్న జగపతిబాబు తండ్రే ‘దసరా బుల్లోడు’ నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ అనే విషయం తెలిసిందే. జగపతిబాబు పేరుతోనే ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి సినిమాలు తీసేవారు. అప్పట్లో జగపతి పిక్చర్స్ అంటే టాలీవుడ్ నెంబర్ వన్. ‘దసరా బుల్లోడు’తోనే వీబీ రాజేంద్రప్రసాద్ దర్శకుడయ్యారు. ఈ సినిమా కథ కూడా ఆయనే తయారు చేసుకున్నారు. వాస్తవానికి జగపతి సంస్థకు విక్టరీ మధుసూదనరావు ఆస్థాన దర్శకుడు. అయితే ఆయన బిజీగా ఉండడం వల్ల దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును అడిగారట వీబీ. ఆయనకూ వీలు కాలేదు. చివరికి అక్కినేనినే డైరెక్ట్ చేయమని అడిగారట. కానీ స్టేజ్ ఆర్టిస్ట్‌గా, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా మంచి అనుభవమున్న వీబీనే డైరెక్ట్ చేయాల్సిందిగా ఏఎన్నార్ ప్రొత్సహించడంతో వీబీ దర్శకత్వం చేయక తప్పలేదు. అందుకే ఈ సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం. తర్వాత వివిధ కారణాలవల్ల అన్నీ కోల్పోయినప్పుడు తన అనుభవాలు, జ్ఞాపకాలకు అక్షర రూపమిస్తూ రాసిన పుస్తకానికి ‘దసరా బుల్లోడు’ అనే టైటిలే పెట్టుకున్నారు వీబీ రాజేంద్రప్రసాద్.
– దాచేపల్లి సురేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment