చెరిగిపోని పచ్చబొట్టు పవిత్రబంధం | Golden Memories Of Pavitra Bandham Completes 50 Years | Sakshi
Sakshi News home page

చెరిగిపోని పచ్చబొట్టు పవిత్రబంధం

Published Tue, Mar 2 2021 12:58 AM | Last Updated on Tue, Mar 2 2021 3:08 AM

Golden Memories Of Pavitra Bandham Completes 50 Years - Sakshi

కాంచన, అక్కినేని; వాణిశ్రీ, అక్కినేని

కథలోని ప్రధాన పాత్రలకు ఏదో దెబ్బ తగిలి, గతం మర్చిపోవడం ఎప్పుడూ ఓ మంచి వెండితెర కమర్షియల్‌ పాయింట్‌. బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల నుంచి ఇప్పటి దాకా ఈ పాయింట్‌తో అల్లుకున్న కథలు అనేకం. మన అగ్ర హీరోల్లో దాదాపు అందరూ ఈ పాయింట్‌ ఆధారంగా సినిమాలు చేశారు. సక్సెస్‌ అందుకున్నారు. కలర్‌ చిత్రాల జోరు మొదలైన రోజుల్లో దర్శకుడు వి. మధుసూదనరావు, హీరో అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్‌లో ఈ పాయింట్‌తో వచ్చిన సక్సెస్‌ఫుల్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రం ‘పవిత్రబంధం’. బిగువైన కథ, పాటలు, హీరోయిన్లు కాంచన, వాణిశ్రీ అందచందాలతో సరిగ్గా 50 ఏళ్ళ క్రితం వచ్చిన ‘పవిత్రబంధం’ ఆ తరానికి ఓ తీపి గుర్తు. ఆ సినిమాలోని ‘గాంధి పుట్టిన దేశమా ఇది’, ‘పచ్చబొట్టూ చెరిగీపోదులే’ లాంటి సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌.

అందాల తారలతో...
ఒక్కో హీరోకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో సినిమాకు ఒక్కో యు.ఎస్‌.పి. ఉంటుంది. ‘దేవదాసు’ ఫేమ్‌ అక్కినేనికి కెరీర్‌ తొలి రోజుల నుంచీ హీరోగా మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఎక్కువ. ఒకరికి ఇద్దరు నాయికలతో అలాంటి ప్రేమలు, పెళ్ళిళ్ళ కథలు తెరపై పండించడంలో ఆయనదో ప్రత్యేక ముద్ర. అందుకే, 1950లలో, ’60లలో అలాంటి కుటుంబకథలతో ఆయన తన రేంజ్‌నూ, ఇమేజ్‌నూ పెంచుకుంటూ వచ్చారు. కలర్‌ సినీశకం మొదలయ్యాక కూడా ఆయన ఆ మార్గం వీడలేదు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల చివరలో అక్కినేని చేసిన అలాంటి ఓ గమ్మతై ్తన ప్రేమ, పెళ్ళి కథ – ‘పవిత్రబంధం’. ‘‘ప్రేమించిన ప్రియురాలు! పెళ్ళాడిన ఇల్లాలు!! ఎవరి అనుబంధం – తరతరాల పవిత్రబంధం?’’ ఒక్కముక్కలో ఇదీ ఈ సినిమా కాన్సెప్ట్‌. అప్పటికే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అందాల నటి కాంచన, సావిత్రి తరువాత అప్పుడప్పుడే స్టార్‌ హోదాకు ఎదుగుతున్న వాణిశ్రీ ఇందులో అక్కినేని సరసన హీరోయిన్లు. శృంగారాభినయానికి ఒకరు, సెంటిమెంటుకు మరొకరు. ఇక, 1970ల ద్వితీయార్ధానికి హీరోగా స్థిరపడ్డ కృష్ణంరాజు నెగటివ్‌ రోల్‌ చేశారు.

ఆకట్టుకొనే కథ... కథనం...
‘పవిత్రబంధం’లో ‘‘కల్లకపటాలు లేని పల్లెటూరి వలపులు, అల్లకల్లోలమైన పట్నవాసపు తలపులు’’ చూపారు. అశోక్‌ మూవీస్‌ పతాకంపై టి. గోవిందరాజన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వి. మధుసూదనరావు పక్కా కమర్షియల్‌ మీటర్‌లో తీర్చిదిద్దారు. మెదడుకు దెబ్బ తగిలి, కథలోని ప్రధానపాత్ర పాత జ్ఞాపకాలను మర్చిపోవడమనే ఫార్ములాను లేడీస్‌ సెంటిమెంట్‌కు ముడిపెట్టి, హాస్య, శృంగార రసాలకు ప్రాముఖ్యమిస్తూ అల్లుకున్నారు. అనుకోని విధంగా జీవితంలో ఇద్దరు అమ్మాయిలకు ప్రేమను పంచవలసి వచ్చిన హీరో కథ ఇది.

అనాథాశ్రమంలో పెరిగి, ఉన్నత విద్య చదివి, ఉద్యోగం దొరకక పట్నంలో తిరుగుతూ, ఓ పాడైపోయిన బస్సులో నివసిస్తుంటాడు హీరో (అక్కినేని). అతి గారాబంతో పంజరంలా మారిన ఇంట్లో నుంచి బయటపడి, తానెవరో చెప్పని ఓ కల

వారింటి అమ్మా యి (కాంచన)ను ప్రేమి స్తాడు. ఇంతలో ఓ కారు ప్రమాదం. హీరో గతాన్ని మర్చిపోతాడు. ఓ పల్లెటూరు చేరతాడు. అనుకోకుండా అక్కడో పల్లెటూరి అమ్మాయి (వాణిశ్రీ)ని కాపాడి, ఆమె ప్రేమ దక్కించుకొని, పెళ్ళి చేసుకొంటాడు. పండంటి పిల్లాడికి తండ్రి అవుతాడు. రైతుగా జీవితం గడుపుతుంటాడు. పట్నానికి పని మీద వెళతాడు.

తీరా అప్పుడు రెండోసారి ప్రమాదం. మళ్ళీ మెదడుకు దెబ్బ. ఈ రెండు యాక్సిడెంట్లకు మధ్య జరిగిన కథను హీరో మర్చిపోతాడు. మొదటి యాక్సిడెంట్‌కు ముందు పెద్దింటి అమ్మాయితో జరిపిన పాత ప్రేమకథ మాత్రం గుర్తొచ్చి, పెళ్ళికి సిద్ధమవుతాడు. కనిపించని భర్త కోసం వెతుక్కుంటూ పట్నం వస్తుంది పల్లెటూరి భార్య. అక్కడ హీరో కోసం ఇద్దరు హీరోయిన్ల మధ్య అంతః సంఘర్షణ. ‘పచ్చబొట్టు’ పాట, కన్నకొడుకు (బేబీ డాలీ) జ్ఞాపకాలతో హీరోకు తన పల్లెటూరి పెళ్ళికథా గుర్తొస్తుంది. చివరకు ప్రేమ కన్నా, తాళి కట్టిన అమ్మాయిదే పవిత్రబంధం అనే మహిళా సెంటిమెంటుకే సినిమా జై కొడుతుంది. ఒకమ్మాయి త్యాగంతో మరో అమ్మాయి సంసారం చక్కబడుతుంది. మనిషి, మనసు, డబ్బు– వీటి మధ్య బంధం ఏమిటి? హీరో కథలో పట్నంలో జరిపిన ప్రేమా, పల్లెటూరిలోని పెళ్ళా– ఏది గొప్ప? ఇలా పాత్రల ఘర్షణ, అనుబంధాల పవిత్రత చూపుతుందీ సినిమా.

ఆరుద్ర కలం... పాటల బలం...
ఈ సినిమాకు ఆరుద్ర రాసిన ‘అట్ల తద్దోయ్‌ ఆరట్లోయ్‌..’ (గానం పి. సుశీల బృందం), ‘ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం నిజం నిజం’ (సుశీల – ఘంటసాల), సంతోష – విషాద సందర్భాలు రెంటిలోనూ వచ్చే ‘పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా’ పాటలు మోస్ట్‌ పాపులర్‌. జనపదం మెచ్చే పాటల రచయిత కొసరాజు కలంలోని ‘ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి..’ (సుశీల – స్వర్ణలత) హుషారు రేపింది. అప్పట్లో మంచి మ్యూజికల్‌ ఆల్బమ్‌గా నిలిచిన ‘పవిత్రబంధం’ సక్సెస్‌కు తారల అభినయంతో పాటు ఈ ఎవర్‌ గ్రీన్‌ పాటలూ తోడయ్యాయి. ఈ సినిమాకు ప్రధాన బలమైన పాటలతో పాటు మాటలూ ఆరుద్రే రాశారు.

ఆ అసిస్టెంట్లు ఇప్పుడు ఫేమస్‌!
సర్వసాధారణంగా తెలుగునాట సినిమాలన్నీ డిస్ట్రిబ్యూటర్ల ముందస్తు పెట్టుబడితో తయారవుతూ వచ్చిన కాలం అది. అప్పటి ప్రముఖ పంపిణీ సంస్థ ‘నవయుగ ఫిలిమ్స్‌’ సహకారంతో ‘పవిత్రబంధం’ తయారైంది. సహజంగానే, ‘నవయుగ ఫిలిమ్స్‌’ వారే సినిమాకు ప్రధాన పంపిణీదారులు. చిత్రం ఏమిటంటే, ఆ తరువాతి కాలంలో సుప్రసిద్ధులైన ఓ దర్శకుడు, ఓ నిర్మాత అప్పట్లో ఈ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేశారు. వారెవరంటే – దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, నిర్మాత ‘యువచిత్ర’ కె. మురారి.

అప్పట్లో దర్శకుడు వి. మధుసూదనరావు దగ్గర సహాయకులుగా పనిచేసిన ఈ ఇద్దరూ కాలక్రమంలో చెరొక శాఖలో స్థిరపడ్డారు. కోదండరామిరెడ్డి తమ గురువులానే పలు కమర్షియల్‌ హిట్స్‌ అందించి, దర్శకుడిగా 100 చిత్రాల మార్కుకు కాస్త దూరంలో ఆగారు. ఇక, ‘నవయుగ ఫిలిమ్స్‌’ అధినేతలైన కాట్రగడ్డ కుటుంబానికే చెందిన మురారి దర్శకత్వం కన్నా నిర్మాణం తన అభిరుచికి సరిపోతుందని అటు మళ్ళారు.  ‘సీతామాలక్ష్మి’, ‘గోరింటాకు’ మొదలు ‘నారీ నారీ నడుమ మురారి’ దాకా పలు మ్యూజికల్‌ హిట్స్‌ నిర్మించారు. అలా ‘పవిత్రబంధం’ అసిస్టెంట్‌ డైరెక్టర్లిద్దరూ తర్వాత ఫేమసయ్యారు.

విజయవాడ విశ్లేషణకు పెద్ద పీట!
ఓ సినిమా రిలీజయ్యాక ఆ చిత్ర యూనిట్‌ ఆంధ్రదేశంలోని ప్రధాన రిలీజు కేంద్రాలకు వెళ్ళడం, విజయయాత్రలు చేయడం, పత్రికా రచయితలతో సంభాషించడం అప్పట్లో ఓ ఆనవాయితీ. సినీ వ్యాపార, పంపిణీరంగ రాజధాని విజయవాడలో ప్రతి సినిమాకూ అవి తప్పనిసరిగా జరిగేవి. ‘పవిత్రబంధం’కి కూడా ఆ ఆనవాయితీ పాటించారు. విజయవాడలో నవయుగ ఫిలిమ్స్‌ నిర్వహణ బాధ్యతలతో అప్పటికే తల పండిన ప్రముఖ సినీ వ్యాపార, ప్రచార రంగ నిపుణుడు కాట్రగడ్డ నరసయ్య ఎప్పటికప్పుడు వినూత్న ప్రచార వ్యూహాలతో సినిమాకు ప్రచారం కల్పించేవారు. ‘పవిత్రబంధం’ రిలీజయ్యాక తొలి వారంలోనే ఆయన వినూత్నంగా స్థానిక రచయితలతో చిత్ర యూనిట్‌ ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించారు. దర్శకుడు వి. మధుసూదనరావు, నిర్మాత టి. గోవిందరాజన్‌ పాల్గొన్న ఈ ఇష్టాగోష్ఠిలో రావూరి సత్యనారాయణరావు, రెంటాల గోపాల కృష్ణ, వాసిరెడ్డి సీతాదేవి, తుర్లపాటి కుటుంబరావు లాంటి ఆ తరం ప్రముఖ రచయితలు, జర్నలిస్టులు సినిమాపై తమ అభిప్రాయాలను వివరించడం విశేషం. విజయవాడలో తరచూ రచయితలతో సమావేశాలు జరపడం, వారి అభిప్రాయాలనూ, విశ్లేషణలనూ తెలుసుకోవడం సినిమా పురోగతికి మేలు చేస్తుందని సాక్షాత్తూ దర్శకుడు వి. మధుసూదనరావు అభిప్రాయపడ్డారు. ఆ ఒరవడి డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థలో పెను మార్పులు వచ్చిన 1990ల చివరి దాకా కొనసాగడం విశేషం.

మొత్తం మీద అక్కినేని, మధుసూదనరావుల కాంబినేషన్‌ లోని ‘పవిత్రబంధం’ ఓ పాపులర్‌ చిత్రంగా నిలిచింది. అప్పట్లో రేడియోలో పదే పదే వినిపించిన పాపులర్‌ పాటలతో ఇప్పటికీ జనానికి గుర్తుండిపోయింది. ఆరుద్ర రాసిన ‘గాంధి పుట్టిన దేశమా ఇది..’ పాట యాభయ్యేళ్ళు గడిచిపోయినా, నేటి సమకాలీన సమాజానికీ వర్తించడం ఓ విశేషం. మారని మన వ్యవస్థకు అద్దం పట్టే ఓ విషాదం. బాక్సాఫీస్‌ విజయాల లెక్కల కన్నా ఈ బాధామయ పరిస్థితులు, నిరుద్యోగిగా – రైతుగా – ఎస్టేటు యజమానిగా మూడు పార్శా్వలలో అక్కినేని నటన, ఘంటసాల గానం – అన్నీ ఈ సినిమాను చిరస్మరణీయం చేశాయి.

కలర్‌ అక్కినేని వర్సెస్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ అక్కినేని!
ఓ మాస్‌ హిట్‌ సినిమా థియేటర్లలో నడుస్తుండగా... ఆ పక్కనే మరెంత బాగున్న సినిమా మరొకటి వచ్చినా బాక్సాఫీస్‌ ఎదురీత తప్పదు. అక్కినేని ‘పవిత్రబంధం’కి అలాంటి పరిస్థితే ఎదురైంది. కలర్‌ చిత్రాలు ఊపందుకుంటున్న సమయంలో వచ్చిన కలర్‌ఫుల్‌ మాస్‌ హిట్‌ అక్కినేని ‘దసరా బుల్లోడు’ (1971 జనవరి 13). ఆ తరువాత సరిగ్గా 6 వారాలకే ‘పవిత్రబంధం’ వచ్చింది. దానికి ‘దసరా బుల్లోడు’ ఊహించని ప్రత్యర్థి అయి కూర్చుంది. సినిమా, తీసుకున్న పాయింట్, తీసిన విధానం, నటీనటులు, పాటలు – ఇలా అన్నీ బాగున్నా, రంగుల చిత్రం ‘దసరా బుల్లోడు’ వెల్లువ నలుపు తెలుపుల ‘పవిత్ర బంధం’ని బాక్సాఫీస్‌ వద్ద ముంచెత్తింది. కానీ, అంత గట్టి పోటీలోనూ ‘పవిత్రబంధం’ జనాదరణ పొందింది. బెజవాడలో శతదినోత్సవమూ చేసుకుంది.

అక్కినేని కథతో...   రాఘవేంద్రుడి ముద్దుల ప్రియుడు
గమ్మత్తేమిటంటే, విజయవంతమైన చిత్రాలతో విక్టరీ మధుసూదనరావుగా పేరు తెచ్చుకున్న వి. మధుసూదనరావు దగ్గర తొలి రోజుల్లో పనిచేసిన తరువాతి తరం కమర్షియల్‌ చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు అచ్చంగా ఇదే కథను రంగుల్లో తెరకెక్కించారు.

 ‘పవిత్ర బంధం’ రిలీజైన 23 ఏళ్ళ తరువాత రాఘవేంద్రరావు తీసిన ‘ముద్దుల ప్రియుడు’ (1994) చూస్తే – బేసిక్‌గా రెండు కథలూ ఒకటే అని అర్థమవుతుంది.
బ్లాక్‌ అండ్‌ వైట్‌ అక్కినేని, వాణిశ్రీ, కాంచన స్థానంలో రెండు దశాబ్దాల తరువాత రంగుల్లో వెంకటేశ్, రంభ, రమ్యకృష్ణ వచ్చారు. కొత్త తరం ప్రేక్షకులకు కావాల్సిన మసాలాలు దట్టిస్తూ, మార్పులూ చేశారు. అప్పటి ‘పవిత్ర బంధం’లానే ఇప్పటి ‘ముద్దుల ప్రియుడు’లోనూ కొన్ని పాటలు (వేటూరి రచనలు ‘వసంతంలా వచ్చిపోవా ఇలా...’, ‘సిరి చందనపు చెక్క లాంటి భామ...’, సిరివెన్నెల రచన ‘నాకే గనక నీతోనే గనక పెళ్ళయితే గనక...’) పదే పదే వినిపించాయి.

కీరవాణి మార్కు సంగీతానికి, రాఘవేంద్రరావు మార్కు పూలు – పండ్ల చిత్రీకరణ శైలి, రమ్యకృష్ణ అందం తోడై పాటలు రేడియోలో, టేప్‌రికార్డర్లలో మారు మోగాయి. కానీ, సినిమా మాత్రం ఆశించిన బాక్సాఫీస్‌ రిజల్ట్‌ అందుకోలేకపోయింది. స్వీయ నిర్మాణ సంస్థ ఆర్‌.కె. ఫిల్మ్‌ అసోసియేట్స్‌పై నిర్మించిన రాఘవేంద్రరావుకు నిరాశే మిగిలింది.

ఎవర్‌ గ్రీన్‌ సాంగ్స్‌
అక్కినేని సినీ కెరీర్‌ లో సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ చాలా ఉన్నాయి. అందులోనూ, సామాజిక పరిస్థితులకు సరిపడేలా నిత్యనూతనంగా నిలిచిన పాటలూ అనేకం. అలాంటి పాటలనగానే ఎవరికైనా – అక్కినేని ‘వెలుగు నీడలు’ చిత్రంలో పెండ్యాల సంగీతంలో ఘంటసాల పాడిన శ్రీశ్రీ రచన ‘పాడవోయి భారతీయుడా..’ గుర్తొస్తుంది. ‘స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోద’నీ, ‘అవినీతి – బంధుప్రీతి – చీకటి బజారు అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు’ననీ అక్కినేని పాత్ర నోట రచయిత పలికిన మాట దురదృష్టవశాత్తూ ఇవాళ్టికీ వర్తించే మాట! ప్రతి స్వాతంత్య్ర దినోత్సవాన జనాన్ని ఆలోచింపజేస్తున్న పాట!!

సరిగ్గా అదే పద్ధతిలో చిరస్మరణీయ గీతమైంది – ‘పవిత్రబంధం’లో ఎస్‌. రాజేశ్వరరావు సంగీతంలో, ఆరుద్ర రాయగా, ఘంటసాల గళంలో, తెరపై హీరో అక్కినేని నోట వచ్చే ‘గాంధి పుట్టిన దేశమా ఇది.’ ఆ పాటలో ‘ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు’, ‘ఉన్నది మనకు ఓటు – బ్రతుకు తెరువుకే లోటు’ అంటూ సాగే నిరుద్యోగ నాయక పాత్ర ఆవేదన నేటి పరిస్థితులకీ అన్వయిస్తుంది. ‘పేరుకు ప్రజలదే రాజ్యం – పెత్తందార్లకే భోజ్యం’ అంటూ కవి క్రాంతదర్శి అయ్యాడు.

– రెంటాల జయదేవ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement