kameswara rao
-
బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజికవర్గానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పి.విశ్వరూప్, జోగి రమేశ్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్‌గా పేరి కామేశ్వరరావు (పీకే రావు) ప్రమాణ స్వీకారం చేశారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలో బ్రాహ్మణుల సమస్యలు తెలిసిన పేరి కామేశ్వరరావు వంటి సీనియర్ నాయకుడిని కార్పొరేషన్ చైర్మన్‌గా సీఎం జగన్ నియమించడం అభినందనీయమన్నారు. విశ్వరూప్ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం కలిగిన పేరి కామేశ్వరరావు బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. జోగి రమేష్ మాట్లాడుతూ రానున్నకాలంలో బ్రాహ్మణులకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కోన రఘుపతి మాట్లాడుతూ వంశపారంపర్య అర్చకత్వం, అర్చకులకు వేతనాల పెంపు సీఎం జగన్ పాలనలోనే జరిగాయని చెప్పారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ అర్హులైన బ్రాహ్మణులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రూ.600 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. పేరి కామేశ్వరరావును దేవదాయశాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల శంకర్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ, ఏపీ అర్చక సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ఆత్రేయ బాబు, అనంతబాబు, కార్పొరేషన్ జీఎం జి.నాగసాయి, పలు బ్రాహ్మణ సంఘాల నాయకులు అభినందించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీ సుసర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యామిలీ ఫ్రెండ్ తనయుడి వివాహ వేడుకలో మహేశ్‌బాబు, నమ్రత సందడి (ఫొటోలు)
-
వివాహ బంధం: బ్రహ్మముడి అంటే...?
శుభదినాన, ప్రథమంగా వరునివైపువారు వధువు ఇంటికివెళ్ళి వారికి ఆహ్వానం పలుకుతారు. అప్పుడు వధువుకు ముత్తైదువులచే మంగళస్నానాలుచేయించి, నూతన వస్త్రాలు ధరింపజేసి, కళ్యాణ తిలకం దిద్ది పాదాలకు పారాణిపెట్టి చక్కగా అలంకరించి పెండ్లికుమార్తెను చేయాలి. ఆ తర్వాత వరుడికి కూడా మంగళ స్నానాలు చేయించి, నూతన వస్త్రాలు ధరింపజేసి, కళ్యాణతిలకం దిద్ది, పాదాలకు పారాణితో అలంకరించి పెండ్లికుమారుణ్ణి చేయాలి. తర్వాత వరునిచేత ‘గృహస్థాశ్రమ ధర్మాచరణ కొరకు, సత్సంతానం కొరకు, నరకవిమోచనం కొరకు’ వివాహమాడుతున్నానని సంకల్పం చెప్పించి, గణపతి పూజ, పుణ్యహవాచనాలు చేయించి రక్షాబంధనం చేయించాలి. విడి గృహంలో ఒక కొత్త గంపలో కొద్దిగా ధాన్యం లేక అక్షింతలను వుంచి, వధువును ఆ గంపలో కూర్చుండబెట్టి, ఆమె చేత మంగళ గౌరీపూజ చేయించాలి. మన పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరులు ఆదిదంపతులు కనుక, సౌభాగ్య ప్రదాయిని గౌరీదేవిగనుక, వధువుచేత మంగళగౌరీపూజ చేయించుట ఆచారం. ఆ తర్వాత, గౌరీ పూజలో వుంచిన కంకణాన్ని వధువుకు రక్షగా ధరింపజేస్తారు. తదుపరి, వరునితరపువారు, వధువు తండ్రితో వరుని గోత్రప్రవరలను చెప్పి కన్యాదానంచేయమని అర్థించుట ఆచారం. అప్పుడు వధువు తండ్రికూడా తమ గోత్రప్రవరలు చెప్పి అంగీకారం తెలియజేస్తాడు. తదుపరి కన్యాదాన సమయాన, కన్యాదాత ఆచమనంచేసి మహా సంకల్పం చెప్తాడు. ఇందులో త్వష్ట, విష్ణు, శివ, సూర్య, ఇంద్రాది సమస్త దేవతల ఆశీర్వాదాలను తీసుకోవడం జరుగుతుంది. ఆ తరువాత కన్యాదాత సువర్ణదాన, గోదాన, భూదానాది దశమహాదానాలను చేయవలసివుంటుంది. వధువు తల్లిదండ్రులు వరుణ్ణి విష్ణుస్వరూపంగా భావించాలి. అప్పుడు వారు ఆ వరుని కాళ్ళు కడిగి తమ శిరస్సుపై చల్లుకుని, వరునికి యథా శక్తి నూతన వస్త్రాలు, ఆభరణాదులను ఇచ్చి పూజిస్తారు. కన్యాదాతకు దక్షిణతాంబూలాదులను వుంచి, జలధారతో ఆ దోసిలిని, వరుని దోసిలిలో వుంచుతారు. వధువు తండ్రి తన కుమార్తెను కన్యాదానం చేసినప్పుడు, ‘సంప్రదదే నమమ’ అని అనడు. అంటే, ఈమెను నీకు సంపూర్ణంగా దానం చేసి ఈమెపై నా హక్కును వదులుకుంటున్నాను, ఇక పై ఈమె నాది కాదు, సంపూర్ణంగా నీదే అని అనడు. అలా సంపూర్ణ హక్కును విడువకుండా ఆ కన్యాదాత దానంచేస్తాడు. ఎందుకంటే ఉత్తరోత్తరా ఏదైనా సమస్యలవల్ల ఆమెను తన భర్త విడిచినచో తనను పోషించాల్సిన బాధ్యతను తండ్రి వదులుకోడు. అందుకనే, కన్యను గ్రహించినప్పుడు వరుడిచేత ‘పరిగృహ్ణామి‘ అని అనిపించరు. కేవలం ‘స్వస్తి‘ అని మాత్రమే అనిపిస్తారు. ఆ సమయంలో, కన్యాదాత వరునిచేత కొన్ని వాగ్దానాలు చేయించుకుంటాడు. అవి ‘ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్యా‘ అని. అనగా, వారిరువురూ దంపతులైనతర్వాత, భార్య అనుమతి లేకుండా భర్త, ఎటువంటి ధర్మ, అర్థ, కామ సంబంధమైన కార్యాలు చేయరాదు అని. అందుకు వరుడు ‘నాతిచరామి‘, అనగా ధర్మ అర్థ కామసంబంధ విషయాలలో ఆమెను అతిక్రమించను అని అంగీకారం తెలియజేస్తాడు. ఆ తర్వాత, వరుడు అగ్నిప్రతిష్ఠాపన చేస్తాడు. తదుపరి మధుపర్కం అనగా, కొద్దిగా తేనె, పెరుగులను కలిపి తనకు తినిపిస్తారు. తరువాత వధూవరులు ఇరువురు జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని ఒకరి శిరసుపై మరొకరు వుంచుతారు. తదుపరి వధువు నడుముకు యోక్త్రమనే తాడును కడతారు. పిమ్మట, స్వర్ణశిల్పాచార్యునిచేత నిర్మించి పూజించబడిన రెండు మంగళసూ త్రాలను, వారికి తగు దక్షిణాఫల తాంబూల స్వయంపాకాదులనిచ్చి వారి ఆశీర్వచనం తీసుకుని మేళతాళాలతో కళ్యాణవేదిక వద్దకు తీసుకువచ్చి, రెండు తలంబ్రాల పళ్ళెరాలలో వుంచి, ముత్తైదువుల చేత తాకించి, అందరి ఆశీర్వాదాలను తీసుకుంటారు. పిమ్మట వరుడు మంగళసూత్రాలను తీసుకుని, వధువుకు ఎదురుగా నిల్చి ‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం‘ అను మంత్రాన్ని చదువుతూ మూడుముళ్ళు వేస్తాడు. తర్వాత, వధూవరుల దోసిళ్ళను పాలతో శుభ్రం చేసి, వానిని తలంబ్రాలతో నింపి, మొదటగా వరుడు వధువు శిరమున పోస్తాడు. ఆ సమయంలో ‘నీవలన సత్సంతాన వృద్ధి జరుగును గాక’ అను మంత్రాన్ని చదువుతారు. వధువు చేత ‘పాడిపంటలు వృద్ధియగునుగాక’ అను మంత్రాన్ని చదువుతూ తలంబ్రాలు పోయిస్తారు. మూడోసారి వరుడిచేత ‘ధన ధాన్య వృద్ధి జరుగును గాక’ అంటూ తలంబ్రాలు వధువు శిరస్సుమీద పోయిస్తారు. ఆ తర్వాత ఆ తలంబ్రాలను అన్నింటినీ వధూవరులు ఉల్లాసంగా ఒకరి శిరస్సున ఒకరు దోసిళ్ళ తో పోస్తారు. ఆ తర్వాత, వారి దాంపత్య బంధం ఆజన్మాంతం వర్ధిల్లాలను విషయానికి సూచనగా, వారి కొంగులను ముడివేస్తారు. దీనినే బ్రహ్మముడి/ బ్రహ్మగ్రంథి అంటారు. తర్వాత వరుడు, తమ బంధం నిలవాలని, వారికి సత్సంతానం కలగాలనే సంకల్పంతో దేవతలను ప్రార్థిస్తూ తన కుడిచేతిని బోర్లించి, వధువు కుడిచేతిని గ్రహిస్తాడు. దీనినే పాణిగ్రహణం అంటారు. –ఆచార్య తియ్యబిండి కామేశ్వర రావు చదవండి: ‘రాగాలు’ రాగిణులై కనబడ్డాయి పవిత్రతా స్వరూపిణి సీత -
వివాహానికి ఏమి పరిశీలించాలి?
వివాహం ఎన్ని విధాలో గత వారంలో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వివాహానికి ఏమి పరిశీలించాలో అవలోకిద్దాం. ఒకే గోత్రం, లేదా ఒకే ప్రవర కలిగినవారు వివాహం చేసుకోవడాన్ని నిషేధించారు. తండ్రికి 7 తరాలవరకు, తల్లికి 5 తరాలవరకు సపిండురాలైన కన్యను చేసుకోరాదని శాస్త్రవచనం. అందరూ కూడా తమ వర్ణానికి చెందిన కన్యనే వివాహమాడాలని స్మృతులు శాసించినాయి. కానీ, బ్రాహ్మణులు మూడువర్ణాలకు చెందిన కన్యలని, క్షత్రియులు రెండువర్ణాలకు చెందిన కన్యలని, వైశ్యులు వైశ్యవర్ణానికి చెందిన కన్యలను వివాహమాడవచ్చు అని కొన్ని స్మృతులు బోధించాయి. దీనిని అనులోమ వివాహం అంటారు. కానీ నిమ్నవర్ణాలవారు హెచ్చువర్ణాలవారితో వివాహానికి స్మృతులు అంగీకరించలేదు. దీనిని విలోమవివాహం అంటారు. వర్ణధర్మాలను పాటించనివారు, మగ సంతానం లేనివారు, వేదాధ్యయనం చేయనివారు, దొంగలు, మోసగాళ్ళు, నిందలుమోసేవాళ్ళు, రాజద్రోహులు, కురూపులు, క్షయ, కుష్ఠు, పాణ్డు రొగపీడితులు, వంశపారంపర్యంగా వచ్చు రోగపీడితులైనవారు, మిక్కిలి పొడుగువారు, మరగుజ్జులు, విపరీతమైన నల్లటి / తెల్లటి శరీరంగలవారు, వికలాంగులు మొదలగు వారితో వివాహాలను శాస్త్రాలు నిషేధించాయి. ఇరువర్గాలవారు, విద్య, ఐశ్వర్యాదులలో సమానంగా వున్నప్పుడే ఆ వివాహ బంధం నిలచునని శాస్త్రకారుల వచనం. వరుణ్ణి ఎంచుకునేముందు, అతడి గుణగణాలతోబాటు, అతని వంశం, శాస్త్రపరిజ్ఞానం, వయస్సు, ఆరోగ్యం, శరీరపుష్టి, బంధుబలగం, సంపదలు అను ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నియమం పెట్టారు. రోగాలతో వున్నవానికి, మారువేషాలలో తిరిగే వానికి, అవయవ సౌష్టవం లేనివానికి, విపరీతమైన బలం గలవానికి, బలహీనునికి, సంపాదన లేనివానికి, గుణహీనునికి, బుద్ధిహీనునికి, విదేశాలలోవుండువానికి, కన్యను ఇవ్వరాదని శాస్త్ర నియమం. శారీరక పరిపుష్టత, ఆరోగ్యరీత్యా, వధువు వయస్సు వరుని వయస్సుకంటే తక్కువగా వుండాలని అందరు శాస్త్రకారులు నిర్ణయించిన విషయం. శాస్త్రకారులందరు, వధువు రజస్వల కాకమునుపే వివాహం చేయాలని తీర్మానించారు. వివాహానికి ఉపయుక్తమైన కాలం గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తంచేశారు స్మృతికారులు. కొందరు ఉత్తరాయణంలో మాత్రమే చెయ్యాలని, మరికొందరు సంవత్సరమంతా చెయ్యొచ్చని చెప్పారు. చైత్ర, పుష్యమాసాలు పనికిరావని కొందరు చెప్పారు. ఆషాఢ, మార్గశిర, ఫాల్గుణ మాసాలు విడిచిపెట్టాలని కొందరు, అన్ని మాసాలలో చెయ్యచ్చని కొందరు చెప్పారు. రోహిణీ, మృగశిర, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శ్రవణ, స్వాతి నక్షత్రాలు మంచివని కొందరు చెప్పియున్నారు. బుధ, గురు, శుక్రవారాలు వివాహానికి మంచివని కొందరు అంటే, రాత్రిపూటచేసే వివాహాలకు వారం పట్టించుకోనవసరం లేదని కొందరు స్మృతికారులు చెప్పారు. త్రిజ్యేష్టం, అనగా, జ్యేష్ట సంతానాలుగాని, జ్యేష్ఠ మాసంగానీ, జ్యేష్ఠా నక్షత్రంగానీ మూడు రకాల జ్యేష్ఠలు కలవకూడదని నియమంపెట్టారు. వివాహ విషయంలో, జ్యోతిష్యం ప్రముఖ పాత్రను పోషిస్తుంది. వధూవరుల వివాహ పొంతన పరీక్ష చేయడానికి, వర్ణం, వశ్యం, జన్మ/నామ నక్షత్రాలు, యోనులు, గ్రహాలు, గణాలు, రాసులు, నాడులు, కూటాలు అని ఎనిమిది అంశాలని పరిగణనలోకి తీసుకునే పద్ధతి వున్నది. వీటిలో ఆఖరి రెండు అంశాలకూ ప్రస్తుతం కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగిలినవి పెద్దగా పట్టించుకోవడంలేదు. మొత్తం 27 నక్షత్రాలు, దేవ, మానుష్య, రాక్షస అని మూడు తరగతులుగా/గణాలుగా విభజించారు. వధూవరులిద్దరూ ఒకే గణానికి చెందినవారైతే మంచిది. లేనిచో వారు కొన్ని నిబంధనల్ని పాటించాలి. వధూవరులు వారి జన్మ సమయాన్ని బట్టి వారు కొన్ని జంతుయోనులకు చెందినవారైవుంటారు. వారు జాతివైరం గల జంతువులకి చెందినవారు కాకుండా వుండాలి. ఉదాహరణకి, సింహం –జింక, పులి–మేక, పాము–ముంగిస, పిల్లి–ఎలుక, ఇలా వైరి వర్గానికి చెందకుండా వుండాలి. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు చదవండి: వివాహం కాని మానవులు పరిపూర్ణులు కారు.. కావ్యాలు చదవకూడదు, పాడుకోవాలి -
మా నాన్న దగ్గర రాఘవేంద్రరావు అసిస్టెంట్..
సినీ ఫ్యాన్ పేరుతో రివ్యూలు రాశారు.. చంద్రహారంతో సినీ రంగ ప్రవేశం చేశారు.. నర్తనశాలకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చారు.. పౌరాణికబ్రహ్మ పేరు సంపాదించారు.. నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలలో శిరోమణి అవార్డు అందుకున్నారు.. సినిమాలలో బిజీగా ఉన్నా ఏనాడూ పిల్లల్ని నిర్లక్ష్యం చేయలేదు.. ఆయనే దర్శకులు కమలాకర కామేశ్వరరావు.. నేడు(జూన్ 29) 23వ వర్ధంతి. ఈ సందర్భంగా తండ్రితో పిల్లలకున్న అనుబంధం గురించి పెద్ద కుమార్తె శ్రీమతి లక్ష్మి సాక్షితో పంచుకున్న వివరాలు... నాన్నగారు 1911, అక్టోబర్ 14న బందరులో పుట్టారు. తాతగారు సుందర్రావు, నాయనమ్మ కామేశ్వరమ్మ. తాతగారికి ఐదుగురు కొడుకులు, ఇద్దరు అమ్మాయిలు. అది గోల్కొండ నవాబుల పరిపాలనా కాలం. మా తాతగారు నవాబుల దగ్గర పనిచేశారట. ఆ రోజుల్లో ఆయనను తీసుకువెళ్లడానికి బగ్గీ వచ్చేదట. నాన్నగారు ఆఖరి నవాబు కాలంలో పుట్టారు. ఆయన అందరికంటె చిన్నవారు. పది నెలల వయసు వచ్చేసరికే తాతగారు పోయారు. నాన్నగారు చంటిపిల్లాడు కావటంతో, ఆయనను అందరూ అల్లారుముద్దుగా పెంచారు. అప్పట్లోనే బిఏ నాన్నగారు ఎంతో కష్టపడి బందరు నోబుల్ కాలేజీలో బిఏ పూర్తి చేశారు. ఆ రోజుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో రెండే కాలేజీలు.... మద్రాసులో లేదంటే మచిలీపట్టణంలో చదవాలి. అప్పట్లో ఇంట్లో కరెంటు లేదు. పుస్తకాలు కొనుక్కునే స్థాయి కూడా లేదు. పెద్దయ్యాక మాత్రం చాలా పుస్తకాలే కొన్నారు. ఇంట్లో ఒక బీరువాలో ఇంగ్లీషు పుస్తకాలు, మరొక బీరువాలో తెలుగు వేదాంత గ్రంధాలు ఉండేవి. మా కోసం పిల్లల పుస్తకాలు కొనేవారు. ‘మచిలీపట్టణం చరిత్ర’ పుస్తకంలో నాన్నగారి గురించి ఒక పేజీ రాశారు. ఆటో వద్దనేవారు.. మేం బస్సులోనే ప్రయాణించేవాళ్లం. ఎప్పుడైనా ఆటోలో వెళ్తాం నాన్నా అంటే, మీటర్ టాక్సీలో వెళ్లమనేవారు. ఆయన తాతయ్యాక మనవలతో ఎంతో సంతోషంగా గడిపారు. నెలల పిల్లాడికి ఉత్తరాలు రాశారు. మా ఇంట్లో పెద్ద చెక్క ఉయ్యాలలో చంటి పిల్లాడిని పడుకోబెట్టి, ఉయ్యాలకు తాడు కట్టి, ఆ తాడును తన కాలి బొటనవేలికి కట్టుకుని, కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతూ, కాలితో ఊపుతూ, ‘తాతా! ఉయ్యాల ఊపనా’ అంటూండేవారు. మాతో మౌనంగా ఉండే నాన్నేనా మనవలతో ఇంత సరదాగా ఉంటున్నది అనిపించేది. తెల్ల పంచె, లాల్చీ, నుదుటి మీద విభూతి, కుంకుమతో స్వచ్ఛంగా ఉండేవారు. సినీ ఫ్యాన్ – కృష్ణా పత్రిక నాన్నగారు బి. ఏ పూర్తి చేసి ఖాళీగా ఉన్న సమయంలో, కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావుగారు సినిమా రివ్యూలు రాయమని కోరటంతో, నాన్న అంగీకరించారు. సినీ ఫ్యాన్ పేరుతో రివ్యూలు రాయటం ప్రారంభించారు. అప్పట్లో హెచ్. ఎం. రెడ్డిగారు తీసిన ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’తో పాటు ‘ద్రౌపదీ మానసంరక్షణ’ చిత్రం కూడా విడుదలైంది. హెచ్. ఎం. రెడ్డి గారు తీసిన సినిమా బాగా ఆడింది. నాన్నగారికి ‘మాన సంరక్షణ’ పేరు వినసొంపుగా ఉండటంతో, ఆ పేరు పట్టుకుని, చాలా బావుంది అని రాశారు. టెక్నికల్‌గా కూడా ‘మాన సంరక్షణ’ చిత్రమే బాగుందట. రివ్యూ చూసిన హెచ్. ఎం. రెడ్డిగారు, ఏ మాత్రం బాధపడకుండా నాన్నను విజయవాడ వచ్చి కలవమన్నారట. ఆ మాట ప్రకారం వెళ్లి కలిస్తే, ‘మా దగ్గర పని చేస్తావా’ అని అడగటంతో, నాన్నగారి సినీ రంగ ప్రవేశం జరిగింది. అప్పట్లో కృష్ణా పత్రిక రివ్యూకి అంత విలువ ఉండేది. మేం బందరులో ఉండగానే పింగళి నాగేంద్రరావుగారితో స్నేహం ఏర్పడింది. నాన్నగారు విజయవాహినిలో నెల జీతానికి సెటిల్ అయ్యాక, ‘ఇక్కడ ఖాళీ ఉంది, నువ్వు కూడా మద్రాసు వచ్చేసై’ అని పిలవటంతో పింగళి నాగేంద్రరావుగారు మద్రాసు వెళ్లారు. చెన్నైలో కెవి రెడ్డి గారితో కలిసి ఒక రూమ్‌లో ఉండేవారు. నాగిరెడ్డి, బి.ఎన్. రెడ్డి గారి సంస్థల్లో పనిచేశారు. నాన్నగారు దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం ‘చంద్రహారం’ చిత్రం తరవాత నాన్నగారి నైపుణ్యం చూసి ఎన్. టి. ఆర్. తన సంస్థలో అవకాశం ఇచ్చారు. ఆ సంస్థలోనే ‘పాండురంగ మహాత్మ్యం’ చేశారు. ఆ చిత్రంతో బ్రేక్ రావటంతో, పౌరాణిక చిత్రాలకు నాన్న ఫేమస్ అయిపోయారు. నెహ్రూతోకమలాకర కామేశ్వరరావు సమయ పాలన... షూటింగ్‌కి కారు వస్తుందంటే, వరండాలో సోఫాలో రెడీగా కూర్చునేవారు. కారు రాగానే ఎక్కి వెళ్లిపోయేవారు. ప్రివ్యూలకు అందరం వెళ్లేవారం. మా మేనత్తగారు కూడా మాతో వచ్చేవారు. అందరినీ ఆలస్యం చేయకుండా టైమ్‌కి రెడీగా ఉండమనేవారు. ‘నిత్యం ప్రశాంతంగా, చిరునవ్వుతో ఉండేవారు. ‘దుఃఖానికి సుఖానికి ఒకేలా ఉండాలి’ అనేవారు. ఆయన ఆ సూత్రాలే పాటించేవారు. నాన్నగారి దర్శకత్వంలో వచ్చిన, ‘నర్తనశాల’ చిత్రానికి జాతీయస్థాయిలో రెండో ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. దక్షిణ భారత దేశంలో మొట్టమొదటిసారి దక్కిన గౌరవం అది. ఆ రోజు కూడా నాన్న ఎంతో స్థితప్రజ్ఞతతో ఉన్నారు. నాన్నగారికి రెండు సంవత్సరాలు వరుసగా జాతీయ అవార్డులు వచ్చాయి. పురాణ చిత్రాలకు ఆదరణం తగ్గుతుండటంతో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా మాకు తెలియనిచ్చేవారు కాదు. సొంత ఇల్లు కూడా కొనుక్కోలేకపోయారు. ఒక్క నయా పైసా అప్పు లేనందుకు సంతోషించేవారు. ఉన్నదానితో సంతోషంగా ఉండాలి అనేవారు. సంగీతం – వేదాంతం నాన్న సంగీతం బాగా పాడేవారట. నా కంటె ముందు ఒక బాబు పుట్టి, పది నెలల వయసులోనే పోయినప్పటి నుంచి నాన్న పాడటం మానేశారని అమ్మ చెబుతుండేది. నాన్న సంగీతం నేర్చుకోకపోయినా, రాగాలు తాళాలు చెప్పగల పరిజ్ఞానం ఉంది. బందరులో సంగీత కచేరీలకు వెళ్లేవారట. అందుకునేమో నాన్నగారి సినిమాలలో సంగీతం, సాహిత్యం ఉన్నతంగా ఉండేవి. షూటింగ్‌లు లేనప్పుడు స్వామి చిన్మయానంద, జిడ్డు కృష్ణమూర్తి ఉపన్యాసాలు వినడానికి వెళ్లేవారు. ఆధ్యాత్మిక, వేదాంత గ్రంధాలు చదివేవారు. లైబ్రరీలో కూర్చుని ఇంగ్లీష్ సినిమాలకు సంబంధించిన విషయాలు చదివేవారు. ఇంట్లో కూడా స్క్రిప్ట్ రాసుకునేవారు. ప్రతిరోజూ లేవగానే ధ్యానం, జపం చేసేవారు. రమణ మహర్షి, రామకృష్ణ, పరమహంస, వివేకానంద, అరవిందులు రచించిన పుస్తకాలు అధ్యయనం చేసేవారు. సహస్ర చంద్ర దర్శనం... వెయ్యి పున్నములు చూసిన వారికి ఒక భోగం జరుపుతారు. అందుకు ఆరోగ్యం, భార్య రెండూ ఉండాలి. ఆ రెండూ నాన్నగారికి ఉన్నాయి కనుక, ఆయనను ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాం. ‘శతమానం భవతి’ అని వంద మందిని మాత్రమే పిలవమన్నారు. ఆయన కింద కూర్చోలేరేమో అనుకున్నాం, కానీ, మా అందరికీ ఆనందం కలిగించేలా చక్కగా చేయించుకున్నారు. ఆయన పిల్లలుగా పుట్టే అదృష్టం మాకు భగవంతుడు ఇచ్చినందుకు, ఆ ఒక్క వేడుకైనా చేయగలిగినందుకు సంతోషపడ్డాం. ఆ తరవాత నాన్నగారి శతజయంతి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మా చెల్లెలు శాంతి పూర్తిగా సహకరించింది. బాలు గారి వల్లే... నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బాలు గారు ఆటా వాళ్ల చేత నాన్నగారికి ‘శిరోమణి’ అవార్డు ఇప్పించారు. 80 సంవత్సరాల వయసులో నాన్నగారు రాలేనని చెప్పినా, బాలుగారి బలవంతంతో అమ్మనాన్న కలిసి వెళ్లారు. సినీ పరిశ్రమలో నాన్నగారిని ధర్మరాజు అనేవారు. ఎవరైనా పిలిచి ఇస్తేనే సినిమా చేసేవారు. నాగిరెడ్డి గారు ఫాల్కే అవార్డు అందుకున్నప్పుడు లక్షరూపాయలు అవార్డు వస్తే, ఇందులో నాన్నగారి భాగస్వామ్యం ఉంది అని కొంత డబ్బు నాన్నకి ఇచ్చేశారు. ఆ రోజుల్లో అంత ఉన్నతంగా ఉండేవారు. రాఘవేంద్రరావుగారు నాన్నగారి దగ్గరే మొదట అసిస్టెంట్‌గా చేశారు, నాన్నగారిని గురువు గారు అంటుంటారు. ప్రేమగా చూసేవారు.. నాన్నగారికి మేం ఐదుగురం పిల్లలం. ఒక అబ్బాయి, నలుగురు ఆడ పిల్లలు. అందరి కంటే నేనే పెద్దదాన్ని. నా తరవాత శాంత, ఉష, ఉమ, అబ్బాయి రామకృష్ణ, మా అందరినీ నిశ్శబ్దంగా గమనిస్తూ, ప్రేమగా పెంచారు. ఇంట్లో పనులన్నీ అమ్మ ద్వారానే జరిగేవి. స్కూల్ డిబేట్లో మాట్లాడాలంటే, ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో చెప్పేవారు. మహిళా దినోత్సవం సందర్భంగా.. ద్రౌపది, సీతల గురించి ప్రస్తావిస్తూ, స్త్రీ శక్తి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. నాన్నగారు ఆ రోజు చేసిన బోధన ఈ నాటికీ చాలా ఉపయోగపడుతోంది. అమ్మనాన్నలు వయసులో పెద్దవారయ్యాక మా చెల్లెళ్లు ఉష, ఉమ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. చివరి రోజుల్లో నెల్లూరులో తమ్ముడి దగ్గర గడిపారు. అక్కడ ఉండగానే జూన్ 29, 1998లో పరమపదించారు. - పానుగంటి లక్ష్మి (కమలాకర కామేశ్వరరావు పెద్ద కుమార్తె) – సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఉపనయనంతోనే ద్విజత్వం
షోడశోపచారాలలో ఉపనయనం ఒకటి. ఇది ప్రధానమైనది. ఉపనయనమనగా బ్రహ్మచారిని గ్రహించడమని అథర్వవేదం వలన తెలుస్తుంది. అంటే ఆచార్యుడు ఒక బ్రహ్మచారికి వేదవిద్య నేర్పించేందుకుగాను శిష్యునిగా స్వీకరించడమని అర్థం. ఈ సంస్కారానికే మౌంజీబంధనం, వటుకరణం, ఉపాయనం అని వేరే పేర్లుకూడా వున్నాయి. గాయత్రీ ఛందస్సుతో బ్రాహ్మణులని, త్రిష్టుభ్ ఛందస్సుతో క్షత్రియుల్నీ, జగతీ ఛందస్సుతో వైశ్యుల్నీ ఆ సృష్టికర్త సృష్టించాడని ఆపస్తంభుడు తన ధర్మ సూత్రాలలో తెలియజేశాడు. ఈ సంస్కారం వల్ల ద్విజత్వం సిద్ధిస్తుంది. అంటే రెండో జన్మ ప్రాప్తించినట్లే అని శాస్త్రం. అందుకే ఉపనయనం అయినవారిని ద్విజులు అంటారు. ఉపనయనాన్ని బ్రాహ్మణులకి గర్భాష్టమాన, అంటే ఏడో సంవత్సరంలో చేయాలని చెప్పారు. కొందరు శాస్త్రకారులు ఎనిమిదో సంవత్సరంలో చేయాలన్నారు. క్షత్రియులకి పదకొండో సంవత్సరంలో, వైశ్యులకి పన్నెండో సంవత్సరంలో చేయాలని సూచించారు. ఈ సంవత్సరాల ప్రామాణికత, వారికి ఉపదేశించే ఛందస్సుల ఆధారంగా నిర్ణయించబడింది. అంటే, గాయత్రీ ఛందస్సులో ఒక పాదానికి ఎనిమిది అక్షరాలు, త్రిష్టుభ్ ఛందస్సులో ఒక పాదానికి పదకొండు అక్షరాలు, జగతి ఛందస్సులో ఒక పాదానికి పన్నెండు అక్షరాలు వుంటాయి. ఉపనయనం చెయ్యడానికి రకరకాల శాస్త్రకారులు రకరకాల వయస్సులను ప్రామాణికంగా చెప్పివుండడం విశేషం. ఎవరు ఎలా చెప్పినా, ఉపనయనానికి కనీసం ఏడు సంవత్సరాలు వుండాలన్నది అందరి అభిప్రాయం. అలాగే, బ్రాహ్మణులకి పదహారు సంవత్సరాలు, క్షత్రియులకి ఇరవై రెండు సంవత్సరాలు, వైశ్యులకి ఇరవైనాలుగు సంవత్సరాలు దాటకూడదన్నది శాస్త్రం. తరువాతి కాలంలో శాస్త్రకారులు ఈ హద్దును వరసగా ఇరవై రెండు, ముప్పైమూడు, ముప్పై ఆరు సంవత్సరాలుగా సవరించారు. కానీ ఈ ఉపనయనం కేవలం బాలకులకే చెయ్యాలికానీ యువకులకు కాదు; అంటే పదహారవ సంవత్సరంతో యవ్వనంలోకి అడుగుపెట్టినవారు ఉపనయనానికి అనర్హులని జైమిని ధర్మశాస్త్రం కచ్చితంగా చెప్పింది. బ్రాహ్మణులకి వసంత ఋతువులో, రథకారులకు వర్షఋతువు, క్షత్రియులకు గ్రీష్మఋతువు, వైశ్యులకు శర దృతువు అని బోధాయనుడి గృహ్యసూత్రాలు నిర్దేశించాయి. ఉపనయనాన్ని చైత్ర, వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ, మాఘ, ఫాల్గుణ మాసాలలో శుక్ల పక్షాన విదియ, తదియ, పంచమి, షష్ఠి, దశమి, ఏకాదశి తిథులలో, ఆది, బుధ, గురు, శుక్ర వారాలలో, పురుష నక్షత్రాలలో జరిపించాలని శాస్త్రకారులు తెలియజేశారు. ఈ ద్విజులలో ఎవరైతే ఈ ఉపనయన సంస్కారాన్ని వారికి నిర్దేశించిన కాలంలో జరిపించుకోరో, వారిని ధర్మభ్రష్టులుగా పరిగణించి, ఆయా జాతులనుండి వెలివేయాలని మనువు ఘంటాపదంగా సూచించాడు. బ్రహ్మచారికి ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చేవరకు ఆచార్యుని వద్దనే వుండి విద్యను నేర్చుకోవాలని శాస్త్రం. ఒక వేదం చదివినవారు మరొక వేదాన్ని చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకునే సాంప్రదాయాన్ని కూడా కొందరు శాస్త్రకారులు సూచించారు. బ్రహ్మవాదినులైన స్త్రీలకు కూడా ఉపనయనం చేయించే ఆచారమున్నట్లు శాస్త్రకారులు పేర్కొన్నారు. అయితే వారికి రజస్వల కాక ముందే అనగా ఎనిమిదవ సంవత్సరం దాటకుండానే ఉపనయనం చేయించాలని శాస్త్రం. వారికి కూడా వేదాధ్యయనమున్నది. బ్రహ్మవాదినులైన గార్గి, మైత్రి అలనాటి రోజుల్లోనే ఉపనయనం చేయించుకున్నారు. సంస్కార విధానం తారాబలం, చంద్రబలాలతోబాటు, గురుబలం కూడా గల ముహూర్తాన్ని పంచకరహితంగా నిర్ణయించి, శుభముహుర్తాన, గణపతి పూజ పుణ్యహవాచనలను జరిపించి అగ్నిప్రతిష్ఠ చేసి, ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం..’ అనుమంత్రంతో వటువునకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఆచార్యుని చేతులమీదుగా దీక్షా వస్త్రాలు, దండకమండలాలు, అజినం, మేఖలాలు తీసుకుని ధరించి అగ్నికి హవిస్సులు అర్పించాలి. ముహూర్త సమయానికి ఆచార్యుడు ఒక నూతన వస్త్రాన్ని వటువుతోసహా కప్పుకుని, ఎవరికీ వినపడకుండా వటువు కుడిచెవిలో బ్రహ్మోపదేశమంత్రాన్ని పఠిస్తాడు. ఆ తరువాత అగ్నికార్యం, ఇతర శాస్త్ర విధులను నిర్వహించి ఆచార్యుని నుండి బ్రహ్మచర్య దీక్షను తీసుకుని, కార్యక్రమం తర్వాత వస్త్రాలను, దండాదులను మోదుగ చెట్టుయందు విడిచిపెట్టాలి. ఆచార్యునికి గోదానమిచ్చి, వస్త్ర తాంబూలాదులతో సత్కరించాలి. ఆ తరువాత ఆచార్యుడు చెప్పిన బ్రహ్మచర్య వ్రతనియమాలని పాటిస్తూ గురుశుశ్రూష చేయాలి. బ్రహ్మచర్య దీక్షలో ఉన్న బ్రహ్మచారి కచ్చితంగా భిక్షాటనం చేయాలని మనువు ధర్మ శాస్త్రం. పరమ పవిత్రమైన భిక్షను తినడం అంటే ఉపవాసమున్నట్లే లెక్క అని చెప్పారు. ఆ భిక్ష కూడా వేరువేరు ఇండ్లనుండి తీసుకున్నదై ఉండాలి, ఒకే ఇంటినుండి తీసుకోరాదు అని శాసనం. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
గృహస్థు ఆచరించాల్సిన సంస్కారాలు గృహ్య సూత్రాలు
గృహ్య సూత్రాలనేవి గృహస్థులు ఆచరించాల్సిన ధర్మాలనూ, సంస్కారాలనూ వివరిస్తాయి. ఇవి ఇంట్లో చేయవలసిన కర్మలు. ద్రాహ్యాయనుడు, కాత్యాయనుడు తప్ప, కల్పసూత్రాలను రచించిన ఋషులందరూ గృహ్య సూత్రాలను రచించారు. వాటిలో కొన్ని, ఆపస్తంభ, బౌధాయన, ఆశ్వలాయన, భారద్వాజ, గోభిల, హిరణ్యకేశీయ, జైమినీయ, ఖదీర, మానవ, పారాస్కర, సాంఖ్యాయన గృహ్య సూత్రాలు. ఇవి వాటిని రచించిన ఋషులపేర్లమీద ప్రాచుర్యం పొందాయి. వీటిలో బోధాయన, ఆపస్తంభ, కాత్యాయనమొదలగు తొమ్మిది గృహ్యసూత్రాలు ప్రాచీనమైనవి. వైఖానస, శౌనకీయ, భారద్వాజ, అగ్నివేశ, జైమినీయ, వాధూల, మాధ్యందిన, కౌండిన్య, కౌశీతకీ గృహ్యసూత్రాలు తొమ్మిది ఆ తరువాతి కాలానివి. గృహ్యసూత్రాలు, నలభై సంస్కారాలను, ఎనిమిది ఆత్మ గుణాలను నిర్దేశించాయి. వైదికులు, ప్రతినిత్యం ఏడు హవిర్యజ్ఞాలు, ఏడు సోమయజ్ఞాలు, ఏడు పాకయజ్ఞాలు మొత్తం కలిపి ఇరవై ఒక్క యజ్ఞాలను ఆచరించే అగ్నికార్యం చేయాలని కల్పసూత్రాలు చెప్తున్నాయి. వీటిలో ఏడు హవిర్యజ్ఞాలు, ఏడు సోమయజ్ఞాలు, శ్రౌత సూత్రాలలోనికి వస్తాయి కనుక గృహ్యసూత్రాలలో వుండవు. మిగిలిన ఏడు పాకయజ్ఞాలు, పంతొమ్మిది సంస్కారాలతో కలిపి గృహస్థుడు ఆచరించాల్సిన మొత్తం ఇరవై ఆరు సంస్కారాలు గృహ్యసూత్రాలలో వుంటాయి. అసలు ఈ సంస్కారాల సంఖ్యమీద కొన్ని వాదోపవాదాలున్నాయి. అవి పన్నెండు అని కొందరు, పదహారు అని కొందరు, పంతొమ్మిది అని కొందరు అంటారు. కానీ ఎక్కువ భాగం పదహారు సంస్కారాలనే అంగీకరించారు. స్వామి దయానంద సరస్వతి రచించిన ‘సంస్కార విధి’ లో పదహారు సంస్కారాలనే పేర్కొన్నారు. అవి గర్భాదానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, నిష్క్రమణం, అన్నప్రాసనం, చూడాకరణ, కర్ణవేధ, విద్యారంభం, ఉపనయనం, వేదారంభం, కేశాంతం, సమావర్తనం, వివాహం, అంత్యేష్టి. దేవయజ్ఞం(కర్మకాండలు, హోమాలు), పితృయజ్ఞం(తర్పణం, శ్రాద్ధక్రియలు), భూతయజ్ఞం(బలులు, అర్పణలు), బ్రహ్మయజ్ఞం (వేదాన్ని అధ్యయనం చెయ్యడం), మనుష్యయజ్ఞం (అతిథులకు, పేదలకు సేవచెయ్యడం)అనే ఐదునిత్యయజ్ఞాలు; అగ్నాధేయం, అగ్నిహోత్రం, సౌత్రాయణీ, అగ్రయణేష్టి, చాతుర్మాస్యం, దర్శపూర్ణమాస్యం, విరూఢపశుబంధఅనే ఏడు హవిర్యజ్ఞాలు; అగ్నిష్టోమ, అత్యగ్నిష్టోమ, ఉక్థ్య, వాజపేయ, అప్తోర్యామ, అతిరాత్రి, షోడశి అనే ఏడుసోమయజ్ఞాలు; అష్టక, అగ్రహాయణీ, ఆశ్వయుజీ, శ్రాద్ధ, పార్వణ, చైత్రీ, శ్రావణీ అనే ఏడుపాకయజ్ఞాలు; ప్రాజాపత్యం, సౌమ్యం, ఆగ్నేయం, వైశ్వదేవం అనేవి వటువు కోసం ఆచార్యుడు చేసే నాలుగుసంస్కారాలు; సమావర్తనం, వివాహం అనేవి తనకోసం తను చెయ్యాల్సిన రెండు స్వకృత్య సంస్కారాలు; గర్భాదానం, పుంసవనం, సీమంతం అనేవి తన భార్యకు చేయవల్సిన మూడు సంస్కారాలు; జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన, చౌలం, ఉపనయనం అనేవి తనసంతానం శ్రేయస్సు కోసం చేయవల్సిన ఐదుసంస్కారాలు; మొత్తం కలిపి గృహస్థుడు ఆచరించాల్సినవి నలభైసంస్కారాలు. వీటి గురించి, పారస్కరుడు, అశ్వలాయనుడు, బోధాయనుడు మాత్రమే తమ గృహ్య సూత్రాలలో వివరంగా తెలియజేశారు. ఈ గృహ్య సూత్రాలలో ముఖ్యంగా, గార్హపత్యాగ్నిని ఉపయోగించిచేసే క్రతువుల వివరణ వుంటుంది. దయ, అనసూయ (అసూయ లేకపోవడం), అకార్పణ్యం (మొండిగా లేకుండుట), అస్పృహ, అనాయాసం, శౌచం (శుభ్రత), మాంగల్యం (మధు స్వభావం), క్షాంతి (క్షమా గుణం) అనేవి ఆత్మ గుణసంస్కారాలు. ఇవి జాతి భేదం లేకుండా, ప్రతి మనిషికీ వర్తించే ధర్మాలు.పైన చెప్పిన నలభై సంస్కారాలు, ఈ ఎనిమిది ఆత్మగుణ సంస్కారాలు, మొత్తం కలిపి మనిషి పాటించాల్సిన సంస్కారాలు నలభై ఎనిమిది అనే నానుడి కూడా వుంది లోకంలో. ఈ సంస్కారాల సంఖ్య విషయంలో ఎన్ని అభిప్రాయ భేదాలున్నా, అన్ని సంస్కారాలూ మనిషిని సంస్కరించేవే, తనని ధర్మమార్గాన ప్రయాణింప జేసేవే. ఈ సంస్కారాలన్నీ కొన్ని స్వప్రయోజనాలకోసం చేసేవైతే, కొన్ని ఇతరుల లేక సామాజిక ప్రయోజనాలకోసం చేసేవి. ఒక వ్యక్తి సంస్కారవంతుడైతే, అది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమాజానికి ఉపయోగించేదే. కాబట్టే, మనిషి ఈ ధర్మాలను ఆచరించినంత కాలం సమాజం సంస్కారవంతంగా, ధర్మబద్ధంగా వుంటుంది. వ్యక్తులు ధర్మం తప్పితే, వ్యవస్థ కూడా గాడితప్పి యావత్ సమాజమూ భ్రష్టుపట్టిపోతుంది. ధర్మానికి హాని జరిగితే, సాక్షాత్తూ భగవంతుడే వచ్చి ధర్మ సంస్థాపన చేస్తానని చెప్పడంలో, ధర్మానికివున్న ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ గుర్తించి నడచుకోవాలి. ధర్మ హాని జరుగకుండా చూసుకోవాలి. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
సంస్కారాలను బోధించే కల్పసూత్రాలు
కల్పసూత్రాలు(శాస్త్రాలు)ఋగ్వేదాది వేదాలవారీగా శాఖాభేదంతో అనేకమంది ఋషులు రచించారు. అవి ఆ ఋషుల పేర్లమీదే ప్రచారం పొందాయి. ఋగ్వేదానికి ఆశ్వలాయన, సాంఖ్యాయన కల్పసూత్రాలు, శుక్ల యజుర్వేదానికి కాత్యాయన, కృష్ణ యజుర్వేదానికి ఆపస్తంభీయ, బోధాయన, వైఖానస, సత్యాషాఢ, భారద్వాజ, అగ్నివేశ కల్పసూత్రాలు, సామవేదానికి లాట్యాయన, ద్రాహ్యాయన, జైమినీయ కల్పసూత్రాలు ప్రచారంలో వున్నాయి. చదవండి: (కల్పసూత్రాలు) ఎవరెవరు ఏయే కర్మలను ఆచరించాలి, ఏయే కర్మలకు ఏయే మంత్రాలను ఉపయోగించాలి, దానికి కావల్సిన సామగ్రి, దానికి అధిష్టాన దేవత, యజ్ఞాయుధాలు ఏమేమి కావాలి, అవి ఎన్ని వుండాలి, వాటి ఆకారం ఏమిటి, అవి దేనితో తయారు చెయ్యాలి, ఎంతమంది ఋత్విక్కులు కావాలి, యజ్ఞగుండాలు ఎన్ని కావాలి, వాటి ఆకారాలు, వాటి కొలతలు, అవి ఎలా నిర్మించాలి, హోమ ప్రక్రియలు, హోమంలో వెయ్యాల్సిన హవిస్సులు, హోమ సమిధలు తదితర విషయాలను వివరిస్తాయి కల్పసూత్రాలు.. కల్పశాస్త్రాలలోని విషయాలన్నీ ముఖ్యంగా సూత్రాల రూపంలోనే వుంటాయి. సూత్రమంటే విశాలమైన విషయాన్ని ఒక చిన్న వాక్యరూపంలో చెప్పడం. శ్రౌత సూత్రాలు, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు, శుల్బ (శిల్ప) సూత్రాలు అని కల్ప సూత్రాలు నాలుగు రకాలుగా విభజించారు. శ్రౌత సూత్రాలు శృతిని (వేదాన్ని) ఆధారం చేసుకుని చెప్పబడ్డాయి. ఉదాహరణకు, ఋగ్వేదంలో వివాహ సూక్తం, అథర్వణ వేదంలో వివాహ సంస్కారానికి సంబంధించిన సుమారు నూటనలభై మంత్రాలు మొదలైనవాటి ఆధారంగా అన్నమాట. వివాహం, గర్భాదానం, పుంసవనం, అక్షరాభ్యాసం, బ్రహ్మచర్యం, అంత్యేష్టి వంటి కొన్ని సంస్కారాల తాలూకు కొన్నిమంత్రాలు మనకు వేదాలలో కనబడినా, వాటికి సంబంధించిన నిర్దిష్టమైన విధి విధానాలు, పద్ధతులు వేదాలలో కనబడవు. వీటికి సంబంధించిన సంపూర్ణమైన వివరణలు మనకు శ్రౌత సూత్రాలే అందిస్తాయి. కర్మ సిద్ధాంత మూలాలు మనకు మొదటగా ఋగ్వేదంలోనూ ఆతర్వాత అథర్వణవేదంలోనూ కనిపిస్తాయి. ఈ సందర్భంగా అథర్వణవేదం గురించి కొంత చెప్పుకోవాల్సిన అవసరం వుంది. వేదాలలో అథర్వణవేదం చివరిదే అయినా, అందులో దేవతా స్తోత్రాలకు సంబంధించిన మంత్రాలే కాకుండా, వేదకాలంలోని సమాజం, దానికి సంబంధించిన చరిత్ర, మానవుల జీవన విధానం, ఇత్యాది అంశాలను అధ్యయనం చెయ్యడానికి అది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కారాలు, గృహాలు, పాడిపంటలు, వ్యవసాయం, కులమతాలు, వ్యాపార వాణిజ్యాలు, ప్రభుత్వాలు, రాజ్యాంగాలు, కళలు, వస్తు ఉత్పత్తులు, పరిశ్రమలు, భూగోళ ఖగోళ విఙ్ఞానం, వేదాంతం, విశ్వం మొదలగు అంశాలగురించి అథర్వణవేదం ఎంతో సమాచారాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, ‘‘సర్వప్రాణుల మనుగడకు అన్నమే ఆధారం. ఆ అన్నానికి ఉత్పత్తిస్థానం క్షేత్రం (పొలం).ఆ క్షేత్రాన్నీ, అశ్వాన్నీ పోషిస్తూ క్షేత్రపతి (రైతు) మా మేలుకోసం కృషి (వ్యవసాయం) చేస్తాడు. ఆ బుద్ధిశాలి ఎంతో విఙ్ఞానం గడించి మాకు సుఖం కలిగించుగాక..!’’ అంటూ లౌకిక విషయాలైన వ్యవసాయ ప్రాధాన్యత, రైతుల ప్రాముఖ్యత గురించి అమోఘంగా స్తుతించిందీ వేదం. ఈ శ్రౌత సూత్రాలు, గార్హపత్య, ఆహవనీయ, దక్షిణ అనే మూడురకాల అగ్నులు వుపయోగించి చేసే యాగాలనుండి ఐదురకాల అగ్నులు ఉపయోగించి చేసే మహా క్రతువుల వరకు అన్నింటి గురించీ తెలియజేస్తాయి. ఉదాహరణకు, ఉపనయనంలో, బ్రాహ్మణులకు గాయత్రి, క్షత్రియులకు త్రిష్టుప్, వైశ్యులకు జగతీ మంత్రాలను ఉపదేశించే విధానాన్ని తెలిపేది శ్రౌత సూత్రాలే.అగ్న్యాధానం చెయ్యడానికి, వసంతే బ్రాహ్మణః గ్రీష్మే రాజన్యః వర్షాసు రథకారః శరదివైశ్యః అను వేద ప్రమాణం చేత, పూర్వకాలంలో ప్రతి వసంతఋతువులోను సోమయజ్ఞం చేసేవారు. ఇందుకు అవసరమైతే భిక్షాటన కూడా చేసేవారు. వీరిని ‘వసంత సోమయాజులు’ అనేవారు. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
నిజమా! అప్పాజీ అలా చేశాడా..!
కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో గుమ్మడి ప్రధాన పాత్ర పోషించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘మహారాజా! బహమనీ సుల్తానులు ఏ నిమిషంలోనైనా మన రాజ్యంపై దాడిచేయవచ్చు’’ హెచ్చరిక వార్తను రాయలవారి చెవిలో వేశాడు సేనాని రామలింగ నాయకుడు. అక్కడనే ఉన్న హంబీరుడు ఊరకనే ఉంటాడా! అనుమాన అగ్ని రాజేశాడు... ‘‘అలజడి కలిగించడం కోసమే ఇలా ఈ బహమనీ సుల్తానులను ఎవరైనా సృష్టించి పెట్టారేమోనని అనుమానంగా ఉంది.’’ ‘‘ఏమిటి సృష్టించారా?’’ ఆశ్చర్యపోయాడు రామలింగ నాయకుడు. ‘‘రామలింగ నాయకా! ఇంతకూ అప్పాజీ వారు ఏమన్నారు?’’ అడిగారు రాయలవారు. ‘‘ఈ విషయాన్ని మీతోనే సంప్రదించమన్నారు మహారాజా’’ చెప్పాడు రామలింగ నాయకుడు. దొరికిన అవకాశాన్ని జారవిడుచుకుంటాడా... తంటాలమారి హంబీరుడు మళ్లీ చెలరేగిపోయాడు... ‘‘ఏముందీ, మన అబ్బాయిని మనం పిలిపించేసుకున్నం కదండీ. అప్పాజీ వారు అలిగారు. కొంచెం బెట్టు చేస్తున్నారంతే’’ అంటూ వికటాట్టహాసం చేశాడు హంబీరుడు. ‘‘రామలింగ నాయకా... ముందు ఇతనిని బంధించండి’’ ఆగ్రహంతో ఆదేశించాడు తిమ్మరుసు. హంబేరుడు....గజగజా వణికిపోయాడు. ‘‘రక్షించాలి మహారాజా! ఏదో చుట్టం చూపుగా వస్తే ఈ పాపం నాకు అంటగడుతున్నారు. ఇక్కడ నే ఒక్కణ్ణేగా పరాయివాణ్ణి. సాక్ష్యం కూడా అక్కరలేదునుకుంటాను’’ అమాయకత్వం ఒలకబోస్తూ అన్నాడు హంబీరుడు. ‘‘సాక్ష్యాలు తరువాత ముందు బంధించండి’’ మరింత గట్టిగా అరిచాడు తిమ్మరుసు. ‘‘రామలింగ నాయాకా! ఆగండి. అతని నోరు నొక్కడానికి మీరెందుకంత తొందరపడుతున్నారు. ఈ సమయంలో సహాయపడగల స్వజనంలో వారు కూడా ఒకరని మీరు గ్రహించాలి’’ అన్నారు రాయలవారు. రాయల నోట ఆ మాటలు ఊహించనివి. మహామంత్రి ఉలిక్కిపడ్డాడు! రాయలవారి మాటలతో గుంటనక్క హంబీరుడికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ‘‘విరూపాక్షస్వామి! మహారాజా... వారు నా మీదే అనుమానం మోపుతుంటే నా అనుమానం నేను చెప్పాలిగా. మా గజపతి వంశాల మీద వీరికి ఎంత పగో మీకు తెలిసిందే. ప్రతీకారం కోసమేగా ఈ సంబంధం చేసింది. మా అన్నపూర్ణ కడుపున పుట్టాడు గనుక ఆ పసికూన ఈ ఆంధ్రసామ్రాజ్య వజ్రసింహాసనాన్ని ఏలుతాడు. కానీ మీరు వానికి పట్టాభీషేకం చేయాలని పట్టుబట్టారు, అదే మన కొంప ముంచింది ప్రభూ!’’ ‘‘ఏమిటీ? అప్పాజీని దోషిని చేస్తున్నారా?’’ ఆవేశంగా అరిచాడు రామలింగ నాయకుడు. ‘‘ఏమిటి మీ సాక్ష్యం?’’ అని కూడా అడిగాడు. ‘‘అయ్యయ్యో! ఇంత పనిచేసిన వారు సాక్ష్యం కూడా దొరకనిస్తారా? అసలు ఎవరు వచ్చారో ఎలా తీసుకెళ్లారో కళ్లు మూసిన మా బాబు వస్తేకదా తెలిసేది. మాకంత పుణ్యం లేదే..’’ అన్నాడు హంబీరుడు. ఇది విని రాయలవారి కంట్లో నీళ్లు. ‘‘గజపతుల మీద మీకెంత ద్వేషం ఉన్నా... లేక లేక కలిగిన నా బిడ్డను, నా కంటి వెలుగును ఆర్పేస్తారా అప్పాజీ! నా బిడ్డను బతకనిచ్చి నన్ను రాజ్యభ్రష్టున్ని చేసినా నేను సంతోషించేవాణ్ణి’’ అన్నారు రాయలవారు కళ్లనీళ్ల పర్యంతం అవుతూ. ఇదివిని తిమ్మరుసు గుండెలో వంద పిడుగులు పడ్డాయి. ‘‘రాయా! ఏమిటిది? మీరు నన్ను అనుమానిస్తున్నారా?’’ గుండెలు పట్టుకున్నాడు తిమ్మరుసు. మళ్లీ దృశ్యంలోకి వచ్చాడు హంబీరుడు. ‘‘మీ అంతటివారిని ఈ రాజ్యంలో ఎవ్వరూ అనుమానించరనే కదా మీరింత పని చేసింది’’ అగ్నిలో ఆజ్యం పోశాడు హంబీరుడు. హంబీరుడు హద్దు మీరుతున్నప్పటికీ రాయలవారి నోటి నుంచి ‘ఏం మాట్లాడుతున్నావు!’ అనే మాట పొరపాటున కూడా వినిపించలేదు. ‘‘మౌనం వహించారా మహారాజా! నేటికి మీరు నన్ను అనుమానించే స్థితికి వచ్చారా? ఏమిటీ దురదృష్టం! ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కరోజు గడువు ఇవ్వండి. హంతకుడిని సాక్ష్యంతో సహా మీ ముందు నిలబెడతాను’’ అన్నాడు తిమ్మరుసు. ‘‘ఒక్కరోజు కాదు, ఒక్క ఘడియ ఇస్తే ఈ రాజ్యాన్నే తారుమారు చేస్తారు. మీ శక్తిసామర్థ్యాలు మా రాయలవారికి తెలియనివి కావు. ఆనాడు వారి అన్నగారిని మోసం చేసి వారిని గద్దెనెక్కించారు. ఇప్పుడు వీరిని మోసం చేసి అచ్యుతరాయలకి పట్టం కడతారు’’ ఆజ్యం పోస్తూనే ఉన్నాడు హంబీరుడు. వేరే ఏమీ మాట్లాడకుండా... ‘‘రామలింగనాయకా! ఇక విచారణ, న్యాయసభ’’ అని చెప్పకనే తీర్పు చెప్పి విసవిసా అక్కడి నుంచి వెళ్లిపోయారు రాయలవారు. ‘‘ఏమిటి ఈ అన్యాయం?’’ అన్నాడు కళ్లనీళ్లతో రామలింగనాయకుడు. ‘‘రామలింగనాయకా! మీ ధర్మం మీరు నిర్వర్తించండి’’ అతడి భుజం మీద చేయి వేస్తూ అన్నాడు తిమ్మరుసు. విచారణ జరగలేదు. సాక్ష్యాల జాడలేదు. అయినా తిమ్మరుసు మీద తీర్పు వచ్చింది... ‘‘శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణదేవరాయలవారి ఆమోదం పొందిన ధర్మాసనం వారి తీర్పు ఇది. ఈ సంఘటన జరుగు వరకు విజయనగర సామ్రాజ్య సర్వసేనానిగా వ్యవహరించి, రాయలవారికి పితృసమానుడై, ప్రజలకు పూజనీయుడై ఇప్పుడు కఠిన కిరాతకుడై యువరాజు హత్యపాతకమునకు ఒడిగట్టాడు. ఈ తిమ్మరాజు కుటిల నీతితో, కుతంత్రములతో ఇష్టం లేని రాజులను పదవీభ్రష్టులను చేయుచూ వస్తున్నాడని చెప్పుటకు రాయలవారి వంశ చరిత్రే సాక్ష్యం. గజపతి వంశంపై గల పగ చేతనే ఈ నేరం చేసినాడని వాదుల ఆరోపణ. ఇందుకు ప్రతికూలముగా నిందితుని మౌనం తప్ప వేరు సాక్ష్యం లేదు. తంత్రాంగంలో అసమానప్రతిభావంతుడైన ఈ తిమ్మరాజు ప్రత్యక్ష్య సాక్ష్యం లవలేశం దొరకకుండా హత్య చేయుటలో సమర్థుడు. కనుక అనుమాన ప్రమాణమే ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చితిమి. ఈ తిమ్మరాజు శిశుహంతకుడు, రాజద్రోహి, శిక్షాస్మృతిని అనుసరించి ఇతనికి కన్నులు కాల్చివేసి, శాశ్వత కారాగావాసము విధించాల్సియున్నది. వెంటనే నిందితున్ని కారాగారబద్ధుణ్ణి చేయవలెను. ఈ రాత్రి గడిచి సూర్యోదయం అయ్యేవేళకు ఇతని కన్నులను కాల్చివేయవలెను’’ సమాధానం: మహామంత్రి తిమ్మరుసు -
గజాసుర గర్భంలో శివుడు!
కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణంరాజు శివుడు, వాణిశ్రీ పార్వతిగా నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘గజాసురుడు మహాభక్తుడు. అతని ఆరాధన అచంచలమైనది’’ అన్నాడు శివుడు తన భక్తుడైన గజాసురుడి గురించి. ‘‘స్వామీ! అతని ఆంతర్యం కుటిలమైనది. ఆ తపస్సులో బలీయమైన కుతంత్రం ఉన్నది. అటువంటి దుష్టుడికి వరాలు ఇవ్వడం మంచిది కాదు’’ అన్నది పార్వతి. ‘‘మంచిచెడులు ఎంచుకొని వరాలు ఇవ్వడం ధర్మం కాదు’’ అన్నాడు శివుడు. ‘‘ఒకరికి ఇచ్చిన వరం మరొకరికి శాపం కారాదు’’ అన్నది పార్వతి. ‘‘ఆరాధించే భక్తులను అనుగ్రహించకపోవడం మాకు వీలుకాదు’’ అన్నాడు శివుడు. ‘‘దానివల్ల లోకం నాశనమైతే?’’ అడిగింది పార్వతి. ‘‘నూతన సృష్టికి నాంది పలుకుతుంది. విలయం నుండి నవయురాగారంభం అవుతుంది’’ అన్నాడు శివుడు. ‘‘అయితే మీ అర్ధాంగి మాట...’’ పార్వతి. ‘‘మన్నించలేదని మథనపడకు. అకుంఠితదీక్షతో మమ్మల్ని ఆరాధిస్తున్న ఆ మహాభక్తున్ని చూడు...’’ అన్నాడు శివుడు. భూలోకంలో... ‘‘ఓం...నమశ్శివాయ’’ అంటూ గజాసురుడు భీకరంగా తపస్సు చేస్తున్నాడు. శివుడు ఎంతకీ ప్రత్యక్షం కాకపోవడంతో... ‘‘పరమేశ్వరా! భక్తవత్సలుడవని కరుణామయుడవని అంటారే! ఈ దాసునిపై నీకు ఇంకా దయ రాలేదా! నీ మనసు కరగలేదా? ఈ దాసునికి నీ దివ్యమంగళ రూపం దర్శించే భాగ్యం కలిగించవా ప్రభూ! నీ కరుణకు పాత్రం కాని ఈ జన్మ నాకెందుకు...’’ అని ఖడ్గంతో గజాసురుడు శిరచ్ఛేధనం చేసుకోబోతుండగా శివుడు ప్రత్యక్షమై...‘‘ఆగు గజాసురా!’’ అని వారించాడు. శివుడిని చూడగానే గజాసురుడి కళ్లల్లో వెలుగు నిండింది. ‘‘స్వామీ! ముక్కంటి దేవరా! గౌరీ మనోహరా... గంగాధరా! కరుణించవా స్వామీ!’’ భక్తి పారవశ్యంతో అన్నాడు గజాసురుడు. ‘‘అనితరసాధ్యమైన నీ ఆరాధననకు సంతసించాను. నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను. ఏం కావాలో కోరుకో!’’ భక్తుణ్ణి అడిగాడు శివుడు. అప్పుడు గజాసురుడు తన మనసులో మాట సూటిగా అడిగాడు... ‘‘ప్రభూ! నీ దివ్యరూపం నా ఒక్కరికే దక్కాలి. నువ్వు నా గర్భకుహరంలో కొలువుండాలి’’ ‘‘గజాసురా! ఏమి ఈ విపరీతమైన కోరిక. అనంతమూ, సకల జనాదరణీయమైన శివస్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా?’’ అడిగాడు శివుడు. ‘‘స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామీ! నా కోరికను మన్నించవలె’’ అని తన విపరీత కోరికను సమర్థించుకున్నాడు గజాసురుడు. ‘‘గజాసురా! దుర్భరమైన ఈ వరం ఏ విపరీతాలకు దారి తీస్తుందో తెలుసా?’’ హెచ్చరించాడు శివుడు. ‘‘నీ చరణాలను నమ్ముకున్న నేను ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను స్వామీ!’’ అన్నాడు పట్టు వదలని గజాసురుడు. ఇక చేసేదేమీ లేక శివుడు గజాసురుడు అడిగిన వరాన్ని ఇచ్చాడు. గజాసురుడి ముందు జంగమయ్యలు ప్రదర్శన ఇచ్చారు. ‘‘మీ ప్రదర్శనకు మెచ్చినాము. ఏమి కావలెనో కోరుకోండి’’ అన్నాడు గజాసురుడు. పక్కనే ఉన్న నారదుడు మాత్రం– ‘‘గజాసురా! తొందరపడి వాగ్దానం చేయవద్దు. వారు ఏం కోరుతారో ఏమో’’ అని హెచ్చరించాడు. ‘‘ఏం కోరినా ఇస్తా నారదా! మేము అపరపరమేశ్వర అవతారులం. వరాలను అనుగ్రహించడంలో ఆ శివునికి ఏమీ తీసిపోం’’ అన్నాడు. ఆ మాటల్లో గర్వం ప్రతిధ్వనిస్తోంది. ‘‘అది నిజమే. ఈ అపరపరమేశ్వరుడు ఆడిన మాట తప్పనివాడు. మీ అదృష్టం ఫలించింది. మీ ప్రదర్శనకు తగిన బహుమానం లభిస్తుంది. కోరుకోండి. సందేహించకండి’’ అన్నారు వందిమాగధులు. ‘‘మేము అందరిలాంటి యాచకులం కాదు జంగమయ్యలం. మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి’’ అని అడిగారు జంగమయ్యలు. ‘‘ఏమిటి ఈ విపరీతమై కోరిక!’’ ‘‘వీరు గంగిరెద్దుల వారు కాదు. కపట వేషధారులు... బ్రహ్మ, విష్ణువులు..’’ అంటున్నారు గజాసురుడి పరివారం. నిజమే... వారు గంగిరెద్దుల వారు కాదు... బ్రహ్మ, విష్ణువులు. ‘‘ఎంత మోసం!’’ అన్నాడు గజాసురుడు. ‘‘మోసం కాదు గజాసురా! లోకక్షేమం కోసం ఈ వేషాలు వేయాల్సి వచ్చింది. అందరివాడైన ఆదిశంకరుడు నీ ఒక్కడికే దక్కాలనుకోవడం స్వార్థం కాదా?’’ ‘‘అందరి హృదయంలో వెలిగే ఆ ఆరని జ్యోతిని నీ గర్భకుహరంలో బంధించడం దుశ్చర్య కాదా! ఆదిదంపతులను వేరు చేయుట దురుద్దేశం కాదా!’’... అన్నారు బ్రహ్మ, విష్ణువులు. ‘‘నారాయణ! మాట ఇచ్చేముందు నా మాట విని ఉంటే ఇంతవరకు వచ్చేదా?’’ అన్నాడు నారదుడు. ‘‘ఏమంటావు గజాసురా! అపరపరమేశ్వరుడిలా ఆడిన మాట తప్పనని ప్రగల్భాలు పలికావే. ఇప్పుడేమంటావు ఆడిన మాట తప్పుతావా?’’ ఎత్తిపొడిచారు బ్రహ్మ, విష్ణువులు. ‘‘అన్నమాట కాదన్నమాట మేమెరుగం. అయినా చేతులతో తీసివ్వడానికి శివుడేమీ ఆటబొమ్మ కాదు. చేతనైతే ఫాలలోచనుడిని బయటికి రప్పించి తీసుకెళ్లండి’’ అన్నాడు గజాసురుడు. ‘‘శివున్ని రప్పించడం అంటే కుప్పిగంతులు వేసినట్లు కాదు. తీసుకెళ్లమనండి చూద్దాం’’ అని రెచ్చగొట్టారు వందిమాగధులు. ‘సాంబ సదాశివ శంభోశంకర పరమ దయాకర భక్త వశంకర నంది వాహన నాగభూషణ భయవిమోచన... కాలలోచన... కడుపు చీల్చుకొని రా’ అంటూ గానం చేస్తున్నారు బ్రహ్మ, విష్ణువులు. అంతే... గజాసురుడి కడుపులో భరించలేని నొప్పి మొదలైంది. కొద్దిసేపట్లోనే... అతడి కడుపును చీల్చుకుంటూ శివలింగం బయటికి వచ్చింది. ‘‘భక్త వశంకరా! సుర పక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా! వరం ఇచ్చినట్లే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామీ!’’ మరణశయ్యపై ఉన్నాడు గజాసురుడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై... ‘‘గజాసురా! విపరీతమై వరాలు విపత్కరాలని ఆనాడే నిన్ను హెచ్చరించాను’’ అంటూ గతాన్ని గుర్తు చేశాడు. ‘‘నిజమే స్వామీ! అజ్ఞానంతో నీ ఆదేశంలోని పరమార్థాన్ని గ్రహించలేకపోయాను. కాని దానికి ఇంత శిక్ష విధిస్తావా! అనంతకోటి కాంతిపుంజాలతో ప్రకాశించిన ఈ శరీరాన్ని అంధకారబంధురం చేసి వెళ్లిపోతావా!’’ అని దుఃఖిస్తున్నాడు మృత్యువుకు చేరువులో ఉన్న గజాసురుడు. సమాధానం - శ్రీ వినాయక విజయం -
పిండ ప్రదానానికి వచ్చి ప్రాణం విడిచి..
పితృదేవతలకు పిండప్రదానం చేయడానికి వచ్చి గుండె నొప్పిరావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం గొల్లపూడిలో చోటుచేసుకొంది. గొల్లపూడి త్రిబులెక్స్ కాలనీకి చెందిన చావలి సాయి కామేశ్వరావు(59) విజయవాడరైల్వే శాఖ ఏసీ కోచ్ లో సీనియర్ సెక్షన్ ఇంజినీరు(ఏసి మెయింటెనెన్స్)గా పనిచేస్తున్నారు. భార్య అరుణప్రభతో గొల్లపూడిలోని పుష్కర్‌ఘాట్‌కు పుష్కరాల ప్రారంభం నుంచి పుష్కరాల స్నానానికి వస్తున్నారు. ఆదివారం పితృదేవతలకు పిండప్రదానం కార్యక్రమాన్ని పురోహితునితో చేయించుకొని నదిలో నిమజ్జనం చేయడానికి వస్తుండగా హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో కామేశ్వరావు కుప్పకూలిపోయారు. భార్య గట్టిగా కేకలువేయడంతో అధికారులు ఎంపీడీఓ వై.బ్రహ్మయ్య దగ్గరలోవున్న వైద్యసిబ్బందిని పిలిచి ప్రాథమిక వైద్యం చేయాలని సూచించారు. పల్స్‌రేటు తక్కువుగా వుందని చెప్పడంతో అక్కడేవున్న పుష్కరఘాట్ ప్రత్యేక అధికారి, డీఎస్పీ ఆస్మ ఫరజాన వెంటనే 108కి ఫోను చేశారు. వ్యాను అందుబాటులో లేకపోవడంతో తనజీపులో ఎక్కించుకొని స్థానిక ఆంధ్రాహాస్పటల్కు వైద్యం కోసం తరలిస్తుండగా కామేశ్వరావు మృతి చెందారు. మృతుడు గుండెజబ్బుకు సంబంధించి స్టంట్స్ వేయించుకొన్నాడని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. పుష్కరఘాట్‌లో జరిగిన ప్రమాద సంఘటన వివరాలను ఎంపీడీఓ బ్రహ్మయ్య జిల్లా కలెక్టర్ బాబు ఏ, జిల్లావైద్యశాఖాధికారి, ఇతర అధికారులకు తెలియచేశారు. అందుబాటులో లేని ప్రభుత్వ వైద్యం: పుష్కరఘాట్ల వద్ద ప్రభుత్వ వైద్యులను, సిబ్బందితోపాటు ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్‌ను అందుబాటులో వుంచాల్సివుండగా గొల్లపూడి పుష్కరఘాట్ సీ గ్రేడ్ కావడంతో ఏఎన్ఎంను, సాధారణ మందులను మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ ఘాట్ వద్ద ప్రభుత్వ అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు కొందరు ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినా జిల్లావైద్యశాఖ పట్టించుకోలేదని తెలిసింది. ఇప్పటికైనా అంబులెన్స్‌ను అందుబాటులో వుంచాలని గ్రామస్తులు జిల్లాయంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
తండ్రికి పిండ ప్రదానం చేస్తూ....
విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో తండ్రికి పిండ ప్రదానం చేస్తూ ఓ రైల్వే ఉద్యోగి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే అతడు మరణించాడు. ఈ సంఘటన విజయవాడలోని గొల్లపుడి ఘాట్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కృష్ణా పుష్కరాల్లో భాగంగా విజయవాడకు చెందిన కామేశ్వరావు (48) ఈ రోజు ఉదయం తండ్రికి పిండ ప్రదానం చేసేందుకు గొల్లపూడి ఘాట్‌కు వచ్చారు. తండ్రికి పిండ ప్రదానం చేస్తున్న సమయంలో తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించారు. అక్కడే ఉన్న పోలీసులు అతడి వద్ద ఉన్న ఐడీ కార్డు ద్వారా రైల్వే ఉద్యోగిగా గుర్తించారు. విజయవాడలోని రైల్వే కోచ్ డిపోలో సీనియర్ సెక్షన్ అదికారిగా కామేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కామేశ్వరరావు మరణ వార్తను అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.