నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి జాతీయ అవార్డు అందుకున్న దర్శకులు కమలాకర కామేశ్వరరావు
సినీ ఫ్యాన్ పేరుతో రివ్యూలు రాశారు.. చంద్రహారంతో సినీ రంగ ప్రవేశం చేశారు.. నర్తనశాలకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చారు.. పౌరాణికబ్రహ్మ పేరు సంపాదించారు.. నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలలో శిరోమణి అవార్డు అందుకున్నారు.. సినిమాలలో బిజీగా ఉన్నా ఏనాడూ పిల్లల్ని నిర్లక్ష్యం చేయలేదు.. ఆయనే దర్శకులు కమలాకర కామేశ్వరరావు.. నేడు(జూన్ 29) 23వ వర్ధంతి. ఈ సందర్భంగా తండ్రితో పిల్లలకున్న అనుబంధం గురించి పెద్ద కుమార్తె శ్రీమతి లక్ష్మి సాక్షితో పంచుకున్న వివరాలు...
నాన్నగారు 1911, అక్టోబర్ 14న బందరులో పుట్టారు. తాతగారు సుందర్రావు, నాయనమ్మ కామేశ్వరమ్మ. తాతగారికి ఐదుగురు కొడుకులు, ఇద్దరు అమ్మాయిలు. అది గోల్కొండ నవాబుల పరిపాలనా కాలం. మా తాతగారు నవాబుల దగ్గర పనిచేశారట. ఆ రోజుల్లో ఆయనను తీసుకువెళ్లడానికి బగ్గీ వచ్చేదట. నాన్నగారు ఆఖరి నవాబు కాలంలో పుట్టారు. ఆయన అందరికంటె చిన్నవారు. పది నెలల వయసు వచ్చేసరికే తాతగారు పోయారు. నాన్నగారు చంటిపిల్లాడు కావటంతో, ఆయనను అందరూ అల్లారుముద్దుగా పెంచారు.
అప్పట్లోనే బిఏ
నాన్నగారు ఎంతో కష్టపడి బందరు నోబుల్ కాలేజీలో బిఏ పూర్తి చేశారు. ఆ రోజుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో రెండే కాలేజీలు.... మద్రాసులో లేదంటే మచిలీపట్టణంలో చదవాలి. అప్పట్లో ఇంట్లో కరెంటు లేదు. పుస్తకాలు కొనుక్కునే స్థాయి కూడా లేదు. పెద్దయ్యాక మాత్రం చాలా పుస్తకాలే కొన్నారు. ఇంట్లో ఒక బీరువాలో ఇంగ్లీషు పుస్తకాలు, మరొక బీరువాలో తెలుగు వేదాంత గ్రంధాలు ఉండేవి. మా కోసం పిల్లల పుస్తకాలు కొనేవారు. ‘మచిలీపట్టణం చరిత్ర’ పుస్తకంలో నాన్నగారి గురించి ఒక పేజీ రాశారు.
ఆటో వద్దనేవారు..
మేం బస్సులోనే ప్రయాణించేవాళ్లం. ఎప్పుడైనా ఆటోలో వెళ్తాం నాన్నా అంటే, మీటర్ టాక్సీలో వెళ్లమనేవారు. ఆయన తాతయ్యాక మనవలతో ఎంతో సంతోషంగా గడిపారు. నెలల పిల్లాడికి ఉత్తరాలు రాశారు. మా ఇంట్లో పెద్ద చెక్క ఉయ్యాలలో చంటి పిల్లాడిని పడుకోబెట్టి, ఉయ్యాలకు తాడు కట్టి, ఆ తాడును తన కాలి బొటనవేలికి కట్టుకుని, కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతూ, కాలితో ఊపుతూ, ‘తాతా! ఉయ్యాల ఊపనా’ అంటూండేవారు. మాతో మౌనంగా ఉండే నాన్నేనా మనవలతో ఇంత సరదాగా ఉంటున్నది అనిపించేది. తెల్ల పంచె, లాల్చీ, నుదుటి మీద విభూతి, కుంకుమతో స్వచ్ఛంగా ఉండేవారు.
సినీ ఫ్యాన్ – కృష్ణా పత్రిక
నాన్నగారు బి. ఏ పూర్తి చేసి ఖాళీగా ఉన్న సమయంలో, కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావుగారు సినిమా రివ్యూలు రాయమని కోరటంతో, నాన్న అంగీకరించారు. సినీ ఫ్యాన్ పేరుతో రివ్యూలు రాయటం ప్రారంభించారు. అప్పట్లో హెచ్. ఎం. రెడ్డిగారు తీసిన ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’తో పాటు ‘ద్రౌపదీ మానసంరక్షణ’ చిత్రం కూడా విడుదలైంది. హెచ్. ఎం. రెడ్డి గారు తీసిన సినిమా బాగా ఆడింది. నాన్నగారికి ‘మాన సంరక్షణ’ పేరు వినసొంపుగా ఉండటంతో, ఆ పేరు పట్టుకుని, చాలా బావుంది అని రాశారు. టెక్నికల్‌గా కూడా ‘మాన సంరక్షణ’ చిత్రమే బాగుందట. రివ్యూ చూసిన హెచ్. ఎం. రెడ్డిగారు, ఏ మాత్రం బాధపడకుండా నాన్నను విజయవాడ వచ్చి కలవమన్నారట. ఆ మాట ప్రకారం వెళ్లి కలిస్తే, ‘మా దగ్గర పని చేస్తావా’ అని అడగటంతో, నాన్నగారి సినీ రంగ ప్రవేశం జరిగింది.
అప్పట్లో కృష్ణా పత్రిక రివ్యూకి అంత విలువ ఉండేది. మేం బందరులో ఉండగానే పింగళి నాగేంద్రరావుగారితో స్నేహం ఏర్పడింది. నాన్నగారు విజయవాహినిలో నెల జీతానికి సెటిల్ అయ్యాక, ‘ఇక్కడ ఖాళీ ఉంది, నువ్వు కూడా మద్రాసు వచ్చేసై’ అని పిలవటంతో పింగళి నాగేంద్రరావుగారు మద్రాసు వెళ్లారు. చెన్నైలో కెవి రెడ్డి గారితో కలిసి ఒక రూమ్‌లో ఉండేవారు. నాగిరెడ్డి, బి.ఎన్. రెడ్డి గారి సంస్థల్లో పనిచేశారు. నాన్నగారు దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం ‘చంద్రహారం’ చిత్రం తరవాత నాన్నగారి నైపుణ్యం చూసి ఎన్. టి. ఆర్. తన సంస్థలో అవకాశం ఇచ్చారు. ఆ సంస్థలోనే ‘పాండురంగ మహాత్మ్యం’ చేశారు. ఆ చిత్రంతో బ్రేక్ రావటంతో, పౌరాణిక చిత్రాలకు నాన్న ఫేమస్ అయిపోయారు.
నెహ్రూతోకమలాకర కామేశ్వరరావు
సమయ పాలన...
షూటింగ్‌కి కారు వస్తుందంటే, వరండాలో సోఫాలో రెడీగా కూర్చునేవారు. కారు రాగానే ఎక్కి వెళ్లిపోయేవారు. ప్రివ్యూలకు అందరం వెళ్లేవారం. మా మేనత్తగారు కూడా మాతో వచ్చేవారు. అందరినీ ఆలస్యం చేయకుండా టైమ్‌కి రెడీగా ఉండమనేవారు. ‘నిత్యం ప్రశాంతంగా, చిరునవ్వుతో ఉండేవారు. ‘దుఃఖానికి సుఖానికి ఒకేలా ఉండాలి’ అనేవారు. ఆయన ఆ సూత్రాలే పాటించేవారు. నాన్నగారి దర్శకత్వంలో వచ్చిన, ‘నర్తనశాల’ చిత్రానికి జాతీయస్థాయిలో రెండో ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. దక్షిణ భారత దేశంలో మొట్టమొదటిసారి దక్కిన గౌరవం అది. ఆ రోజు కూడా నాన్న ఎంతో స్థితప్రజ్ఞతతో ఉన్నారు. నాన్నగారికి రెండు సంవత్సరాలు వరుసగా జాతీయ అవార్డులు వచ్చాయి. పురాణ చిత్రాలకు ఆదరణం తగ్గుతుండటంతో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా మాకు తెలియనిచ్చేవారు కాదు. సొంత ఇల్లు కూడా కొనుక్కోలేకపోయారు. ఒక్క నయా పైసా అప్పు లేనందుకు సంతోషించేవారు. ఉన్నదానితో సంతోషంగా ఉండాలి అనేవారు.
సంగీతం – వేదాంతం
నాన్న సంగీతం బాగా పాడేవారట. నా కంటె ముందు ఒక బాబు పుట్టి, పది నెలల వయసులోనే పోయినప్పటి నుంచి నాన్న పాడటం మానేశారని అమ్మ చెబుతుండేది. నాన్న సంగీతం నేర్చుకోకపోయినా, రాగాలు తాళాలు చెప్పగల పరిజ్ఞానం ఉంది. బందరులో సంగీత కచేరీలకు వెళ్లేవారట. అందుకునేమో నాన్నగారి సినిమాలలో సంగీతం, సాహిత్యం ఉన్నతంగా ఉండేవి. షూటింగ్‌లు లేనప్పుడు స్వామి చిన్మయానంద, జిడ్డు కృష్ణమూర్తి ఉపన్యాసాలు వినడానికి వెళ్లేవారు. ఆధ్యాత్మిక, వేదాంత గ్రంధాలు చదివేవారు. లైబ్రరీలో కూర్చుని ఇంగ్లీష్ సినిమాలకు సంబంధించిన విషయాలు చదివేవారు. ఇంట్లో కూడా స్క్రిప్ట్ రాసుకునేవారు. ప్రతిరోజూ లేవగానే ధ్యానం, జపం చేసేవారు. రమణ మహర్షి, రామకృష్ణ, పరమహంస, వివేకానంద, అరవిందులు రచించిన పుస్తకాలు అధ్యయనం చేసేవారు.
సహస్ర చంద్ర దర్శనం...
వెయ్యి పున్నములు చూసిన వారికి ఒక భోగం జరుపుతారు. అందుకు ఆరోగ్యం, భార్య రెండూ ఉండాలి. ఆ రెండూ నాన్నగారికి ఉన్నాయి కనుక, ఆయనను ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాం. ‘శతమానం భవతి’ అని వంద మందిని మాత్రమే పిలవమన్నారు. ఆయన కింద కూర్చోలేరేమో అనుకున్నాం, కానీ, మా అందరికీ ఆనందం కలిగించేలా చక్కగా చేయించుకున్నారు. ఆయన పిల్లలుగా పుట్టే అదృష్టం మాకు భగవంతుడు ఇచ్చినందుకు, ఆ ఒక్క వేడుకైనా చేయగలిగినందుకు సంతోషపడ్డాం. ఆ తరవాత నాన్నగారి శతజయంతి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మా చెల్లెలు శాంతి పూర్తిగా సహకరించింది.
బాలు గారి వల్లే...
నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బాలు గారు ఆటా వాళ్ల చేత నాన్నగారికి ‘శిరోమణి’ అవార్డు ఇప్పించారు. 80 సంవత్సరాల వయసులో నాన్నగారు రాలేనని చెప్పినా, బాలుగారి బలవంతంతో అమ్మనాన్న కలిసి వెళ్లారు. సినీ పరిశ్రమలో నాన్నగారిని ధర్మరాజు అనేవారు. ఎవరైనా పిలిచి ఇస్తేనే సినిమా చేసేవారు. నాగిరెడ్డి గారు ఫాల్కే అవార్డు అందుకున్నప్పుడు లక్షరూపాయలు అవార్డు వస్తే, ఇందులో నాన్నగారి భాగస్వామ్యం ఉంది అని కొంత డబ్బు నాన్నకి ఇచ్చేశారు. ఆ రోజుల్లో అంత ఉన్నతంగా ఉండేవారు. రాఘవేంద్రరావుగారు నాన్నగారి దగ్గరే మొదట అసిస్టెంట్‌గా చేశారు, నాన్నగారిని గురువు గారు అంటుంటారు.
ప్రేమగా చూసేవారు..
నాన్నగారికి మేం ఐదుగురం పిల్లలం. ఒక అబ్బాయి, నలుగురు ఆడ పిల్లలు. అందరి కంటే నేనే పెద్దదాన్ని. నా తరవాత శాంత, ఉష, ఉమ, అబ్బాయి రామకృష్ణ, మా అందరినీ నిశ్శబ్దంగా గమనిస్తూ, ప్రేమగా పెంచారు. ఇంట్లో పనులన్నీ అమ్మ ద్వారానే జరిగేవి. స్కూల్ డిబేట్‌లో మాట్లాడాలంటే, ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో చెప్పేవారు. మహిళా దినోత్సవం సందర్భంగా.. ద్రౌపది, సీతల గురించి ప్రస్తావిస్తూ, స్త్రీ శక్తి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. నాన్నగారు ఆ రోజు చేసిన బోధన ఈ నాటికీ చాలా ఉపయోగపడుతోంది. అమ్మనాన్నలు వయసులో పెద్దవారయ్యాక మా చెల్లెళ్లు ఉష, ఉమ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. చివరి రోజుల్లో నెల్లూరులో తమ్ముడి దగ్గర గడిపారు. అక్కడ ఉండగానే జూన్ 29, 1998లో పరమపదించారు.
- పానుగంటి లక్ష్మి (కమలాకర కామేశ్వరరావు పెద్ద కుమార్తె)
– సంభాషణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment