శుభదినాన, ప్రథమంగా వరునివైపువారు వధువు ఇంటికివెళ్ళి వారికి ఆహ్వానం పలుకుతారు. అప్పుడు వధువుకు ముత్తైదువులచే మంగళస్నానాలుచేయించి, నూతన వస్త్రాలు ధరింపజేసి, కళ్యాణ తిలకం దిద్ది పాదాలకు పారాణిపెట్టి చక్కగా అలంకరించి పెండ్లికుమార్తెను చేయాలి. ఆ తర్వాత వరుడికి కూడా మంగళ స్నానాలు చేయించి, నూతన వస్త్రాలు ధరింపజేసి, కళ్యాణతిలకం దిద్ది, పాదాలకు పారాణితో అలంకరించి పెండ్లికుమారుణ్ణి చేయాలి. తర్వాత వరునిచేత ‘గృహస్థాశ్రమ ధర్మాచరణ కొరకు, సత్సంతానం కొరకు, నరకవిమోచనం కొరకు’ వివాహమాడుతున్నానని సంకల్పం చెప్పించి, గణపతి పూజ, పుణ్యహవాచనాలు చేయించి రక్షాబంధనం చేయించాలి. విడి గృహంలో ఒక కొత్త గంపలో కొద్దిగా ధాన్యం లేక అక్షింతలను వుంచి, వధువును ఆ గంపలో కూర్చుండబెట్టి, ఆమె చేత మంగళ గౌరీపూజ చేయించాలి.
మన పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరులు ఆదిదంపతులు కనుక, సౌభాగ్య ప్రదాయిని గౌరీదేవిగనుక, వధువుచేత మంగళగౌరీపూజ చేయించుట ఆచారం. ఆ తర్వాత, గౌరీ పూజలో వుంచిన కంకణాన్ని వధువుకు రక్షగా ధరింపజేస్తారు. తదుపరి, వరునితరపువారు, వధువు తండ్రితో వరుని గోత్రప్రవరలను చెప్పి కన్యాదానంచేయమని అర్థించుట ఆచారం. అప్పుడు వధువు తండ్రికూడా తమ గోత్రప్రవరలు చెప్పి అంగీకారం తెలియజేస్తాడు. తదుపరి కన్యాదాన సమయాన, కన్యాదాత ఆచమనంచేసి మహా సంకల్పం చెప్తాడు. ఇందులో త్వష్ట, విష్ణు, శివ, సూర్య, ఇంద్రాది సమస్త దేవతల ఆశీర్వాదాలను తీసుకోవడం జరుగుతుంది. ఆ తరువాత కన్యాదాత సువర్ణదాన, గోదాన, భూదానాది దశమహాదానాలను చేయవలసివుంటుంది.
వధువు తల్లిదండ్రులు వరుణ్ణి విష్ణుస్వరూపంగా భావించాలి. అప్పుడు వారు ఆ వరుని కాళ్ళు కడిగి తమ శిరస్సుపై చల్లుకుని, వరునికి యథా శక్తి నూతన వస్త్రాలు, ఆభరణాదులను ఇచ్చి పూజిస్తారు. కన్యాదాతకు దక్షిణతాంబూలాదులను వుంచి, జలధారతో ఆ దోసిలిని, వరుని దోసిలిలో వుంచుతారు. వధువు తండ్రి తన కుమార్తెను కన్యాదానం చేసినప్పుడు, ‘సంప్రదదే నమమ’ అని అనడు. అంటే, ఈమెను నీకు సంపూర్ణంగా దానం చేసి ఈమెపై నా హక్కును వదులుకుంటున్నాను, ఇక పై ఈమె నాది కాదు, సంపూర్ణంగా నీదే అని అనడు. అలా సంపూర్ణ హక్కును విడువకుండా ఆ కన్యాదాత దానంచేస్తాడు. ఎందుకంటే ఉత్తరోత్తరా ఏదైనా సమస్యలవల్ల ఆమెను తన భర్త విడిచినచో తనను పోషించాల్సిన బాధ్యతను తండ్రి వదులుకోడు. అందుకనే, కన్యను గ్రహించినప్పుడు వరుడిచేత ‘పరిగృహ్ణామి‘ అని అనిపించరు. కేవలం ‘స్వస్తి‘ అని మాత్రమే అనిపిస్తారు. ఆ సమయంలో, కన్యాదాత వరునిచేత కొన్ని వాగ్దానాలు చేయించుకుంటాడు. అవి ‘ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్యా‘ అని. అనగా, వారిరువురూ దంపతులైనతర్వాత, భార్య అనుమతి లేకుండా భర్త, ఎటువంటి ధర్మ, అర్థ, కామ సంబంధమైన కార్యాలు చేయరాదు అని. అందుకు వరుడు ‘నాతిచరామి‘, అనగా ధర్మ అర్థ కామసంబంధ విషయాలలో ఆమెను అతిక్రమించను అని అంగీకారం తెలియజేస్తాడు.
ఆ తర్వాత, వరుడు అగ్నిప్రతిష్ఠాపన చేస్తాడు. తదుపరి మధుపర్కం అనగా, కొద్దిగా తేనె, పెరుగులను కలిపి తనకు తినిపిస్తారు. తరువాత వధూవరులు ఇరువురు జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని ఒకరి శిరసుపై మరొకరు వుంచుతారు. తదుపరి వధువు నడుముకు యోక్త్రమనే తాడును కడతారు. పిమ్మట, స్వర్ణశిల్పాచార్యునిచేత నిర్మించి పూజించబడిన రెండు మంగళసూ త్రాలను, వారికి తగు దక్షిణాఫల తాంబూల స్వయంపాకాదులనిచ్చి వారి ఆశీర్వచనం తీసుకుని మేళతాళాలతో కళ్యాణవేదిక వద్దకు తీసుకువచ్చి, రెండు తలంబ్రాల పళ్ళెరాలలో వుంచి, ముత్తైదువుల చేత తాకించి, అందరి ఆశీర్వాదాలను తీసుకుంటారు.
పిమ్మట వరుడు మంగళసూత్రాలను తీసుకుని, వధువుకు ఎదురుగా నిల్చి ‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం‘ అను మంత్రాన్ని చదువుతూ మూడుముళ్ళు వేస్తాడు. తర్వాత, వధూవరుల దోసిళ్ళను పాలతో శుభ్రం చేసి, వానిని తలంబ్రాలతో నింపి, మొదటగా వరుడు వధువు శిరమున పోస్తాడు. ఆ సమయంలో ‘నీవలన సత్సంతాన వృద్ధి జరుగును గాక’ అను మంత్రాన్ని చదువుతారు. వధువు చేత ‘పాడిపంటలు వృద్ధియగునుగాక’ అను మంత్రాన్ని చదువుతూ తలంబ్రాలు పోయిస్తారు. మూడోసారి వరుడిచేత ‘ధన ధాన్య వృద్ధి జరుగును గాక’ అంటూ తలంబ్రాలు వధువు శిరస్సుమీద పోయిస్తారు. ఆ తర్వాత ఆ తలంబ్రాలను అన్నింటినీ వధూవరులు ఉల్లాసంగా ఒకరి శిరస్సున ఒకరు దోసిళ్ళ తో పోస్తారు. ఆ తర్వాత, వారి దాంపత్య బంధం ఆజన్మాంతం వర్ధిల్లాలను విషయానికి సూచనగా, వారి కొంగులను ముడివేస్తారు. దీనినే బ్రహ్మముడి/ బ్రహ్మగ్రంథి అంటారు. తర్వాత వరుడు, తమ బంధం నిలవాలని, వారికి సత్సంతానం కలగాలనే సంకల్పంతో దేవతలను ప్రార్థిస్తూ తన కుడిచేతిని బోర్లించి, వధువు కుడిచేతిని గ్రహిస్తాడు. దీనినే పాణిగ్రహణం అంటారు.
–ఆచార్య తియ్యబిండి కామేశ్వర రావు
చదవండి:
‘రాగాలు’ రాగిణులై కనబడ్డాయి
పవిత్రతా స్వరూపిణి సీత
Comments
Please login to add a commentAdd a comment