షోడశోపచారాలలో ఉపనయనం ఒకటి. ఇది ప్రధానమైనది. ఉపనయనమనగా బ్రహ్మచారిని గ్రహించడమని అథర్వవేదం వలన తెలుస్తుంది. అంటే ఆచార్యుడు ఒక బ్రహ్మచారికి వేదవిద్య నేర్పించేందుకుగాను శిష్యునిగా స్వీకరించడమని అర్థం. ఈ సంస్కారానికే మౌంజీబంధనం, వటుకరణం, ఉపాయనం అని వేరే పేర్లుకూడా వున్నాయి. గాయత్రీ ఛందస్సుతో బ్రాహ్మణులని, త్రిష్టుభ్ ఛందస్సుతో క్షత్రియుల్నీ, జగతీ ఛందస్సుతో వైశ్యుల్నీ ఆ సృష్టికర్త సృష్టించాడని ఆపస్తంభుడు తన ధర్మ సూత్రాలలో తెలియజేశాడు. ఈ సంస్కారం వల్ల ద్విజత్వం సిద్ధిస్తుంది. అంటే రెండో జన్మ ప్రాప్తించినట్లే అని శాస్త్రం. అందుకే ఉపనయనం అయినవారిని ద్విజులు అంటారు. ఉపనయనాన్ని బ్రాహ్మణులకి గర్భాష్టమాన, అంటే ఏడో సంవత్సరంలో చేయాలని చెప్పారు. కొందరు శాస్త్రకారులు ఎనిమిదో సంవత్సరంలో చేయాలన్నారు. క్షత్రియులకి పదకొండో సంవత్సరంలో, వైశ్యులకి పన్నెండో సంవత్సరంలో చేయాలని సూచించారు.
ఈ సంవత్సరాల ప్రామాణికత, వారికి ఉపదేశించే ఛందస్సుల ఆధారంగా నిర్ణయించబడింది. అంటే, గాయత్రీ ఛందస్సులో ఒక పాదానికి ఎనిమిది అక్షరాలు, త్రిష్టుభ్ ఛందస్సులో ఒక పాదానికి పదకొండు అక్షరాలు, జగతి ఛందస్సులో ఒక పాదానికి పన్నెండు అక్షరాలు వుంటాయి. ఉపనయనం చెయ్యడానికి రకరకాల శాస్త్రకారులు రకరకాల వయస్సులను ప్రామాణికంగా చెప్పివుండడం విశేషం. ఎవరు ఎలా చెప్పినా, ఉపనయనానికి కనీసం ఏడు సంవత్సరాలు వుండాలన్నది అందరి అభిప్రాయం. అలాగే, బ్రాహ్మణులకి పదహారు సంవత్సరాలు, క్షత్రియులకి ఇరవై రెండు సంవత్సరాలు, వైశ్యులకి ఇరవైనాలుగు సంవత్సరాలు దాటకూడదన్నది శాస్త్రం. తరువాతి కాలంలో శాస్త్రకారులు ఈ హద్దును వరసగా ఇరవై రెండు, ముప్పైమూడు, ముప్పై ఆరు సంవత్సరాలుగా సవరించారు. కానీ ఈ ఉపనయనం కేవలం బాలకులకే చెయ్యాలికానీ యువకులకు కాదు; అంటే పదహారవ సంవత్సరంతో యవ్వనంలోకి అడుగుపెట్టినవారు ఉపనయనానికి అనర్హులని జైమిని ధర్మశాస్త్రం కచ్చితంగా చెప్పింది.
బ్రాహ్మణులకి వసంత ఋతువులో, రథకారులకు వర్షఋతువు, క్షత్రియులకు గ్రీష్మఋతువు, వైశ్యులకు శర దృతువు అని బోధాయనుడి గృహ్యసూత్రాలు నిర్దేశించాయి. ఉపనయనాన్ని చైత్ర, వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ, మాఘ, ఫాల్గుణ మాసాలలో శుక్ల పక్షాన విదియ, తదియ, పంచమి, షష్ఠి, దశమి, ఏకాదశి తిథులలో, ఆది, బుధ, గురు, శుక్ర వారాలలో, పురుష నక్షత్రాలలో జరిపించాలని శాస్త్రకారులు తెలియజేశారు. ఈ ద్విజులలో ఎవరైతే ఈ ఉపనయన సంస్కారాన్ని వారికి నిర్దేశించిన కాలంలో జరిపించుకోరో, వారిని ధర్మభ్రష్టులుగా పరిగణించి, ఆయా జాతులనుండి వెలివేయాలని మనువు ఘంటాపదంగా సూచించాడు. బ్రహ్మచారికి ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చేవరకు ఆచార్యుని వద్దనే వుండి విద్యను నేర్చుకోవాలని శాస్త్రం. ఒక వేదం చదివినవారు మరొక వేదాన్ని చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకునే సాంప్రదాయాన్ని కూడా కొందరు శాస్త్రకారులు సూచించారు.
బ్రహ్మవాదినులైన స్త్రీలకు కూడా ఉపనయనం చేయించే ఆచారమున్నట్లు శాస్త్రకారులు పేర్కొన్నారు. అయితే వారికి రజస్వల కాక ముందే అనగా ఎనిమిదవ సంవత్సరం దాటకుండానే ఉపనయనం చేయించాలని శాస్త్రం. వారికి కూడా వేదాధ్యయనమున్నది. బ్రహ్మవాదినులైన గార్గి, మైత్రి అలనాటి రోజుల్లోనే ఉపనయనం చేయించుకున్నారు.
సంస్కార విధానం
తారాబలం, చంద్రబలాలతోబాటు, గురుబలం కూడా గల ముహూర్తాన్ని పంచకరహితంగా నిర్ణయించి, శుభముహుర్తాన, గణపతి పూజ పుణ్యహవాచనలను జరిపించి అగ్నిప్రతిష్ఠ చేసి, ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం..’ అనుమంత్రంతో వటువునకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఆచార్యుని చేతులమీదుగా దీక్షా వస్త్రాలు, దండకమండలాలు, అజినం, మేఖలాలు తీసుకుని ధరించి అగ్నికి హవిస్సులు అర్పించాలి. ముహూర్త సమయానికి ఆచార్యుడు ఒక నూతన వస్త్రాన్ని వటువుతోసహా కప్పుకుని, ఎవరికీ వినపడకుండా వటువు కుడిచెవిలో బ్రహ్మోపదేశమంత్రాన్ని పఠిస్తాడు. ఆ తరువాత అగ్నికార్యం, ఇతర శాస్త్ర విధులను నిర్వహించి ఆచార్యుని నుండి బ్రహ్మచర్య దీక్షను తీసుకుని, కార్యక్రమం తర్వాత వస్త్రాలను, దండాదులను మోదుగ చెట్టుయందు విడిచిపెట్టాలి. ఆచార్యునికి గోదానమిచ్చి, వస్త్ర తాంబూలాదులతో సత్కరించాలి. ఆ తరువాత ఆచార్యుడు చెప్పిన బ్రహ్మచర్య వ్రతనియమాలని పాటిస్తూ గురుశుశ్రూష చేయాలి. బ్రహ్మచర్య దీక్షలో ఉన్న బ్రహ్మచారి కచ్చితంగా భిక్షాటనం చేయాలని మనువు ధర్మ శాస్త్రం. పరమ పవిత్రమైన భిక్షను తినడం అంటే ఉపవాసమున్నట్లే లెక్క అని చెప్పారు. ఆ భిక్ష కూడా వేరువేరు ఇండ్లనుండి తీసుకున్నదై ఉండాలి, ఒకే ఇంటినుండి తీసుకోరాదు అని శాసనం.
– ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment