కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో గుమ్మడి ప్రధాన పాత్ర పోషించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...
‘‘మహారాజా! బహమనీ సుల్తానులు ఏ నిమిషంలోనైనా మన రాజ్యంపై దాడిచేయవచ్చు’’ హెచ్చరిక వార్తను రాయలవారి చెవిలో వేశాడు సేనాని రామలింగ నాయకుడు. అక్కడనే ఉన్న హంబీరుడు ఊరకనే ఉంటాడా! అనుమాన అగ్ని రాజేశాడు...
‘‘అలజడి కలిగించడం కోసమే ఇలా ఈ బహమనీ సుల్తానులను ఎవరైనా సృష్టించి పెట్టారేమోనని అనుమానంగా ఉంది.’’
‘‘ఏమిటి సృష్టించారా?’’ ఆశ్చర్యపోయాడు రామలింగ నాయకుడు.
‘‘రామలింగ నాయకా! ఇంతకూ అప్పాజీ వారు ఏమన్నారు?’’ అడిగారు రాయలవారు.
‘‘ఈ విషయాన్ని మీతోనే సంప్రదించమన్నారు మహారాజా’’ చెప్పాడు రామలింగ నాయకుడు.
దొరికిన అవకాశాన్ని జారవిడుచుకుంటాడా... తంటాలమారి హంబీరుడు మళ్లీ చెలరేగిపోయాడు...
‘‘ఏముందీ, మన అబ్బాయిని మనం పిలిపించేసుకున్నం కదండీ. అప్పాజీ వారు అలిగారు. కొంచెం బెట్టు చేస్తున్నారంతే’’ అంటూ వికటాట్టహాసం చేశాడు హంబీరుడు.
‘‘రామలింగ నాయకా... ముందు ఇతనిని బంధించండి’’ ఆగ్రహంతో ఆదేశించాడు తిమ్మరుసు.
హంబేరుడు....గజగజా వణికిపోయాడు.
‘‘రక్షించాలి మహారాజా! ఏదో చుట్టం చూపుగా వస్తే ఈ పాపం నాకు అంటగడుతున్నారు. ఇక్కడ నే ఒక్కణ్ణేగా పరాయివాణ్ణి. సాక్ష్యం కూడా అక్కరలేదునుకుంటాను’’ అమాయకత్వం ఒలకబోస్తూ అన్నాడు హంబీరుడు.
‘‘సాక్ష్యాలు తరువాత ముందు బంధించండి’’ మరింత గట్టిగా అరిచాడు తిమ్మరుసు.
‘‘రామలింగ నాయాకా! ఆగండి. అతని నోరు నొక్కడానికి మీరెందుకంత తొందరపడుతున్నారు. ఈ సమయంలో సహాయపడగల స్వజనంలో వారు కూడా ఒకరని మీరు గ్రహించాలి’’ అన్నారు రాయలవారు.
రాయల నోట ఆ మాటలు ఊహించనివి.
మహామంత్రి ఉలిక్కిపడ్డాడు! రాయలవారి మాటలతో గుంటనక్క హంబీరుడికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది.
‘‘విరూపాక్షస్వామి! మహారాజా... వారు నా మీదే అనుమానం మోపుతుంటే నా అనుమానం నేను చెప్పాలిగా. మా గజపతి వంశాల మీద వీరికి ఎంత పగో మీకు తెలిసిందే. ప్రతీకారం కోసమేగా ఈ సంబంధం చేసింది. మా అన్నపూర్ణ కడుపున పుట్టాడు గనుక ఆ పసికూన ఈ ఆంధ్రసామ్రాజ్య వజ్రసింహాసనాన్ని ఏలుతాడు. కానీ మీరు వానికి పట్టాభీషేకం చేయాలని పట్టుబట్టారు, అదే మన కొంప ముంచింది ప్రభూ!’’
‘‘ఏమిటీ? అప్పాజీని దోషిని చేస్తున్నారా?’’ ఆవేశంగా అరిచాడు రామలింగ నాయకుడు.
‘‘ఏమిటి మీ సాక్ష్యం?’’ అని కూడా అడిగాడు.
‘‘అయ్యయ్యో! ఇంత పనిచేసిన వారు సాక్ష్యం కూడా దొరకనిస్తారా? అసలు ఎవరు వచ్చారో ఎలా తీసుకెళ్లారో కళ్లు మూసిన మా బాబు వస్తేకదా తెలిసేది. మాకంత పుణ్యం లేదే..’’ అన్నాడు హంబీరుడు.
ఇది విని రాయలవారి కంట్లో నీళ్లు.
‘‘గజపతుల మీద మీకెంత ద్వేషం ఉన్నా... లేక లేక కలిగిన నా బిడ్డను, నా కంటి వెలుగును ఆర్పేస్తారా అప్పాజీ! నా బిడ్డను బతకనిచ్చి నన్ను రాజ్యభ్రష్టున్ని చేసినా నేను సంతోషించేవాణ్ణి’’ అన్నారు రాయలవారు కళ్లనీళ్ల పర్యంతం అవుతూ.
ఇదివిని తిమ్మరుసు గుండెలో వంద పిడుగులు పడ్డాయి.
‘‘రాయా! ఏమిటిది? మీరు నన్ను అనుమానిస్తున్నారా?’’ గుండెలు పట్టుకున్నాడు తిమ్మరుసు.
మళ్లీ దృశ్యంలోకి వచ్చాడు హంబీరుడు.
‘‘మీ అంతటివారిని ఈ రాజ్యంలో ఎవ్వరూ అనుమానించరనే కదా మీరింత పని చేసింది’’ అగ్నిలో ఆజ్యం పోశాడు హంబీరుడు.
హంబీరుడు హద్దు మీరుతున్నప్పటికీ రాయలవారి నోటి నుంచి ‘ఏం మాట్లాడుతున్నావు!’ అనే మాట పొరపాటున కూడా వినిపించలేదు.
‘‘మౌనం వహించారా మహారాజా! నేటికి మీరు నన్ను అనుమానించే స్థితికి వచ్చారా? ఏమిటీ దురదృష్టం! ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కరోజు గడువు ఇవ్వండి. హంతకుడిని సాక్ష్యంతో సహా మీ ముందు నిలబెడతాను’’ అన్నాడు తిమ్మరుసు.
‘‘ఒక్కరోజు కాదు, ఒక్క ఘడియ ఇస్తే ఈ రాజ్యాన్నే తారుమారు చేస్తారు. మీ శక్తిసామర్థ్యాలు మా రాయలవారికి తెలియనివి కావు. ఆనాడు వారి అన్నగారిని మోసం చేసి వారిని గద్దెనెక్కించారు. ఇప్పుడు వీరిని మోసం చేసి అచ్యుతరాయలకి పట్టం కడతారు’’ ఆజ్యం పోస్తూనే ఉన్నాడు హంబీరుడు.
వేరే ఏమీ మాట్లాడకుండా...
‘‘రామలింగనాయకా! ఇక విచారణ, న్యాయసభ’’ అని చెప్పకనే తీర్పు చెప్పి విసవిసా అక్కడి నుంచి వెళ్లిపోయారు రాయలవారు.
‘‘ఏమిటి ఈ అన్యాయం?’’ అన్నాడు కళ్లనీళ్లతో రామలింగనాయకుడు.
‘‘రామలింగనాయకా! మీ ధర్మం మీరు నిర్వర్తించండి’’ అతడి భుజం మీద చేయి వేస్తూ అన్నాడు తిమ్మరుసు.
విచారణ జరగలేదు. సాక్ష్యాల జాడలేదు. అయినా తిమ్మరుసు మీద తీర్పు వచ్చింది...
‘‘శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణదేవరాయలవారి ఆమోదం పొందిన ధర్మాసనం వారి తీర్పు ఇది. ఈ సంఘటన జరుగు వరకు విజయనగర సామ్రాజ్య సర్వసేనానిగా వ్యవహరించి, రాయలవారికి పితృసమానుడై, ప్రజలకు పూజనీయుడై ఇప్పుడు కఠిన కిరాతకుడై యువరాజు హత్యపాతకమునకు ఒడిగట్టాడు. ఈ తిమ్మరాజు కుటిల నీతితో, కుతంత్రములతో ఇష్టం లేని రాజులను పదవీభ్రష్టులను చేయుచూ వస్తున్నాడని చెప్పుటకు రాయలవారి వంశ చరిత్రే సాక్ష్యం.
గజపతి వంశంపై గల పగ చేతనే ఈ నేరం చేసినాడని వాదుల ఆరోపణ. ఇందుకు ప్రతికూలముగా నిందితుని మౌనం తప్ప వేరు సాక్ష్యం లేదు. తంత్రాంగంలో అసమానప్రతిభావంతుడైన ఈ తిమ్మరాజు ప్రత్యక్ష్య సాక్ష్యం లవలేశం దొరకకుండా హత్య చేయుటలో సమర్థుడు. కనుక అనుమాన ప్రమాణమే ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చితిమి. ఈ తిమ్మరాజు శిశుహంతకుడు, రాజద్రోహి, శిక్షాస్మృతిని అనుసరించి ఇతనికి కన్నులు కాల్చివేసి, శాశ్వత కారాగావాసము విధించాల్సియున్నది. వెంటనే నిందితున్ని కారాగారబద్ధుణ్ణి చేయవలెను. ఈ రాత్రి గడిచి సూర్యోదయం అయ్యేవేళకు ఇతని కన్నులను కాల్చివేయవలెను’’
సమాధానం: మహామంత్రి తిమ్మరుసు
Comments
Please login to add a commentAdd a comment