గృహస్థు ఆచరించాల్సిన  సంస్కారాలు గృహ్య సూత్రాలు | Thiyabindi Kameswara Rao Devotion Article Over Vedas | Sakshi
Sakshi News home page

గృహస్థు ఆచరించాల్సిన  సంస్కారాలు గృహ్య సూత్రాలు

Published Tue, Nov 17 2020 6:24 AM | Last Updated on Tue, Nov 17 2020 6:24 AM

Thiyabindi Kameswara Rao Devotion Article Over Vedas - Sakshi

గృహ్య సూత్రాలనేవి గృహస్థులు ఆచరించాల్సిన ధర్మాలనూ, సంస్కారాలనూ వివరిస్తాయి. ఇవి ఇంట్లో చేయవలసిన కర్మలు. ద్రాహ్యాయనుడు, కాత్యాయనుడు తప్ప, కల్పసూత్రాలను రచించిన ఋషులందరూ గృహ్య సూత్రాలను రచించారు. వాటిలో  కొన్ని, ఆపస్తంభ, బౌధాయన, ఆశ్వలాయన, భారద్వాజ, గోభిల, హిరణ్యకేశీయ, జైమినీయ, ఖదీర, మానవ, పారాస్కర, సాంఖ్యాయన గృహ్య సూత్రాలు. ఇవి వాటిని రచించిన ఋషులపేర్లమీద ప్రాచుర్యం పొందాయి. వీటిలో బోధాయన, ఆపస్తంభ, కాత్యాయనమొదలగు తొమ్మిది గృహ్యసూత్రాలు ప్రాచీనమైనవి. వైఖానస, శౌనకీయ, భారద్వాజ, అగ్నివేశ, జైమినీయ, వాధూల, మాధ్యందిన, కౌండిన్య, కౌశీతకీ గృహ్యసూత్రాలు తొమ్మిది ఆ తరువాతి కాలానివి. 

గృహ్యసూత్రాలు, నలభై సంస్కారాలను, ఎనిమిది ఆత్మ గుణాలను నిర్దేశించాయి. వైదికులు, ప్రతినిత్యం ఏడు హవిర్యజ్ఞాలు, ఏడు సోమయజ్ఞాలు, ఏడు పాకయజ్ఞాలు మొత్తం కలిపి ఇరవై ఒక్క యజ్ఞాలను ఆచరించే అగ్నికార్యం చేయాలని కల్పసూత్రాలు చెప్తున్నాయి. వీటిలో ఏడు హవిర్యజ్ఞాలు, ఏడు సోమయజ్ఞాలు, శ్రౌత సూత్రాలలోనికి వస్తాయి కనుక గృహ్యసూత్రాలలో వుండవు. మిగిలిన ఏడు పాకయజ్ఞాలు, పంతొమ్మిది సంస్కారాలతో కలిపి గృహస్థుడు ఆచరించాల్సిన మొత్తం ఇరవై ఆరు సంస్కారాలు గృహ్యసూత్రాలలో వుంటాయి. అసలు ఈ సంస్కారాల సంఖ్యమీద కొన్ని వాదోపవాదాలున్నాయి. అవి పన్నెండు అని కొందరు, పదహారు అని కొందరు, పంతొమ్మిది అని కొందరు అంటారు. కానీ ఎక్కువ భాగం పదహారు సంస్కారాలనే అంగీకరించారు. స్వామి దయానంద సరస్వతి రచించిన ‘సంస్కార విధి’ లో పదహారు సంస్కారాలనే పేర్కొన్నారు. అవి గర్భాదానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, నిష్క్రమణం, అన్నప్రాసనం, చూడాకరణ, కర్ణవేధ, విద్యారంభం, ఉపనయనం, వేదారంభం, కేశాంతం, సమావర్తనం, వివాహం, అంత్యేష్టి.

దేవయజ్ఞం(కర్మకాండలు, హోమాలు), పితృయజ్ఞం(తర్పణం, శ్రాద్ధక్రియలు), భూతయజ్ఞం(బలులు, అర్పణలు), బ్రహ్మయజ్ఞం (వేదాన్ని అధ్యయనం చెయ్యడం), మనుష్యయజ్ఞం (అతిథులకు, పేదలకు సేవచెయ్యడం)అనే ఐదునిత్యయజ్ఞాలు; అగ్నాధేయం, అగ్నిహోత్రం, సౌత్రాయణీ, అగ్రయణేష్టి, చాతుర్మాస్యం, దర్శపూర్ణమాస్యం, విరూఢపశుబంధఅనే ఏడు హవిర్యజ్ఞాలు; అగ్నిష్టోమ, అత్యగ్నిష్టోమ, ఉక్థ్య, వాజపేయ, అప్తోర్యామ, అతిరాత్రి, షోడశి అనే ఏడుసోమయజ్ఞాలు; అష్టక, అగ్రహాయణీ, ఆశ్వయుజీ, శ్రాద్ధ, పార్వణ, చైత్రీ, శ్రావణీ అనే ఏడుపాకయజ్ఞాలు; ప్రాజాపత్యం, సౌమ్యం, ఆగ్నేయం, వైశ్వదేవం అనేవి వటువు కోసం ఆచార్యుడు చేసే నాలుగుసంస్కారాలు; సమావర్తనం, వివాహం అనేవి తనకోసం తను చెయ్యాల్సిన రెండు స్వకృత్య సంస్కారాలు; గర్భాదానం, పుంసవనం, సీమంతం అనేవి తన భార్యకు చేయవల్సిన మూడు సంస్కారాలు; జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన, చౌలం, ఉపనయనం అనేవి తనసంతానం శ్రేయస్సు కోసం చేయవల్సిన ఐదుసంస్కారాలు; మొత్తం కలిపి గృహస్థుడు ఆచరించాల్సినవి నలభైసంస్కారాలు. వీటి గురించి, పారస్కరుడు, అశ్వలాయనుడు, బోధాయనుడు మాత్రమే తమ గృహ్య సూత్రాలలో వివరంగా తెలియజేశారు. ఈ గృహ్య సూత్రాలలో ముఖ్యంగా, గార్హపత్యాగ్నిని ఉపయోగించిచేసే  క్రతువుల వివరణ వుంటుంది.

దయ, అనసూయ (అసూయ లేకపోవడం), అకార్పణ్యం (మొండిగా లేకుండుట), అస్పృహ, అనాయాసం, శౌచం (శుభ్రత), మాంగల్యం (మధు స్వభావం), క్షాంతి (క్షమా గుణం) అనేవి ఆత్మ గుణసంస్కారాలు. ఇవి జాతి భేదం లేకుండా, ప్రతి మనిషికీ వర్తించే ధర్మాలు.పైన చెప్పిన నలభై సంస్కారాలు, ఈ ఎనిమిది ఆత్మగుణ సంస్కారాలు, మొత్తం కలిపి మనిషి పాటించాల్సిన సంస్కారాలు నలభై ఎనిమిది అనే నానుడి కూడా వుంది లోకంలో.

ఈ సంస్కారాల సంఖ్య విషయంలో ఎన్ని అభిప్రాయ భేదాలున్నా, అన్ని సంస్కారాలూ మనిషిని సంస్కరించేవే, తనని ధర్మమార్గాన ప్రయాణింప జేసేవే. ఈ సంస్కారాలన్నీ కొన్ని స్వప్రయోజనాలకోసం చేసేవైతే, కొన్ని ఇతరుల లేక సామాజిక ప్రయోజనాలకోసం చేసేవి. ఒక వ్యక్తి సంస్కారవంతుడైతే, అది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమాజానికి ఉపయోగించేదే. కాబట్టే, మనిషి ఈ ధర్మాలను ఆచరించినంత కాలం సమాజం సంస్కారవంతంగా, ధర్మబద్ధంగా వుంటుంది. వ్యక్తులు ధర్మం తప్పితే, వ్యవస్థ కూడా గాడితప్పి యావత్‌ సమాజమూ భ్రష్టుపట్టిపోతుంది. ధర్మానికి హాని జరిగితే, సాక్షాత్తూ భగవంతుడే వచ్చి ధర్మ సంస్థాపన చేస్తానని చెప్పడంలో, ధర్మానికివున్న ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ గుర్తించి నడచుకోవాలి. ధర్మ హాని జరుగకుండా చూసుకోవాలి. 
– ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement