పితృదేవతలకు పిండప్రదానం చేయడానికి వచ్చి గుండె నొప్పిరావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం గొల్లపూడిలో చోటుచేసుకొంది. గొల్లపూడి త్రిబులెక్స్ కాలనీకి చెందిన చావలి సాయి కామేశ్వరావు(59) విజయవాడరైల్వే శాఖ ఏసీ కోచ్ లో సీనియర్ సెక్షన్ ఇంజినీరు(ఏసి మెయింటెనెన్స్)గా పనిచేస్తున్నారు. భార్య అరుణప్రభతో గొల్లపూడిలోని పుష్కర్‌ఘాట్‌కు పుష్కరాల ప్రారంభం నుంచి పుష్కరాల స్నానానికి వస్తున్నారు.
ఆదివారం పితృదేవతలకు పిండప్రదానం కార్యక్రమాన్ని పురోహితునితో చేయించుకొని నదిలో నిమజ్జనం చేయడానికి వస్తుండగా హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో కామేశ్వరావు కుప్పకూలిపోయారు. భార్య గట్టిగా కేకలువేయడంతో అధికారులు ఎంపీడీఓ వై.బ్రహ్మయ్య దగ్గరలోవున్న వైద్యసిబ్బందిని పిలిచి ప్రాథమిక వైద్యం చేయాలని సూచించారు. పల్స్‌రేటు తక్కువుగా వుందని చెప్పడంతో అక్కడేవున్న పుష్కరఘాట్ ప్రత్యేక అధికారి, డీఎస్పీ ఆస్మ ఫరజాన వెంటనే 108కి ఫోను చేశారు. వ్యాను అందుబాటులో లేకపోవడంతో తనజీపులో ఎక్కించుకొని స్థానిక ఆంధ్రాహాస్పటల్‌కు వైద్యం కోసం తరలిస్తుండగా కామేశ్వరావు మృతి చెందారు. మృతుడు గుండెజబ్బుకు సంబంధించి స్టంట్స్ వేయించుకొన్నాడని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. పుష్కరఘాట్‌లో జరిగిన ప్రమాద సంఘటన వివరాలను ఎంపీడీఓ బ్రహ్మయ్య జిల్లా కలెక్టర్ బాబు ఏ, జిల్లావైద్యశాఖాధికారి, ఇతర అధికారులకు తెలియచేశారు.
అందుబాటులో లేని ప్రభుత్వ వైద్యం: పుష్కరఘాట్‌ల వద్ద ప్రభుత్వ వైద్యులను, సిబ్బందితోపాటు ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్‌ను అందుబాటులో వుంచాల్సివుండగా గొల్లపూడి పుష్కరఘాట్ సీ గ్రేడ్ కావడంతో ఏఎన్‌ఎంను, సాధారణ మందులను మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ ఘాట్ వద్ద ప్రభుత్వ అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు కొందరు ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినా జిల్లావైద్యశాఖ పట్టించుకోలేదని తెలిసింది. ఇప్పటికైనా అంబులెన్స్‌ను అందుబాటులో వుంచాలని గ్రామస్తులు జిల్లాయంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు.