భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజికవర్గానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పి.విశ్వరూప్, జోగి రమేశ్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్‌గా పేరి కామేశ్వరరావు (పీకే రావు) ప్రమాణ స్వీకారం చేశారు.
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలో బ్రాహ్మణుల సమస్యలు తెలిసిన పేరి కామేశ్వరరావు వంటి సీనియర్ నాయకుడిని కార్పొరేషన్ చైర్మన్‌గా సీఎం జగన్ నియమించడం అభినందనీయమన్నారు. విశ్వరూప్ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం కలిగిన పేరి కామేశ్వరరావు బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. జోగి రమేష్ మాట్లాడుతూ రానున్నకాలంలో బ్రాహ్మణులకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కోన రఘుపతి మాట్లాడుతూ వంశపారంపర్య అర్చకత్వం, అర్చకులకు వేతనాల పెంపు సీఎం జగన్ పాలనలోనే జరిగాయని చెప్పారు.
మల్లాది విష్ణు మాట్లాడుతూ అర్హులైన బ్రాహ్మణులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రూ.600 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. పేరి కామేశ్వరరావును దేవదాయశాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల శంకర్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ, ఏపీ అర్చక సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ఆత్రేయ బాబు, అనంతబాబు, కార్పొరేషన్ జీఎం జి.నాగసాయి, పలు బ్రాహ్మణ సంఘాల నాయకులు అభినందించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీ సుసర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment