వివాదాలు. విమర్శలు. అభిశంసనలు. కోర్టు కేసులు. రుజువైన క్రిమినల్ నేరాలు. సొంత పార్టిలోనే విమర్శలు. మొత్తంగా రాజకీయ భవితవ్యంపైనే నీలినీడలు. హత్యాయత్నాలు. ప్రత్యర్థుల ప్రచార హోరు. వీటన్నింటినీ తట్టుకుంటూ 78 ఏళ్ల వయసులోనూ మరోసారి అమెరికా అధ్యక్షునిగా గెలిచి చూపించిన మొండి ఘటం డొనాల్డ్ ట్రంప్. ఆ ఘనత సాధించిన అత్యంత వృద్ధునిగా రికార్డు సృష్టించి విమర్శకుల నోళ్లు మూయించారు. రెండుసార్లూ ట్రంప్ ఓడించిన డెమొక్రాట్ ప్రత్యర్థులు మహిళలే కావడం విశేషం. 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ను ఓడించగా ఈసారి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ఆయన ఘనవిజయం సాధించారు.
కష్టకాలాన్ని దాటి...
నిజానికి గత నాలుగేళ్లూ ట్రంప్‌కు కష్టకాలంగానే గడిచాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమితో ఆయనకు సమస్యలు మొదలయ్యాయి. ఆ ఓటమిని ఒప్పుకోకపోవడమే గాక బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు కూడా ట్రంప్ నిరాకరించారు. బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు 2021 జనవరి 6న కాంగ్రెస్ సంయుక్త భేటీ జరుగుతున్న క్యాపిటల్ హిల్‌పైకి మద్దతుదారులను దాడికి ఉసిగొల్పి ప్రపంచాన్నే నివ్వెరపరిచారు. ఆ క్రమంలో చోటుచేసుకున్న హింసాకాండ ఇటీవలి దాకా కేసుల రూపంలో ట్రంప్‌ను వెన్నాడింది. తర్వాత హష్ మనీ ఉదంతంలో క్రిమినల్ కేసును ఎదుర్కొన్నారు.
న్యాయ విచారణకు హాజరైన ఏకైక మాజీ అధ్యక్షునిగా చెత్త రికార్డునూ మూటగట్టుకున్నారు. హష్ మనీ కేసులో దోషిగానూ రుజువయ్యారు. అలా నేరస్తునిగా ముద్రపడ్డాక అధ్యక్షుడైన తొలి నేతగా కూడా నిలిచారు! డెమొక్రాట్ల అభ్యర్థిగా బైడెన్ తప్పుకుని కమలా హారిస్ తెరపైకి రావడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయమంటూ అంచనాలు వెల్లువెత్తాయి. అందుకు తగ్గట్టే ఆమెతో జరిగిన ఏకైక అధ్యక్ష డిబేట్‌లో ట్రంప్ పూర్తిగా తేలిపోయారు. అయినా ఎక్కడా వెనక్కు తగ్గలేదు.
అభిమానుల తిరుగులేని మద్దతు ఆయనకు పెట్టనికోటగా నిలిచింది. ప్రచార క్రమంలో పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం సంచలనం రేపింది. దుండగుని తూటా ఆయన చెవిని గాయపరుస్తూ దూసుకెళ్లడంతో ప్రాణాపాయం త్రుటిలో తప్పింది. అలాంటి సమయంలోనూ పిడికిలి బిగించి ‘ఫైట్, ఫైట్’అని నినదిస్తూ ట్రంప్ ప్రదర్శించిన మొక్కవోని ధైర్యం అమెరికన్లను ఆకట్టుకుంది. ఆయన అమెరికా ఫస్ట్ నినాదం ఓటర్లను మరోసారి ప్రభావితం చేసింది. వలసలపై ఉక్కుపాదం మోపుతానని, ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దుతానని, చైనాకు ముకుతాడు వేస్తానని, యుద్ధాలకు తెర దించుతానని, మొత్తంగా అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన హామీలు విపరీతంగా ఆకట్టుకున్నాయి.
వాటిముందు హారిస్ ఆఫ్రో ఆసియన్ మూలాలు, ప్రచార వ్యూహాల వంటివేవీ పని చేయలేదు. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఏకపక్ష విజయం సాధించారు. అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా మారితే మేలనడం, చైనాపై టారిఫ్‌లు తప్పవని హెచ్చరించడం, గ్రీన్‌లాండ్‌ను, పనామా కాల్వను స్వా«దీనం చేసుకుంటానని, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని ప్రకటించడం ద్వారా తన పాలన ఎలా ఉండనుందో సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో అధ్యక్షునిగా రెండో విడతలో ట్రంప్ ఏమేం చేస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.
ఆది నుంచీ...
ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్ లోని క్వీన్స్‌లో మేరీ ఫ్రెడ్ దంపతులకు జన్మించారు. ఐదుగురు సంతానంలో నాలుగోవాడు. పెన్సిల్వేనియా వర్సిటీలో ఫైనాన్స్‌లో డిగ్రీ చేశారు. 1971లో తండ్రి నుంచి రియల్టీ వ్యాపార బాధ్యతలను స్వీకరించారు. హోటల్స్, రిసార్టులు, నిర్మాణంతో పాటు క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులు తదితరాల్లోకీ విస్తరించారు. రియాలిటీ టీవీ షో ద్వారా దేశవ్యాప్తంగా పాపులరయ్యారు. ట్రంప్‌కు మూడు పెళ్లిళ్లయ్యాయి. మోడల్, క్రీడాకారిణి ఇవానా జెలింకోవాకు 1990లో విడాకులిచ్చారు. వారికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ జన్మించారు. 1993లో మార్లా మేపుల్స్‌ను పెళ్లాడి టిఫానీకి జన్మనిచ్చారు. 1999లో ఆమెకు విడాకులిచ్చి 2005లో స్లొవేనియా మోడల్ మెలానియాను పెళ్లాడారు. వారి సంతానం బారన్ విలియం ట్రంప్.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment