అది 1988 డిసెంబర్ 2, రాత్రి పది దాటింది. రాజస్థాన్ లోని పాలీ–జోధ్‌పూర్ హైవే రూట్‌లో ‘350cc రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ RNJ7773’ బండి హుందాగా, వేగంగా పరుగులు తీస్తోంది. ఎందుకో ఆ బండి అకస్మాత్తుగా స్కిడ్ అయింది. క్షణాల్లోనే భళ్లుమనే పెద్ద శబ్దం.. ఏకంగా మరణ శాసనాన్నే లిఖించింది. చెట్టును ఢీ కొట్టిన ఆ బండి హెడ్‌లైట్.. మిణుకు మిణుకుమని ఒక్కసారిగా ఆరిపోయింది.
మరునాడు ఆ చెట్టు ముందు పడి ఉన్న బుల్లెట్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు విచారణకు సిద్ధమయ్యారు. ఆ బుల్లెట్.. పాలీ జిల్లాలోని ‘చోటిలా’ అనే గ్రామానికి చెందిన జమీందారు జోగ్ సింగ్ కుమారుడు.. ‘ఓం సింగ్ రాథోడ్’ అనే 23 ఏళ్ల యువకుడిదని నిర్ధారించుకున్నారు. ప్రమాదంలో అతను చనిపోయాడని, అతనితో పాటు ప్రమాదానికి గురైన అతని ప్రాణ స్నేహితుడు ట్రీట్‌మెంట్ పొందుతున్నాడని తెలుసుకున్నారు. వెంటనే బుల్లెట్‌ని.. తమ సీజ్డ్ వెహికల్ యార్డ్‌కి తరలించారు.
నరేష్ భట్టి అనే స్థానిక డ్రైవర్.. మరునాడు ఉదయాన్నే పోలీస్ స్టేషన్‌కి వచ్చి..‘నిన్న మీరు స్వాధీనం చేసుకున్న రాథోడ్ గారి బుల్లెట్‌ని.. మళ్లీ యాక్సిడెంట్ జరిగిన చోటే ఎందుకు వదిలేశారు?’ అని ప్రశ్నించాడు. అతని ప్రశ్న పూర్తికాకుండానే.. అక్కడున్న ఓ కానిస్టేబుల్ పరుగున వెళ్లి.. తమ సీజ్డ్ వెహికల్ యార్డ్‌ని పరిశీలించాడు. అంతే వేగంగా తిరిగి వచ్చి ‘యార్డ్‌లో ఆ బుల్లెట్ లేదు సార్’ అని ఆయాసపడుతూ చెప్పాడు.
అది ఆకతాయిల పని కావచ్చు అనుకున్న పై అధికారులు.. వెంటనే మళ్లీ సంఘటన స్థలానికి వెళ్లి ఆ బండిని తీసుకొచ్చి.. ఈసారి గొలుసుతో లాక్ చేశారు. తెల్లవారేసరికి యార్డ్‌లో.. గొలుసు మాత్రమే ఉంది. బుల్లెట్ లేదు. అది మళ్లీ యాక్సిడెంట్ జరిగిన చోటుకే వెళ్లిపోయింది. ఇక లాభం లేదని బుల్లెట్ టైర్లలో గాలి తీసి ఓ రోజు.. పెట్రోల్ తీసి మరో రోజు.. బుల్లెట్‌ని యార్డ్‌లో ఉంచడానికి ప్రయత్నించారు.
కానీ మళ్లీ బుల్లెట్టే గెలిచింది. పోలీసులు విఫలమయ్యారు. దాంతో అసలు ఆ బుల్లెట్ యాక్సిడెంట్ జరిగిన చోటుకు దానంతట అదే ఎలా వెళ్తోంది? ఎందుకు వెళ్తోంది? ఎవరు తీసుకెళ్తున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు హడలెత్తించే కథనాలను సృష్టించడం మొదలెట్టాయి.
రాథోడ్ ఆత్మ బుల్లెట్ బండిలో చేరిందని.. అదే బండిని అక్కడికి తీసుకెళ్తోందని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే.. రాథోడ్ కలలోకి వచ్చి.. తనకు గుడి కట్టించమని కోరాడంటూ అతడి అమ్మమ్మ ప్రకటించింది. దాంతో భయపడేవారంతా భక్తి బాటపట్టారు. యాక్సిడెంట్ జరిగిన చోటే స్థలాన్ని సేకరించి.. ఆ చెట్టు దగ్గరే గుడి కూడా కట్టేశారు.
భక్తుల దర్శనార్థం ఆ బుల్లెట్‌నీ అక్కడే ప్రత్యేకంగా ఉంచి.. పవిత్రంగా పూజించడం మొదలుపెట్టారు.రాజస్థాన్ రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన యువకులను ‘బన్నా’ అని పిలుస్తుంటారు. అందుకే రాథోడ్‌ని కూడా ‘ఓం బన్నా’ అని భక్తితో పిలవడం మొదలుపెట్టారు. అతని ఫొటో పెట్టి.. అతని విగ్రహం కట్టి.. మొక్కులు మొక్కడం ప్రారంభించారు. ప్రయాణాల్లో ప్రమాదాలు జరగొద్దంటే బుల్లెట్ బాబా ఆశీర్వాదం తప్పనిసరి అనేది ఆనవాయితీగా మారింది.
జోగ్ సింగ్‌కి ఒక్కగానొక్క కొడుకు రాథోడ్. అతడికి బుల్లెట్ బండి అంటే ప్రాణం. చాలా ఆశపడి కొనుక్కున్న ఆ బండిని.. చాలా ఇష్టంగా చూసుకునేవాడు. పెళ్లి అయిన కొన్ని నెలలకే అలా ప్రమాదంలో చనిపోయాడు. తీరని విషాదంతో ఉన్న జోగ్ సింగ్ కుటుంబానికి.. ఈ ‘ఓం బన్నా టెంపుల్’ ఊరటగా నిలిచింది. ఇక్కడ నేటికీ పెద్ద పెద్ద జాతర్లు జరుగుతుంటాయి. పిల్లలు, పెద్దలు ఏ శుభకార్యం తలపెట్టినా ముందు ఈ గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటారు.
గాజులు, ఎర్ర జాకెట్ ముక్కలను ముడుపులుగా కడుతుంటారు. అలాగే మద్యాన్ని బుల్లెట్ బాబాకు నైవేద్యంగా పెడుతుంటారు.అయితే రాథోడ్ మరణించిన దారి గుండా.. ప్రయాణం చేసేవారికి ఓం బన్నా ఆత్మ పలు రూపాల్లో కనిపించి.. హారన్ కొట్టమని, జాగ్రత్తగా వెళ్లమని చెప్పినట్లు చాలామంది సాక్ష్యమిస్తుంటారు. ఈ గుడికి వచ్చే భక్తులు.. తమని ఎల్లవేళలా కాపాడమంటూ అర్జీ పెట్టినట్లుగా.. తమ వాహనాల హారన్స్ కొడుతూ ఉంటారు.
తమను రక్షించడానికే రాథోడ్ ఆత్మ ఆ గుడి ప్రాంగణంలోని ఆ బుల్లెట్‌లో ఉందని స్థానికులంతా బలంగా నమ్ముతుంటారు. ఏదేమైనా ఆనాడు బుల్లెట్ స్టేషన్ నుంచి ఎలా ఆ ప్రమాదఘటనా స్థలానికి వెళ్లింది? రాథోడ్ అమ్మమ్మ కల నిజమేనా? ఆ గుడిలో ఆత్మ ఉందా? అది దైవత్వాన్ని ఆపాదించుకుని భక్తుల్ని రక్షిస్తోందా? అనే ప్రశ్నలు సమాధానాల్లేని మిస్టరీనే! - సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment