మాటలు చూపులు లేని ప్రేమ
జ్యోతిర్మయం
ఓ రోజున మెహెర్‌బాబా తన శిష్యుల్ని అడిగారు, ‘కోపంతో ఉన్నప్పుడు మనుషులు ఒకరి మీద ఒకరు గట్టిగా అరుచుకొంటూ ఎందుకు మాట్లాడతారు?’ అని. అందుకు శిష్యులు, ‘మనుషులు కోపంతో ఉన్నా రు కాబట్టి అట్లా అరుచుకొంటూ మాట్లాడతారు. కోపం వ్యక్తంచేసే పద్ధతి అది’ అని జవాబిచ్చారు.
అది విని బాబా మళ్లీ అడిగారు, ‘అది సరే, మీరు అన్నట్లు వాళ్లు కోపాన్ని ఆ విధంగా అరుస్తూ వ్యక్తం చేయవచ్చు. కోపం వచ్చినప్పుడు పక్క పక్కనే కూర్చొ ని ఉన్న వ్యక్తులు కూడా ఒకరితో ఒకరు దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడినట్లు గట్టిగా గొంతు చించు కొని అరుస్తూ మాట్లాడతారు. మెల్లగా మాట్లాడినా వాళ్లకు వినపడుతుంది కదా? అలాంటప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడినట్లు అరుస్తూ మాట్లాడటం ఎందుకు?’ దానికి శిష్యు లు ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పారు. కానీ ఏదీ బాబాకు తృప్తి నివ్వలేదు. బాబాయే ఇలా చెప్పారు.
‘ఒక వ్యక్తికి ఇంకొక అతని మీద కోపం వచ్చినప్పుడు, కోపంతో ఉన్న వ్యక్తి హృదయం నుండి ఆ ఇంకొక అతను దూరంగా తొలగిపోతాడు. అప్పుడు ఇద్దరి మధ్య సన్నిహితత్వం పోయి మానసి కంగా దూరం అయిపోతారు. దానివల్ల ఇద్దరూ ఒకరి నుండి ఒకరు భౌతికంగా కూడా చాలా దూరంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. ఆ స్థితిలో వారు ఎంత దూరంగా ఉన్నట్లు అనుభూతి చెందితే అంత బిగ్గరగా గొంతు చించుకొని అరుస్తారు. ఎంత ఎక్కువ దూరం అయితే అంత ఎక్కువగా అరుస్తారు. ప్రేమ అదృశ్యమవుతుంది. ప్రేమ లోపించటంతో ఇవ తలి వాడు ఎంత పెద్దగా అరిస్తే అవతలివాడు తిరిగి అంత పెద్దగానూ అరుస్తాడు. కోపం తగ్గేటంత వరకు, అంటే హృదయాలు మళ్లీ దగ్గరయ్యేటంత వరకు, ప్రేమ మళ్లీ మొలకెత్తేటంత వరకు, ఆ అరుచుకోవటం అనేది అలా సాగుతూనే ఉంటుంది.’
‘ఇప్పుడు మీరు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని తీసుకోండి. పరస్పరం ప్రేమతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా మాట్లాడుకుంటారు?’ అని అడిగారు బాబా. ‘వారు నెమ్మదిగా, మృదువుగా మా ట్లాడుకుంటారు’ అని సమాధానం చెప్పారు శిష్యులు.
బాబా ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇంకా ఇలా అన్నారు. ‘పరస్పరం ప్రేమతో ఉన్నవారు చాలా నెమ్మ దిగా మృదువుగా మాట్లాడుకొంటారు. వారి ఇద్దరి మధ్య ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే వారి కంఠస్వరం అంత శాంతంగా, అంత నెమ్మదిగా, అంత మృదు వుగా ఉంటుంది. వారి మధ్య ప్రేమ ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య అసలు మాటలే ఉండవు. మాటలాడే అవసరమే రాదు. అప్పుడు ఇద్దరూ ఒకరిని ఒకరు కేవలం చూసుకోవటంతోనే తృప్తిపడతారు. ప్రేమ ఇంకా పరాకాష్టకు చేరుకొన్నప్పుడు, ఆ చూసు కొనే అవసరం కూడా కలగదు.’
- దీవి సుబ్బారావు