బ్రహ్మము నుంచి వచ్చిన జీవరాసులన్నిటిలోనూ మానవ జన్మ ఉత్తమమైనది. మానవులకు మాత్రమే జ్ఞానం సంపాదించి బ్రహ్మమును పొందగల శక్తి ఉంది. మనలోని జీవాత్మ మానసిక, సూక్ష్మ, స్థూలము అను మూడు పొరలచే కప్పి ఉండటం వల్ల పరమా త్మను తెలుసుకోలేకపోతున్నది. మనం చేసే కార్యాలు మనకు తెలియకుండా జరగడం వల్ల ఇదంతా మాయ వల్ల జరుగుతున్నదని అనుకుంటాం. పరమాత్మ నుండి బయటపడిన అణువును అంతరాత్మ అంటాం. పరమాత్మ నుంచి బయలుదేరిన తర్వాత దేహాన్ని ధరింపజేసేది కర్మ. కర్మను నశింపజేసి పరమాత్మను చేసేది యోగం.
ఇలాంటి మోక్షం కలిగించే ఉద్దేశంతో తమిళ నాడులో కావేరీ తీరంలోని కుంభకోణంలో 1868లో జన్మించిన బ్రహ్మాంశ సంభూతుడు, సీవీవీగా పిలుచు కునే కంచుపాటి వెంకట్రావు వెంకాసామిరావు ఓ కొత్త యోగాన్ని మానవాళికి ప్రసాదించారు. అందరికీ అమరత్వం, బ్రహ్మత్వం అందించాలన్న ఉద్దేశంతోనే దీన్ని ప్రవేశపెట్టారు. నాశరహిత, మరణరహిత నిరం తర సంపూర్ణ ప్రజ్ఞా చైతన్య సహిత నూతన మానవుని ఆవిష్కరించడమే ధ్యేయంగా ఈ యోగాన్ని 1910 మే 29న మానవాళికి అందించారు. నాటి రుషుల తపస్సుకు అంతిమ లక్ష్యం- బ్రహ్మత్వం పొందడం. అది వ్యక్తికి మాత్రమే పరిమితం. దాని నుంచి దృష్టి మరల్చి సంసారం సాగిస్తూనే స్వధర్మాన్ని పాటిస్తూ తమ విధులను నిర్వర్తిస్తూ ఉన్న చోటనే ఉంటూ అందరూ బ్రహ్మ త్వాన్ని పొందాలని ఈ యోగాన్ని ఆవిష్కరించారు.
ఈ యోగసూత్రం ప్రకారం అందరూ కలసి సాధించాల్సిన ముక్తికి సి.వి.వి. అనే మూడు అక్షరాలు మంత్రశక్తిని ప్రసాదిస్తాయి. అవే మార్గాన్ని నిర్దే శిస్తాయి. అవే సర్వసిద్ధులను ప్రసాదిస్తాయి. సృష్టికి భంగం కలగకుండా సృష్టికార్యం యధావిధిగా జరుపుకుంటూ సృష్టిలోని దోషాలను సవరించేందుకు సీవీవీ పూనుకున్నారు. ‘యోగం’ అంటేనే శివం. కుండలిని యోగశక్తి. ప్రణవం (అంటే నాదం) వాటి సూత్రం. నాద తరంగాలు విశ్వవ్యాప్తమైనట్లే మాస్టరు యోగశక్తి సర్వవ్యాప్తమై ఉంది. అంటే సాధకులకు విశ్వవ్యాప్తమైన పరబ్రహ్మ లేదా పరమాత్మ మాస్టరు ద్వారా, మాస్టరు రూపంలో దర్శనమిస్తాడు.
సాధకులకు శాశ్వతత్వం కలిగిస్తాననీ, మరో జన్మ ఉండదనీ, తనను నమ్మిన, తనకు నమస్కరిం చిన వారిని తనంతవారినిగా చేస్తాననీ అభయమి చ్చారు. ఈ యోగ సాధనా ప్రక్రియలో గ్రహచార దుష్ఫ లితాల నుంచి రక్షణ, శరీరంలోగల దోషాలు, కర్మ ప్రారబ్ధం నుంచి విముక్తి కలుగుతాయి. కేవలం ధ్యానం ద్వారా చేసే ఈ యోగాతో ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందవచ్చు.
- మునిపల్లె శేషగిరిరావు