అన్న మాట
రామ–లక్ష్మణ–భరత–శత్రుఘ్నులు అనే నలుగురు ఆదర్శ సోదరులుగా సుప్రసిద్ధిని పొంది ఉన్నారు. శ్రీరాముని వదిలి ఉండలేని లక్ష్మణుడు తనను కూడా అరణ్యానికి తీసుకుపొమ్మని శ్రీరామునితో వాదులాడి అంగీకారాన్ని పొందాడు. అరణ్యవాస సమయంలో సీతారాములకు వివిధ సేవలను అందించాడు.
శ్రీరామచంద్రుడే రాజ్యాన్ని పాలించుటకు సమ ర్థుడు, అర్హుడు అని భావించిన భరతుడు సపరివా రంగా అరణ్యానికి వెళ్లాడు. రాజ్యాన్ని పరిపాలించటా నికి తిరిగి అయోధ్యకు రమ్మని శ్రీరాముణ్ణి కోరాడు.
మీరు రాజ్యపాలన చేయటానికి అంగీకరించే వరకు నేను నీరు కూడా తీసుకోకుండా కఠినోపవాస దీక్షను చేస్తాను అని గట్టిగా తన అభిప్రాయాన్ని భర తుడు వెలిబుచ్చాడు. అయినప్పటికీ శ్రీరాముని ఆజ్ఞను పాటిస్తూ మహర్షుల, సిద్ధుల, గంధర్వుల ఉపదే శాలను శిరసావహిస్తూ భరతుడు రాజ్యపాలన బాధ్యతను స్వీకరిం చాడు. లక్ష్మణునివలె మొండిపట్టు పట్ట లేదు.
పితృవాక్య పరిపాలనా వ్రతాన్ని తాను కొనసా గిస్తున్నానని, 14 ఏళ్లు పూర్తికాగానే తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని స్వీకరిస్తానని, అంతవరకు రాజ్య పరిపాలనలో నీకు ఈ పాదుకలు సహాయంగా ఉంటా యని భరతునితో శ్రీరాముడు పలికాడు. భరతుడు అంగీకార సూచకంగా శ్రీరామ పాదుకలను స్వీక రించి శిరస్సుపై ధరించాడు. అన్నకు ప్రదక్షిణం చేసి ఆజ్ఞ తీసుకొని నంది గ్రామానికి చేరి శ్రీరామ పాదు కలను రాజసింహాసనంపై ఉంచి శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం 14 ఏళ్ల పాటు రాజ్యాన్ని పరిపాలించాడు.
తాను రాజ్యాన్ని వదలటానికి, ఈ అరణ్యానికి రావటానికి కారణం కైకేయియే అనే భావనతో భర తుడు కైకేయిని కోపంతో నిందిస్తాడేమోనని శ్రీరా ముడు ఊహించాడు. అందుకే ఓ భరతా! నీవు కైకేయి మాతను దూషించవద్దు. ఆమెపై రోషాన్ని తెచ్చు కోవద్దు. ఆమెను కాపాడు.. అని శ్రీరాముడు భరతుణ్ణి ఆజ్ఞా పించాడు.
అన్నమాట ప్రకారం భరతుడు రాజ్యాన్ని సక్ర మంగా పాలించి రాజ్యంయొక్క అభివృద్ధికి పాటు పడటమే కాకుండా కైకేయిపట్ల కూడా ఆదరభావాన్ని చూపాడు. శ్రీరాముడు అరణ్యం నుండి తిరిగి వచ్చి నాక అన్నగారూ! మీ మాట ప్రకారం నా తల్లి కైకేయిని గౌరవ భావంతో ఆదరించాను. ఆమెను కోపగించ లేదు. మీ ఆజ్ఞను పాటిస్తూ మీ ప్రతినిధిగా మీ పాదు కలు ముందు పెట్టుకొని ప్రజాసేవ చేశాను. తిరిగి మీకు రాజ్యాన్ని సమర్పిస్తున్నాను.. అని భరతుడు శ్రీరామ పట్టాభిషేక సమయంలో విన్నవించాడు. అన్నమాటను జవదాటని భరతుని భ్రాతృభక్తి ప్రశంసనీయమైనది.
(వ్యాసకర్త : సముద్రాల శఠగోపాచార్యులు)