Sankrathi
-
సంక్రాంతికి అయలాన్
శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్ ’. కోటపాడి జె.రాజేష్, ఆర్డీ రాజా నిర్మించిన ఈ సినిమాను సంక్రాతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ‘‘అయలాన్ అంటే ఏలియన్ అని అర్థం. ఈ ప్రయాణంలో మాకు కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ధైర్యం కోల్పోకుండా, పట్టుదలతో ఈ సినిమా చేశాం. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడాలనుకోవడం లేదు. అందుకే సినిమా విడుదల కొంత ఆలస్యం అవుతోంది. మా మూవీలో 4500 సీజీ షాట్స్ ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మా మూవీ రిలీజ్ కానుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
సంక్రాంతి కానుకలో మృతిచెందిన బల్లి.. ఫిర్యాదుదారుడిపైనే కేసు, మనస్తాపంతో
సాకక్షి, చెన్నై: సంక్రాంతి కానుకలో బల్లి మృతిచెందిందని ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి తిరుత్తణిలో చోటు చేసుకుంది. శరవణ పుష్కరిణి సమీపంలోని చౌక దుకాణంలో అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే కార్యకర్త నాథన్ (65) నాలుగు రోజుల కిందట సంక్రాంతి కానుకలు తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి పరిశీలించగా చింతపండులో మృతి చెందిన బల్లి ఉన్నట్లు గుర్తించి చౌక దుకాణం సేల్స్ మ్యాన్‌కు ఫిర్యాదు చేశాడు. చదవండి: యువతులను వంచించి వికృతానందం సేల్స్‌మ్యాన్ శరవణన్ పట్టించుకోకపోవడంతో మీడియాకు తెలిపాడు. దీంతో ఫిర్యాదు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు. మనస్తాపం చెందిన అతని కుమారుడు కుప్పుస్వామి (35) మంగళవారం సాయంత్రం కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీనికి నిరసనగా అన్నాడీఎంకే నేతలు రాస్తారోకో చేపట్టారు. చదవండి: Viral Video: ఏంటా దూకుడు!... బ్రేక్ వేసుండకపోతే పరిస్థితి.... -
మెడికల్ కాలేజీలకు సెలవుల్లేవ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈనెల 8వ తేదీ నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీచేసింది. మెడికల్ కాలేజీలను సెలవుల నుంచి మినహాయించినట్లు ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా జీవోలో పేర్కొన్నారు. 17 నుంచి విద్యాసంస్థలు పనిచేస్తాయని తెలిపారు. -
సంక్రాంతి అంటే ‘హ్యాపీ’ డిస్కౌంట్ ఆఫర్స్
సాక్షి, హైదరాబాద్: హ్యాపీ మొబైల్ స్టోర్స్ సంక్రాంతి పండుగకి ఆఫర్లను ప్రకటించింది. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఎటువంటి లక్కీడ్రాలు లేకుండా ఒక కచ్చితమైన బహుమతిని, 10శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. ఎంఐ, టీసీఎల్, ఎల్జీ, రియల్‌మి ఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. జనవరి 1 నుంచి 31 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ‘‘సంక్రాంతి అంటే హ్యాపీయే’’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రతి ఇంటి ఆనందాన్ని నింపాలనే లక్ష్యంతో ఉన్నట్లు సంస్థ అధినేత శ్రీ కృష్ణ పవన్ అన్నారు. -
ప్రతి జనవరిలో రూ.6వేల కోట్లను ఖాతాల్లో జమచేస్తాం
సాక్షి, ప్రకాశం జిల్లా : ఇక నుంచి ప్రతి ఏడాది జనవరి నెలలో జగనన్న అమ్మఒడి పథకం కింద ఆరువేల కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలో జమచేస్తామని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సంకాంత్రి పండుగను పురస్కరించుకొని బుధవారం ఆయన దోర్నాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాడు నేడు కార్యక్రమంలో కింద మెదటి దశలో 15వేల స్కూళ్లను, రూ.3600కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ రోజు ఫోటో చూపించి.. తిరిగి మూడేళ్ల తర్వాత అదే స్కూల్‌ను ఫోటో తీసి చూపిస్తామన్నారు. ఫోటో చూసి ఎలా అభివృద్ధి జరిగిందో ప్రజలే అర్థం చేసుకుంటారని చెప్పారు. రాబోయే రోజుల్లో రూ.1300 కోట్లతో మధ్యాహ్నం భోజన పథకం మార్పులు చేసి పిల్లకు మంచి భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో తొలిసారిగా వచ్చే ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. -
స్ఫూర్తిజ్వాల
బద్దకాన్ని కాచి ఉత్తేజంగా మారుస్తున్నట్టు.. జీవిత లక్ష్యాన్ని రగులుస్తున్న భావన! భోగి మంట చుట్టూ ఉన్న అక్క, అన్న, తమ్ముడు, చెల్లి.. అందరం ఉత్సాహంగా.. ఉత్తేజంగా! ఇంకా సూర్యుడు పలకరించని ఉదయం.. అయినా ఇంట్లో వాళ్లంతా లేచారు.. నువ్వుల నూనె మస్సాజ్ వాసన.. కాగులో వేడినీళ్లు మరుగుతున్న చప్పుడు.. వాకిట్లో భోగిమంటకు సిద్ధం చేస్తున్న సందడి.. నిద్రను సాగనంపాలని చూస్తున్నా.. వణికించే చలి.. నిద్రను దుప్పట్లో దూర్చి జోగొట్టే ప్రయత్నం చేస్తోంది. అందుకే కళ్లు తెరిచి చూసి అటు తిరిగి ఏ డిస్ట్రబెన్స్‌ను చెవిన పడనివ్వకుండా దిండును చెవులకు అడ్డం పెట్టుకొని మళ్లీ కళ్లు మూసుకుంటుంటే.. నానమ్మ ఊరుకోలేదు. సర్రున దుప్పటి లాగేసింది. అత్తొచ్చి అమాంతం ఎత్తుకొని తీసుకెళ్లి వాకిట్లో కూర్చోబెట్టింది. అమ్మ వచ్చేసి తలకు కొబ్బరి నూనె రాసింది. పిన్ని నువ్వుల నూనె పట్టించడానికి సన్నద్ధమైంది. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, బాబాయ్‌లు, నాన్న, తాతయ్య ఒకటే హడావిడి. ‘‘నాన్నమ్మా.. నిన్న నేను ఏరి తెచ్చిన రేగు కంప కనపడట్లేదే?’’ ఏడుపు గొంతుతో అన్న. ‘‘అక్కడే ఉంటుంది నాన్నా.. సరిగ్గా చూ..’’ నాన్నమ్మ పూర్తి చేసేలోపే ‘‘ఆ.. దొరికింది దొరికింది’’ అంటూ దాన్ని లాక్కొచ్చే అన్నయ్య. రెండు చేతులను చాపి వాటి మీద చిన్న చిన్న కర్రపుల్లల్ని మోసుకొస్తున్న తమ్ముడు.‘‘అమ్మడూ.. ఆ పిడకల దొంత తీసుకురా...’’ అక్కకు అత్త పురమాయింపు. లోపలి నుంచి కాళ్లు విరిగిపోయిన కుర్చీని తీసుకొస్తూ ఆయాసపడుతున్న తాతను చూసి ‘‘ఏమండీ.. మామగారి చేతుల్లోంచి ఆ కుర్చీని లాక్కోండి’’ నాన్నకు అమ్మ అప్పగించిన బాధ్యత. ‘‘రంగమ్మా.. ఇద్దరం తీసుకెళ్దాం గొబ్బెమ్మలను’’ చెల్లి (బాబాయ్ కూతురు) రిక్వెస్ట్.. మా ఇంట్లో పనులకు సహాయంగా ఉన్న రంగమ్మత్తతో .. పిడకలుగా మారిన గొబ్బెమ్మల గురించి. ఎవరూ ఖాళీగా లేరు. అందరూ కలిసి చేస్తున్న పని. సహాయం. భోగి మంట రాజుకుంది. అంతెత్తున లేచింది. అప్పటిదాకా ఒంట్లో ముసుగేసుకున్న చలి పారిపోయింది. భోగి మంట రిఫ్లెక్షన్లో అందరి మొహాలు వెలుగుతున్నాయి. ఆ ఫ్లేమ్నే తదేకంగా చూస్తుంటే.. నాలోనూ ఏదో ఉత్సాహం.. నాలో ఉన్న బద్దకాన్ని కాచి ఉత్తేజంగా మారుస్తున్నట్టు.. జీవిత లక్ష్యాన్ని రగులుస్తున్న భావన! భోగి మంట చుట్టూ ఉన్న అక్క, అన్న, తమ్ముడు, చెల్లి.. అందరినీ చూశా. అందరూ నాలాగే ఉన్నారు. ఉత్సాహంగా.. ఉత్తేజంగా!భోగి అనగానే ఇదే సీన్ రిపీట్ అవుతూ వస్తోంది కొన్నేళ్లుగా. ఇప్పుడు అందరం పెద్దవాళ్లమయ్యాం. ఒకరి మీద ఆధారపడకుండా.. ఇంకొకరికి సాయపడేంత! అన్నట్టు మేమంతా చిన్నప్పుడు పెట్టుకున్న గోల్స్‌ని రీచ్ అయ్యాం. అయినా ప్రతి భోగి కొత్త లక్ష్యాన్ని నిర్దేశిస్తూనే ఉంది. సమష్టి కృషిని బోధిస్తూనే ఉంది. ఇంకా ఏదో సాధించాలన్న తపనను రగిలిస్తూనే ఉంది. ఎక్కడున్నా ప్రతి సంక్రాంతికి ఊరెళ్తాం. నానమ్మ, తాతల ఆశీస్సుల కోసం.. ఆ వాకిట్లో భోగిజ్వాల పంచే స్ఫూర్తి కోసం! – సరస్వతి రమ -
సంక్రాంతి ఎఫెక్ట్.. ఇప్పటికే 300 బస్సులు ఫుల్
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి రద్దీ నేపథ్యంలో తెలంగాణ, ఏపీలకు టీఎస్ ఆర్టీసీ తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలంగాణ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఇప్పటికే 300బస్సులు ఫుల్ అయ్యాయన్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేశామని, మొత్తం 5252 బస్సులు సిద్దం చేశామన్నారు. 'ఎంజీబీఎస్ నుండి 3400 బస్సులు తిరుగుతాయి. ఉత్తర తెలంగాణ బస్సులు 10వ తేదీ నుండి 14వరకు జేబీఎస్ నుండి నడుస్తాయి. నల్లగొండ వెళ్లే బస్సులు దిల్‌షుఖ్‌నగర్ నుండి, వరంగల్ వెళ్లే బస్సులు ఉప్పల్ నుండి వెళ్తాయి. కర్నూలు అనంతపురం వెళ్లే రెగ్యులర్ బస్సులు ఎంజీబీఎస్ నుండి, స్పెషల్ బస్సులు సీబీఎస్ నుండి బయలు దేరుతాయి. వికారాబాద్, తిరుపతి, మహబూబ్ నగర్, బెంగుళూరు బస్సులు ఎంజీబీఎస్ నుండి వెళ్తాయి. విజయవాడ వైపు వెళ్లే బస్సులు నగర శివార్ల నుండే బయలుదేరుతాయి. వెయ్యి బస్సులను ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వెసులు బాటు కల్పించాము. ప్రయాణికుల సేవల కోసం 24గంటలూ అధికారులు అందుబాటులో ఉంటారు. స్పెషల్ బస్సులకు స్పెషల్ చార్జీలు ఉంటాయి. 50శాతం అదనంగా చార్జీలు ఉంటాయి. రిజర్వేషన్లలో విశాఖ, అమలాపురం, రాజోలు వంటి ప్రాంతాలకు డిమాండ్ అధికంగా ఉంది. 1592బస్సులను తెలంగాణకు, 3670 బస్సులను ఏపీకి నడపనున్నాము. సిటీ బస్సులను కూడా వినియోగిస్తాం. రోజుకు 400 మెట్రో ఎక్స్ ప్రెస్, లైనర్లు, డిలక్స్ బస్సులను వాడుతాము. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాము. ఎంజీబీఎస్, జేబీఎస్‌ల నుండి బస్ పాయింట్ల వద్దకు షెటిల్ బస్సులను తిప్పుతాము' అని యాదగిరి పేర్కొన్నారు. -
ఆ ప్రజాప్రతినిధులను వదిలిపెట్టం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడి పందేలు ఆడిన ప్రజాప్రతినిధులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వారి హోదాలు, చిరునామాలతో సహా పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా గుంటూరు జిల్లాలో కోడి పందేలు ఆడిన తెలుగుదేశం పార్టీకి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు దేవినేని మల్లికార్జునరావు, ముమ్మనేని వెంకట సుబ్బయ్యలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అధికార పార్టీ నేతలకు నోటీసులు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ దాఖలైన మరో పిటిషన్‌పై ధర్మాసనం స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సైతం నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. -
సంబరాల సంక్రాంతి
మకర సంక్రాంతిలాగా తెలుగుల సంస్కృతికి అద్దం పట్టే పండుగ మరొకటి లేదు. అందుకే పండుగలెన్ని ఉన్నా తెలుగు వారికి ‘పెద్ద పండుగ’ సంక్రాంతే. నూరేళ్ల క్రితం వరకూ విడదీయలేనంతగా జన జీవన స్రవంతిలో భాగంగా నిలిచిపోయిన మకర సంక్రాంతి, సంప్రదాయాలు ఇవ్వాళ నామమాత్రంగానే ఉన్నా యని చెప్పవచ్చు. ముఖ్యంగా నగరాలలో, పట్టణాలలో ఆధునికత ఆనాటి జీవన విధానాన్నీ, ఆర్థిక సామాజిక స్థితులనూ, మానవ సంబంధాలనూ, ఆనాటి విలువ లనూ నానాటికీ కనుమరుగు చేస్తున్న కాలం కదా. అతి వేగంగా మారుతున్న కాలంలో ఉధృతమైన వర దలా మనల్ని ముంచెత్తుతున్న పాశ్చాత్య సంస్కృతి ప్రభావంలో, ఒక్కొక్క సంవత్సరం గడిచేసరికి, మనం మరెంత ఎక్కువ దూరం కొట్టుకు వచ్చామో స్ఫుటంగా చూసి హెచ్చరించే సందర్భంగా ఇప్పుడు మకర సంక్రాంతి ఏటేటా మన ముందు నిలుస్తున్నది. సూర్యుడు తన నిరంతర పయనంలో మరొక సారి మకర రాశిలో ప్రవేశించే పుణ్య దినం మకర సంక్రాంతి. ఇది ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆరంభ దినం. ధర్మాచరణకూ, పుణ్యకార్యాల ప్రారంభానికీ మకర సంక్రాంతి అనువైన కాలం. అన్నిటినీ మించి మానవ సంబంధాల విలువలను సంక్రాంతి సంప్రదా యాలు చాటి చెప్తాయి. పంటలు చేతికివచ్చి, శ్రమ ఫలం అర్ధరూపంలో చేతికొస్తుంది కనుక అన్నిరకాల దానధర్మాలకూ çసంక్రాంతి తగిన కాలం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో యావత్ ప్రజానీకంలోనూ అంద రికీ ఆనందదాయకమైంది సంక్రాంతి. అన్ని పండగల కంటే ఈ పండగ సంబరాల ఆనందం అంబరాన్ని అంటటానికి ముఖ్యకారణం ఆర్థికం.ధనధాన్యాలూ, పాడిపంటలతో గ్రామాలు కళ కళలాడే కాలంలోవచ్చే పండగ కదా. అందుకే గ్రామీణ సమాజంలో అన్ని వర్గాల వారూ అత్యంత ఉత్సాహంతో జరుపుకునే పండగ సంక్రాంతి. సంక్రాంతి ముగ్గులు దిద్దడంలో, గొబ్బెమ్మల అలంకరణలో, హరిదాసుల పాటలలోనూ, గంగి రెద్దుల ఆటలలోనూ ఎక్కడ చూసినా కళాత్మకత కనిపిస్తుంది. అయితే అదంతా ఆత్మానందం కోసం చేసే కళా ప్రతిభ ప్రకటన అవటం వల్ల, అందులో వాణిజ్య కళలకు ఎన్నోరెట్లు మించిన సహజత్వమూ, సృజనాత్మకతా, ఉత్సాహమూ ప్రతిబింబిస్తాయి. ప్రతి గ్రామీణ కళాకారుడికి సంక్రాంతి అంటే తన కళకు మెప్పునూ, లక్ష్మీ కటాక్షాన్ని కురిపించే సందర్భమే. ఆధునిక జీవితం అందించే సౌకర్యాలతోపాటు, అలనాటి ఆప్యాయతా మానవ సంబంధాల సౌర భాలు కలబోసుకుంటే, మనిషి జీవితం వెలుగుల మ యమౌతుందనేది సంక్రాంతి మనకిచ్చే సందేశం‘ ( ఎం. మారుతి శాస్త్రి ) -
పోలీసు పహారాలో రాజధాని
భద్రతా వలయంలో రాజధాని గ్రామాలు శరవేగంగా కదులుతున్న సీఆర్డీఏ చీమ చిటుక్కుమన్నా ముందే తెలిసిపోయేలా ఏర్పాట్లు సంక్రాంతిలోగా పనిముగించే యోచన రాజధాని గ్రామాలు పోలీసు పహారాలోకి వెళ్లిపోయాయి. సీఆర్డీఏ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. అధికారుల బృందానికి పోలీసులు పటిష్టరక్షణ కల్పిస్తున్నారు. మఫ్టీలో అన్ని గ్రామాలనూ జల్లెడ పడుతున్న ఇంటలిజెన్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు స్థానికుల కదలికలను ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. గుంటూరు సిటీ : రాజధానిపై సర్వాధికారాలు గల సీఆర్డీఏ అధికారికంగా భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించడంతో రాష్ట్ర నూతన రాజధాని ప్రాంతంలో మరో కీలకమైన అంకానికి తెర లేచింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుళ్లూరులో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్న మరుసటి రోజు శుక్రవారం ఈ ఘట్టం మొదలైంది. రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాలు పోలీసు భద్రతా వలయంలో చేరిపోయాయి. అణువణువూ నిఘా నీడన ఒదిగిపోయాయి. అక్కడ చీమ చిటుక్కుమన్నా సీఆర్డీఏకు ముందే తెలిసేలా ఏర్పాట్లు జరిగాయి. సేకరణ ప్రక్రియ ప్రారంభించడానికి ముందే హైకోర్టులో కేవియట్ దాఖలు చేయడంతో దీనిపై ఎవరు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్నా, ముందుగా ప్రభుత్వానికి నోటీసు పంపాల్సి ఉంటుంది. ఈ రకంగా కూడా భూ సేకరణకు ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారో ముందుగానే తెలుసుకునే వెసులుబాటు సీఆర్డీఏకు చిక్కింది. నూతన సంవత్సరం ఆరంభంలో రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న నేలపాడు నుంచి మొదలైన భూ సేకరణను వీలైనంత త్వరగా ముగించాలన్న యోచనలో సీఆర్డీఏ ఉంది. ఈ మేరకు తన అడుగులను వేగవంతం చేసింది. తుళ్లూరులో నూతన సంవత్సర వేడుకలకు హాజరైన సీఎం చంద్రబాబు కూడా సంక్రాంతిలోగా భూములు ఇవ్వాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో భూసేకరణకు ఎలాంటి అవరోధాలూ ఎదురవకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వయంగా రంగంలో దిగిన రూరల్ ఎస్పీ రామకృష్ణ ప్రత్యేక బలగాలను రాజధాని ప్రాంతమంతటా మోహరించారు. వంద మందికి పైగా పోలీసులతో కూడిన 16 ప్రత్యేక బృందాలను సీఆర్డీఏకు రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఇక మఫ్టీలో అన్ని గ్రామాలనూ జల్లెడ పడుతున్న ఇంటలిజెన్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామస్తుల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ వివరాలను అప్పటికప్పుడే ఉన్నతాధికారులకు జేరవేస్తున్నారు. దీంతో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా వాటిని మొగ్గలోనే అణిచివేసే వీలు చిక్కింది. ఖాకీల నీడన కాలం వెళ్లదీస్తున్న రాజధాని ప్రాంతంలో ఇంకా భూమి ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతుల్లో కొంత అయోమయ వాతావరణం నెలకొంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని గందరగోళం ఏర్పడింది. ఇస్తే ఏమవుతుంది? ఇవ్వకుంటే ఏమవుతుంది? అన్న శషభిషల మధ్య ఏం చేయాలో దిక్కుతోచని దుస్థితిలోకి అనివార్యంగా జారిపోయారు. అయితే భూ సేకరణ అధికారికంగా ప్రారంభించగానే పైకి అంతా స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తున్నా... ఏ గ్రామంలో చూసినా దీనిపైనే ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. మరో వైపు భూ సేకరణ మినహా మిగిలిన అంశాలతో తనకు సంబంధం లేదన్నట్లుగా సీఆర్డీఏ తన పనిని చకచకా చేసుకుంటూ ముందుకు పోతోంది. -
సంక్రాంతి గోపాలుడు
విశ్వంలో పరిణమిల్లే ప్రతి విలయానికీ, ప్రతి అద్భుతానికీ దేవుడే కారణభూతుడు. భగవద్గీత, ఖురాన్, బైబిల్... ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పేది ఇదే. అలాంటప్పుడు మానవుల ఈతిబాధలకు కారకుడు దైవం కాక మరెవరు? ఈ ప్రశ్ననే సమాజంపై సంధించాడు ఓ వ్యక్తి. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఏకంగా దైవం పైనే కేసు బనాయించాడు. మరి దానికి దైవం ఎలా స్పందించాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘గోపాల గోపాల’. దేవుడిపైనే కేసు వేసే గోపాల్రావుగా వెంకటేశ్ నటిస్తుంటే, సాక్షాత్ గోపాలునిగా పవన్‌కల్యాణ్ నటిస్తున్నారు. నాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ మిథున్చక్రవర్తి ఇందులో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుండటం విశేషం. కిశోర్‌కుమార్ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. బాలీవుడ్లో రూపొందిన ‘ఓమైగాడ్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. కథలోని ఆత్మ చెడకుండా, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులతో దర్శకుడు డాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ కాంబినేషన్లో వచ్చే సన్ని వేశాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేలా ఉంటాయని సమాచారం. ప్రస్తుతం వారిద్దరిపైనే హాస్పిటల్‌కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సంక్రాతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. వెంకటేశ్‌కి జోడీగా శ్రియ నటిస్తున్న ఈ చిత్రంలో మధుశాలిని, పోసాని కృష్ణమురళి, రంగనాథ్, రాళ్లపల్లి, కృష్ణుడు, దీక్షాపంత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: ఉమేశ్ శుక్లా, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: గౌతంరాజు.