- భద్రతా వలయంలో రాజధాని గ్రామాలు
- శరవేగంగా కదులుతున్న సీఆర్‌డీఏ
- చీమ చిటుక్కుమన్నా ముందే తెలిసిపోయేలా ఏర్పాట్లు
- సంక్రాంతిలోగా పనిముగించే యోచన
రాజధాని గ్రామాలు పోలీసు పహారాలోకి వెళ్లిపోయాయి. సీఆర్‌డీఏ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. అధికారుల బృందానికి పోలీసులు పటిష్టరక్షణ కల్పిస్తున్నారు. మఫ్టీలో అన్ని గ్రామాలనూ జల్లెడ పడుతున్న ఇంటలిజెన్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు స్థానికుల కదలికలను ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు.
గుంటూరు సిటీ : రాజధానిపై సర్వాధికారాలు గల సీఆర్‌డీఏ అధికారికంగా భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించడంతో రాష్ట్ర నూతన రాజధాని ప్రాంతంలో మరో కీలకమైన అంకానికి తెర లేచింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుళ్లూరులో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్న మరుసటి రోజు శుక్రవారం ఈ ఘట్టం మొదలైంది. రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాలు పోలీసు భద్రతా వలయంలో చేరిపోయాయి. అణువణువూ నిఘా నీడన ఒదిగిపోయాయి. అక్కడ చీమ చిటుక్కుమన్నా సీఆర్‌డీఏకు ముందే తెలిసేలా ఏర్పాట్లు జరిగాయి.
సేకరణ ప్రక్రియ ప్రారంభించడానికి ముందే హైకోర్టులో కేవియట్ దాఖలు చేయడంతో దీనిపై ఎవరు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్నా, ముందుగా ప్రభుత్వానికి నోటీసు పంపాల్సి ఉంటుంది. ఈ రకంగా కూడా భూ సేకరణకు ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారో ముందుగానే తెలుసుకునే వెసులుబాటు సీఆర్‌డీఏకు చిక్కింది.
నూతన సంవత్సరం ఆరంభంలో రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న నేలపాడు నుంచి మొదలైన భూ సేకరణను వీలైనంత త్వరగా ముగించాలన్న యోచనలో సీఆర్‌డీఏ ఉంది. ఈ మేరకు తన అడుగులను వేగవంతం చేసింది. తుళ్లూరులో నూతన సంవత్సర వేడుకలకు హాజరైన సీఎం చంద్రబాబు కూడా సంక్రాంతిలోగా భూములు ఇవ్వాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో భూసేకరణకు ఎలాంటి అవరోధాలూ ఎదురవకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వయంగా రంగంలో దిగిన రూరల్ ఎస్పీ రామకృష్ణ ప్రత్యేక బలగాలను రాజధాని ప్రాంతమంతటా మోహరించారు.
వంద మందికి పైగా పోలీసులతో కూడిన 16 ప్రత్యేక బృందాలను సీఆర్‌డీఏకు రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఇక మఫ్టీలో అన్ని గ్రామాలనూ జల్లెడ పడుతున్న ఇంటలిజెన్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామస్తుల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ వివరాలను అప్పటికప్పుడే ఉన్నతాధికారులకు జేరవేస్తున్నారు. దీంతో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా వాటిని మొగ్గలోనే అణిచివేసే వీలు చిక్కింది.
ఖాకీల నీడన కాలం వెళ్లదీస్తున్న రాజధాని ప్రాంతంలో ఇంకా భూమి ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతుల్లో కొంత అయోమయ వాతావరణం నెలకొంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని గందరగోళం ఏర్పడింది. ఇస్తే ఏమవుతుంది? ఇవ్వకుంటే ఏమవుతుంది? అన్న శషభిషల మధ్య ఏం చేయాలో దిక్కుతోచని దుస్థితిలోకి అనివార్యంగా జారిపోయారు. అయితే భూ సేకరణ అధికారికంగా ప్రారంభించగానే పైకి అంతా స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తున్నా... ఏ గ్రామంలో చూసినా దీనిపైనే ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. మరో వైపు భూ సేకరణ మినహా మిగిలిన అంశాలతో తనకు సంబంధం లేదన్నట్లుగా సీఆర్‌డీఏ తన పనిని చకచకా చేసుకుంటూ ముందుకు పోతోంది.