
సాక్షి, హైదరాబాద్: తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడి పందేలు ఆడిన ప్రజాప్రతినిధులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వారి హోదాలు, చిరునామాలతో సహా పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా గుంటూరు జిల్లాలో కోడి పందేలు ఆడిన తెలుగుదేశం పార్టీకి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు దేవినేని మల్లికార్జునరావు, ముమ్మనేని వెంకట సుబ్బయ్యలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అధికార పార్టీ నేతలకు నోటీసులు
సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ దాఖలైన మరో పిటిషన్‌పై ధర్మాసనం స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సైతం నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment