గణిత దశావధానం కార్యక్రమంలో మాట్లాడుతున్న గణిత శతావధాని మడ్డు తిరుపతిరావు
అబ్బుర పరిచిన అవధానం
Published Fri, Aug 5 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
♦ కాశీబుగ్గలో గణిత దశావధానం
♦ ఔరా అనిపించిన చిన్నారులు
పలాస: కాశీబుగ్గ గురుకుల విద్యాలయంలో శుక్రవారం జన జాగృతి సాహితీ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత అష్టావధానం అబ్బురపరిచింది. అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలమేధావి సప్ప సాయి(5వ తరగతి) గణిత దశావధానం, చిరుమేధావి సాలిన కౌశిక్(3వ తరగతి) విద్యార్థుల మేధాసంపత్తి ప్రదర్శన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ చిచ్చరపిడుగులు ప్రేక్షకులను ఔరా అనిపించారు. జనజాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ తెప్పల కృష్ణమూర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, గురుకుల విద్యాలయ డైరెక్టర్ కింతలి కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పలాస–కాశీబుగ్గ లయన్స్‌క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఆనందరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. 10 మంది పృచ్ఛకులు సంధించిన వారగణన 4“4 గణిత చదరం, 1000 సంఖ్యల మొత్తం చెప్పడం, దత్త భిన్నాంకం, మెమోరీ గేమ్, మనో సంకలనం 1, 3“3 గణిత చదరం, దత్తాంకం, మనః సంకలనం 2, సరస ప్రసంగాలకు సప్ప సాయి అవలీలగా సమాధానాలు చెప్పాడు. ప్రేక్షకులు అడిగిన ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లు, భారతదేశంలోని రాష్ట్రాల పేర్లు, రాజధానులు, ప్రపంచంలోని 100 ముఖ్య దేశాలు, రాజధానులు, వాటి కరెన్సీ, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శాఖల పేర్లు, 60 తెలుగు సంవత్సరాలు, భారతదేశ రాష్ట్రపతి పేర్లు, వివిద పరికరాలు కనుగొన్న శాస్త్రవేత్తల పేర్లు, 2016 క్యాలెండర్‌లో అడిగిన తేదీనికి వారం పేరు చెప్పడం తదితర అంశాలకు సాలిన కౌశిక్ ప్రశ్న పూర్తవకముందే సమాధానం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ అవధానంలో గురుకుల పాఠశాలకు చెందిన 9, 10 తరగతుల బాలబాలికలు రుచిత, సమన్వి, ప్రజ్ఞ, సంహిత, చంద్రిక, సాయికుమార్, కుమారరాజు, సాయితేజ, తిరుమలసాయి, దివాకర్, పృచ్ఛకులుగా పాల్గొన్నారు. గణిత దశావధాని బాలమేధావులకు గురువు మడ్డు తిరుపతిరావు సమన్వయకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో జనజాగృతి ప్రధాన కార్యదర్శి బమ్మిడి సుబ్బారావు, ఉపాధ్యక్షులు రేజేటి సతీష్‌కుమార్, సహాయక కార్యదర్శి ఎంఎస్ ప్రసాద్, పైల మల్లేశం, లాబాల సిరి, మడే శరత్‌చంద్రుడు, తంగుడు సాంభమూర్తి, ఎన్.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement