‘దోస్త్‌’ కటీఫ్‌! | Government plans to end online degree admissions | Sakshi
Sakshi News home page

‘దోస్త్‌’ కటీఫ్‌!

Published Fri, Dec 13 2024 4:42 AM | Last Updated on Fri, Dec 13 2024 4:42 AM

Government plans to end online degree admissions

డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు సర్కార్‌ స్వస్తి చెప్పే యోచన 

భారీగా మిగిలిపోతున్న సీట్లు..ముందే జాగ్రత్త పడుతున్న ప్రైవేటు కాలేజీలు  

దీంతో వచ్చే సంవత్సరం నుంచి పాత పద్ధతిలోనే ప్రవేశాలు 

దోస్త్‌పై ఉన్నత విద్యామండలి మనోగతం 

త్వరలో ప్రభుత్వానికి నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతమున్న ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌– తెలంగాణ (దోస్త్‌)’ విధానాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిగ్రీ ప్రవేశాలను పాత విధానంలోనే చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు పూర్తి స్వేచ్ఛ లభించే వీలుంది. ఎవరికి సీటివ్వాలి? ఎవరికి ఇవ్వకూడదనేది కాలేజీలే నిర్ణయించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. 

ఉన్నత విద్యామండలి దీనిపై ఇప్పటికే చేపట్టిన అధ్యయనం తుది దశకు చేరుకోగా, త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీన్ని ఆమోదిస్తే, వచ్చే విద్యా సంవత్సరం (2025–26) నుంచి దోస్త్‌ను ఎత్తివేసినట్టేనని మండలి వర్గాలు చెబుతున్నాయి. 

‘దోస్త్‌’ను కొన్ని కాలేజీలు కొన్నేళ్లుగా వ్యతిరేకిస్తున్నాయి. అవి ఇప్పటికీ దోస్త్‌ జాబితాలో చేరలేదు. ఆయా కాలేజీల ఒత్తిడి మేరకే దోస్త్‌కు స్వస్తి చెప్పబోతున్నట్లు విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. దీనిపై అన్నివర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.  

ఏమిటీ దోస్త్‌? 
రాష్ట్రవ్యాప్తంగా 1,055 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. గతంలో డిగ్రీ సీటు కోసం ప్రతీ కాలేజీలోనూ రుసుం చెల్లించి దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి ఉండేది. సీటు ఎక్కడ వచి్చందో తెలుసుకునేందుకు ప్రతీ కాలేజీకి వెళ్లాల్సి వచ్చేది. సీటు రాకపోతే మరో కౌన్సెలింగ్‌ పెట్టే వరకూ అన్ని కాలేజీలూ తిరగాలి. విభిన్న కోర్సుల కోసం వివిధ దరఖాస్తులు చేయాల్సి వచ్చేది. 

ఈ విధానం వల్ల విద్యార్థులు వ్యయ ప్రయాసలకు గురయ్యేవాళ్లు. దీనిపై జాతీయస్థాయిలో విస్తృత చర్చ జరగ్గా, ఆన్‌లైన్‌లో ఏకీకృత ప్రవేశాలు ఉండాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ 2015లో ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో 2016 నుంచి దోస్త్‌ ద్వారా ప్రవేశాలు చేపడుతున్నారు. 

మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థి కూడా ఆన్‌లైన్‌లో అన్ని కాలేజీలకు, అన్ని కోర్సులకు దరఖాస్తు చేసే అవకాశం వచి్చంది. ఎక్కడికీ వెళ్లకుండానే సెల్‌ఫోన్‌లోనే ఎక్కడ? ఏ కోర్సులో? సీటు వచ్చిందనే సమాచారం వచ్చే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 

అభ్యంతరాలేంటి? 
దోస్త్‌ ద్వారా కొంతమంది విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఉన్నత విద్యామండలి వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు స్థానికంగా కాకుండా, మెరిట్‌ ప్రకారం ఎక్కడో సీట్లు వస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు వచ్చినా విద్యార్థులు చేరడం లేదని అధికారులు అంటున్నారు. 

మరోవైపు ప్రైవేటు కాలేజీలు దోస్త్‌లో విద్యార్థుల చేత ఆప్షన్లు ఇప్పించుకునేందుకు పోటీ పడుతున్నారని చెబుతున్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో దోస్త్‌ ప్రవేశాలు ఎక్కువగా ఉంటున్నాయని, కొన్నిచోట్ల తక్కువగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. దోస్త్‌ పేరుతో మండలి ఆధిపత్యం చేస్తోందని, ఫలితంగా కాలేజీలు కొత్త కోర్సులతో విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

పాత విధానం వల్ల కాలేజీలపై ప్రభుత్వ అజమాయిషీ తగ్గుతుందని, ఇష్టానుసారం ఫీజులు వసూలు చేసే అవకాశం          వస్తుందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. లోపాలుంటే సరిచేయాలి తప్ప, వ్యవస్థనే రద్దు చేయడం ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమేనని చెబుతున్నాయి. 

అధ్యయనం చేస్తున్నాం
దోస్త్‌పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది ఉండాలంటున్నారు. కొంతమంది ఉపయోగం లేదంటున్నారు. అన్నివైపుల నుంచి పరిశీలన జరుపుతున్నాం. మార్పులు అనివార్యమనిపిస్తే తప్పకుండా చేస్తాం.  – ప్రొ. వి.బాలకిష్టారెడ్డి(ఉన్నత విద్యామండలి చైర్మన్‌) 

దోస్త్‌ వల్లే పారదర్శకత
సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ కాలంలో దోస్త్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. పేద, ధనిక   తారతమ్యం లేకుండా, వ్యయ ప్రయాసలు   లేకుండా సీట్లు పొందుతున్నారు. ఇంట్లో కూర్చుని ఖర్చు లేకుండా ఎక్కడైనా సీటు వచ్చే పారదర్శకత దోస్త్‌ వల్లే సాధ్యం. దీన్ని ఎత్తివేస్తే విద్యార్థులకు   ఇబ్బంది అవుతుంది.   – ప్రొ. ఆర్‌.లింబాద్రి(ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్‌) 

కార్పొరేట్‌ కాలేజీల కొమ్ముగాస్తారా?
దోస్త్‌ వల్లనే ప్రైవేటు కాలేజీల దోపిడీకి అడ్డుకట్ట పడుతోంది. ఇప్పుడు దాన్ని ఎత్తివేస్తే గతంలో మాదిరిగా ప్రైవేటు కాలేజీలు దోచుకుంటాయి. పేద వర్గాల ప్రయోజనాలను తాకట్టు పెట్టే ఇలాంటి చర్యలను ఆమోదించం. అవసరమైతే విద్యార్థి ఉద్యమాలకూ వెనుకాడం.   – నాగరాజు(ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి)

ఆమోదయోగ్యం కాదు 
దోస్త్‌లో లోపాలుంటే సరిచేయాలి. ఎందుకు మార్పులు చేస్తున్నామో చెప్పాలి. అంతేతప్ప ప్రైవేటు కాలేజీల ఒత్తిడి మేరకు దోస్త్‌ను రద్దు చేస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఇది ఆమోదయోగ్యం కాదు.    – చింతకాయల ఝాన్సీ రాణి(ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement