విద్యలో వెనకబడి ఉన్నాం
డిప్యూటీ సీఎం కడియం
హైదరాబాద్: అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే విద్యాపరంగా మనం వెనకబడి ఉన్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణలో నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆర్టీసీ కల్యాణమండపంలో ఆదివారం తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం డైరీని ఆయన ఆవిష్కరించారు. కడియం మాట్లాడుతూ... అందరి భాగస్వామ్యంతోనే తెలంగాణ వచ్చిందని, దాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రైవేట్ కళాశాలల మేనేజ్‌మెంట్‌లు ఆరోగ్యశ్రీ, డబుల్ బెడ్‌రూమ్‌లు అడిగారని, అయితే ఆసరా పథకం కోరతారేమోనని కంగారుపడ్డానని పరోక్షంగా చురకలు వేశారు. రాష్ర్టంలో 80 లక్షల మంది విద్యార్థులుంటే అందులో 50 శాతం మంది ప్రైవేట్ విద్యాలయాల్లోనే చదువుతున్నారన్నారు. అందరికీ తమ ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని, అయితే ప్రభుత్వ విద్యాలయాలను గాలికొదిలేసి ప్రైవేటు సంస్థలను ఏ ప్రభుత్వం ప్రోత్సహించదన్నారు. రానున్న బడ్జెట్‌లో ఫీజు బకాయిలను పూర్తిగా చెల్లించేందుకు కృషి చేస్తామన్నారు.
యాభై ఏళ్లలో జరగనిది ఐదేళ్లలో చేస్తాం: ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... బల్దియా ఎన్నికల్లో ఒక్కసారి తమకు అవకాశం ఇస్తే, యాభై ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపిస్తామన్నారు. తెలంగాణ వస్తే విద్యుత్ సమస్యగా మారుతుందని ఏపీ చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారని, కానీ.. కిరణ్ దీపం ఆరిపోయింది గానీ, ఇక్కడ ఎండాకాలం కూడా కరెంట్ కోతలు లేవన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎ.వరదారెడ్డి, అధ్యక్షుడు వి.నరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, జాహ్నవి కళాశాలల చైర్మన్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.