Deputy CM Kadiyam
-
వచ్చే ఏడాది అంబేడ్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణ
డిప్యూటీ సీఎం కడియం, మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీ నాటికి ఆవిష్కరించేందుకు ప్రణాళిక రూపొందిం చామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తెలిపారు. అంబేడ్కర్ 125 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబా ద్‌లోని ఐమాక్స్ నెక్లెస్ రోడ్డు వద్ద 125 అడుగుల అంబేడ్కర్ భారీ కాంస్య విగ్రహా న్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిష్టాçపన కమిటీ వేసినట్లు వారు పేర్కొన్నారు. గురువారం ఇక్కడ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కి టెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ప్రాంగణంలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ శిల్పకళాకారులు మలిచిన అంబేడ్కర్ విగ్రహ నమూనాలను కడియం, జగదీశ్‌రెడ్డిలు పరిశీలించారు. శ్రీహరి మాట్లాడుతూ ఈ ఏడాది అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విగ్రహ ప్రతిష్టాపన చేయబోయే ప్రాంతంలోని మట్టిని పరీక్షించడంతోపాటు విగ్రహ నమూనా రూపకల్పనకు కన్సల్టెంట్‌ను నియమించనున్నట్లు చెప్పారు. నోడల్ ఏజెన్సీగా ఆర్ అండ్ బి శాఖ వ్యవహరిస్తుం దని, ప్రాజెక్ట్ వర్క్‌ను రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌మిశ్రా సమన్వయం చేస్తారని తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపన పనుల ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ గణపతిని నియమించినట్లు చెప్పారు. -
మహారాష్ట్రతో ఒప్పందం చారిత్రకం
తెలంగాణ బీడు భూములకు వరం ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయాం అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ పేటెంట్ ప్రాజెక్టుల పేరుతో నిస్సిగ్గుగా దోచుకున్నారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ : దశాబ్దాలుగా అంతరాష్ట్ర వివాదాలతో బీళ్లుగా మారిన తెలంగాణ భూములకు నీళ్లు పారించే చారిత్రక ఒప్పందం జరిగిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గోదావరి జలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ల మధ్య జరిగిన ఒప్పందంతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యాలమవుతుందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా అంతరాష్ట్ర వివాదాల అడ్డంకుల కారణంగా ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఈ ఒప్పందం కుదిరిందన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం హన్మకొండలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి జలాల్లో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి జలాలు 1400 టీఎంసీలు, ఇందులో తెలంగాణకు 950 టీఎంసీలు రావాలన్నారు. కృష్ణానదిలో ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు వస్తే ఇందులో తెలంగాణ 300 టీఎంసీల నీరు వాటా ప్రకారం రావాలన్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ అవార్డు నీటి కేటాయింపులు చేసినా వాడుకోలేని దుస్థితి నాటి పాలకులదని విమర్శించారు. 1975, 2012లో మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్నామని కాంగ్రెస్ వారు చెపుతున్నారని... ఒప్పందాలు చేసుకుంటే ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదని కడియం ప్రశ్నించారు. 2015లో నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మించ వద్దని ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్లతో నిర్మిస్తే ఇబ్బందులు తప్పవని, నాలుగు మీటర్ల ఎత్తు తగ్గించి 148 మీటర్ల వరకు నిర్మించాలని మహారాష్ట్ర సీఎం చౌహాన్ సూచించారని పేర్కొన్నారు. 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 160 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని, 148కి తగ్గిస్తే 40 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలో మిగతా నీటిని వినియోగించుకోవడానికి ప్రాజెక్టులను రీడిజైన్ చేశామని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. మేడిగడ్డ వద్ద 180 టీఎంసీల నీటి లభ్యత ఉందన్నారు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మించడం ద్వారా తమ్మిడిహట్టి వద్ద కోల్పోయిన 160 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావచ్చని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో 36 లక్షల హెక్టార్లకు సాగు నీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ పేటెంట్ అని దుయ్యబట్టారు. నాడు ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ వారు నిస్సిగ్గుగా దోచుకున్నారని విరుచుకుపడ్డారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబందించి జీఓ 123ను హైకోర్టు నిలిపివేస్తే స్వీట్లు పంచుకుని రాక్షస ఆనందం పొందారని, దీనిపై అప్పీలుకు వెళితే జీఓ నిలిపివేతను ఎత్తివేస్తే కాంగ్రెస్ నాయకులు బిక్కముఖం వేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన జలయజ్ఞంపై సీబీఐ విచారణ జరుపుతుందన్నారు. వాస్తవాలు బయటపడుతాయన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎంపీ ఆజ్మీర సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు దాస్యం వినయబాస్కర్, కొండా సురేఖ, ఆరూరి రమేష్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్రావు పాల్గొన్నారు. -
సీబీసీఐడీ నివేదిక పరిశీలించాకే నిర్ణయం
విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు ఎంసెట్–2పై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ: ఎంసెట్–2 రద్దు విషయంలో సీబీసీఐడీ నివేదిక పరిశీలించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం హన్మకొండలోని సర్క్యూట్ హౌజ్‌లో ఎంసెట్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయనను కలిశారు. ఎంసెట్–2 రద్దు చేసి, ఎంసెట్–3 నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోందని, ఇప్పటికే విద్యార్థులు నిద్రాహారాలు మాని చదవుకుని రెండు ఎంసెట్లు రాశారని, ఎంతో కష్టపడి చదివి ర్యాంకులు సాధించారని డిప్యూటీ సీఎంకు వివరించారు. మరో ఎంసెట్ నిర్వహిస్తే తమ పిల్లలు రాసే పరిస్థితి లేదని అవేదన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలని, కావాలంటే వారి ప్రవేశాలు రద్దు చేయాలని, తమను ఇందులో బలిచేయొద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు కడియం శ్రీహరి ముందు ఏకరువుపెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు, ఎంసెట్–1, ఎంసెట్–2 అంటూ తమ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని, తిరిగి ఎంసెట్ నిర్వహించవద్దని కోరారు. తమ ప్రతినిధిగా సీఎం కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని వేడుకున్నారు. గతంలో అక్రమాలకు పాల్పడినవారిపై చర్య తీసుకుంటే ఈ పరిస్థితి పునరావృతం అయ్యేది కాదన్నారు. దీంతో కడియం మాట్లాడుతూ.. సీబీసీఐడీ, వైద్య, ఆరోగ్య శాఖ విచారణ చేస్తున్నాయని, నివేదిక వచ్చాక ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విద్యార్థులకు నష్టం కలగదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని కోరారు. -
మా భవిష్యత్తు తో ’పరీక్ష’లా..?
ఎంసెట్ - 2 ర్యాంకర్ల ఆగ్రహం మళ్లీ ఎంసెట్ వద్దే వద్దు.. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి వినతి హన్మకొండ చౌరస్తా, భూపాలపల్లి : ఎంసెట్ 2 రద్దు అవుతుందని వస్తున్న ఊహాగానాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్2ను రద్దు చేస్తారన్న వార్తల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు గురువారం హన్మకొండ లోని సాక్షి సిటీ ఆఫీసు కు వచ్చి వారి ఆవేదనను వెల్లడించారు. అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిశారు. భూపాలపల్లిలోనూ ఎంసెట్ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు కడియం శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేశారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ రెండేళ్ళ పాటు కష్టపడి చదివామని, పేపర్ లీకేజీతో డిప్రెషన్లో ఉన్నామని, మరోమారు పరీక్ష రాసే ఓపిక లేదన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీకి పాల్పడిన వారిని శిక్షించి మిగిలిన విద్యార్థులకు యథావిధిగా కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. ఇందుకు స్పందించిన డిప్యుటీ సీఎం శ్రీహరి మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో సీఐడీ నివేదిక అందిన తరువాతనే తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు. నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారికి కఠిన శిక్ష తప్పదని, విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. మళ్లీ పరీక్ష అంటే తట్టుకోలేరు నక్షత్ర, 197 ర్యాంకర్, హన్మకొండ ఎంసెట్ 2 ను రద్దు చేస్తే సున్నితమైన విద్యార్థులు చాలా మంది ఆత్మహత్య చేసుకునేలా ఉన్నారు. మాకు అర్థం చేసుకునే తల్లిదండ్రులు, వారి ప్రోత్సాహం ఉంది కాబట్టి ధైర్యంగా ఇక్కడి దాకా రాగలిగాం. చాలా మంది పేదలు ఉన్నారు. మళీ పరీక్ష అంటే వారు తట్టుకోలేరు. మా భవిష్యత్తుతో పరీక్షలొద్దు శ్రేణిక, 1062వ ర్యాంకర్, వరంగల్ ఎంసెట్1 రాశాం, అది కాదు ఎంసెట్ 2 అన్నారు.. కష్టమైనా భరిస్తూ మరోసారి పరీక్ష రాశాం. మధ్యలో నీట్ అన్నారు. ఇలా స్పష్టత లేకుండా విద్యార్థుల భవిష్యత్తుతో పరీక్షలు పెట్టడం ఎంత వరకు సమంజసం. దయచేసి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నాలు మానుకోవాలి ఎంసెట్ 3 అనే ఆలోచనే సరైంది కాదు డాక్టర్ రవీందర్, విద్యార్థినీ తండ్రి, హన్మకొండ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంసెట్ పేపర్ లీకేజీకి కారణం ఎవరు, ఎవరిని శిక్షించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. మా పాపకు 908 ర్యాంకు వచ్చింది. ఎంతో కష్టపడితే తప్ప ఆ ర్యాంకు రాలేదు. విద్యార్థుల కష్టాలను కాదని ఎంసెట్ 3 నిర్వహించాలనే ఆలోచనే సరైంది కాదు. మళ్లీ పరీక్ష అంటే విద్యార్థులకు శిక్షే డాక్టర్ జగన్మోహనచారి, విద్యార్థిని తండ్రి, వరంగల్ ఇప్పటికే తీవ్ర ఒత్తిడితో ఉన్న విద్యార్థులకు మరోసారి పరీక్ష అంటే లీకేజీ కి కారుకులైన నిందితులను ఒదిలి విద్యార్థులకు శిక్ష విదించడమే అవుతుంది. ప్రభుత్వం ఎంసెట్ 2ను రద్దు చేసే యోచనను పక్కన పెట్టి నిందితులు గుర్తించి కఠినంగా శిక్షించాలి. రోజు కు 14 గంటలు చదివాను స్వప్నిల్, 1299వ ర్యాంకర్, ఏటూరునాగారం ఎంసెట్1 రాశాను అది కాదని మళ్లీ ఎంసెట్ 2 అన్నారు. అందుకు మంచి ర్యాంకు రావాలని రోజుకు 14 గంటలు చదివాను. మళ్లీ పేపర్ లీకేజీ అయిందని ఆ పరీక్ష ను రద్దు చేసి మరోసారి పరీక్ష అంటే భయంగా ఉంది. లీకేజీ కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలి తప్ప ఎంసెట్ 3ని తెరమీదకు తేవద్దు. లీకేజీతో ర్యాంకులు సాధించిన వారిని శిక్షించండి శ్రీరుక్మిణి, హన్మకొండ అక్రమంగా పాసై సీటు సంపాదించాలని ఆశ పడి డబ్బులతో ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన విద్యార్థులను గుర్తించి వారిని శిక్షించండి, వారికి ఎంసెట్ రాసే అవకాశాన్ని ఇవ్వద్దు. అంతేతప్పా కొందరి కోసం 50వేల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకోవడం సరైంది కాదు. మళీ పరీక్ష అనడం సరైందికాదు బీవీ.శ్రీపతిరావు, విద్యార్థి తండ్రి, హన్మకొండ లీకేజీ కారణం చూపి మరోసారి పరీక్ష లు నిర్వహించాలనే ఆలోచన సరైంది కాదు. విద్యార్థులు లాంగ్‌టర్మ్ కోచింగ్‌లో గంటలు, రోజులు తరబడి శ్రమించి చదివి ర్యాంకులు సాధించారు. అక్రమాలకు పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. అప్పుడే‡ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ప్రశ్నాపత్రం లీక్ వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది : అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ అన్వర్ అత్యున్నత ర్యాంకు సాధించి విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీక్ పేరుతో మళ్లీ పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి పెరిగి ఆందోళనకు గురవుతారు. ఈ క్రమంలో ఉత్తమ ర్యాంకు మళ్ళీ వస్తుందో లేదో అనే అనుమానంతో ఎంట్రెన్స్‌లో సైతం ప్రతిభను కనబరచలేరు. నైతిక సై్థర్యం కోల్పోయి నిరాశకు గురవుతారు. లొసగులు, లోపాలు ఎంట్రన్స్ నిర్వహణ జరిగినప్పుడే ప్రతిభ కలిగిన విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. -
రేషనలైజేషన్ తర్వాత టీచర్ల భర్తీ
డిప్యూటీ సీఎం కడియం వెల్లడి టెట్‌కు ముందే హేతుబద్ధీకరణకు చర్యలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. వచ్చేనెల 1న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహిస్తామని, ఈ పరీక్ష ఫలితాల కంటే ముందే హేతుబద్ధీకరణ చేపడతామని చెప్పారు. వచ్చే నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సోమవారం విద్యాశాఖ కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. అలాగే జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ భర్తీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రణాళిక లు రూపొందించి ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయనున్న పలు నిర్ణయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ వివరాలివీ.. యూనివర్సిటీల వారీగా ఆన్లైన్ ప్రవేశాలు అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం స్థలం, భవనం, వసతులు, ఫ్యాకల్టీ ఉంటేనే అనుబంధ గుర్తింపు, అనుమతులు ఇస్తారు. ఇందుకు అన్ని విభాగాలకు చెందిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్లైన్ పద్ధతిలో చేపడతారు. తద్వారా బోగస్ కాలేజీలు, బోగస్ విద్యార్థులు లేకుండా చూస్తారు. విద్యార్థుల ఆధార్ నెంబర్‌ను కూడా అనుసంధానం చేస్తారు. యూనివర్సిటీల వారీగా ఆన్లైన్ ప్రవేశాల విధానం అమల్లోకి తెస్తారు. అన్ని యూనివర్సిటీలు నిర్ణీత షెడ్యూలు, అకడమిక్ కేలండర్ ప్రకారం ప్రవేశాలు చేపట్టేలా చూస్తారు. ప్రవేశాల షెడ్యూల్, అకడమిక్ కేలండర్ వివరాలను విద్యార్థులకు ముందుగానే అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి చర్యలు చేపట్టాలని భేటీలో నిర్ణయించారు. మండలాల వారీగా విద్యా ప్రొఫైల్ పాఠశాలల నుంచి ఉన్నత విద్యాసంస్థల వరకు అన్నింటి సమాచారాన్ని క్షేత్రస్థాయి నుంచి సేకరిస్తారు. వాటి ఆధారంగా మండలాల వారీగా విద్యా ప్రొఫైల్ రూపొందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతారు. స్కూళ్లలో కనీస వసతులు కల్పిస్తారు. ప్రతి విద్యా సంస్థలో శుభ్రపరిచిన రక్షిత తాగునీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. కాలేజీలన్నింటిలో బయోమెట్రిక్ ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే జూన్ 30 నాటికి ఈ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. స్కూళ్లలో విద్యార్థులకు బట్టలు అందించేందుకు ఆప్కో వద్ద క్లాత్ లేకపోతే ఓపెన్ టెండర్ ద్వారా తెప్పించాలని నిర్ణయించారు. దీనిపై ఆప్కో నుంచి నివేదిక కోరారు. విద్యా శాఖలో అన్ని సేవలను ఆన్లైన్ చేయనున్నారు. వర్సిటీల్లో వైఫై సదుపాయం కల్పించనున్నారు. ప్రభుత్వ బడుల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో ప్రీ ప్రైమరీ విద ్య ప్రవేశపెట్టే ఆలోచనలు చేస్తున్నారు. అలాగే ప్రతినెలా విద్యాశాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు చేపడతారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, కళాశాల విద్య కమిషనర్ వాణిప్రసాద్, సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీరెడ్డి, జేఎన్టీయూ వీసీ శైలజా రామయ్యార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ పాల్గొన్నారు. ప్రైవేటు పుస్తకాలు అమ్మే స్కూళ్లపై చర్యలు ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రభుత్వ నిర్దేశిత సిలబస్‌తో కూడిన పుస్తకాలనే వినియోగించాలి. మే 20నాటికి ఈ పుస్తకాలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను స్కూళ్లలో అమ్ముతున్న పాఠశాలల్లో తనిఖీలు చేసి చర్యలు చేపడతారు. స్కూళ్లు, కాలేజీల్లో విద్యాశాఖ అకడమిక్ కేలండర్ జారీ చేశాకే ప్రవేశాలు చేపట్టాలి. లేదంటే చర్యలు తీసుకుంటారు. -
విద్యలో వెనకబడి ఉన్నాం
డిప్యూటీ సీఎం కడియం హైదరాబాద్: అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే విద్యాపరంగా మనం వెనకబడి ఉన్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణలో నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆర్టీసీ కల్యాణమండపంలో ఆదివారం తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం డైరీని ఆయన ఆవిష్కరించారు. కడియం మాట్లాడుతూ... అందరి భాగస్వామ్యంతోనే తెలంగాణ వచ్చిందని, దాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రైవేట్ కళాశాలల మేనేజ్మెంట్లు ఆరోగ్యశ్రీ, డబుల్ బెడ్రూమ్లు అడిగారని, అయితే ఆసరా పథకం కోరతారేమోనని కంగారుపడ్డానని పరోక్షంగా చురకలు వేశారు. రాష్ర్టంలో 80 లక్షల మంది విద్యార్థులుంటే అందులో 50 శాతం మంది ప్రైవేట్ విద్యాలయాల్లోనే చదువుతున్నారన్నారు. అందరికీ తమ ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని, అయితే ప్రభుత్వ విద్యాలయాలను గాలికొదిలేసి ప్రైవేటు సంస్థలను ఏ ప్రభుత్వం ప్రోత్సహించదన్నారు. రానున్న బడ్జెట్లో ఫీజు బకాయిలను పూర్తిగా చెల్లించేందుకు కృషి చేస్తామన్నారు. యాభై ఏళ్లలో జరగనిది ఐదేళ్లలో చేస్తాం: ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... బల్దియా ఎన్నికల్లో ఒక్కసారి తమకు అవకాశం ఇస్తే, యాభై ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపిస్తామన్నారు. తెలంగాణ వస్తే విద్యుత్ సమస్యగా మారుతుందని ఏపీ చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారని, కానీ.. కిరణ్ దీపం ఆరిపోయింది గానీ, ఇక్కడ ఎండాకాలం కూడా కరెంట్ కోతలు లేవన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎ.వరదారెడ్డి, అధ్యక్షుడు వి.నరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, జాహ్నవి కళాశాలల చైర్మన్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్‌లో పదివేల ర్యాంకు కటాఫ్
ఫీజులపై డిప్యూటీ సీఎం కడియం వెల్లడి ♦ సెక్షన్ 371డీకి లోబడి స్థానికత నిర్ధారణ ♦ఈ-సెట్లో వెయి మందికి అవకాశం ♦షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ కౌన్సెలింగ్ ♦ రేషనలైజేషన్‌తో బడులు మూతపడవు సాక్షి, హన్మకొండ: ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో పదివేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా మొత్తం ఫీజు చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సోమవారం ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ కటాఫ్ విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలలో నెలకొన్న సందేహాలు, గందరగోళాలను తీర్చేం దుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలి పారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానాన్నే కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎక్కువమంది తెలంగాణ విద్యార్థులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రీయింబర్స్‌మెంట్‌కు పదివేల ర్యాంకు కటాఫ్‌గా నిర్ణయించినట్లు వెల్లడించారు. పది వేలు పైబడి ర్యాంకు వచ్చిన విద్యార్థులకు రూ 35,000 వార్షిక ఫీజుగా రీయింబర్స్మెంట్ చేస్తామన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సెక్షన్ 371డీని అనుసరించి స్థానికతను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదివిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, ప్రభుత్వ గురుకుల కాలేజీల్లో చదివిన ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులకు పూర్తిగా ఫీజు చెల్లిస్తామన్నారు. ఈ-సెట్ విద్యార్థులకు వరాలు ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం వరాలు ప్రకటించారు. ఈసెట్ ద్వారా ప్రవేశాలు పొందే వెరుు్య మంది విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని కడియం తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు ‘ఫీజుల వివరాలను నోటీసుబోర్డులో ఉంచాలని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు సూచించాం, ఎవరైనా ఈ నిబంధనల ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’ అని కడియం శ్రీహరి హెచ్చరించారు. ఫీజుల వివరాలు వెల్లడించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశించినట్లు వెల్లడించారు. కేజీ టు పీజీ పథకాన్ని 2016-17 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియెట్ పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని, ఇందుకయ్యే ఖర్చులో సగం(రూ.3 కోట్లు) భరిం చేందుకు శ్రీమేథా సంస్థ ముందుకు వచ్చిందన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్రాంచ్‌ను వరంగల్‌లో నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఈ నెల 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. బాలికలకు ఆశ్రమ పాఠశాలలు కోల్‌బెల్ట్: పదో తరగతి.. ఆపై చదివిన బాలికల కోసం ప్రత్యేక ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చినట్లు డిప్యూటీ సీఎం శ్రీహరి వెల్లడించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం మంజూ ర్‌నగర్‌లో సోమవారం సింగరేణి చేపట్టిన హరితహారం కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ సిరి కొండ మధుసూదనాచారితోపాటు శ్రీహరి హాజరయ్యారు. శ్రీహరి మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ చదువుకునే బాలికలకు సైతం రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ బాలికల సంరక్షణను పోలీసులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ కౌన్సెలింగ్.. ఎంసెట్ -15 కౌన్సెలింగ్ ప్రక్రియను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోందన్నారు. కోర్టు తీర్పుకు లోబడి ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూ(హెచ్) ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ వల్ల ఏ ఒక్క పాఠశాల మూతపడదని హామీ ఇచ్చారు. అవసరానికి మించి ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల నుంచి అవసరం ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడమే రేషనలైజేషన్ లక్ష్యమని వివరించారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత డీఎస్సీ గురించి పరిశీలిస్తామన్నారు. తెలంగాణ సిలబస్ కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నిర్ణయించిందని శ్రీహరి తెలిపారు. -
స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొన్న కడియం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఆదివారం హైదరాబాద్ ఎస్ఆర్నగర్-శివబాగ్లో ఆయన స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఉత్తేజపరిచారు.