- విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు
- ఎంసెట్–2పై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
సీబీసీఐడీ నివేదిక పరిశీలించాకే నిర్ణయం
Published Fri, Jul 29 2016 12:07 AM | Last Updated on Sat, Sep 29 2018 6:18 PM
హన్మకొండ: ఎంసెట్–2 రద్దు విషయంలో సీబీసీఐడీ నివేదిక పరిశీలించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం హన్మకొండలోని సర్క్యూట్ హౌజ్‌లో ఎంసెట్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయనను కలిశారు. ఎంసెట్–2 రద్దు చేసి, ఎంసెట్–3 నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోందని, ఇప్పటికే విద్యార్థులు నిద్రాహారాలు మాని చదవుకుని రెండు ఎంసెట్‌లు రాశారని, ఎంతో కష్టపడి చదివి ర్యాంకులు సాధించారని డిప్యూటీ సీఎంకు వివరించారు.
మరో ఎంసెట్ నిర్వహిస్తే తమ పిల్లలు రాసే పరిస్థితి లేదని అవేదన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలని, కావాలంటే వారి ప్రవేశాలు రద్దు చేయాలని, తమను ఇందులో బలిచేయొద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు కడియం శ్రీహరి ముందు ఏకరువుపెట్టారు.
సుప్రీంకోర్టు తీర్పు, ఎంసెట్–1, ఎంసెట్–2 అంటూ తమ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని, తిరిగి ఎంసెట్ నిర్వహించవద్దని కోరారు. తమ ప్రతినిధిగా సీఎం కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని వేడుకున్నారు. గతంలో అక్రమాలకు పాల్పడినవారిపై చర్య తీసుకుంటే ఈ పరిస్థితి పునరావృతం అయ్యేది కాదన్నారు. దీంతో కడియం మాట్లాడుతూ.. సీబీసీఐడీ, వైద్య, ఆరోగ్య శాఖ విచారణ చేస్తున్నాయని, నివేదిక వచ్చాక ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విద్యార్థులకు నష్టం కలగదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని కోరారు.
Advertisement