మా భవిష్యత్తు తో ’పరీక్ష’లా..? | exams to With our future | Sakshi
Sakshi News home page

మా భవిష్యత్తు తో ’పరీక్ష’లా..?

Published Thu, Jul 28 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

విద్యార్థులతో మాట్లాడుతున్న డిప్యుటీ సీఎం శ్రీహరి

విద్యార్థులతో మాట్లాడుతున్న డిప్యుటీ సీఎం శ్రీహరి

  • ఎంసెట్‌ - 2 ర్యాంకర్ల ఆగ్రహం
  • మళ్లీ ఎంసెట్‌ వద్దే వద్దు..
  •  విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన
  • డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి వినతి
  • హన్మకొండ చౌరస్తా, భూపాలపల్లి :  ఎంసెట్‌ 2 రద్దు అవుతుందని వస్తున్న ఊహాగానాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్‌2ను రద్దు చేస్తారన్న వార్తల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు గురువారం హన్మకొండ లోని సాక్షి సిటీ ఆఫీసు కు వచ్చి వారి ఆవేదనను వెల్లడించారు. అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిశారు. భూపాలపల్లిలోనూ ఎంసెట్‌ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు కడియం శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేశారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ రెండేళ్ళ పాటు కష్టపడి చదివామని, పేపర్‌ లీకేజీతో డిప్రెషన్‌లో ఉన్నామని, మరోమారు పరీక్ష రాసే ఓపిక లేదన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీకి పాల్పడిన వారిని శిక్షించి మిగిలిన విద్యార్థులకు యథావిధిగా కౌన్సిలింగ్‌ నిర్వహించాలని కోరారు. ఇందుకు స్పందించిన డిప్యుటీ సీఎం శ్రీహరి మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో సీఐడీ నివేదిక అందిన తరువాతనే తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు. నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పేపర్‌ లీకేజీకి పాల్పడిన వారికి కఠిన శిక్ష తప్పదని, విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. 
     
    మళ్లీ పరీక్ష అంటే తట్టుకోలేరు
    నక్షత్ర, 197 ర్యాంకర్, హన్మకొండ 
    ఎంసెట్‌ 2 ను రద్దు చేస్తే సున్నితమైన విద్యార్థులు చాలా మంది ఆత్మహత్య చేసుకునేలా ఉన్నారు. మాకు అర్థం చేసుకునే తల్లిదండ్రులు, వారి ప్రోత్సాహం ఉంది కాబట్టి ధైర్యంగా ఇక్కడి దాకా రాగలిగాం. చాలా మంది పేదలు ఉన్నారు. మళీ పరీక్ష అంటే వారు తట్టుకోలేరు.
     
    మా భవిష్యత్తుతో పరీక్షలొద్దు
    శ్రేణిక, 1062వ ర్యాంకర్, వరంగల్‌
    ఎంసెట్‌1 రాశాం, అది కాదు ఎంసెట్‌ 2 అన్నారు.. కష్టమైనా భరిస్తూ మరోసారి పరీక్ష రాశాం. మధ్యలో నీట్‌ అన్నారు. ఇలా స్పష్టత లేకుండా విద్యార్థుల భవిష్యత్తుతో పరీక్షలు పెట్టడం ఎంత వరకు సమంజసం. దయచేసి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నాలు మానుకోవాలి
     
    ఎంసెట్‌ 3 అనే ఆలోచనే సరైంది కాదు
    డాక్టర్‌ రవీందర్, విద్యార్థినీ తండ్రి, హన్మకొండ
    అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంసెట్‌ పేపర్‌ లీకేజీకి కారణం ఎవరు, ఎవరిని శిక్షించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. మా పాపకు 908 ర్యాంకు వచ్చింది. ఎంతో కష్టపడితే తప్ప ఆ ర్యాంకు రాలేదు. విద్యార్థుల కష్టాలను కాదని ఎంసెట్‌ 3 నిర్వహించాలనే ఆలోచనే సరైంది కాదు. 
     
    మళ్లీ పరీక్ష అంటే విద్యార్థులకు శిక్షే
    డాక్టర్‌ జగన్మోహనచారి, విద్యార్థిని తండ్రి, వరంగల్‌
    ఇప్పటికే తీవ్ర ఒత్తిడితో ఉన్న విద్యార్థులకు మరోసారి పరీక్ష అంటే లీకేజీ కి కారుకులైన నిందితులను ఒదిలి విద్యార్థులకు శిక్ష విదించడమే అవుతుంది. ప్రభుత్వం ఎంసెట్‌ 2ను రద్దు చేసే యోచనను పక్కన పెట్టి నిందితులు గుర్తించి కఠినంగా శిక్షించాలి.
     
    రోజు కు 14 గంటలు చదివాను
    స్వప్నిల్, 1299వ ర్యాంకర్, ఏటూరునాగారం
    ఎంసెట్‌1 రాశాను అది కాదని మళ్లీ ఎంసెట్‌ 2 అన్నారు. అందుకు మంచి ర్యాంకు రావాలని రోజుకు 14 గంటలు చదివాను. మళ్లీ పేపర్‌ లీకేజీ అయిందని ఆ పరీక్ష ను రద్దు చేసి మరోసారి పరీక్ష అంటే భయంగా ఉంది. లీకేజీ కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలి తప్ప ఎంసెట్‌ 3ని తెరమీదకు తేవద్దు.
     
    లీకేజీతో ర్యాంకులు సాధించిన వారిని శిక్షించండి
    శ్రీరుక్మిణి, హన్మకొండ
    అక్రమంగా పాసై సీటు సంపాదించాలని ఆశ పడి డబ్బులతో ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన విద్యార్థులను గుర్తించి వారిని శిక్షించండి, వారికి ఎంసెట్‌ రాసే అవకాశాన్ని ఇవ్వద్దు. అంతేతప్పా కొందరి కోసం 50వేల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకోవడం సరైంది కాదు.
     
    మళీ పరీక్ష అనడం సరైందికాదు
    బీవీ.శ్రీపతిరావు, విద్యార్థి తండ్రి, హన్మకొండ
    లీకేజీ కారణం చూపి మరోసారి పరీక్ష లు నిర్వహించాలనే ఆలోచన సరైంది కాదు. విద్యార్థులు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లో గంటలు, రోజులు తరబడి శ్రమించి చదివి ర్యాంకులు సాధించారు. అక్రమాలకు పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. అప్పుడే‡ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.
     
    ప్రశ్నాపత్రం లీక్‌ వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది : అసిస్టెంట్‌ ప్రొఫెసర్, డాక్టర్‌ అన్వర్‌
     అత్యున్నత ర్యాంకు సాధించి విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీక్‌ పేరుతో మళ్లీ పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి పెరిగి ఆందోళనకు గురవుతారు. ఈ క్రమంలో ఉత్తమ ర్యాంకు మళ్ళీ వస్తుందో లేదో అనే అనుమానంతో ఎంట్రెన్స్‌లో సైతం ప్రతిభను కనబరచలేరు. నైతిక సై్థర్యం కోల్పోయి నిరాశకు గురవుతారు. లొసగులు, లోపాలు ఎంట్రన్స్‌ నిర్వహణ జరిగినప్పుడే ప్రతిభ కలిగిన విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement