నీట్ వివాదంపై లోక్‌సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ధనికులైతే చాలు పరీక్షా విధానాన్నే కొనేయొచ్చంటూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పార్లమెంట్ వేదికగా విపక్షనేత రాహుల్‌గాంధీ ప్రభుత్వం తీవ్ర విమర్శలుచేశారు. గత ఏడేళ్లలో ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు ఆధారాలు లేవంటూ లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడంతో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ‘‘ నీట్ పేపర్ లీకేజీ ఉదంతంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వీయతప్పిదాన్ని ఒప్పుకోవట్లేదు.
ప్రతి ఒక్కరిపై నిందలేస్తూ తప్పుబడుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే కనీస అవగాహన కూడా ఆయనకు లేనట్లుంది. వరస లీకేజీలతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడిందని కోట్లాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భారత్‌లో పరీక్షల నిర్వహణ అనేది ఒక మోసపూరిత వ్యవహారమని అభ్యర్థులు ఒక నిర్ణయానికొచ్చారు. ధనికులైతే చాలు పరీక్షావిధానాన్నే కొనేయొచ్చు అనే పరిస్థితి నెలకొంది.
ఈ తప్పు వ్యవస్థీకృతంగా జరుగుతోంది. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు మీ వంతుగా ఎలాంటి కృషిచేస్తున్నారు?’ అని మంత్రిని రాహుల్ నిలదీశారు. దీంతో మంత్రి ప్రధాన్ మాట్లాడారు. ‘‘ మొత్తం పరీక్ష విధానమే నిష్పలం అన్నట్లుగా మాట్లాడటం దురదృష్టకరం. ఏడేళ్లలో 70 పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ సభ్యుడు మాణిక్కం ఠాకూర్ చెబుతున్నదంతా అబద్ధం. నిజానికి ఎన్‌టీఏను స్థాపించాక 240కిపైగా పరీక్షలను విజయవంతంగా నిర్వహించాం.
ఐదు కోట్ల మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకున్నారు. 4.5 కోట్ల మంది వివిధ పరీక్షలు రాశారు’’ అని మంత్రి చెప్పారు. దీంతో ఠాకూర్ కలగజేసుకుని ‘‘ పేపర్ లీకేజీల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా ఎలాంటి నిర్ణయాలు ఆచరణలో పెడుతున్నారో మంత్రి చెప్పాలి. లేదంటే రాజీనామా చేయాలి’ అని అన్నారు. దీంతో మంత్రి స్పందించారు. ‘‘ ఇక్కడ మాలో ఏ ఒక్కరో జవాబుదారీ కాదు.
ఏం జరిగినా ప్రభుత్వం మొత్తం జవాబుదారీగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ‘‘పేపర్ లీకేజీల విషయంలో మోదీ సర్కార్ రికార్డ్ సృష్టించనుంది. ఒకే చోట రాసిన వారిలో ఎక్కువ మందికి అత్యధిక మార్కులు వచ్చిన పరీక్షకేంద్రాల జాబితాను విడుదలచేయాలి’ అని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్‌చేశారు. అనంతరం టీఎంసీ, డీఎంకే సహా విపక్ష సభ్యులంతా వాకౌట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment