మహారాష్ట్రతో ఒప్పందం చారిత్రకం | Historical agreement with Maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రతో ఒప్పందం చారిత్రకం

Published Wed, Aug 24 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

మహారాష్ట్రతో ఒప్పందం చారిత్రకం

మహారాష్ట్రతో ఒప్పందం చారిత్రకం

  • తెలంగాణ బీడు భూములకు వరం
  • ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయాం
  • అవినీతి, అక్రమాలు కాంగ్రెస్‌ పేటెంట్‌
  • ప్రాజెక్టుల పేరుతో నిస్సిగ్గుగా దోచుకున్నారు
  • ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
  • హన్మకొండ : దశాబ్దాలుగా అంతరాష్ట్ర వివాదాలతో బీళ్లుగా మారిన తెలంగాణ భూములకు నీళ్లు పారించే చారిత్రక ఒప్పందం జరిగిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గోదావరి జలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్‌ల మధ్య జరిగిన ఒప్పందంతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యాలమవుతుందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా అంతరాష్ట్ర వివాదాల అడ్డంకుల కారణంగా ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఈ ఒప్పందం కుదిరిందన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం హన్మకొండలోని టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
     
    గోదావరి జలాల్లో బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి జలాలు 1400 టీఎంసీలు, ఇందులో తెలంగాణకు 950 టీఎంసీలు రావాలన్నారు. కృష్ణానదిలో ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు వస్తే ఇందులో తెలంగాణ 300 టీఎంసీల నీరు వాటా ప్రకారం రావాలన్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో బచావత్‌ అవార్డు నీటి కేటాయింపులు చేసినా వాడుకోలేని దుస్థితి నాటి పాలకులదని విమర్శించారు. 1975, 2012లో మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్నామని కాంగ్రెస్‌ వారు చెపుతున్నారని... ఒప్పందాలు చేసుకుంటే ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదని కడియం ప్రశ్నించారు. 2015లో నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్‌ తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మించ వద్దని ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు.
     
    తమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్లతో నిర్మిస్తే ఇబ్బందులు తప్పవని, నాలుగు మీటర్ల ఎత్తు తగ్గించి 148 మీటర్ల వరకు నిర్మించాలని మహారాష్ట్ర సీఎం చౌహాన్‌ సూచించారని పేర్కొన్నారు. 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 160 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని, 148కి తగ్గిస్తే 40 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలో మిగతా నీటిని వినియోగించుకోవడానికి ప్రాజెక్టులను రీడిజైన్‌ చేశామని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. మేడిగడ్డ వద్ద 180 టీఎంసీల నీటి లభ్యత ఉందన్నారు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మించడం ద్వారా తమ్మిడిహట్టి వద్ద కోల్పోయిన 160 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావచ్చని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వం చేపట్టిందన్నారు.
     
    ఈ రెండు ప్రాజెక్టులతో 36 లక్షల హెక్టార్లకు సాగు నీరు అందుతుందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. అవినీతి, అక్రమాలు కాంగ్రెస్‌ పేటెంట్‌ అని దుయ్యబట్టారు.  నాడు ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్‌ వారు నిస్సిగ్గుగా దోచుకున్నారని విరుచుకుపడ్డారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు సంబందించి జీఓ 123ను హైకోర్టు నిలిపివేస్తే స్వీట్లు పంచుకుని రాక్షస ఆనందం పొందారని, దీనిపై అప్పీలుకు వెళితే జీఓ నిలిపివేతను ఎత్తివేస్తే కాంగ్రెస్‌ నాయకులు బిక్కముఖం వేశారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన జలయజ్ఞంపై సీబీఐ విచారణ జరుపుతుందన్నారు. వాస్తవాలు బయటపడుతాయన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్, ఎంపీ ఆజ్మీర సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు దాస్యం వినయబాస్కర్, కొండా సురేఖ, ఆరూరి రమేష్, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement